‘‘ఓ అణుశాస్తవ్రేత్తగా మూడో ప్రపంచ యు ద్ధంలో ఏం జరుగుతుందో చెప్పండి’’- అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దానికి ‘‘మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నన్ను అడగకండి? నాలుగో ప్రపంచ యుద్ధం గురించి మాత్రం చెప్పగలను’’ అని అన్నాట్ట ఆయన. ఇదేంటని పాత్రికేయుడు నోరెళ్లబెడితే- ‘‘నాలుగో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు.. మూడవ ప్రపంచయుద్ధమే ఆఖరి యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయవేత్తలంతా ఆఖరి ప్రపంచ యుద్ధం కోసం అన్నీ సిద్ధం చేస్తూనే ఉన్నారు’’ అన్నాడట ఐన్‌స్టీన్.
నేటి రాజకీయాల్లో జరుగుతున్న దుస్సంఘటనలు, దురాలోచనలు చూస్తుంటే మనం కూడా అలాంటి ప్రమాదంలోకి నెట్టబడుతున్నామా? అనే భయమేస్తుంది. ఉదాహరణకు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలను చూడండి. కొత్తకొత్త పొత్తుల వంటలు వండి వార్చినా, రాత్రికి రాత్రి పార్టీలు మారి టిక్కెట్టు సంపాదించినా, ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారినా ప్రజలు వాళ్లను అంగీకరిస్తున్నారు! ఇదే మన ప్రజాస్వామ్యానికి పట్టిన మాయరోగం.
స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశంలో కుటుంబ పాలనకు నాంది పడింది. మోతీలాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసిన విజ్ఞులలో ఒకరు. ఆయన వారసత్వంతో గాంధీ చాటున జవహర్‌లాల్ నెహ్రూ గద్దెపై కూర్చొన్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో రాజకీయవేత్తలు ఈ దేశ రాజకీయ యవనికపై ఉన్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభభాయి పటేల్ వంటి కాకలుదీరిన యోధానుయోధులు ప్రధాని పదవిని సమర్ధవంతంగా నిర్వహించగలిగిన వారే. వీళ్లందరి కన్నా ముందే నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ కొంత భారతదేశానికి తన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ద్వారా స్వాతంత్య్రం ప్రకటించి నెహ్రూ కన్నా ముందే ఈ దేశ ప్రధాని అయ్యాడు. కానీ, మహాత్మా గాంధీ అండదండలు పుష్కలంగా సంపాదించిన నెహ్రూ తన ప్రధాని పీఠాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. నెహ్రూ అనంతరం ఎందరో రాజకీయ దురంధరులను కాదని ఇందిర అధికారం చేపట్టగా, ఆ వారసత్వ పరంపర నేడు రాహుల్ గాంధీ వరకు నాలుగో తరం కొనసాగుతున్నది. వారసత్వ వృక్షానికి ఫలించిన రాహుల్ గాంధీ ఇపుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తాడట!?
పెద్ద ప్రజావిప్లవం వచ్చిన తర్వాత తెలంగాణ కూడా ఇలాంటి కబంధహస్తాల్లోకే వెళ్లిందని ఇపుడు అన్ని పార్టీలవారు విమర్శిస్తున్నారు. సబ్బండ వర్ణాల ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇపుడు ఓ కుటుంబం చేతిలో చిక్కిందంటే- ఈ దేశంలో ఆదర్శం ఎవరు? ఉద్యమనేతగా కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి 2014 ఎన్నికల్లో ప్రజలు ఓసారి అధికారం ఇచ్చారు. కేసీఆర్ చెబుతున్నట్లు వ్యవస్థల్ని అర్థం చేసుకొనేందుకు ఈ నాలుగేళ్లు సరిపోయింది.. ఇపుడు అభివృద్ధి జరిగి తీరుతుంది చూ డండి అని చెప్పడం ఈ ఎన్నికల సమయానికి ప్రజలు జీర్ణించుకుంటారా? లేదా? అన్నది చూడాలి. మన దేశంలో ప్రజలకు అభివృద్ధి కన్నా భావోద్వేగాలు ఎక్కువ. ఈ విషయం ఒకే పాఠశాలలో చదువుకున్న ‘ఇద్దరు చంద్రుల’కు తెలుసు. అందుకే ఇపుడు తెలంగాణ రాజకీయాలు తలక్రిందులయ్యాయి. అందుకే ఇపుడు ఎన్నో కలియుగ వింతలను మనం చూస్తున్నాం.
‘నా వెన్నుపూసలో బులెట్ దింపింది చంద్రబాబే , ఎన్‌కౌంటర్ల పేరుతో నక్సలైట్లను పొట్టనబెట్టుక్నొవాడు చంద్రబాబు’- అని ఎన్నోసార్లు చెప్పిన ప్రజాగాయకుడు గద్దర్ ఇప్పుడు చంద్రబాబు కడుపులో తలపెట్టి తల్లడిల్లిపోతే ఇది కలియుగ విచిత్రం కాక ఇంకేమిటి? రాహుల్‌ను కూడా ఆలింగనం చేసుకున్నాడు గద్దర్. ఇనే్నళ్లు పీడిత, తాడిత, బహుజన రాజ్యం, మార్క్స్ రాజ్యం, మావోరాజ్యం కావాలన్న గద్దర్ ఇప్పుడు రాహుల్ రాజ్యం కావాలంటున్నాడు! ఓ జాతీయ పార్టీ నాలుగుతరాలు పాలించినా ఈ దేశంలోని సమస్యలు గద్దర్ భుజం మీది గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం ఏ పార్టీ? ఏ కుటుంబం? ఏ రాజకీయ వారసత్వం? 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ‘నక్సలైట్లు అసలు సిసలైన దేశభక్తులు’ అన్నాడు. 1989లో చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చినపుడు నక్సలైట్ల పట్ల ఉదాసీన వైఖరి చూపాడు. అలిపిరి ఘటన తర్వాత ఆనాటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి- ‘చంద్రబాబును మించిన నక్సలైట్ లేడు’ అన్నాడు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి నక్సలైట్లపట్ల మొదట కొంత సానుభూతి చూపి ఆ తర్వాత కఠినంగా వ్యవహరించాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ‘నక్సలైట్ల ఎజెండాను మేం అమలు చేస్తాం’ అని ప్రకటించాడు. అధికారంలోకి రాగానే ఈ స్టేట్‌మెంట్లు అన్నీ తలక్రిందులయ్యాయి. ఇప్పుడు విచిత్రంగా గద్దర్ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చే వ్యక్తిగా మారడం కలియుగ విచిత్రం!
ఇక తెరాస వెంబడి ఉన్న మజ్లిస్ పార్టీది మరో కథ. కేసీఆర్ ‘మజ్లిస్ మాకు గొప్ప రాజకీయ భాగస్వామి’అని ప్రకటిస్తే మజ్లిస్ వైఖరి మరోలా ఉంది. కర్ణాటకలో కుమారస్వామిలా తాను ముఖ్యమంత్రిని అవుతానని, ఇప్పటివరకూ అందరు సీఎంలు కేసీఆర్ సహా మా పాదాల చెంత తలవంచారని అక్బర్ ప్రకటించాడు. భాజపాను నిలువరించాలంటే కేసీఆర్‌ను, భాజపాను కలువనివ్వకూడదనే తాము టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నామని కూడా ఓవైసీ ప్రకటించాడు. దీంతో హిం దువుల్లో కలవరం మొదలయ్యింది.
మజ్లీస్ గురించి కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. ఇనే్నళ్లూ తమవెంట తిరిగినప్పుడు గొప్ప ‘ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ’గా కన్పించిన మజ్లీస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు మతతత్వవాదిగా కన్పిస్తోంది. మజ్లిస్‌ను ఇన్నాళ్లు పెంచి పోషించిన కాంగ్రెస్ ఓవైపు ముస్లిం లీగ్ పార్టీని చంకనెత్తుకునే మరోవైపు ఓవైసీ బ్రదర్స్‌పై యుద్ధానికి తలపడడం మరో విచిత్రం.
కేసీఆర్ మజ్లిస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల హిందూ యువకుల ఓట్లకు తెరాస దూరం అయినట్లే. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన మజ్లిస్‌ను కేసీఆర్ ఒకప్పుడు ‘పాతబస్తీలోని పిడికెడంత పార్టీ’ అన్నాడు. ఇపుడు మాకు వాళ్లను మంచిన మిత్రులు లేరు అంటున్నాడు. ‘బంగారు ముద్ద’అని పాగిడించుకున్న కోదండరాం కేసీఆర్‌కు బద్ధశత్రువయ్యాడు. ఆ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ తన పాత తెలివితేటలు ప్రయోగించి ఎక్కడుంచాలో అక్కడుంచింది. ఆచార్యుడు రాజకీయాల్లోకి వస్తేగానీ ఈ తత్వం బోధపడడంలేదు. నల్లపుప్రహ్లాద్ వంటివారు గాని, ఇటీవల టీజెఎస్ వీడి వెళ్లిపోయిన ప్రొ.జ్యోత్స్న, రచనారెడ్డిల వ్యాఖ్యలు చూస్తే రేపు కోదండరాం పరిస్థితి కాంగ్రెస్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవన్నీ రాజకీయ చిత్ర విచిత్రాలే!
వెనుకటికి ఒకడు తల్లిని చంపి కోర్టుకు వెళ్లాడట. నీకు ఉరిశిక్ష వేస్తాం అని జడ్జి అంటే ‘తల్లిలేనివాణ్ణి కనికరించండి’ అన్నాట్ట. ఇటీవల చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూసి ప్రత్యర్థులు చెబుతున్న నానో కథ ఇది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా కేసీఆర్‌కు పెద్దశత్రువు చంద్రబాబే. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన నాయకుడు భారతదేశంలో చంద్రబాబు ఒక్కడే. తన బలం, బలహీనత గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే తన వ్యక్తిత్వాన్ని వెంటనే మార్చుకోగలడు. అదే ఆయన రాజకీయ మనుగడకు కారణం. అనేకమార్లు ‘యూ టర్న్’ తీసుకోవడం ఆయనకు కలిసొచ్చింది. లేని శత్రుత్వాన్ని, మిత్రత్వాన్ని సృష్టించి తనకు కావలసింది సాధించుకోవడం బాబు నైజం అని విశే్లషకులు చెప్తారు. అందుకే ఎన్టీఆర్ లాంటి మహా నటుడు... ‘హి ఈజ్ బెటర్ యాక్టర్ దేన్ మీ’ అన్నాడు. ఈ చరిత్ర తెలిసినవారు ఇపుడు చంద్రబాబు కాంగ్రెస్ కండువా వేసుకొని రాహుల్ ప్రక్కన గజమాల సరిచేసుకొని ఫొటో దిగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడడం లేదు.
బురదనుండి మాత్రమే ‘కమలం’ వికసించే కాస్మిక్ నియమం ఉందని ఓ తత్త్వవేత్త చెప్పాడు. ఈ కుటుంబ పాలన, కులవాదం, మతతత్త్వం, అవకాశవాదం, స్వార్థ రాజకీయం, ఊసరవెల్లి బుద్ధులు, ఆశ్రీత పక్షపాతం, అవినీతి వంటివన్నీ మనముందు కదలాడుతున్న పార్టీలు సృష్టించినవే. ఇదంతా బురద రాజకీయమే. మనం ఈ బురదలో మునిగిపోకుండా, ఆ బురద నుండే కమలాలను వికసింపజేయాలి. కమలాల విత్తనాలు ఒక అద్భుతం. అవి బురదను సైతం అందమైన పుష్పంగా మారుస్తాయి. ఇదే ఈనాడు తెలంగాణ ఓటరు గ్రహించాల్సిన సూత్రం.
*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
పెన్ గన్ గ : ఆంధ్రభూమి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి