కొక్కొరో ... క్కో ...
స్వార్థ సిద్ధాంతం !


కాలడి నుండి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసి ఆదిశంకరులు అద్వైతం అనే సిద్ధాంతాన్ని అందిస్తే.. అంతే స్థాయిలో శ్రీమద్రామానుజులు, మధ్వాచార్యులు, నింబార్కులు.. ఎంతో అవలోకనం చేసి సిద్ధాంతాలను ఆవిష్కరించారు.
ఆధునిక కాలంలో ఐన్‌స్టీన్‌, ఆర్కెమిడీస్‌ అనేక సైన్సు సిద్ధాంతాలను ఆవిష్కరించారు. ఇలా మనదేశంలో అనేక సిద్ధాంతాలను కాచివడబోసి, సంసారాలు వదిలిపెట్టి, బ్రహ్మచారులుగా ఉండి కొత్త కొత్త పద్ధతులను లోకానికి అందించారు. కానీ ఇటీవల స్వార్థ రాజకీయ నాయకులు మాత్రం రాత్రికి రాత్రి తమ కుయుక్తులతో, మొద్దుబారిన మేధస్సుతో ఓ అద్భుతమైన సిద్ధాంతం ఆవిష్కరించారు. వీరి మెదడు ముందు గౌతమ బుద్దుడు, గురునానక్‌, శ్రీకృష్ణుడు, గోరఖ్‌నాథ్‌ వంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా చేతులెత్తెయ్యాల్సిందే!
అలాగే దేశాన్ని ఉర్రూతలూగించిన గాంధీ, బోసు, భగత్‌సింగ్‌, తిలక్‌, అంబేద్కర్‌, డాక్టర్జీ వంటి వారు సైతం వాళ్లను చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. మరి తమ మేధోమథనంతో కనుగొన్న కొత్త సిద్ధాంతం ఏంటో తెలిస్తే మన కళ్లు బైర్లు కమ్మాల్సిందే; దానిపేరే ‘స్వార్థపరత్వం.’
లేకపోతే ‘నావెన్నులో తూటాలు దింపాడని తల్లడిల్లిపోయి పాటలు రాసి పంచెగట్టి ఎగిరి దుంకిన మావోయిస్ట్‌ సాంస్కృతిక సారథి ‘గద్దర్‌’ చంద్రబాబు కడుపులో తలబెట్టడం ఏమిటి? ‘ప్రపంచ బ్యాంక్‌ జీతగాడు’ అని గొంతెత్తి అరచిన కమ్యూనిస్టులు బాబుగారి పక్కన నిలబడి ఫోటోలు దిగుతుంటే మన గుండె ఆగాల్సిందే.
రాజీవ్‌గాంధీ టి.అంజయ్యను, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఎన్టీఆర్‌ను అవమానిస్తే ఆ అవమానాగ్నిలోంచి పుట్టుకొచ్చిన ‘తెలుగుదేశం పార్టీ’ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ను వ్యతిరేకించింది. అది అన్నగారి జమానాలోని తెలుగుదేశం. కానీ ఇప్పుడు దేశాన్ని తలక్రిందులు చేయగల, ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను పెట్టిన అపర కులీకుత్‌బ్‌షా చంద్రబాబు సారథ్యంలో నడిచే తెలుగుదేశం కదా! ఈ అవమానాల చిట్టాను అమరావతి అనే కొత్త నగరం పునాదుల్లో దాచిపెట్టి మొన్న రాహుల్‌గాంధీ ప్రక్కన గజమాలలో దూరి ఫోటో దిగేందుకు పడ్డపాట్లు చూస్తే.. అబ్బ! చా! అనిపిస్తుంది. రాజీవ్‌గాంధీకే టెక్నాలజీ గురించి చెప్పానన్న బాబు రాహుల్‌గాంధీతో కరచాలనం చేసేందుకు, అతని ముందు పెద్దరికం ప్రదర్శించేందుకు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముక్కుమీద వేసుకొన్న వేలుకూడా కిందకు సిగ్గుతో జారిపోతున్నది.
ప్రపంచాన్నే ఏకం చేస్తాం అనే కమ్యూనిస్టు సురవరం సుధాకర్‌రెడ్డి ముష్టి మూడుసీట్ల కోసం దేబిరిస్తూ ప్రజాకూటమి వేదికపై నిలబడి ‘మోదీని దించేస్తాం’ అని ప్రకటిస్తుంటే కలికాలం ఇంత అద్భుతంగా నడుస్తుందా! అనిపిస్తోంది. ఇక 125 సంవత్సరాల క్రితం పుట్టి ‘మేం లేకపోతే సూర్యచంద్రులకే వెలుగు లేదు’ అని మాట్లాడే కాంగ్రెసు పార్టీ మోదీ, కేసీఆర్‌లను కొట్టేందుకు కోదండరాం లాంటి ‘పాలిట్రిక్స్‌’ తెలియని పొలిటికల్‌ శాస్త్రవేత్తను వెంబటి పెట్టుకోవడం వల్లనే కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందని అనిపిస్తున్నది!?
మానవ హక్కుల సంఘాలలో మరిగిమరిగి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కరిగి కరిగి, తెలంగాణ ఉద్యమంతో తెగ ఊగిన కోదండరాం గుప్పెడు సీట్లకోసం గాంధీభవన్‌ మొదలుకొని టెన్‌ జనపథ్‌ వరకు తిరిగితిరిగి కేసీఆర్‌తో వెళ్లలేక, కాంగ్రెస్‌తో వేగలేగ బాధపడడం కలియుగ విచిత్రం!!?
ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారం మోదీ, షాలు తన్నుకుపోతే కర్ణాటక కంఠీరవుడైన దేవగౌడతో పొత్తు సరిగ్గా లేకున్నా బయటకు చెప్పుకోలేకపోతుంది కాంగ్రెస్‌. ఇన్నాళ్లు అమ్మగారు రాజమాత సోనియా సేవలో తరించే బంట్లు మొత్తం ఎలాగైనా పరువు దక్కించుకోవాలని పరుగు పరుగున తెలంగాణలో వాలిపోయారు. ఇక దీంతో పాటు ‘చారిత్రక కలయిక’ అంటూ చంద్రబాబు – రాహుల్‌ కలయికను తెలుగు పచ్చళ్లు రోట్లో వేసి దంచి తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటే చప్పరించలేక మనం చచ్చిపోవడం కూడా కలియుగ విచిత్రాల్లో భాగమే!
నేను గెలిస్తే..!
నేను గెలిస్తే చుక్కల్లో చంద్రుణ్ణి ఒక్కణ్ణి రహస్యంగా మీ ఇళ్లలోకి తెస్తాను. నేను గెలిస్తే సూర్యుణ్ణి సుద్దముక్కలా చేసి బడుగు పిల్లలకు బలపంగా ఇస్తాను. నేను గెలిస్తే గోదావరిని ఆంధ్రాకు వెళ్లకుండా అడ్డుట్టవేసి మీ ఇంటి నల్లా పైపులోకి పంపిస్తాను. నేను గెలిస్తే కృష్ణానదీ ప్రవాహాన్ని చుక్క కూడా క్రిందకు పోనివ్వకుండా విజయవాడలోనే కొత్త పసుపు పచ్చ సముద్రాన్ని సృష్టిస్తాను. వీలైతే దానికి ‘చంద్రన్న సముద్రం’ అని పేరు పెడతాను. నేను గెలిస్తే దేశంలో ఎలాంటి పన్నులు లేకుండా చేసి దేశంలోని డబ్బును స్విట్జర్లాండ్‌కు తరలిస్తాను. నేను గెలిస్తే ఐటి, ఈడి, సిబిఐలను రద్దుచేసి సీఎం రమేశ్‌ను, సుజనాచౌదరిలను చుట్టాల్లా చూసుకుంటాను. నేను గెలిస్తే ఏ సిఎంనైనా నాకాళ్ల దగ్గర మోకరిల్ల జేస్తాను. నేను గెలిస్తే అర్జంటుగా అర్ధరాత్రి మతోన్మాదంపై యుద్ధం చేసి ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్‌ వ్యవస్థలను సృష్టించి సామాజిక న్యాయంతో సంపదను అందరికీ పంచేస్తా. వీలైతే మాకినేని బసవ పున్నయ్య భవనం, సుందరయ్య విజ్ఞానం కేంద్రం అమ్మేసి దేశంలోని పేదసాదలందరికీ సంపద పంపిణీ చేసి మార్క్స్‌ రాజ్యాన్ని స్థాపిస్తా. నేను గెలిస్తే మా పీఠం మాత్రం అలాగే అట్టిపెట్టుకొని బహుజన లెప్ట్‌ భావాలు గల వాళ్లను ఎమ్మెల్యేలుగా చేసి మాయవతి – మార్క్స్‌ సిద్ధాంతంతో సరికొత్త ‘మాయా సామ్రాజ్యం’ నిర్మిస్తాను. నేను గెలిస్తే పీడనలేని, దొరల పాలనలేని సామాజిక తెలంగాణ సాధిస్తాను. నేను గెలిస్తే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు ఇచ్చినా, నా అంత గొప్పవాడు ఈ దేశ రాజకీయాల్లో ఎవరూ లేరని చెప్పే బాబుగారి పాదాల దగ్గర భరతునిలా ఉండి పాలిస్తా.
ఇవన్నీ విన్న ఓటరు.. ఇన్ని చెప్పారు ‘ఈ దేశాన్ని కాపాడుతా’ అని ఒక్కరు చెప్పలేదే ! అని బాధపడి, భరతమాతను మనసులో ప్రార్థించి ఓటు వేయడానికి బయలుదేరాడు..!!



***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
10 : 16 : డిశంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 06

1 కామెంట్‌: