‘రాజదండం మట్టిగరిచినపుడు ధర్మదండం దానిని ఉద్ధరిస్తుంది’ అనే మాటను ఓ గొప్ప తత్త్వవేత్త చెప్పాడు. హిందూ ధర్మం ధార్మిక లక్షణాలను పుణికిపుచ్చుకొన్నది. అందుకే శ్రీరాముడిని ధర్మస్వరూపంగా, గోవును ధర్మ స్వరూపంగా చెప్తూ వచ్చారు. దేనివల్ల సమాజానికి ఆధ్యాత్మిక ప్రవేశం కలుగుతుందో అదంతా ధర్మమే. ఈ ధర్మ స్వరూపానే్న కొందరు ‘హిందుత్వ’ అంటారు. 

ఇంకొందరు సనాతన, వైదిక, ఆర్య.. వంటి పేర్లతో పిలుస్తారు. హిందుత్వకున్న గొప్ప గుణం రాజకీయాలకు అతీతంగా గొరవింపబడడం. అందుకే మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎన్నిసార్లు ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించినా, లౌకికవాదాన్ని వల్లించినా వ్యక్తిగత జీవితంలో జరిగే ‘తంతు’లో వైదిక భావన నుండి తప్పించుకోలేరు. అదే అబ్రహామిక్ మతాల్లో రాజకీయం, మతం రెండూ కలగాపులగమై ఉంటాయి. హిందుత్వ నుండి రాజకీయం విడదీయడం చాలా సులువు. అందుకే చాలామంది నేతలు రోజూ హిందువుగా జీవిస్తూనే ‘హిందుత్వ’ను తిట్టగలరు! ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పునాదుల్లో హైందవానికి ఆధ్యాత్మికతకు- హిందుత్వానికి మధ్య జ్ఞానం అనే పెద్ద అడ్డుగోడ ఉంది. అందువల్లనే పదవుల రీత్యా ఎంత గొప్పవారైనా మహాత్ములను, పీఠాధిపతులను, స్వామీజీలను చూసినపుడు నేతలు మోకరిల్లుతారు. దాన్ని తక్కువతనంగా భావించకూడదు. అది వారి వినయానికి నిదర్శనం. ఇస్లాం, క్రైస్తవాల్లో స్వాముల్లాంటి మత గురువులుండరు కానీ ముల్లాలు, పాస్టర్లు మత గురువులే. 

హైందవంలో ఒక వ్యక్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తే హైందవేతర మత గురువులు గల్లీకొకరు తమ మతాన్ని నూరిపోస్తారు. దానిని ఎవరూ ప్రశ్నించరు. కానీ హిందూ గురువుల్లో ఎవరో ఒకరు నాయకులకు సన్నిహితంగా ఉంటే అదేదో అంతర్జాతీయ నేరంగా ప్రచారం చేస్తారు. అసదొద్దీన్ ఓవైసీ ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం హైదరాబాద్ మక్కా మసీదులో ముస్లింలను ఉద్దేశించి చేసే ప్రసంగం గొప్ప లౌకికవాదం! అదే హిందూ నాయకులు ఎక్కడైనా రాజకీయంగా మతాన్ని వాడుకుంటే మతతత్వం! ఇదీ ఈ దేశంలో వ్యాఖ్యానం. ఇందుకు భిన్నంగా ఇటీవల ప్రజలను ప్రభావితం చేసే స్వాములు రాజకీయాలకు దగ్గరగా ఉండడం కొందరు జీర్ణించుకోరు. హిందూమతానికి స్వామీజీలు ధర్మ ప్రబోధం మాత్రమే చేయాలా? అన్నది ఇవాళ్టి కొత్త ప్రశ్న.

ఇటీవల విశాఖ శ్రీశారాదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు పట్ట్భాషేకం చేసేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసిఆర్, జగన్‌లు వెళ్లడం, స్వామి స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలు, చర్యలపై కొందరు విమర్శలు మొదలుపెట్టారు. ‘అగ్నిసాక్షిగా చెబుతున్నా జగన్ నా ఆత్మ. కెసిఆర్ అపర మేధావి. వీరిద్దరి పాలన మరో పదిహేనేళ్ళు సాగాలి’ అన్న శారదా పీఠాధిపతి ప్రసంగం రాజకీయంగా కొందరికి ఇబ్బంది కలిగింది.

స్వరూపానందేంద్ర మొదటి నుండి కల్మషం లేకుండా, మనస్సులో భయం లేకండా మాట్లాడడం అలవరచుకొన్నారు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చింది. క్రీడాకారిణి పి.వి.సింధును సత్కరించినా, టీవీ చానళ్ళ భావదారిద్య్రాన్ని ప్రశ్నించినా, రాజకీ య నాయకులను గద్దెనెక్కించడం కోసం రాజశ్యామల యాగం చేసినా, సినిమా నటుల వరుస మరణాలను ఆపేందుకు దైవ సన్నిధానంలో యాగం చేసినా, మతమార్పిడి నిరోధాలకు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినా ఆయన ప్రత్యేకమే. ఇందులో కొన్ని వివాదాస్పదంగా అనిపించినా అతనిలో సహజత్వం అందరికీ నచ్చుతుంది. స్వాములు ఆశీర్వాదం కోసం, ప్రవచనాల కోసం కాదు ధర్మరక్షణకు కూడా అంకితం అవ్వాలన్నది క్రొత్త ట్రెండ్. ధీరేంద్ర బ్రహ్మచారి వంటివాళ్లను ఇందిరా గాంధీ గురువుగా స్వీకరించగా, కాంగ్రెస్ పార్టీ రామ్‌దేవ్ బాబాపై దాడి చేసింది. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో యూపిఏ ప్రభుత్వం ఆయనపై తీవ్రాగ్రహం ప్రదర్శించింది. సహజంగానే రామ్‌దేవ్ నరేంద్ర మోదీకి అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారు.

కంచి పీఠాధిపతి సహా శంకర పీఠాధిపతులంతా కాస్త భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గురువుగా చెప్పే శంకరాచార్య పీఠాధిపతి స్వరూపానంద కాంగ్రెస్‌కు మద్దతుగా భాజపాను విమర్శించేవారు. స్వామి అగ్నివేశ్ పేరుకు కాషాయం కట్టినా కమ్యూనిస్టులకు గురుతుల్యుడు. రామ్‌విలాస్ వేదాంతి, సాధ్వి ఉమాభారతి, సాధ్వి నిరంజన్ జ్యోతి, యోగి ఆదిత్యనాథ్, సాధ్వి ప్రాచీ, సాక్షి మహరాజ్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, సాధ్వి రితంబర వంటివారు భాజపాను ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్నారు. కన్నడ నాట వీర లౌకికులైన దేవెగౌడ, సిద్ధరామయ్య కుటుంబాలు శివస్వాముల మఠాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల చినజీయర్ స్వామికి కేసీఆర్ ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలుసు. ఒకప్పుడు కమల్‌నాథ్ ఆశారాం బాపునకు ప్రియశిష్యుడు. ఇదంతా చెప్పడం ఎందుకంటే కేసీఆర్, జగన్‌లు స్వరూపానందేంద్ర దగ్గరకు వెళ్లడాన్ని రాజకీయం చేస్తున్నవారు ఈ చరిత్ర తెలుసుకోవాలి.

క్రీ.శ. 778లో కేరళలోని కాలడిలో జన్మించిన ఆదిశంకరులు చేసింది ధర్మోద్యమమే. బౌద్ధులు, జైనుల్లోని డొల్లతనపు కొన్ని సిద్ధాంతాలను తుత్తునియలు చేసిన లకులీశుడు పాశుపత మత ప్రవర్తకుడైనా మతాన్ని కాపాడాడు. మాధవ విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి దక్షిణ దేశాన్ని కొనే్నళ్ళపాటు ముస్లిం దండయాత్రల నుండి రక్షించారు. సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీని 1674లో హిందూ సామ్రాజ్య పట్ట్భాషేకం చేసేవరకు తన ప్రయత్నం కొనాసాగించాడు. వంగ దేశపు స్కాట్‌గా బ్రిటీషువారితో అభివర్ణింపబడిన బంకించంద్ర ఛటర్జీ సన్యాసుల తిరుగుబాటునే కథగా ‘వందేమాతరం’ రచించాడు. అది ఈ దేశంలో ఎందరో గొప్ప దేశభక్తులకు తారకమంత్రం అయ్యింది. ‘ఆనంద్‌మఠ్’ నవల ఆనాటి ఆధ్యాత్మిక లోకాన్ని ఉర్రూతలూగించింది. అంతెందుకు? అస్పృశ్యతను నివారించేందుకు గాంధీ కన్నా ముందే గొప్పగా పనిచేసిన స్వామి శ్రద్ధానంద 1926 డిసెంబర్ అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది చేతిలో హత్యగావించబడ్డారు. ఇటీవల క్రైస్తవుల ఆగడాలను అడ్డుకొని గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం నింపిన స్వామి లక్ష్మణానందను మావోయిస్టులు- మాత మార్పిడి ముఠాలు కలి సి హత్యచేశారు. ఇలా శంకరుడు మొదలుకొని లక్ష్మణానంద వరకు స్వాములు, మఠాధిపతులు ధర్మం కోసం నిలబడ్డారు. ప్రతి సమయంలో ఎవరో ఒకరు నాయకులకు గైడ్ చేయకపోతే ధర్మాగ్లాని జరిగే ప్రమాదముంది. ఎందుకంటే నాయకుల అధికారం కన్నా ఇంకేదీ ఎక్కువ కాదనే భ్రమ ‘అధికారం’లో ఉంటుంది. అది తొలగించి వారిలో ఆధ్యాత్మిక భావన కలిగించే పని స్వామీజీలది.

అద్వైతమూర్తి సచ్చినందేంద్ర సరస్వతి సంప్రదాయంలో నుండి స్వరూపానందేంద్ర కూడా ‘రాజ్యంతే నరకం ధృవం’ అన్న మాటనుండి నాయకులను తప్పించవచ్చు. అయితే పీఠాధిపతులు కూడా దీనికున్న పరిధులు గమనించాలి. ఆలింగనాలు, ముద్దులు, ఆత్మలు.. ఇవి కాకుండా చేసే ప్రబోధం అందరినీ అంగీకరింపజేస్తుంది. అలాగే నాయకులు స్వాములను వాడుకున్న సందర్భాలను మనం విస్మరించరాదు. ఆశారాం బాపు పాదాల చుట్టూ చాలామంది కాంగ్రెస్ నాయకులు తిరిగారు. కానీ ఆయన సోనియా గాంధీని బహిరంగంగా విమర్శించాక వ్యవహారం తలక్రిందులైంది. హర్యానా-పంజాబ్‌లో అరెస్టయిన ‘రాం-రహీం’ బాబాను చాలామంది వాడుకొని వదిలేశారు. అందువల్ల ఆధ్యాత్మికతకూ- రాజకీయాలకున్న దళసరి పొరను మఠాధిపతులు గమనించాలి.

సత్యసాయిబాబా దేహాంతం విషయంలోని నాటకాలు ఎవరి దర్శకత్వమో ఈనాటికీ తెలియదు. జయలలిత-కంచి స్వామికీ మధ్య వచ్చిన విభేదాలు, వాటి ఫలితాలు ఎంత తీవ్రమైనవో హిందూ సమాజం చవిచూసింది. ఇటీవలి కాలంలో ఆస్తులు మఠాలకు పెరగడం కూడా స్వామీజీలకు సమాజానికి ఎంత లాభమో, దాని వెనుక ప్రమాదం కూడా అదే స్థాయిలో ఉంది. అలాగే సమాజంలోని మెజారిటీ ప్రజలను విస్మరిస్తే అడిగే దిక్కు లేకుండా పోవడమే స్వామీజీల రంగప్రవేశంగా చెప్పవచ్చు. సద్గురు శివానందమూర్తి లాంటి మహనీయుడు 2014కు ముందు నరేంద్ర మోదీ లాంటి దేశభక్తుడు ఈ దేశ ప్రధానిగా కావాలని తపించాడు. ఎందరో అనుయాయులున్నా ఒక సహచర భక్తుడితో వారణాసి వెళ్లి అక్కడ తపస్సునంతా ధారపోసి వచ్చాడు. ఆ తర్వాతే ఆయన దేహత్యాగం చేశాడు. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకు ‘నేను సంకల్పం చేశా’ అని స్వరూపానందేంద్ర అంటున్నారు. 

జగన్‌ను కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్లి చేసిన ఓ పూజా కార్యక్రమం మతమార్పిడి కోసం శుద్ధీకరణ అనే ప్రచారం బాగా జరిగి, అది ఎన్నికల్లో హిందువులు, భాజపా ఓట్లను జగన్‌కు మళ్లించింది. పుష్కరాల సందర్భంలో నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు పాలనలో గుళ్లు కూలగొట్టడం గురించి ఆంధ్రాలో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో స్వరూపానందేంద్ర ప్రతిఘటించాడు. 2014 కన్నా ముందులాగా వైయస్ జగన్ మెస్సయ్యలా శిలువ మోయడం తగ్గించాడు. ఇదంతా స్వరూపానందేంద్ర చేసిన హైందవీకరణ అనడంలో సందేహం లేదు. కానీ రాజకీయాల్లో ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికమంతా రాజకీయం కాకూడదు అన్న విషయం విస్మరించవద్దు.

ఎందుకంటే రమణ మహర్షి దగ్గరకు నాటి భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చినా, ఆయన మామూలుగానే స్పందించారు. ‘రాష్ట్రపతి గారు మిమ్మల్ని చూస్తానని ఢిల్లీనుండి కబురంపారు’ అంటే ‘నాకు ఆయనతో ఏం పనిలేదే..’ సున్నితంగా తిరస్కరించారు. అయితే అందరూ రమణమహర్షిలా ఉండలేరు. ధర్మరక్షణకు స్వామీజీల అవసరం ఉంది. ఇదే వైఎస్‌ఆర్ ప్రభుత్వం తిరుమలను రెండు కొండలుగా మార్చాలనుకొన్నపుడు ఉద్యమం తారస్థాయికి చేర్చేందుకు ఉడిపి పెజావర్ మఠాధిపతి విశేశ్వర తీర్థులు రావలసివచ్చింది. స్వాములు జోక్యం చేసుకోకపోతే ధర్మం నిలబడదు. విచ్ఛిన్నకర శక్తులను నిలువరించాలంటే దేశం - ధర్మం - దైవం ఈ మూడూ ఏకసూత్రంతో నడపాలి. లేదంటే దేవాలయాలకు, హిందూ సమాజానికి భద్రత ఉండదు. ఇప్పటికీ ఆ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. స్వాములు అమాయకంగా, బాల్యావస్థలో వౌనముద్రాధారులయి, లోకం పోకడ తెలియకుండా మఠాల ఆస్తులు మాత్రమే పెంచితే హిందువులకు జరిగే గ్లానిని ఎవరూ నిరోధించలేరు. కొందరు ఆత్మజ్ఞానులుగా, కొందరు ధర్మరక్షకులుగా ఉండాల్సిందే. ఓ రమణమహర్షిలా, ఓ నిసర్గ దత్తమహారాజ్‌లా కొందరు ఆధ్యాత్మికవేత్తలు జీవించాల్సిందే. 

ఆ పరంపర ఈనాటికీ కొనసాగుతున్నది. మాతా అమృతానందమయి, శ్రీ గెంటేల వెంకటరమణలు ఆ కోవలోనివారే. మరోవైపు ఓ త్రిదండి చినజీయరు స్వామి, స్వరూపానందేంద్ర, పరిపూర్ణానంద ఉండాల్సిందే. రాజు నిరంకుశుడైనపుడు జ్ఞానప్రబోధం చేసేందుకు గురువులు అవసరం. ఎందుకంటే ‘ఆధ్యాత్మిక ప్రబోధం’ రాచరికాన్ని కూడా సున్నితంగా పలుచన చేస్తుంది. అహంకారం తగ్గిస్తుంది. కానీ స్వాములు, పీఠాధిపతులు కూడా జోక్యాన్ని పరిమితంగా ఉంచుకోవాలి. తద్వారా మన సనాతన వైదిక హిందూ ధర్మం శక్తి పెరుగుతుంది.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*21-06-2019 : శుక్రవారం*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి