కవిత్వం ఆల్కెమో.. ఆల్కహాలో రసజ్ఞత ఉన్నవారికే తెలుస్తుంది. కానీ కవులు నడయాడే కేంద్ర సాహిత్య అకాడమీ మాత్రం రాజకీయాలకు అడ్డాగా మారింది. మేడిపండులా పైకి పరమ సాధువుల్లా కన్పించే కవి పుంగవులు, సాహిత్య శేఖరులు ఇంచుమించు రాజకీయ నాయకులంతా ఎత్తు ఎదిగారు. రాజకీయ పార్టీలు తమ అధికారాన్ని అక్షరాలా కాపాడుకొన్నట్లు ఇందులో గద్దెనెక్కినవాళ్లు ‘స్వార్థపరాయణత్వం’ ఆమూలాగ్రం కొనసాగిస్తున్నారు. అదంతా అకాడమీ నిబంధనలకు లోబడే!? కేంద్ర సాహిత్య అకాడమీ యు.ఆర్.అనంతమూర్తి, ఇంద్రనాథ్ చౌదరి, సచ్చిదానందన్ పదవీకాలాల్లో ఆశ్రీత పక్షపాతం పెరిగిపోయింది. ఇపుడు కొత్తగా వచ్చిన చంద్రశేఖర్ కంబర కాలం ఎలా వుంటుందో చూడాలి.
బయట ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చానల్ పెట్టినా దేశమంతా ‘కాషాయమయం’ అయిపోయిందని గగ్గోలు పెట్టే బ్యాచ్ సాహిత్య అకాడమీ విషయంలో మాత్రం కిమ్మనదు. ఇందులో అందరూ ‘ఆశ్రీత పక్షపాతం’ అనుకుంటారని అప్పుడో ఇప్పుడో కొందరు రబ్బరు స్టాంపులను తమ పక్కన పెట్టుకొంటారు. వారి చేత ‘మమ’ అనిపించి తమ పనులను గంధర్వుల చేత కూడా చేయించుకొంటారు. ఈ మహాకవులకు, సాహిత్యవేత్తలకు ఆస్థాన సాహిత్య చరిత్రకారులుంటారు. వాళ్లకు ఎవరిని ఎక్కించాలో, ఎవరిని నొక్కేయాలో బాగా తెలుసు.
ఈమధ్య తెలుగు ప్రాంతంలో మరో విచిత్రమైన అనువాద కవితలను పత్రికలకు వదులుతున్నారు. దళిత కవి దున్న ఇద్దాసు, సంకీర్తన కవి వేపూరు హనుమద్దాసు వీళ్ల కంటికి ఆనరు. ఇమ్మడిజెట్టి చంద్రయ్య ఆఖరుకు గోరటి వెంకన్న కూడా సాహిత్య అకాడమీ దృష్టిలోకి పోలేదు. కానీ వివిధ దేశాల్లో ముక్కూ ముఖం తెలియని కవుల కవితలని అనువాదం పేరుతో అర్థంకాని మార్మిక భాషలో అందించి గొప్ప కవులుగా పేరు పొందుతున్నారు. ఎవరికీ తెలియని, ఎవరికీ అర్థంకాని వారి గురించి రాయడం కూడా వీరి ప్రతిభకు గీటురాయే. మన ప్రక్కనున్న, మన కళ్లముందు కదలాడే, నడయాడే కవులను వ్యక్తిగతంగా కూడా గౌరవించరు. దేశ విదేశాల్లో ఆ కవి ఎంత పోటుగాడో తెలియదు గాని వీళ్లు ఆకాశానికి ఎత్తేస్తారు. దాంతో పాఠకులకు ఈయన గొప్ప పరిశోధకుడనో, అనువాదకుడనో భ్రమను కల్పిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు ఎదగడానికి విలువలను వదలేసి సాహిత్య వలువలు ఎలా వలిచేస్తున్నారో చెప్పడానికి!
‘మతం మత్తుమందు’ అనేవాళ్లు మతాన్ని ద్వేషిస్తారు, కానీ వర్గ దృక్పథాన్ని మాత్రం పెంచి పోషిస్తారు. రాజకీయ నాయకుల్లా ఈ సాహితీవేత్తలు తమ వర్గానికి లేదా తమ భావజాలం వున్నవాళ్లకి ఉన్నత స్థానాలు అందిస్తారు. ఇది సాహిత్య రంగంలో అవిచ్ఛిన్నంగా కొనసాగడం దురదృష్టం. పత్రికా వార్తలను బట్టి ఈ సంవత్సరం తెలుగు ప్రాంతాలనుండి సాహిత్య అకాడమీకి ఎంపికైన పేర్లు చూస్తే మనకు ఇట్టే తెలిసిపోతుంది. 2018-2022 మధ్య ఐదేళ్ల కోసం తెలుగు సలహా మండలిలో ప్రముఖ మార్క్సిస్టు కవి కె.శివారెడ్డి కన్వీనర్‌గా, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ప్రముఖ అభ్యుదయ, వామపక్ష ఎక్సెట్రా ఎక్సెట్రా డా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, వాసిరెడ్డి నవీన్, శిఖామణి, అట్టాడ అప్పల్నాయుడు, కె.మధుజ్యోతి ఆంధ్ర ప్రాంతం నుండి ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియకంతా కర్త కర్మ క్రియ రాచపాళెం అనేది జగమెరిగిన సత్యం. ఇక తెలంగాణ నుండి ప్రముఖ విమర్శకులు డా ఎస్వీ రామారావు, డా అంపశయ్య నవీన్, ఆచార్య బన్న అయిలయ్య, డా షేక్ యాకూబ్‌లు ఎంపికయ్యారు. ఇందులో సింహభాగం సభ్యులు ఒకే సిద్ధాంత భావజాలం కలవారే. డా బన్న అయిలయ్యను బహుశా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా వినిపించినందుకు ఎంపిక చేసినట్లు మనం భావించవచ్చు. యస్వీ రామారావును ముందు పెట్టి తోలుబొమ్మలు ఆడించేవారు వేరే ఉన్నారు. వివాదాస్పదుడు కాని ఆచార్య యస్వీ రామారావును ఎవరు తెరవెనుక ఉండి ముందుకు తెచ్చారో అందరికీ తెలుసు!?
ఇందులో వామపక్ష భావజాలం ఉన్నవాళ్లకే అగ్రపీఠం దక్కిందని తేటతెల్లమైంది. విచిత్రం ఏమిటంటే మతోన్మాదులు అని వీళ్లు లోకంలోని బురదనంతా తెచ్చిపోసే, తిట్టిపోసే జాతీయవాద ప్రభుత్వం హయాంలోనే వీళ్లు స్వేచ్ఛగా పదవులు పొందారు. కానీ ఈ కవిశేఖరులు, సాహితీమూర్తులు కవి సంగమాల్లో, కవి సమ్మేళనాల్లో అసహనం, అవార్డు వాపసీలు నిర్భీతిగా కొనసాగిస్తారు.
ఎంత బాగా జాతీయతను, హిందుత్వను తిట్టగలిగితే ఇపుడు అంత గొప్ప కవి. ద్రౌపదిని కృష్ణుడి ఇష్టసఖిగా, స్వైరిణిగా, కాముకిగా చిత్రీకరించిన మహాకవి ఇటీవలనే పద్మ అవార్డు పొందిన సంగతి మనకు తెలిసిందే. ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినపుడు ఎంతో దుమారం రేగింది. రాజగురువులు, ఆస్థాన కవులు, పేరొందిన న్యాయమూర్తులు ఈ పుస్తకానికి ప్రసంశావాక్యాలు పలికారు కాబట్టి ద్రౌపదిని ఆరాధించేవారి మాటలు అరణ్యరోదనగానే మిగిలాయి. ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసినవారు పేరొందిన మహారచయితలు. కీ.శే. మాజీ గవర్నర్ వి.ఎస్.రమాదేవి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, కాశీపట్నం రామారావులు జ్యూరీ మెంబర్లుగా ఈ గ్రంథం ఎంపిక జరిగింది కాబట్టి ఇంకెవరూ మాట్లాడకూడదు! తమకు నచ్చిన పుస్తకానికి అవార్డు ఇవ్వడానికి తమకు నచ్చినవారిని అందలం ఎక్కించడానికి రాజకీయ నాయకులకన్నా ఎక్కువ పైరవీలు చేస్తారు మన సాహిత్యవేత్తలు!
విచిత్రం ఏమిటంటే 2012 తర్వాత సలహా సంఘ సభ్యులే దాదాపుగా పురస్కారాలు పొందుతున్నారు. ఇక్కడ క్విడ్ ప్రోకో పద్ధతి అమలవుతుంది. అయితే ఈ గ్యాంగ్ అంతా జాతీయవాద ప్రభుత్వంపై హిందూ మహా సముద్రంలోని బురదనంతా ఎత్తిపోస్తారు. దేశంలో అవార్డు వాపసీ కార్యక్రమం జరుగుతుంటే అత్యంత వేగంగా స్పందించింది డా కాత్యాయనీ విద్మహే. 2013 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఈమె సిద్ధాంత సారూప్యతతో పొందిందని లోకమంతా తెలుసు. జాతీయవాద ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ పుస్తకానికి మిత్రుడు డా పసునూరి రవీందర్ అవార్డు పొందారు. చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి పింగళి చైతన్య, విముక్త పుస్తకానికి ఓల్గా అవార్డు పొందారు. పాపినేని శివశంకర్ 2016లో అవార్డు పొందారు. గాలిరంగు సంపుటికి పైగంబర కవి దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు ప్రాంతాల్లో మావోయిజాన్ని మార్క్సిజాన్ని కవిత్వంలోకి వొంపిన మార్క్స్ పాఠశాల కవి కులగురువు కె.శివారెడ్డికి మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చే ‘కబీర్ సమ్మాన్ పురస్కారం’ లభించడం కొసమెరుపు. వీళ్లంతా ఏదోరకంగా వామపక్షవాదంతో సంబంధం ఉన్నవారే. దేశమంతా కాషాయమయం అవుతుందనే కషాయాన్ని జనాల మెదళ్లలోకి ఎక్కించే వీళ్లంతా ఈ నాలుగైదు ఏళ్లనుండి అవార్డులు పొందుతున్నారు. మరి సాహిత్య సంస్థలు కాషాయమయం కాలేదా? లేక వీళ్లకు సిద్ధాంత నిబద్ధత లేదా? ఇక్కడే సామాన్య పాఠకులు రావూరి భరద్వాజను, కాళోజీని తలచుకొని గుండె నిబ్బరం పొందాలి. ఇక డా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ఈ చర్చలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఈ ఎంపికతో ఆయన రెండవసారి సాహిత్య అకాడమీలో కొనసాగుతున్నారు. ఒకే వ్యక్తిని ఏదో ఒక రూపంలో అకాడమీలో కొనసాగించడానికి తెలుగు ప్రాంతాల్లో ఇంకెవరూ సాహిత్యవేత్తలు లేరా? ఈయన అభ్యుదయ కవిగా, హేతువాదిగా ఉంటూ తన రచనా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. తన భావజాలం ఉన్న వ్యక్తులకే అవార్డులు రివార్డులు ఇప్పించడం ఈ వీర కమ్యూనిస్టు యోధుని ప్రత్యేకత. వీళ్లను ప్రశ్నిస్తే ‘మతోన్మాది’ అనే తాతాచార్ల ముద్ర కొట్టేసి దాటి వెళ్లిపోతారు. ఈయన నిర్వహించిన సెమినార్లు, కవి సమ్మేళనాలు, ప్రచురణలపై విచారణ చేస్తే అందులోని ఆశ్రీత పక్షపాతం స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న మొన్నటివరకు ఓ వెలుగు వెలుగుతూ సాహిత్య అకాడమీని నడిపిన డా ఎన్.గోపి సమర్థుడైనా పీఠాలపై ఉన్నవారి సిద్ధాంతాలకు కాస్త అటు ఇటూగా ఉంటూ సాహిత్య అకాడమీలో పనిచేసిన వారే. 1990లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కె.శివారెడ్డి ఇపుడు తెలుగు సలహా మండలి కన్వీనర్‌గా నియమింపబడ్డారు. వీళ్లే కాకుండా ఎందరో మార్క్సిస్టు భావజాలం ఉన్నవారు జ్యూరీ మెంబర్స్‌గా ఉన్నారు. డా కేతు విశ్వనాథ్‌రెడ్డి, కె.రామచంద్రమూర్తి, బి.నర్సింగరావు వంటివారు పుస్తక న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇందులో అప్పుడపుడు అపప్రథ రాకుండా సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ వంటి కొందరికి అవార్డులు విదిలిస్తారు. దాంతో చాలా నోళ్లు మూతబడుతుంటాయి. ఈ ఎర్ర పైత్యం ఇంతటితో ఆగకుండా బుక్‌ఫెయిర్‌లను కూడా కమ్మేసింది. వేదికలకు పేర్లు, పుస్తకావిష్కరణలు అన్నీ ఒకే గుంపువి జరుగుతాయి.
ఇక తెలంగాణాకు సాహిత్య అకాడమీలో తీరని అన్యాయమే జరుగుతోంది. తెలంగాణ ప్రాంతం నుండి పేరుమోసిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉన్నా, ఇక్కడి ప్రాంత కవులకు పెద్ద పీట వేసిందేమీ లేదు. ఇక్కడి ముకురాల, కేశవపంతుల, దాశరథి రంగాచార్య వంటి కవులను అకాడమీ అగ్రస్థానంలో ఎప్పుడూ నిలబెట్టలేదు. తెలంగాణ ఉద్యమకాలంనుండి ఇక్కడి సాహిత్య ఆనవాళ్లను అందిస్తున్నన అందిస్తున్న డా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి వంటి పరిశోధకులకు గానీ, గోరటి వెంకన్న లాంటి వాగ్గేయకారుణ్ణిగానీ, అందెశ్రీని గాని, నందిని సిధారెడ్డినిగాని, డా కసిరెడ్డిని గాని గుర్తించిన పాపాన పోలేదు. ఈ రోజు తెలంగాణలో లెక్కకు మిక్కిలి కవులు బయటకు వస్తున్నారు. ఈ ఆక్రోశంతోనే తెలంగాణ ప్రభుత్వం ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కనీ వినీ ఎరుగని విధంగా జరిపించి ఈ ప్రాంత కవితామతల్లికి నీరాజనం పట్టింది. హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌పై పలవరింపులు చేసే కవులకు ఇది అసహనం కలిగించినా తెలంగాణ సాహిత్యవేత్తలకు క్రొత్తదారి చూపించింది. అకాడమీలో గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ వివక్షను అధిగమించడానికే ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య యస్వీ రామారావు, డా అంపశయ్య నవీన్‌లను సభ్యులుగా తీసుకున్నారు. ఈ నియామకాల వెనుక ఓ ప్రముఖ కవి హస్తం ఉందని అందరికీ తెలుసు. ఇదే దారిలో మొన్న మొన్నటివరకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ అవార్డుల ప్రదానం కూడా జరిగింది. అందులో మార్పు జరగాలని సాహిత్యవేత్తలు ఆశిస్తున్నారు. అన్ని వర్గాలకు, భావజాలాలకు సంస్థల్లో, అవార్డుల్లో, రివార్డుల్లో స్థానం కల్పిస్తేనే సాహిత్య వికాసం బహుముఖీనంగా జరుగుతుంది. అంతేగాని వివిధ రంగాల్లోని పెద్దలకు మాత్రమే పరిచయమున్న వ్యక్తులను సాహిత్యవేత్తలుగా గుర్తించడం సరైన పద్ధతి కాదు. స్వాతిశయాలు, వ్యక్తిగత భేషజాలు, కుల గుర్తింపులు, పైరవీలు, సిద్ధాంత ముద్రలు లేకుండా సాహిత్యాన్ని గుర్తించడం మొదలుపెడితేనే భాష కొన్నాళ్లు బ్రతుకుతుంది. లేకపోతే మనం దినపత్రికలు తప్ప ఇంకేం చదవలేం. ‘శంఖంలో పోస్తేనే తీర్థమయినట్లు’ తమ దారిలో వస్తేనే మేం కవులుగా గుర్తిస్తాం అనే పిడివాదం మార్క్సిజంలో కన్పిస్తుంది. అందులో సాహిత్య అకాడమీ వారికి ముఖ్యస్థానం అవుతూ వస్తున్నది. భావి కవులంతా మా సిద్ధాంత భావజాలంలో రాయాలన్నది కూడా వారి అంతర్గత సందేశం. అందుకే వారికి మిగతా వారి రచనలపట్ల సహనం ఉండదు. అందువల్ల ఎందరో గొప్ప కవులు జీవితమంతా నిరాశా నిస్పృహలతో, అక్కసుతో బాధపడుతూ కుమిలిపోతూ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు!?
వీటన్నిటికీ కేంద్ర సాహిత్య అకాడమీలోని పాపాల భైరవులు కారణం. వేల కోట్ల ధన వ్యయంతో, సకల రాజ లాంఛనాలతో తులతూగుతున్న కేంద్ర సాహిత్య అకాడమీలో సిద్ధాంత పైరవీకార్లదే పైచేయి. 240 మంది భారతీయ భాషల సలహా సంఘం సభ్యులున్న అకాడమీ స్వతంత్రతనే దానికి శాపంగా పరిణమించింది. కేంద్ర సాహిత్య అకాడమీలో పనిచేసిన సచ్చిదానందన్ వివిధ రామాయణ పాఠ వైవిధ్యాలు అకాడమీ ఆస్థాన పత్రిక ‘ఇండియన్ లిటరేచర్’ ప్రకటించడమేగాక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాఠ్యగ్రంథాలుగా మారుతాయి! ఇవన్నీ తమ అధికార దుర్వినియోగం ద్వారా చేసుకొనేవి గావా?
గతంలో కార్యదర్శిగా పనిచేసిన అగ్రహారం కృష్ణమూర్తిపై ఎన్ని అభియోగాలు వచ్చాయో, ఎంత ధనవనరులు దుర్వినియోగం అయ్యాయో ఈ సోకాల్డ్ సాహిత్యవేత్తలకు తెలియదా? ఆయనపై ఆరోపణలు గుప్పుమనగానే అతణ్ణి పదవినుండి తొలగించి, తర్వాత బర్తరఫ్ చేసిన సంగతి లోకమంతా తెలుసు. ఇక ఇప్పుడున్న డా కృత్తివెంటి శ్రీనివాసరావు ఈ నియామకాల వెనుక నుండి నడిపిస్తున్న విషయం తెలిసిందే అని అకాడమీలో సభ్యులుగా పనిచేసిన డా అక్కిరాజు రమాపతిరావు స్వయంగా ప్రకటించారు. అతి తక్కువ బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వం అంత గొప్పగా ప్రపంచ మహాసభలు జరపడమేగాక, ఎందరో తెలంగాణ ప్రముఖుల మోనోగ్రాఫ్‌లు, అరుదైన పుస్తకాలు ముద్రించింది. మరి కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరికోసం పనిచేస్తుంది?
నిజానికి వ్యక్తులు మార్క్సిస్టులుగా ఉండడం సిద్ధాంతరీత్యా తప్పుకాకపోవచ్చు. కానీ మార్క్సిస్టులే సాహిత్య యవనికపై ఉండాలని కోరుకోవడం శుద్ధ తప్పు. తమకు కావలసిన వ్యక్తులను పీఠాలను ఎక్కించేందుకు గడ్డిపోచను కూడా వాళ్లు మదగజంగా మార్చేస్తున్నారు. ఈ పెద్దలకు నచ్చనివాళ్లు సింహాలైనా చిట్టెలుక అని ప్రచారం చేస్తారు. ఈ స్వాభిమాన, దురభిమానాలను సాహితీలోకం బాధతో వౌనంగా భరిస్తూ రోదిస్తున్నది. ‘నీ సిద్ధాంతం నా సిద్ధాంతం వేరుగావచ్చుగాక; నీ భావ వ్యక్తీకరణకు నా ప్రాణం అడ్డుపెడతాను’ అన్నాడు ఓ మహనీయుడు. అలాంటి విశాల హృదయంతో ఉండాల్సిన సాహితీవేత్తలు సంకుచితంగా ప్రవర్తించడం గర్హనీయం. తమ ఇజానికి అనుకూలంగా అస్తిత్వాలను రెచ్చగొడుతూ సాహితీ రంగాన్ని కలుషితం చేసి భాషకూ, సాహిత్యానికి పోగాలం వచ్చిందని పొర్లుదండాలు పెట్టే పెద్దలది ఆత్మహత్యా సదృశం కాదా? ఈ ఎర్రకామెర్లను సాహిత్య అకాడమీపై రుద్దడం ఎంతవరకు న్యాయం?
మొత్తానికి గత కొనే్నళ్లనుండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, నియామకాలు తరచి చూస్తే గణాంకాల ప్రకారం జ్యూరీ సభ్యులు, అవార్డు పొందినవారు, సభ్యులుగా ఎంపికయినవారు - అనే మూడు విధాల సభ్యులు ఒకరి స్థానంలోకి ఒకరు వస్తుంటారు. కొందరు సభ్యులను నామినేట్ చేస్తారు. మరికొందరు జ్యూరీ సభ్యులుగా మారుతారు. ఇంకొందరు అవార్డులు పొందుతారు. ఇది చాలా తెలివిగా కేంద్ర సాహిత్య అకాడమీలో తెలుగు సలహా మండలి ఆడుతున్న నాటక చక్రం. మొత్తానికి ఇంచుమించుగా ఈ మూడింటిని అందరూ అనుభవిస్తారు. ఈ సభ్యుల ఎంపిక కూడా రాజ్యసభ ఓట్ల లెక్కింపులా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుండి ఎన్నుకొనే సభ్యులకోసం వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖ నుండి ప్రతిపాదన లేఖలు, సాంస్కృతిక శాఖ నుండి సిఫారసు లేఖ, ప్రసిద్ధ సాహిత్య సంస్థల ప్రతిపాదన లేఖలు కలిపి సభ్యులను నియమిస్తామని చెప్తారు. ఈ సాంకేతిక అంశాన్ని ఆధారం చేసుకొని తమ వందిమాగధులను, ఇష్టమొచ్చిన వాళ్లను ఎంపిక చేయడానికి తమ సీటు వారికిచ్చి వెళ్తారు. వారి ద్వారా అకాడమీ సెమినార్లు, గౌరవాలు పొందుతారు. ‘విశ్వశ్రేయః కావ్యమ్’ అన్నట్లు వాళ్ల అనుయాయులకు శ్రేయస్సు కల్పించడమే ఇందులోని బ్రహ్మరహస్యం అని తలపండిన పండితులకు సైతం తెలియకపోవడం విడ్డూరం. Poetry is the spontaneous overflow of powerful feelings తీవ్రానుభూతుల స్వచ్ఛంద విజృంభణ కవిత్వం- అన్న వర్డ్స్‌వర్త్‌కు కూడా కవిత్వానికి, సాహిత్యానికి రంగులుంటాయని తెలియదు పాపం!
******************************************************
✍✍- డాక్టర్. పి. భాస్కర యోగి
Published Andhrabhoomi :
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి