ఆపరేషన్ థియేటర్లో రోగి కళ్లు తెరవగానే వై ద్యుడు- ‘ఓ శుభవార్త ఉంది, ఓ దుర్వార్త ఉంది- రెండింటిలో ఏది ముందు చెప్పమంటావ్?’ అని అడిగాడట. మొదట దుర్వార్తనే చెప్పండని ఆ రోగి కోరాడట. ‘నీ రెండు కాళ్లు మోకాళ్ల వరకు పాడైనందున ఆపరేషన్ చేసి తొలగించాం! ఇదే దుర్వార్త’ అన్నాడు డాక్టర్. ‘శుభవార్త ఏంటా?’ అని ఎదురు చూస్తున్నట్లు రోగి చూపులను గమనించి- ‘నీ చెప్పులను పక్కనున్న పేషంట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతకు అమ్ముతావ్?’ అన్నాట్ట డాక్టర్. కాళ్లు పోయినందుకు బాధపడాలా? చెప్పులు అమ్మకానికి వచ్చినందుకు సంతోషపడాలా...?
సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతాపార్టీ కార్యకర్తల మానసిక స్థితి ఆపరేషన్ అయిన ఆ రోగి లాగానే ఉంది. వ్యూహాత్మక తప్పిదాల వల్ల తమ పార్టీ స్థితి నానాటికీ దిగజారడం ఆ కార్యకర్తలను నిస్తేజానికి గురి చేస్తున్నది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పాగావేయడానికి అనువుగా ఉన్న మొదటి స్థానం తెలంగాణ. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల్లో భాజపాకు తీవ్ర నిరాశే మిగిలింది. పార్టీలో అగ్రనేతలనుకునే వారు ఓటమి చెందడం బాధ కలిగించినా, క్రిందిస్థాయి కార్యకర్తల్లో దీనికంతటికీ కారణం ఆ అగ్రనేతలే అన్న కసి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. భాజపా గనుక పూర్తిస్థాయిలో పనిచేసి ఉండి ఉంటే తెరాస విజయానికి బ్రేకులు పడేవి అని చాలామంది అభిప్రాయం. చివరి 15 రోజుల్లో చేసిన ప్రచారం 3 నెలల ముందు నుండే వ్యూహాత్మకంగా చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అన్నది సర్వేసర్వత్రా వినిపిస్తున్నమాట. లేకలేక దొరికిన అవకాశాన్ని గాజుగ్లాసును జారవిడిచినట్లు విడుచుకున్నారని జాతీయవాదుల బాధ. అనునిత్యం అకారణంగా మోదీని తిగుతున్న చంద్రబాబు గ్రూప్ ఓడినందుకు సంతోషించాలా? మరోసారి కేసీఆర్ గెలిచినందుకు బాధపడాలా? అన్నది భాజపా కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు.
తెలంగాణలో ఈరోజుకూ మతపరమైన ఉద్రేకం ఉంది. ఇక్కడి మెజార్టీ ప్రజలను ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, అతని బంటు కాశీం రజ్వీ పెట్టిన బాధల గాయాలను ఎవరూ చెరపలేరు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో గానీ, ఆ తర్వాత వచ్చిన మలి ఉద్యమంలో గానీ తెలంగాణ భాజపా నాయకుల పాత్ర తక్కువేం కాదు. 1997లోనే అందరికన్నా ముందు ‘కాకినాడ తీర్మానం’ చేసి తెలంగాణకు అనుకూలంగా భాజపా వ్యవహరించింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ‘చంద్రబాబు అండ్ కో’ వెంకయ్య నాయుడి ద్వారా దానిని నీరుగార్చిందని కొందరు పార్టీ పెద్దలు చెప్తారు.
2000 సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ మలి ఉద్యమంలో భారతీయ జనతాపార్టీ గణనీయమైన పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించింది. ఈ తొందరపాటులో ఎం. వెం కయ్యనాయుడు చేసిన ‘ప్ర త్యేక హోదా పాపం’ ఇప్పు డు భాజపాకు ఉరితాడులా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత భాజపా- తెదేపాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుండి తెలుగులోని ప్రధాన స్రవంతి మీడియా భాజపాను రోజూ విలన్‌గా చూపిస్తున్నది. చంద్రబాబు, కేసీఆర్, కేటీఆర్‌లను ‘గారు’ అని సంబోధిస్తున్న టీవీ యాంకర్లు ప్రధాని మోదీని ఏకవచనంతో సంబోధిస్తూ అనరాని మాటలంటున్నారు.
ఇక విశే్లషకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా టీవీ చర్చలకు వచ్చిన వారి నోటికి దండం పెట్టాలి. విచిత్రం ఏమిటంటే తెలంగాణకు సంబంధం లేని ప్రత్యేక హోదాను ఇక్కడ చూపిస్తూ రోజూ కథనాలుగా, విశే్లషణలుగా చూపిస్తూ అడ్డగోలుగా మాట్లాడటం షరామామూలైంది. జరుగుతున్నా తెలంగాణ భాజపా నేతలు వౌన మునుల్లా ఆ కార్యక్రమాలను ఆనందంగా వీక్షించడం తప్ప చేసిందేమీ లేదు. టీవీ చర్చలకు వెళ్తున్న శ్రీ్ధర్‌రెడ్డి, రఘునందన్, కృష్ణసాగర్, ఏనుగుల రాకేశ్, ప్రేమేందర్‌రెడ్డి తప్ప మిగతా వాళ్ల గొంతులో బలం లేదు. ప్రజలు రోజూ టీవీ చానళ్లు చూస్తారన్న సత్యాన్ని భాజపా విస్మరించింది. ఆర్‌ఎస్‌ఎస్ బౌద్ధిక్‌లు విని ఓట్లు వేయరు. సాధారణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు టీవీలు, పత్రికలు చూస్తారు. నిన్న మొన్న రాజకీయం మొదలుపెట్టిన ‘జనసేన’ అధినేత పవన్‌కల్యాణ్ ఓ టీవీ ఛానల్‌ను కొనేసి, సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నా తెలంగాణ భాజపా నాయకులకు ఆ ధ్యాసే లేదు!
కేరళ, అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి, పోరాటాలు చేసి పార్టీని విస్తరిస్తున్నారు. కానీ తెలంగాణ భాజపా ముఖ్యులకు అలాంటి ఉద్యమాలపై అవగాహన ఉండదు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే శంషాబాద్ ఏయిర్‌పోర్ట్ నుండి వాళ్లకు కన్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, వారి మన్నన పొంది ఓ ప్రెస్‌మీట్, ఓ శంకుస్థాపనో చేయించి గౌరవంగా పంపించడంవల్ల ఓట్లు పడతాయని అనుకోవడం అమాయకత్వమే. వాళ్లను తెలుగు ప్రజలు ఎవరు పట్టించుకొంటారు? కేంద్రమంత్రులకు రాష్ట్రాలకు రప్పించడం వల్ల పార్టీ అభివృద్ధికి, సైద్ధాంతిక బలానికి ఊతం ఇవ్వాలి తప్ప అదేదో ‘వినోద కార్యక్రమం’ అనుకుంటే అజ్ఞానమే.
ఈ ఐదు ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా తెగించి చేసిన పోరాటం ఒక్కటీ లేదు. తెలుగు రా ష్ట్రాల్లో గోవధ తీవ్రంగా జరుగుతున్నా ఒక్క రాజాసింగ్ తప్ప ఇంకొకరు మాట్లాడిన పాపాన పోలేదు. అద్భుతమైన జాతీయ విలువలున్న కార్యకర్తలను నిర్మించే సరస్వతీ శిశు మందిరాలు ఆర్థిక పరిస్థితుల వల్ల అతలా కుతలం అవుతున్నా ఒక్కనాడు వాటివైపు ఏ భాజపా నాయకుడు కనె్నత్తి చూడలేదు. వామపక్ష విద్యార్థి సంఘాల చేతిలో ప్రాణాలు కోల్పోతూ కూడా ఆ రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ నిలిచి గెలిచింది. ఇప్పుడు భాజపాలో ఉన్న చాలామంది ఆ సంస్థ నుంచి వచ్చినవారే. ఇప్పుడు తెదేపా, తెరాసల్లో ఏబీవీపీ పునాదులపై ఎదిగిన నేతలూ ఉన్నారు. ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలను, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని వామపక్ష వాదులు కబ్జా చేసినా అడిగే దిక్కులేదు. నేడు విద్యార్థి సంఘాల్లో కులవాదం రెచ్చగొడుతున్న ఆచార్యులకు అడ్డూ అదుపూ లేదు. గురుకులాలను కులాల వారీగా ఏర్పరచి కులవాదం వాళ్లలో నూరిపోస్తున్న తీరుతో మరో పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఇంకో కొత్త సమస్య రాబోతోంది. వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కులతత్వంతో బయటకు వస్తే సమాజంలో సంఘర్షణ ఏర్పడడం ఖాయం. ఇవన్నీ కూలంకశంగా ఆలోచించి సమాజంలో సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు జాతీయవాదులుగా మీ యోగదానం ఏంటని అడిగితే, చెప్పేందుకు భాజపా నాయకత్వం చేసిన చింతన ఏంటి? ‘ఇన్‌స్టంట్’ నాయకులను అరువుదెచ్చుకొని, అదీ 15 రోజులముందు టిక్కెట్లు కేటాయించి ‘యుద్ధం చేయ్..’ అంటూ ఎన్నికల కురుక్షేత్రంలోకి పంపడం ఎలాంటి వ్యూహం!?
రోజురోజుకూ తెలంగాణ రాష్ట్ర పాలనలో పెరుగుతున్న మజ్లిస్ జోక్యంపై జాతీయవాదుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. పాతబస్తీలోని రియాసత్‌నగర్‌లో నవంబర్ 24న అక్బరుద్దీన్ ఓవైసీ ‘ఇందిరాగాంధీనే దారుస్సలాంకు వచ్చింది.. ప్రతి ముఖ్యమంత్రి మాముందు తలవంచాడు’ అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువకులు మోదీ పట్ల అభిమానం పెంచుకున్నా దానిని ఓటు బ్యాంక్‌గా భాజపా మార్చుకోలేకపోతుంది. 22 లక్షల సభ్యత్వం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా, తాజా ఎన్నికల్లో 14 లక్షల ఓట్లను మాత్రమే భాజపా పొందగలిగిందంటే కారణం ఎవరు? ఉద్దేశ పూర్వకంగా హైద్రాబాద్ నగరంలో ఓట్ల తొలగింపు జరుగుతున్నా భాజపా దానిపై దృష్టి పెట్టలేదు. సంఘ పరివార్‌లోని ఇతర క్షేత్రాల సభ్యుల పేర్లు కూడా నాయకత్వానికి తెలియకపోవడం విడ్డూరం. కనీసం సర్పంచ్, జెడ్పీటీసీలకు వచ్చే ఓట్లు కూడా రాని వారు ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లకు పోటీపడ్డారంటే అందుకు- పార్టీ ఫండ్, పేరు ఇబ్బడిముబ్బడిగా వస్తుందనే ఆశ కాదా? టిక్కెట్ల కేటాయింపు, పరిశీలన నిష్పక్షపాతంగా జరుపకుండా, అభిప్రాయ సేకరణ లాంఛనంగా చేసి ఓటమి వైపు తీసుకెళ్లడం వ్యూహాత్మక తప్పిదం కాదా?
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని కరెంట్ విషయంలో తప్పుదారి పట్టించిందెవరు? కరెంట్ విషయంలోనే కేసీఆర్ మోదీని తీవ్రంగా తిట్టడం నిజం కాదా? అద్భుతమైన రెండు ప్రసంగాలు చేసిన మోదీని ఈ విషయంలో బోను ఎక్కేలా చేసింది ఎవరు? టిక్కెట్ల కేటాయింపు మొదలుకొని ప్రచార వ్యూహాల వరకు తప్పుల మీద తప్పులు చేసి నేతలు అగాధంలో పడడం కార్యకర్తలను నిరాశకు గురిచేయడం కాదా? తెరాస తిరస్కరించిన బాబూ మోహన్, బొడిగె శోభలకు టిక్కెట్లివ్వడం ఓ గొప్ప వ్యూహమా? అంతకన్నా గొప్ప లీడర్లు తెలంగాణలో ఇంకెవరూ లేరా? మాజీ నక్సల్స్‌కు టిక్కెట్లు ఎలా కేటాయిస్తారు? ఒకప్పుడు వామపక్ష సంఘాల చేతిలో మరణించారని చెప్పే సామ జగన్మోహన్‌రెడ్డి, చంద్రారెడ్డి వంటి వాళ్ల ఆత్మలు ఘోషించవా? విచిత్రం ఏమిటంటే మొద్దు నిద్రలో ఉన్న ఈ మద గజానికి మేతవేస్తూ పెంచుతున్న జాతీయవాద ‘మావటి’ నియంత్రించలేకపోవడం మరో రకమైన ఆశ్చర్యం. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మోదీ వైపు జరుగుతున్న శత్రు మూకలకు కళ్లెం వేయకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయవాద ప్రభుత్వానికి సంకటం తప్పదు. ఇప్పటికైనా తప్పులను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కాకపోతే అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడి భాజపా జీవం పోసినట్లు అవుతుంది. ఓటమి కారణాలను ‘వాస్తులోపాల పైకి, బాత్రూమ్ నిర్మాణాల పైకి నెట్టకుండా ’ నిజాయితీతో సహృదయంతో జాతీయ వాదాన్ని నిలబెడితేనే తెలంగాణలో భాజపాకు మనుగడ. లేదంటే- ‘రాజ్యాంతే నరకం ధృవమ్'.
************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *
*శుక్రవారం : డిసెంబర్ : 21 : 2018*
* డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *
*శుక్రవారం : డిసెంబర్ : 21 : 2018*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి