ఒక గొప్ప సన్యాసి తన శిష్యుడిని వేదాంతం నేర్చుకోవడానికి జనకచక్రవర్తి వద్దకు పంపాడు. ఆ శిష్యుడు.. అంతా తనకే తెలుసు అనే అహంకారంలో ఉన్నాడు. ‘ఈ జనకుడి నుంచి నేనేం నేర్చుకుంటాను’ అనే ధీమాతో ఉన్నాడు. అందుకే జనకుడి వద్దకు వెళ్లి ఒక తాళపత్రంపై.. ‘నేను వచ్చాను’ అని రాసి పంపాడు. దానిని చూసిన జనకుడు నవ్వుకొని ఆ తాళపత్రాన్ని వెనక్కి తప్పి.. ‘నేను చచ్చాక రండి’ అని రాసి పంపాడు. ఇక్కడ ‘నేను చచ్చాక’ అంటే జనకుడి మరణం కాదు. ‘నేను’ అనే అహం వదిలాక రావాలని దాని అర్థం. మనుషులంతే ‘నేను’ అనే అహం చుట్టే పరిభ్రమిస్తూ అసలు సత్యం విస్మరిస్తారు. అందుకే అష్టావక్రుడు ఈ ‘నేను’ను గురించి చెప్తూ..
దేహాభిమాన పాశేన చిరంబద్ధో సి పుత్రక
బోధో హం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ
..అన్నాడు. ‘‘ఓ రాజా, ‘నేను దేహం’ అనే అభిమానంతో నీవు బంధింపబడ్డావు. ‘నేను’ అనే ఈ బంధం నుంచి విడివడడానికి జ్ఞానమనే ఖడ్గంతో భేదించు’’ అని దీని అర్థం. ‘నేను’ అనే అహంకారానికి ప్రాయశ్చిత్తం లేదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దాన్ని వదిలిపెట్టకుండా జ్ఞానం కలగదు కాబట్టే జ్ఞానవేత్తలంతా.. ‘నేను’ను వదలడమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రాథమిక పరిజ్ఞానంగా చెబుతారు. నేను అనే భావాన్ని అన్ని విధాల రూపాల్లో వదిలిపెట్టడమే ముక్తి కలగడానికి దారిగా మారుతుందని ఆదిశంకరులు చెప్పారు. నిజానికి ఆధ్యాత్మిక సోపానంలో పైకి వెళ్లే కొద్దీ నీరుల్లిపాయను ఒలిచిన కొద్దీ లోపల ఏమీ మిగలకుండా శూన్యం ఏర్పడినట్లుగానే.. నేనును వదిలేస్తే పరాత్పరుడైన పరమాత్మను పొందుతాం.
ఇక, ఈ అహంకారంతో జంటగా ఉండేది మమకారం. నాది అనే భావన వల్లనే తీవ్రమైన ఆశలపాశాలతో బంధింపబడతాం. ఎండమావుల్లాంటి ఆశల వెంబడి పరుగెత్తి, పరుగెత్తి అలసి సొలసి చింతలో మునిగిపోతాం. దానివల్ల అశాంతికి లోనై సుఖం లేకుండా జీవిస్తాం. అనేకమైన చింతనల్లో మునిగిపోయి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. పరుగెత్తే మనసుకు ఇంధనం ఈ ‘నాది’ అనే మమకార భావనే. అది గానుగెద్దు ప్రయాణంలా ఉంటుంది. గానుగ తిప్పేందుకు కట్టిన ఎద్దు.. ‘రోజూ నేను వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తాను’ అనుకున్నట్లే ఈ మమకారం చుట్టూ తిరిగేవారి పరిస్థితి అలాగే ఉంటుంది.
బురదలో తిరిగే రాజహంస కూడా మలినం అయినట్లుగా ఈ మమకారంలో పడిన మనిషి జీవితం అంతే. సరోవరం పక్కనున్న బురదగుంటలో పొర్లాడే వరాహంలా సత్యదర్శనం చేయలేం. మమకార బంధం ఆవరిస్తే వివేకం కోల్పోతాం. దానివల్లనే కదా ఆధునిక జీవనంలో మనుషులు పరుగులెత్తే జీవనం కొనసాగిస్తూ అశాంతిగా జీవిస్తున్నారు. ఈ సుడిగుండం నుంచి మానవులను రక్షించేది ధ్యానం, యోగం. అది పూర్తిగా అంతఃకరణకు సంబంధించినది. మనోమాలిన్యాలను కడిగివేసే యోగంలోకి వెళ్లినప్పుడు నిశ్చలమైన సరస్సులో మెరిసే వెండినాణెంలా మనకు మనమే కనిపిస్తాం.
********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి