ఇంట్లో భార్యాభర్తలు గొడవపడుతూ తారస్థాయికి వెళ్లారట. భార్య వైపు చూస్తూ భర్త- ‘నీ విషయంలో తప్పు చేస్తే నేను వెంటనే చచ్చిపోవాలి’ అన్నాడట. వెంటనే భార్య అందుకుని- ‘నేను గనుక నీ విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే నా తాళి వెంటనే తెగిపోవాలి’ అన్నదట. అంటే- ఏ రకంగానైనా భర్త చావే నిర్ణయమైందన్నమాట! ఈ దేశంలో ఎవరు జాతీయ భావంతో మాట్లాడినా- అది నిజమైనా, అబద్ధమైనా వివాదాస్పదం చేయడం మాథ్యమాలకు, మేధావులకు, విదేశీ భక్తులకు అలవాటైపోయింది. ఇటీవల ప్రతి సూడో సెక్యులర్ గొప్ప శాస్తవ్రేత్తగా తనకు తాను ఊహించుకొంటున్నాడు. ఇక ‘జనవిజ్ఞాన వేదిక’ సభ్యులైతే స్టీఫెన్ హాకింగ్ నోట్లోంచి ఇప్పుడే ఊడిపడ్డట్లు టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో ఊదరగొడుతారు. ఒక దేశం ప్రాచీనతను చెప్పుకోవడానికి ప్రతి పౌరుడూ గర్వపడతాడు. కానీ, భారత్‌లో మాత్రం ఈ దేశం గొప్పతనం చెప్పడం మహానేరం. అలా చెప్పడాన్ని ప్రసార మాథ్యమాలు కూడా వివాదాస్పద అంశాలుగా మారుస్తున్నాయి.
ఇటీవల కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురపై భాజపా జెండాను ఎగురవేసి, సీఎం పీఠాన్ని అధిష్ఠించిన ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ ఏది మాట్లాడినా కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. కమ్యూనిస్టులు అతణ్ణి వీలైనంత త్వరగా గద్దె దింపాలనే కుట్రలో భాగంగా ఇలా జరుగుతుండవచ్చు. అతనే కాదు, మన ప్రాచీన వారసత్వాన్ని గురించి ఎవరు మాట్లాడినా అది ‘ఎర్ర’కళ్లకు నచ్చడం లేదు. జాతీయతపై మన గ్రంథాల్లో ఏమీ లేదని చెప్పడం ప్రధాన వ్యూహం. ఎవరైనా సెలబ్రిటీలు వాటి గురించి మాట్లాడితే దాని గురించి చర్చ,రచ్చ మొదలవుతుంది. మన వారసత్వాన్ని గురించి చెప్పే వ్యక్తులపై ‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి’గా ముద్ర వేయడం తెలివైన, తేలికైన పని. కుక్కను ఊరికే చంపడం కన్నా- అది ‘పిచ్చిది’ అని ముద్రవేసి చంపడం సులువు. అదే పనిని ఈ దేశంలో ఓ వర్గం విజయవంతంగా చేస్తోంది.
‘ఇంటర్నెట్ మహాభారత కాలం నుండే మన దేశంలో ఉంది. సంజయుడు కళ్లులేని ధృతరాష్ట్రునికి భారత యుద్ధమంతా పూస గ్రుచ్చినట్లు చెప్పడానికి అదే కారణం. మధ్యలో ఈ విజ్ఞానాన్ని వదలిపెట్టాం’ అని విప్లవ్ దేవ్ అన్నాడు. ఇందులోని ప్రతీకాత్మకతను అర్థం చేసుకోకుండా, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే పనికి సూడో సైంటిస్టులంతా పూనుకొన్నారు. ఆ అంశాన్ని ‘ఎక్స్‌పోజ్’ చేయడానికి విప్లవ్ ఇంటర్నెట్ అనే పదాన్ని వాడాడు గాని, 5వేల ఏళ్ల క్రితమే కేబుల్ ఆపరేటర్లు, వారిని ఆపరేట్ చేసే నాయకులు ఉన్నారని చెప్పా డా? ఆనాటి దూరదర్శన్ విజ్ఞానాన్ని ఈనాటి ఇంటర్నెట్‌తో పోల్చి చెప్పడం నేరమా?
ఆనాటి విజ్ఞానాన్ని వివరించేందుకు వాడిన ‘సింబాలిజాన్ని’ చిలువలు పలువలు చేసి మాట్లాడడం విడ్డూరం. ‘సైన్సు’ అనేది ఒకే రోజు పుట్టిన బ్రహ్మపదార్థం కాదు. న్యూటన్ సమయంలో కొన్ని ఆవిష్కరణలు, ఐన్‌స్టీన్ సమయంలో ఇంకొన్ని ఆవిష్కరణలు.. ఇలా ఇంకా నవీన ఆవిష్కరణలతో ముందుకు పోతూనే ఉన్నాం. సైన్సు అనేది గంపగుత్తగా కొందరి సొత్తు అని భావించడం అవివేకం. భూమి గుండ్రంగా ఉందని చెప్పినవాణ్ణి ఉరేసిన వారి వారసులు కూడా సైన్సు గురించి మాట్లాడుతున్నారు.
ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతంలో సామాన్యులకు నరేంద్ర మోదీ పెద్దగా ముఖపరిచయం ఉన్న నేత కాదు. ఇప్పుడు ఏ టీవీ పెట్టినా ఆయనను విలన్‌గా రోజంతా చూపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే- రాజకీయ నేతలు తమ శత్రుపక్షాలను వేసే ప్రశ్నలను అంతే ఆవేశంలో టీవీ యాంకర్లు అడుగుతున్నారు. కొన్ని మాధ్యమాలు దేశ ప్రధాని అన్న మర్యాద కూడా పాటించకుండా మోదీని తూర్పారబడుతున్నాయి. ఈ చర్చల్లో జర్నలిస్ట్ మేధస్సు కూడా సరిపోక, సైకాలజిస్ట్‌లతో విశే్లషణ చేయించి ప్రధానిని దుర్మార్గునిగా చిత్రీకరిస్తున్నారు. హత్యలు చేసిన ఐసిస్ ఉగ్రవాదుల మనస్తత్వాన్ని అంచనా వేసినట్లు పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు అవకాశవాదం కోసం ఉపయోగించే ‘దుర్బల మనస్తత్వ రాజనీతి’ని మీడియా ఉపయోగించడం సిగ్గుచేటు!
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇటీవల సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. వరుస సెలవులు రావడంతో దానిపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేకపోయింది. మోదీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీలు సంకల్పించాయి. 2019 ఎన్నికల్లో నెగ్గేందుకు బ్రిటీష్ ఎనలటికా అనే సంస్థను కాంగ్రెస్ పార్టీ మన దేశంలోకి ఆహ్వానించినట్లు రిపబ్లిక్ న్యూస్ చానల్ బయటపెట్టింది. దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టడకానికే ఆ సంస్థను మన దేశంలోకి ఆహ్వానించి పని అప్పగించినట్లు జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వీడియోలు విడుదల చేశాడు. అది నిజమేనా? అన్నట్లు ఇటీవల భారత్‌బంద్ హింసాత్మకంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో హింస చెలరేగింది. దాదాపు 10 మందికిపైగా చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆందోళనలో దళితులపై ప్రేమకన్నా భాజపాను, మోదీని అపఖ్యాతిపాలు చేయడమే విపక్షాల ఎజెండా. లింగాయత్‌లకు మైనారిటీ హోదా అంటూ కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనుకొన్న కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటన ఎన్నికల ఎత్తుగడ తేలిపోవడంతో- కాంగ్రెస్ పార్టీ సుప్రీం తీర్పు అనే కొత్త పల్లవిని అందుకొంది. ఈ ఎపిసోడ్‌లో మీడియా పాత్ర ఎక్కువగా ఉంది. కులాలు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేటప్పుడు మీడియా కొంత సంయమనం పాటించకపోతే రాజకీయ నాయకుల ఉచ్చులో పడడం ఖాయం. ప్రజల మధ్య ఇనుపగోడలు నిర్మాణం అవుతాయి. భిన్న పార్శ్వాల సిద్ధాంతాలున్న మనలాంటి దేశంలో అవి మరింత రావణకాష్టం రగిలిస్తాయి. ప్రతి సమస్యను మోదీ ప్రభుత్వ మెడకు కట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో మీడియా భాగస్వామి అయితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది.
అన్ని కులాల నుండి భక్తి ఉద్యమకారులు పుట్టుకొచ్చారన్న వాస్తవాన్ని విస్మరించరాదు. నామ్‌దేవ్, చక్కమేళ, తుకారం, మీరా, గోరకుంభార్, సక్కుబాయి, బ్రహ్మనాయుడు, కబీర, నానక్, రామానంద్, సంత్ జ్ఞానేశ్వర్, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, సంత్య్రిదాసు, అన్నమాచార్య, కృష్ణమాచార్యులు, కనకదాసు, ఘసిదాస్, నర్సీ మెహతా, నారాయణస్వామి వంటి మహనీయులెందరో కులతత్వాన్ని సంఘర్షణ లేకుండా సమాజం నుండి వదిలించారు. సంఘ సంస్కర్తల్లో అన్ని కులాల వారూ ఉన్నారు. ఆ తర్వాత నారాయణ గురు, రామకృష్ణ పరమహంస, మలయాళస్వామి, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రద్ధానంద, సయాజీరావు గైక్వాడ్, మహాత్మా పూలే, గాంధీజీ, డా.అంబేద్కర్, కేశవరావ్ వంటి మహనీయులు సంస్కర్తల అడుగుజాడల్లో నడచి, ఇప్పుడున్న సమాజాన్ని సాధించారు. ఇందులో మహాత్మా పూలే, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ కులతత్వం వేర్లతో సహా పీకే ప్రయత్నం చేశారు. ఆధునిక భారత శాసనకర్తగా, రాజ్యాంగ నిర్మాతగా పేరొందిన అంబేద్కర్ సిద్ధాంతాలు ఈ రోజు భారత రాజకీయాల్లో ఎనలేని పాత్ర పోషిస్తున్నాయి. కానీ- కొందరు అంబేద్కర్‌ను అధ్యయనం చేయకుండానే గుడ్డిగా వ్యతిరేకిస్తే, మరికొందరు ‘మాకే పరిమితం’ అని సంకుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక భారతదేశానికి దిక్సూచి లాంటి అంబేద్కర్‌ను ఇపుడు ‘అందరివాడు’గా చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
అంబేద్కర్‌ను ముందుబెట్టి ఇటీవల విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొందరు మేధావులు రాజకీయం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు మద్దతుగా ఊరేగింపులు నిర్వహించే దేశద్రోహులు అంబేడ్కర్‌ని వాడుకుంటున్నారు. బాబా సాహెబ్‌ను ఈ దేశ మెజారిటీ ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఈ దేశంలోని ఆధ్యాత్మిక వారసత్వాన్ని సాంస్కృతిక సంపదను, సామాజక ఉత్పత్తిని, ఆర్థిక ప్రగతిని వెనుకబడిన, దళిత జాతులు వేల యేళ్ళ నుండి కాపాడుకుంటున్నారు. ఆ స్రవంతి నుండి దూరం చేయడానికి కుల ఘర్షణలు సృష్టిస్తున్న వామపక్ష శక్తులు తమ పార్టీల్లో దళితులకు ఇచ్చిన స్థానం ఏపాటిదో గణాంకాలతో చెప్పవచ్చు. కానీ వారే ఈ రోజు దళిత, బడుగు వర్గాల రక్షకులుగా అభినయిస్తున్నారు.
వామపక్షాల్లో తప్ప మిగతా అన్ని పార్టీల్లో దళిత, బీసీ వర్గాలకు అంతో ఇంతో అగ్రస్థానం దక్కింది. నంబూద్రిపాద్ నుండి సీతారాం ఏచూరి వరకు ఏ కులం వాళ్లు వామపక్షాలను జాతీయ స్థాయిలో నడిపిస్తున్నారు? పుచ్చలపల్లి సుందరయ్య నుండి బి.వి.రాఘవులు వరకు తెలుగు ప్రాంత వామపక్ష నాయకులు ఏ కులం వాళ్లు? అయితే- కుహనా లౌకవాదులు మాత్రం కులం గురించి మీడియాలో తెగ మాట్లాడుతారు! ఇది ఏడో వింత కాక మరేమిటి? దళిత వృద్ధ నేత సీతారాం కేసరిని ఏఐసిసి కార్యాలయం నండి బయటకు నెట్టేసి అధికారం కైవసం చేసుకున్న నాయకురాలి కొడుకు దళితుల ఆత్మాభిమానం గురించి ప్రశ్నించడం విడ్డూరం కాక మరేమిటి? అంబేద్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో గెలవకుండా చేసిన పార్టీ నాయకుడు, జగ్జీవన్‌రాంను ముప్పతిప్పలుబెట్టిన వారు దళితుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని గగ్గోలు పెట్టడం వింతే.
కులాలను ఓటు బ్యాంకుగా భావించే ఏ వ్యవస్థ అయినా బడుగుల ఆత్మగౌరవాన్ని కాపాడలేదు. సంఘర్షణ కోసం వాడుకోవడం ఆత్మహత్యా సదృశం. ఇన్నాళ్లూ అణచివేతలకు గురైన కులం ఈ రోజు సంఘర్షణల సృష్టికి కేంద్రం కావడం ఎంత ప్రమాదమో విజ్ఞులు ఆలోచించాలి. హెచ్చుతగ్గులనే మానసిక వికృతులను సమాజంపై రుద్దే వ్యక్తుల పట్ల మనం జాగరూకులమై ఉండాలి.

********************************************************
✍✍-డాక్టర్. పి. భాస్కర యోగి 
Published Andhrabhoomi :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి