‘‘సత్యం మాతాఫితా జ్ఞానం ధర్మో భ్రాతా దయాసఖా!
శాంతిఃపత్నీ క్షమా పుత్రీ షడైతే మమ బాంధవా’’

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం సఖుడు, శాంతి భార్య, క్షమ కూతురు- ఈ ఆరుగురు నా బంధువులు- ఇదీ శోకార్థం.

నిజమైన సాధకుడు ఇలా భావించాలి. ఇవన్నీ మనిషిని దివ్యాత్మగా మారుస్తాయి. సద్ధర్మాన్ని బోధిస్తాయి. సత్కర్మను నిర్దేశిస్తాయి. భారతీయ దివ్యాత్మవైపు పయనింపజేస్తాయి. సత్యం తల్లిలాంటిది. మనోవాక్కాయ కర్మల్లో ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. తద్వారా సత్య ప్రతిష్ఠ జరుగుతుంది. సత్సంకల్పం పెంపొందుతుంది. ‘సత్యమే ప్రాణము మాటకు’ అన్న ప్రాచీనుల ప్రబోధం నిజం అవుతుంది. తల్లి బిడ్డకు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఏది ఎంత మేరకు అవసరమో చెప్పి, మార్గదర్శనం చేస్తుంది. సత్యం వదలి పెట్టినవాడు, తల్లిలేని బిడ్డవంటివాడు. తల్లి దూరమైన బిడ్డ బ్రతుకు ఎలా భారమో, సత్యాన్ని వదలిపెట్టినవాడి జీవితం కూడా అంతే. జ్ఞానం మనం కావాలనుకొంటేనే వస్తుంది. అది తండ్రిలాంటిది. ఎంత మనం దానివైపు దగ్గరైతే అది మనవైపునకు అంత దగ్గరగా వస్తుంది. మన తండ్రికి లోకానికి ఎలా సంబంధం ఉంటుందో జ్ఞానానికి కర్మకు అలాంటి సంబంధమే ఉంటుంది. జ్ఞాన కర్మలకు సంబంధించి ప్రసిద్ధమైన శ్లోకం గుర్తుకు వస్తున్నది.

జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకమ్
ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్పవినాశకమ్

పుష్పం ఫలానికి కారణం. ఫలం పుష్పాన్ని నాశనం చేస్తుంది. అలాగే జ్ఞానానికి కారణం కర్మ. కాని జ్ఞానమే కర్మను నశింపజేస్తుంది. జ్ఞాని లక్షణాలెన్నో శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. జ్ఞానమే జ్ఞానికి రక్షణ కవచం. తాను ఏ స్థితిలో వున్నానో, తానే మార్గంలో పయనించాలో తెలియజెప్పేది జ్ఞానం. చివరికి తానెక్కడికి చేరాలో చెప్పేది జ్ఞానం. అది వెంబడి ఉండి కాపాడుతుంది. రక్షగా నిలచి మార్గప్రబోధం చేస్తుంది.

అందుకే అది తండ్రిలాంటిది. ధర్మం అన్నలాంటిది. అవసరమొస్తే దండిస్తుంది. ప్రేమగా అనునయిస్తుంది, తన మార్గంలో నడిపిస్తుంది. తనను అనుసరించమని చెప్తుంది. తాను నడిచిన సత్యం, జ్ఞానం- అనే తల్లిదండ్రుల మార్గంలో వెళ్లాలని శాసిస్తుంది. తన వెంట వాళ్లను అలాగే తీసుకెళ్తుంది. తానే అన్న అయి నిలబడుతుంది. పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అందుకే ధర్మం భ్రాత పాత్ర పోషిస్తుంది.
సత్యం, జ్ఞానం, ధర్మం- ఈ మూడు మనిషికి ఎప్పుడైతే రక్షగా నిలిచాయో దయ అనే సఖుడు సులభంగా లభిస్తాడు. పైమూడింటి ప్రబోధం ఇదే. ‘పరోపరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమ్’ అన్న వ్యాసోక్తి అంతరార్థం ఇదే.

శివపూజ, హరికీర్తనకు ఎంత ప్రాముఖ్యం ఉందో దయాగుణానికి అంత ప్రాధాన్యత ఉంది. శాంతి గుణమే పత్ని. సత్య, జ్ఞాన, ధర్మ దయ- అనే బంధువులు తోడుంటే శాంతి కాక ఇంకేం స్వాధీనం అవుతుంది. అదే హృదయం నిండా, మనసు నిండా భాసిస్తుంది. స్వస్థత చేకూర్చుతుంది.

ప్రేమైకమూర్తిగా తన హృదయాన్ని పులకరింపజేస్తుంది. శాంత స్వభావంతో ఉన్నవాడికి క్షమనే పుత్రికగా లభిస్తుంది. సర్వజీవుల యెడల తన దాస దాసోహ తత్వం దృఢం కావాలంటే ‘క్షమ’ పుత్రికా జన్మించాలి. ఆ క్షమాగుణమే శత్రువును కూడా మిత్రునిగా మారుస్తుంది.

చూడండి! భారతీయుల మహోన్నత ఆదర్శాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి ధార్మిక బుద్ధిని ఋషులు ప్రసరింపజేశారో ఈ ఒక్క శ్లోకం చూస్తే చాలు, అర్థమైపోతుంది. స్వభావరీత్యా మనిషి ఎలా ఉన్నా ఈ గుణాలు అలవర్చుకుంటే దివ్యమూర్తిగా మారిపోతాడు. అదే ఋషులు మనకిచ్చిన సంపద.

*********************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి