ఒక అవధూతకు పూల చెట్లన్నా, పశుపక్ష్యాదులన్నా ప్రాణం. మనిషి ఎంత సంపద గలవాడైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఒంటిరాగా జీవించలేడన్నది అతని నమ్మకం. అందువల్ల ఆశ్రమం చుట్టూ ఎన్నో మంచి పూల మొక్కలను పెంచుకున్నాడు. ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ వాటి పాదుల్లో కలుపు తీస్తూ ఆనందంలో మునిగేవాడు. చెట్లకు పూసిన పూలను కోయకుండా చూసి సంతోషించేవాడు. ఆ మొక్కల వద్దకు వెళ్లి వాటిని ఆత్మీయంగా స్పర్శిస్తూ ఏదో మాట్లాడేవాడు. ఇదే అతని ప్రపంచం. ఈ క్రమంలో ఒకసారి ఆ అవధూత ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు. చెట్లను చూడడం కాదు కదా.. నీళ్లు పోసే స్థితిలో కూడా లేడు. దీంతో తన శిష్యునికి చెప్పి మొక్కల బాగోగులు చూసుకోమని పురమాయించాడు. 15 రోజుల తర్వాత అవధూత వచ్చి చూసేసరికి అవన్నీ ఎండిపోయాయి. శిష్యుణ్ని పిలిచి ఏమైందని అడిగాడు. ‘గురువుగారూ.. నేనూ మీలాగే మొక్కలను ప్రేమించాను. కొమ్మలపైనీళ్లు పోశాను. పూలను హృదయానికి హత్తుకున్నాను. వాటిని ముద్దాడాను’ అని చెప్పాడు.

అప్పుడు గురువు.. ‘ఎంత పిచ్చివాడవు! మొక్కలు బతకాలంటే వాటి వేర్లకు నీరు అందేలా పోయాలి తప్ప పైపైన చిలకరిస్తే అప్పటికి తాజాగా కనిపిస్తాయి తప్ప ఏం ఉపయోగం?’ అన్నాడు. భగవద్భక్తి కూడా అంతే. పైపై మెరుగులతో కూడిన భక్తి కేవలం అలంకారం లాంటిది. నిజమైన భక్తి పూర్తిగా హృదయసంబంధమైనది. ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ హృదయస్థానం నుంచే జరగాలి. అందుకు హృదయ పవిత్రత చాలా అవసరం. మనం ఎన్ని వేల రూపాయలు ఖర్చుపెట్టి విత్తనం తెచ్చినా.. రోడ్డు మీద నాటితే మొలకెత్తదు. క్షేత్రం చక్కగా ఉండి, నీటి తడి ఆరకుండా ఉంటుందో అక్కడ మాత్రమే మొలకెత్తుతుంది. అలాగే మన హృదయ క్షేత్రం పవిత్రంగా ఉన్నప్పుడే భగవద్భక్తి మొలకెత్తుతుంది. మనం ఎంచుకున్న గురువు, మనం చేసే సాధన ఆధారంగా అది ఫలిస్తుంది.

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి