కండపట్టి ఉండే కొన్ని జంతువులు క్రూర జంతువుల నుండి తప్పించుకునేందుకు అప్పుడపుడు వలసపోతుంటాయి. పరిస్థితులు చక్కబడగానే తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. కొన్ని పక్షుల్లో, జంతువుల్లో తల్లే స్వయంగా సురక్షిత ప్రదేశంలో పిల్లల్ని ఉంచి అనుకూల పరిస్థితులు వచ్చాక వాటిని తిరిగి తెచ్చుకుంటుంది. ఇపుడు ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీలోకి వలసవస్తున్న కొందరిని చూశాక ఈ ‘పర్యావరణ జంతుశాస్త్రం’ గుర్తుకొస్తున్నది.

ఇటీవలి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వం ఇపుడు ఎదురులేకుండా సాగుతున్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు తిరగకముందే సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్, గరికపాటి రాంమోహనరావు, సీఎం రమేష్ అనే నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులు ఏకంగా తమ పార్టీ పక్షాన్ని భాజపాలో విలీనం చేశారు. ఎన్నికల ముందు ఇంగ్లీషు, తెలుగు టీవీ చానళ్లలో మోదీని, అమిత్‌షాను, భాజపాను బండమూతులు తిట్టిన తెలుగుదేశం నాయకుడు లంకా దినకర్ భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. ఇపుడు ఆంధ్రాలో తెలుగుదేశం వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు భాజపా తలుపులు తడుతున్నది వాస్తవం. ఇదంతా భాజపాను, మోదీని బలపరచడానికా? పరోక్షంగా చంద్రబాబును రక్షించడానికా? అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న!

దేశం మొత్తమీద మోదీని ఘోరంగా అవమానపరిచింది ఏపీ తెదేపా నాయకులే. ప్రధానిని బూతులు తి ట్టడం, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల వస్తే రాళ్లు వేయించడం, నల్ల బెలూన్లు, నల్లచొక్కాలు ధరించడం, రాష్ట్రానికి మోదీ రావద్దని హోర్డింగులు.. ఇలాంటి దారుణాలు ఏ రాష్ట్ర నాయకులు చేయలేదు. ఇ దంతా చేసినవాళ్లే ఇపుడు భాజపా కార్యాలయం ముందు ‘క్యూ’ కట్టడం ఆశ్చర్యం వేస్తుంది. సైకాలజీలో చెప్పే ‘స్టాక్‌హోం సిండ్రోమ్’ అనే పదం గురొస్తుంది. రేప్ చేసినవాడిని పెళ్లిచేసుకుంటాననడం, దెబ్బలు కొట్టినవాడినే గొప్పవాడని స్నేహం చేయడం, తండ్రిని హత్యచేసినవాళ్లను కోర్టులు శిక్షలువేసినా క్షమిస్తాననడం.. ఇలాంటి లక్షణాలను ‘స్టాక్‌హోం సిండ్రోం’ అంటారు. 

అస్సాంలో, త్రిపురలో, బెంగాల్‌లో ఇతర పార్టీల నాయకులు వచ్చి భాజపాను అధికారంలోకి తెచ్చారు. కానీ ఆంధ్రాలో వచ్చే వలస నాయకులతో భాజపా జాగ్రత్తగా ఉండాలి. ఇదేం కొత్త ప్రయోగం కాదు. గతంలో ఎన్నోసార్లు చేసి గంపగుత్తగా తెదేపాకి లాభం కలిగించే వ్యూహం ఇందులో వుంటుంది. ముఖ్యంగా జస్టిస్ పార్టీ ఆనవాళ్లు, అవశేషాలు ఈ రోజుకూ తెలుగుదేశంలో ఉన్నాయి. ఆఖరుకు అవి కమ్యూనిస్టులను నిండా ముంచాయి. రేపు ఆంధ్రాలో భాజపా పరిస్థితి అలా కాకుండా చూసుకోవాలి.

ప్రకాశం పంతులు లాంటి త్యాగధనుడిని నిర్వీర్యం చేసిందెవరు? పొట్టి శ్రీరాములును ఆత్మహత్య చేసుకున్నంత పనిచేసి త్యాగంగా చిత్రీకరించి లాభపడిందెవరు? భారతీయ జనతా పార్టీకి నష్టం చేసే తెలుగు మీడియాలోని సింహభాగం సృష్టికర్తలెవరు? నిన్నమొన్నటివరకు మోదీని విలన్‌గా మార్చి ఆంధ్రాలో భాజపా ఓట్లను 0.8శాతానికి దిగజార్చిందెవరు? దేశమంతా మోదీ గాలి వీస్తే ఆంధ్రలో భాజపాకు ఒక్క ఎంపీ సీటు ఎందుకు రాలేదు? ఎన్నికల ఫలితాలు వచ్చే ముందురోజు వరకు కాలికి బలపం కట్టుకొని మో దీని నిలువరించేందుకు ప్రయత్నం చేసిందెవరు? ఇపుడు భాజపాలో చేరిన సీఎం రమేశ్, సుజనా చౌదరిల వ్యాపారాలపై దర్యాప్తు సంస్థలు పరిశీలనకు వస్తుంటే- తెలుగువారి ఆత్మగౌరవానికి భంగకరంగా చిత్రీకరించింది ఎవరు? ఇంతో అంతో విశ్వసనీయత వున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని భాజపాలోకి రానీయకుండా అడ్డుకున్న అదృశ్య శక్తి ఎవరు? ఆ శక్తులే ఇపుడు భాజపాలో చేరి వేదికలపై ఉన్నతాసనాలపై కూర్చుంటే, పార్టీ కోసం ప్రాణాలిచ్చే సోము వీర్రాజు లాంటివారి పరిస్థితి ఏంటి? తెదేపాలో కొందరు నేతలు జగన్ బ్యాటింగ్ నుండి తప్పించుకునేందుకు భాజపా గూట్లో దాక్కొంటున్నారా? పార్టీని పటిష్టపరిచేందుకు తోడ్పడతారా? అన్నది భాజపా అధినాయకత్వం గ్రహించాలి.

రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య నాయుడు ప్రత్యే క హోదా కోసం చేసిన హడావుడి వల్ల ఆంధ్రలో భాజపాను సులువుగా ‘విలన్’ చేశారు. అది ఆనాడు సదుద్దేశంతో చేసినా, భాజపా మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వున్న ‘స్పెషల్ స్టేటస్’ అనే పదం ఇపుడు చర్చగా మారింది. దానిని ఇంకా పూడ్చుకోకముందే మళ్లీ ఇలాంటి అవకాశవాదులను పార్టీలోకి ఆహ్వానిస్తే కింది స్థాయి కార్యకర్తల మనోభావాలకు గౌరవం ఎలా దక్కుతుంది? ఇప్పటికే భాజపాలో తెదేపా అనుకూల ‘స్లీపర్ సెల్’ ఒకటి బలంగా ఉంది!

ఒకవైపు భాజపా కోసం సోము వీర్రాజు యుద్ధం చేస్తుంటే, మరోవైపు కంభంపాటి హరిబాబు వౌనంగా ఉంటాడు. పైడికొండల మాణిక్యాలరావు సాత్వికంగా వున్న భాజపా మూల సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తి. అతను తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే కామినేని శ్రీనివాస్ పనె్నత్తి తెదేపా వాళ్లను ఒక్క మాటా అనడు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై తిరగుబడితే అతనికి ఓ వర్గం మద్దతు ఇవ్వదు. సర్వానంద్ సోనోవాల్, ముకుల్‌రాయ్ లాంటి వ్యక్తులను ఆహ్వానిస్తే లాభం ఉంటుంది. కానీ దాచుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి వచ్చే వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. గంటా శ్రీనివాసరావు లాంటివారు వస్తే ఆహ్వానించాలి. అతని రాజకీయ ప్రతిభ రికార్డుగా ఉంది. అంతేకాని రాజకీయ స్వార్థం కోసం, వ్యాపారాల రక్షణ కోసం వచ్చేవాళ్లను ఓ కంట కనిపెట్టాలి. ఇక్కడ విధ్వంసం చేసి, చంద్రబాబు కాళ్లదగ్గరకు వెళ్లేవారిని చేర్చుకోకున్నా మంచిదే. ఎందుకంటే విష్ణువర్థన్‌రెడ్డి లాంటివారు హోరాహరీ తలపడిన లంకా దినకర్‌తో సంసారం ఎట్లా?! కావూరి, ముద్రగడ, దగ్గుబాటి, కృష్ణంరాజు.. వంటివాళ్లు భాజపాలో చేరి ఇపుడు ఎక్కడున్నారు? అంతెందుకు, పురేందేశ్వరికి తన తండ్రి స్థాపించిన టిడిపి ముఖ్యమా? తానున్న భాజపా ముఖ్యమా? ఏది నిర్ణయం!?

1969లో తెలంగాణ ఉద్యమాన్ని సర్వనాశనం చేసి కాంగ్రెస్‌తో ములాఖత్ అయిన చెన్నారెడ్డి, తన వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను బలిపెట్టిన నీలం సంజీవరెడ్డి, కులం కోణంలో పార్టీ పెట్టి- ఇంకో పార్టీ పుట్టిముంచిన చిరంజీవి, అదే ప్రయోగం చేసి వికటించిన పవన్‌కల్యాణ్.. ఇదంతా చరిత్ర. 1969లో రెండుగా విడిపోయిన కాంగ్రెస్ వల్ల లాభపడిన నీలం సంజీవరెడ్డి 1977 ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ లేకుండా రాష్టప్రతి అయ్యారు. చరణ్‌సింగ్ వెన్నుపోటు రాజకీయాలకు 1979 జూలైలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బలయ్యింది. ఎన్టీఆర్‌ను చంద్రబాబు నట్టేట ముంచాడు. 

ఇలాంటి వెన్నుపోటుదారులతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్లది శల్య సారథ్యం (ప్రక్కనే వుండి ప్రాణం తీస్తారు). తమ సిద్ధాంతాలు చెల్లనపుడు ప్రక్క గుంపులో కలిసిపోయి వెన్నులో బల్లెం దింపుతారు. 1996 మేలో కేంద్రంలో భాజపా ఆధిపత్యంలో ప్రభు త్వం ఏర్పడ్డాక ప్రభుత్వం 13 రోజులకే పడిపోయినా- ఈ ఎన్నికల ముందునుండే వలసలు మొదలయ్యాయి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, బాలకొండయ్య, పరకాల ప్రభాకర్, యస్బీపి సత్యనారాయణరావు, చుండ్రు శ్రీహరిరావు, ముద్రగడ పద్మనాభం, కె.వి.ఆర్.చౌదరి, జితేందర్‌రెడ్డి, ఆళ్వార్ దాస్, గంగుల ప్రతాపరెడ్డి, వెంకటస్వామి, ఎన్.వెంకటేశ్వర చౌదరి, ఎ.వనజాక్షి, సురేంద్రరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రామమునిరెడ్డి, యు.వి.కృష్ణంరాజు, జమున, నరేశ్, కమాలుద్దీన్, డేగా నరసింహారెడ్డి.. వంటివారు భాజపా తీర్థం పుచ్చుకున్నవారే. ఇపుడు వీళ్లలో ఎంతమంది మిగిలారు? ఈ ప్రయోగం జనసంఘ్ కాలం నుండి భాజపా చేస్తూనే ఉంది. కానీ ఈ ప్రయోగం తెలుగుదేశం బలపడేందుకు బాగా ఉపయోగపడింది. 

బెంగాల్, త్రిపురలాగా కార్యకర్తల్లో సైద్ధాంతిక స్థైర్యాన్ని నింపి దానికి తగిన నాయకుడిని సృష్టించాలి. ఇంకా వీలైతే ఏబీవీపీ సైద్ధాంతిక బలం ఉండి ఇతర పార్టీల్లో వున్న నాయకులను తిరిగి తెచ్చుకోవాలి. పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, టి.జి.వెంకటేశ్, చంగల్రాయుడు, గంగుల ప్రతాపరెడ్డి, దేవేందర్ గౌడ్ వంటివారు ఏబీవీపీ నేపథ్యం వున్నవారే. స్వతంత్ర భారతంలో మజ్లిస్‌కు ముకుతాడు వేసిన ఏకైక ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వంటివాళ్లవల్ల పార్టీకి ఊపువస్తుంది. పరోక్షంగా చంద్రబాబుకు లాభం చేసే వలస గ్యాంగుల పట్ల అధిష్ఠానం జాగ్రత్తగా వ్యవహరించకపోతే పాత చరిత్రే పునరావృతం అవుతుంది.

భాజపాలోని ‘తెదేపా స్లీపర్ సెల్’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ పార్టీని ఎదగనీయలేదు. తెలంగాణలో వున్న పరిస్థితులకు ఏనాడో ఇక్కడ భాజపా అధికారంలోకి రావాల్సింది. విభజన జరిగాక ఈ స్లీపర్ సెల్ అవతారం స్పష్టంగా కనిపిస్తున్నది. తమ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవడం కోసం ఒకపుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వేషం ధరించారు. కమ్యూనిస్టు భావజాలం వున్న కృష్ణమీనన్ 1954లో కేంద్ర క్యాబినేట్‌లో చేరి 1957 నుండి 1962 వరకు కీలకమైన రక్షణ శాఖను చేపట్టి మన భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేశాడు. 1964 తర్వాత అనేకమంది కమ్యూనిస్టులు ఈ దేశంలో తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్ ముసుగేసుకున్నారు.

 రజనీ పటేల్ అనే కమ్యూనిస్టు నాయకుడు బాంబే కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు. ఆర్కే ఖాదిల్కర్, నందినీ శతపతి, డి.పి.్ఛటోపాధ్యాయ, నూరుల్ హసన్, కె.వి.రఘువీరారెడ్డి, ధర్మవీర్‌సిన్హా, అర్జున్ అరోరా, చింతామణి పాణిగ్రాహి, బహుగుణ, పి.చిదంబరం, కె.ఆర్.గణేశ్.. వంటివారు కాంగ్రెస్ ముసుగులోని కమ్యూనిస్టులు. కమ్యూనిస్టు భావజాలంతో నడిచే బ్లిట్జ్ లాంటి పత్రికలు ఆనాడు కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే, నెహ్రూను, కృష్ణమీనన్‌ను ఆకాశానికి ఎత్తేవి. ఇపుడు తెలుగునాట కూడా మీడియాది ఇలాంటి వైఖరే. ఈ వైరుధ్యాలు గమనించకుండా ‘ఆంధ్రా రాజకీయం’ ముందుకుపోతే భవిష్యత్తులో భాజపా 2019 ఎన్నికల ముందు సంవత్సరం పాటు ఎదుర్కొన్న ఇబ్బందులే ఎదుర్కోవడం ఖాయం.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*28 - 06 - 2019 : శుక్రవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి