రాజ్యపాలకుడైన చక్రవర్తికి అనారోగ్యం ఎక్కువైంది. ప్రజలను కన్నతండ్రిలా పాలించే రాజుగారు మరణశయ్యపై ఉన్నారన్న వార్తతో ప్రజలు దుఃఖిస్తున్నారు. చక్రవర్తిపై అత్యంత అభిమానం, గౌరవం గల మంత్రి, ఎలాగైనా చక్రవర్తిని బ్రతికించుకోవాలనే ఆశతో దేశ, విదేశాలనుండి గొప్ప గొప్ప వైద్యులను పిలిపించాడు. అందరూ చేతులెత్తేశారు. ‘రోజులు మాత్రమే గడుస్తాయన్నారు’. మంత్రి సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా, అమృతం నోట్లో పోసినట్లు ఓ చల్లని వార్త చెప్పారు గూఢచారులు. నగరానికి దగ్గరలో ఒక సాధువు వేంచేసి ఉన్నారని, చచ్చినవాళ్లనే బ్రతికించే గొప్ప సిద్ధుడని గూఢచారులు చెప్పారు. వెంటనే మంత్రిగారు వెళ్లి సాధువును దర్శించుకొన్నారు. ‘స్వామీ! తమరు చచ్చినవాళ్లనే బ్రతికిస్తారనగా విన్నాను కానీ మా చక్రవర్తి ప్రాణం ఉండగానే కొట్టుమిట్టాడుతున్నారు.
తమరు దయతో రాజభవనానికి వచ్చి రాజుగారిని బ్రతికించాలని కోరుతున్నాను’ అన్నాడు. సరేనంటూ బయలుదేరిన సాధువు శయ్యపై వున్న రాజును పరిశీలించి చూసి, ‘మహామంత్రీ! మీరేమీ చింతించవద్దు, చిన్న ఏర్పాటుతో రాజుగారు తిరిగి ప్రాణం పోసుకుంటారు. సమృద్ధిగా సంపద ఉండి, శాంతిగా (ప్రశాంతంగా) ఎవ్వరు జీవిస్తున్నారో వారి వస్త్రాలను తెచ్చి ఒక్కసారి రాజుగారికి తొడిగిస్తే చాలు’ అన్నాడు సాధువు. మంత్రిగారి ముఖం వెలిగిపోయింది. వెంటనే నగరంలోని ధనికులందరినీ సమావేశపర్చాడు. ‘వ్యాపారస్తులారా! మీరు ఎంత ధనవంతులో నాకు తెలుసు. మీవల్ల రాజ్యానికి మహోపకారం జరుగబోతోంది. మీలో శాంతిగా ఉన్నవారెవరైనా తమ వస్త్రాలను రాజుగారికిస్తే వారు తిరిగి మామూలు మనిషైపోతారు. కాబట్టి ఎవరైనా సరే ఈ చిన్న సహాయం చేయండి’ అన్నాడు మంత్రి. దాంతో ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్న వ్యాపారస్తులు ‘అయ్యా మంత్రిగారూ! మాకంతా చాలా సంపద ఉన్నది. రాజుగారంటే మాకెంతో గౌరవం. వారికోసం ప్రాణాలైనా ఇస్తాం. కాని మాకు ప్రశాంతత లేదు. ఈ ధనాన్ని ఎలా రక్షించుకోవాలో అని సతమతవౌతున్నాం. ఇక శాంతి ఎక్కడిది? అన్నారు. వ్యాపారులంతా అలా అనేసరికి ఆశ్చర్యపోయాడు మంత్రి. రాజ్యంలోని ఇతర నగరాల్లో చాటింపు వేసినా ఇదే సమాధానం లభించింది మంత్రికి. నగరమంతా పర్యటించి ధనవంతులందరిని కలుసుకున్న మంత్రికి చివరకు నిరాశే ఎదురయ్యింది. సాయంత్రం వరకు తిరిగి తిరిగి అలసిపోయిన మంత్రి చీకటయ్యాక ఇంటికి చేరుకున్నాడు. సాయం సంధ్యవేళ ఏమీ తోచక మేడపై కూర్చొని ఆలోచిస్తూ, తన మనసులో ఇలా అనుకున్నాడు. ‘ఈ సాధువుకు రాజుగారిని బ్రతికించే ఉద్దేశ్యం లేదు. అందుకే పైకి సులభంగా కన్పించే ఇంత కఠినమైన పరీక్ష నాకు పెట్టాడు’ అని అనుకుంటుండగానే నగరం చివర వున్న మఠం (సాధు సన్యాసులు నివసించే స్థలం) నుండి శ్రావ్యమైన సంగీతంతో కూడిన శబ్దం, దాని వెంబడి మంచి ‘తత్త్వం’ వినబడ్డాయి. తెలియకుండానే మంత్రి కాళ్లు మఠంవైపు నడిచాయి. నేరుగా మఠంలో సంగీతం వినబడుతున్న గదిలోకి ప్రవేశించాడు మంత్రి. ఎవరో ఒక మహాపురుషుడు పీఠంపై కూర్చొని ఒక వాద్యాన్ని వాయిస్తూ తత్వం పాడుతున్నాడు. సన్నని దీపపు వెలుగులో తేజోవంతంగా ఆ మహాత్ముని ముఖం మాత్రమే కన్పిస్తుంది. కొందరు జనం ఆయన ముందు వినయంగా కూర్చున్నారు.
గంభీర తాత్త్వికభావనలో వున్న ఆ సాధువు ముఖం చూడగానే నిరాశా నిస్పృహలతో వున్న మంత్రిగారికి శాంతి కలిగింది. తన కార్యం కూడా సఫలవౌతుందనుకున్నాడు. తాత్వికగీతాలాపన పూర్తికాగానే ఆ మహాత్ముని పాదాల ముందు శిరస్సు వంచి నమస్కరించి, తన పరిస్థితి వివరించి, ‘తమ వంటివారి అండ జేరగానే మనోవికలుడైన నాలాంటివాడికే ప్రశాంతత కల్గింది. తమ వస్త్రాలు ఒక్కసారి ఇచ్చినట్లైతే మా చక్రవర్తిగారు మళ్లా ప్రాణం (నిర్జీవంగా ఉన్న రాజు) పోసుకుంటారు’ అన్నాడు మంత్రి. వెంటనే ఆ మహాత్ముడు చిరునవ్వు నవ్వి ‘నాయనా! నేను దిగంబరుడను’ అన్నాడు. చీకట్లో మహాత్ముడు పూర్తిగా కన్పించలేదు మంత్రికి. ఒక్కమాటతో జ్ఞానోదయమైన మంత్రి ఇంటిదారి పట్టాడు. వస్తువులతో మానవునికి ఎన్నడూ శాంతి లభించదు. అది భ్రమ మాత్రమే. వస్తువులపై ఆశ చచ్చినవాళ్ళకే ప్రశాంతత సాధ్యం అనుకున్న మంత్రి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

*************************************************
     డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి