బాల్యంలో విద్యను అభ్యాసంచేయాలి. వనంలో సంసారం చేయాలి. ముసలితనంలో మునిలాగా జీవించాలి. తనువు త్యజించేటపుడు యోగంలో ఉండాలి అంటాడు కాళిదాసు మహాకవి. ఈ నాలుగు విషయాలు చతురాశ్రమాలకు అనుబంధంగా ఉన్నాయి.

ఈ దేశంలో సనాతనకాలం నుండి అయిదు సంవత్సరాల వయస్సపుడే గురుకులానికి పంపే సంప్రదాయం ఉంది. గురుకుల ప్రవేశం పొందిన విద్యార్థి గురువు దగ్గర ‘పరిప్రశే్నన సేవయా’ అన్నట్లు సేవతో పరిప్రశ్న వేయాలి. ఆయుర్వేదం, జ్యోతిషం. వ్యవసాయం, యోగం, ఖగోళం, రసశాస్త్రం, శిల్పం, కవిత్వం, నాట్యం, చిత్రలేఖనం, నౌకాశాస్త్రం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, పశువిజ్ఞానం వంటి సమాజోపయోగమైన విద్యలు ఆ గురుకులంలో నేర్పేవారు. అక్కడ కులభేదం లేదు. పేద, ధనిక తేడా లేదు. అందుకు శ్రీకృష్ణ, కుచేలులిద్దరూ సాందీపుని దగ్గర విద్య నేర్వడమే మనకు ఉదాహరణ. ప్రపంచం బట్టకట్టకముందే మన దేశంలో నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రపంచంలోని నాగరిక మతాలు అజ్ఞానంతో తిరుగుతున్నపుడే భారతీయులు ఈ విద్యల్ని నేర్చి వాటిపై శాస్త్రాలు రచించారు. అలాంటి భారత విద్యావేత్తలైన ఋషులు బాల్యంలో విద్యాభ్యాసం చేయమన్నారు. చిన్నవయసులోనే నిర్మలమైన మనస్సుతో విధ్యాభ్యాసం చేస్తే ధారణ బాగా కుదురుతుంది. బాల్యంలో మనస్సు ‘నల్లబల్ల’లా ఉంటుంది. అప్పుడు ఏం రాస్తే అది నిలబడిపోతుంది. అందుకే బాల్యంలో విద్యాబ్యాసం చేయమన్నారు. అది ఒకరకంగా బ్రహ్మచర్యాశ్రమమే. 

వనంలో వనిషి శరీరం పరిపక్వత సాధిస్తుంది. శరీరంలోని చైతన్యం పరుగెత్తుతుంది. లైంగిక వాంఛ మొదలౌతుంది. అది వైవాహిక జీవితానికి సిద్ధవౌతుంది. కాబట్టి గృహస్థ ఆశ్రమం స్వీకరించాలి. తన వంశాన్ని వృద్ధి చేయాలి. మానవ సమాజాన్ని నిలపాలి. తన కుటుంబ బాధ్యతతోపాటు సామాజిక బాధ్యతను కూడా పూర్తిచేయాలి. గృహస్థుడు ‘తంగేటి చెట్టుపై ఉన్న తేనెపట్టు’ వంటి వాడంటారు. అతడు సమాజంలోని అభాగ్యులకు, అనాథలకు, నిర్బలులకు చేరువగా ఉండాలి. సమాజంలో రుగ్మతలను రూపుమాపడంలో కీలకపాత్ర వహించాలి. అతనొక్కడే ఒంటరిగా కొన్ని పనులు చేయలేదు. కాబట్టి అతని వెంట పరివారం ఉండాలి. ఆ పరివారాన్ని సామాజికదృష్టితో చక్కగా నడిపిస్తే సమాజహితం జరుగుతుంది. వనంలో తనలో ప్రవహించే కోర్కెల ధరలన ధార్మికదృష్టి అనే అడ్డుకట్టలో సమాజంలోకి మెల్లగా ప్రవేశించాలి. అందుకే వయస్సులో సంసారం చేయాలని అంటే కుటుంబ జీవనం సాగించాలని ఉద్బోధించారు. వార్థక్యం వచ్చేసరికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అంటే మునివృత్తిలో జీవించాలి. దైవిక విద్యను ఉపాసించాలి. దైవమార్గం గురించి చింతించాలి. శరీరాన్ని మనస్సును సాధనవైపు మళ్లించాలి.

శాస్త్రాల్లో చెప్పినట్లు మోహసాధనకు సిద్ధం కావాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు జరగాలి. మహాభారతంలో యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు వానస్థ్రానికి వెళ్తాడు. అంతవరకు నిర్వర్తించిన సంసార బాధ్యతలను తన కుమారులకో, కుమార్తెలకో వదలిపెట్టి భగవన్మార్గాన్ని అనే్వషించాలి. తద్వారా అంత్యకాలంలో తాను చేసే మోక్షసాధనకు అది ఉపకరిస్తుంది. వానప్రస్థాశ్రమంలో సాధకునిగా స్థిరపడి అంత్యకాలంలో యోగం ద్వారా శరీరాన్ని వదలిపెట్టాలి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి అష్టాంగాలు. అందులో కూడా ఆసన, ప్రాణాయామాలే యోగం అంటుంటాం. ఈ ఎనిమిది ఆరోగ్యాన్ని, చిత్తశుద్ధిని, వివేకాన్ని కల్గించేవే కాని మోక్షాన్ని కల్గించేవి కావు. అలా మోక్షాన్ని కల్గించే ఏకైక సాధనం యోగం. అది పరమాత్మ స్మరణ. తనకు ఎన్నో జన్మలనుండి కలిగిన వాసనలను వదలిపెట్టడం సామాన్యం కాదు. వాటిని వదిలిపెట్టగలిగితేనే సాధకుడౌతాడు.

*********************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి