ఇటీవల మన మేధావులంతా సైంటిస్టులుగా మారిపోయారు. ఈ ‘సూడో సైంటిస్టుల’ కనుసన్నల్లో నడిచే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఐన్‌స్టీన్‌కు అసలైన వారసుల మాదిరి మాట్లాడడం విడ్డూరం. భారతీయత’ ప్రాముఖ్యతను చెప్పే ఏ విషయాన్ని అయినా వీరు ఛాందసమన్నట్లుగా ఊదరగొడుతున్నారు. ప్రపంచంలో ప్రతి దేశం తన వారసత్వ ఘనతను గౌరవిస్తుంది, కీర్తిస్తుంది. కానీ, మన దేశంలో ప్రాచీనతను, భారతీయతను గురించి ఎవరు మాట్లాడినా వాళ్లను ‘మతవాదులు’గా ముద్రవేస్తారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయిని ‘ఉదారవాదిగా, కవిగా, సున్నిత మనస్కుడి’గా చిత్రీకరించేవారు. ‘రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ పార్టీ’ అని ‘ప్రియమైన శత్రువులు’ ఆయనకిచ్చిన బిరుదు. ఒకవైపు వాజపేయిని ఉత్తముడిగా చిత్రీకరిస్తూ, ఎల్.కె.అద్వానీని మతతత్వవాదిగా ప్రచారం చేశారు. ఈ సూడో సెక్యులర్ గుంపు ఇటీవల కాలంలో అద్వానీని సౌమ్యుడిగా అభివర్ణిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీపై అదేపనిగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘రాంగ్ మేన్ ఇన్ ది రైట్ పార్టీ’ అని కూడా ప్రచారం చేస్తున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షాను, ఉత్తరప్రదేశ్, త్రిపుర ముఖ్యమంత్రులైన యోగి ఆదిత్యనాథ్‌ను, విప్లవ్‌దేవ్‌ను మతవాదులుగా చూపించే కోణం మొదలైంది.

త్రిపురలో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు తెరదించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన భాజపా నేత కుమార విప్లవదేవ్‌ను వీలైనంత త్వరగా గద్దెదింపి అధికారం అందుకోవాలన్న దురూహ ‘సెక్యులర్ ఉద్యమకారుల’లో కనిపిస్తోంది. ‘మనిషిని ఓడించడం కన్నా దుష్ప్రచారం చేయడం సులభం’ అన్న సూత్రం వామపక్ష నాయకులకు, సెక్యులర్ మేధావులకు వెన్నతో పెట్టిన విద్య. 2023లోనైనా మళ్లీ త్రిపురలో మాణిక్ సర్కార్‌ను గద్దెనెక్కించాలనే దురూహతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవదేవ్ ఏది మాట్లాడినా సీపీఎం నేతలు వివాదాస్పదం చేస్తున్నారు. జాతీయతను వ్రేళ్ళతో సహా పీకేయాలంటే మన గ్రంథాల్లో, మన దేశంలో ఏమీ లేదని చెప్పడం వారి ప్రధాన వ్యూహం. అందువల్లనే విప్లవదేవ్ మంచి విషయాలు మాట్లాడినా వారికి కంటగింపుగానే ఉంటోంది. నేరుగా ఎదుర్కోవడం కన్నా అతణ్ణి అపఖ్యాతి పాలు చేయడం సులభమని ఈ శక్తులకు తెలుసు.
‘మహాభారత కాలం నుండే మన దేశంలో ఇంటర్నెట్ వుంది. మహాభారత యుద్ధాన్ని కళ్లులేని ధృతరాష్ట్రునికి సంజయుడు దూరదర్శనంతో చెప్పాడు. అనంతర కాలంలో మనం ఈ విజ్ఞానాన్ని వదలిపెట్టాం’ అని విప్లవదేవ్ అనడం నేరమైపోయింది. ఇందులోని సింబాలిజాన్ని అర్థం చేసుకోకుండా ‘మహాభారత కాలంలో ఇంటర్నెట్’ వుందా! అని సూడో సైంటిస్టులు గోల చేయడం మొదలుపెట్టారు. 

‘దూరదర్శనం’ అనే మాటను విపులీకరించడానికి అతను ఇంటర్నెట్ అనే పదాన్ని వాడాడు గాని 5 వేల యేళ్ళ క్రితమే మనకు ఇంటర్నెట్, కేబులు ఆపరేటర్లు వారిని ఆపరేట్ చేసే రాజకీయ వ్యాపారం ఉందని ఆయన చెప్పాడా?
ఒక విషయాన్ని మనకు తెలియజెప్పడకానికి ఎన్నుకున్న అంశంపై నేరుగా దాడి చేయడానికి ఈ మేధావులకు, నాయకులకు అర్హత ఉందా? సైన్సు కూడా ఏం జడపదార్థం కాదు. న్యూటన్, ఐన్‌స్టీన్ సమయంలో జరిగిన ఆవిష్కరణలు ఈ రోజు జరుగుతున్న ఎన్నో పరిశోధనలకు ఆధారాలు. అంతేగాని ఆ తర్వాత ఏం జరగరాదని చెప్పడం ఎంత అవివేకమో, అంతకుముందు ఏమీ లేదని చెప్పడం కూడా అంతే అజ్ఞానం. ‘సైన్సు’ కేవలం కొందరి సొత్తు అని సూత్రీకరించేందుకు తపన పడుతున్నారు. ఆఖరుకు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినవాణ్ణి ఉరేసినవారి వారసులు కూడా సైన్సు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు భౌతికంగా కన్పించే పదార్థాలపై ఎంత తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయో ‘ఆంతరిక శరీరం’పై మన ఋషులు ఎన్నో పరిశోధనలు చేశారు.

ఇక, విప్లవ్‌దేవ్ మాట్లాడిన విషయానికి వస్తే ‘దూరదర్శన్’ అనేది మహాభారతంలో కురుక్షేత్రం యుద్ధ సమయంలో చూస్తాం. అయితే అదేమీ సర్వజ్ఞత్వం కాదు. భారత్‌లో ఎందరో యోగులకు ఇలాంటి శక్తి ఉన్నట్లు నిరూపణ అయ్యింది. సాధన ద్వారా ప్రకృతి వల్ల జరిగే చిన్నపాటి తేడాల వల్ల కూడా ఈ శక్తి సిద్ధిస్తుందని ఎన్నో పత్రికలు, గ్రంథాలు, అనుభవం వున్నవారు చెప్పడం యదార్థమే. సంజయుడు-్ధృతరాష్ట్రుడు అనగానే మన బుద్ధులు ఆధ్యాత్మికతను విమర్శించడానికి ఉత్సాహపడుతాయి. ఈ విషయంలో రజనీష్ ఎన్నో క్రొత్త విషయాలు అందించాడు. పౌరాణిక గాథలన్నీ ఊహలుగా, కథలుగా భావించే వర్గం ఒకటి అయితే, వాటిలోని ప్రతీకాత్మక విషయాలకు పవిత్రత జోడించి అసలు విషయం సమాజం నుండి దూరం చేసేవారు ఇంకొందరు. దూరదర్శన శక్తి అమెరికాలో ‘టెడ్ సీరియో’ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంగతుల ద్వారా మనం ఇంకొంచెం సులభంగా తెలుసుకోవచ్చు. ‘టెడ్ సీరియో’ ఎన్నో మైళ్ల దూరం నుంచి కూడా చూసేవాడని, ఆయన చూడాలనుకొన్న దృశ్యం అతని కళ్లలో కన్పించేది అని కూడా చెప్తారు. న్యూయార్క్‌లో కూర్చొని ఎన్నో మైళ్ల దూరంలో జరిగే విషయాన్ని గురించి అడిగితే అతను 5 నిమిషాలు కళ్లు మూసుకొని, మళ్లీ కళ్లు తెరిస్తే అక్కడి విషయాలు అతని కళ్లలో కన్పించేవని శాస్తవ్రేత్తలే నిరూపించారు. అతను చూడడమే గాదు ఎదుటివారు కూడా అతని కళ్లలో ఆ దృశ్యాలను చూసేవారు.
టెడ్ సీరియో ఏమీ ఆత్మజ్ఞాని కాదు. అతను సాధారణమైన వ్యక్తే. కానీ అతనికి- ‘ఎక్కడో ఉన్న దాన్ని చూసే శక్తి’ లభించింది. అలాగే రెండు దశాబ్దాల క్రితం స్కాండినేవియాలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అతణ్ణి ఆసుపత్రిలో చేర్చాక, మెలకువ వచ్చాక అతని చెవిలో ఎవరో పాటలు పాడుతున్నట్లు ధ్వను లు విన్పించాయి. రెండు రో జుల తర్వాత తెలిసిన విష యం ఏమిటంటే అక్కడికి దగ్గరలోని రేడియో స్టేషన్ పాటలు అతని చెవులు గ్రహించడం మొదలుపెట్టాయి. అలాగే, ఇంగ్లాండ్‌లో ఓ స్ర్తికి పగటివేళ ఆకాశంలో నక్షత్రాలు కన్పించేవి. ఆమె ఓ మేడమీద నుండి కిందకు పడడం వల్ల కళ్ళలోని ఏదోశక్తి చైతన్యవంతం అయ్యింది. నక్షత్రాలు పగటివేళ కూడా ఉంటాయి. సూర్యకాంతి వల్ల అవి మనకు కన్పించవు. పగటివేళ ఆకాశంలోని నక్షత్రాలను చూచే శక్తి మనకు ఉందన్నమాట. దానికి సంబంధించిన చైతన్యం కలిగి ఆ శక్తి మనలో పనిచేస్తుంది.

రూప, శబ్దాలను కలిపి మన శాస్త్రాలను ‘నాదం’ అన్నారు. అది ఎప్పుడూ ప్రకృతి నిండా నిసర్గ స్థితిలో ఉంటుంది. దానిని గ్రహించే శక్తి మనలోని ఆంతరిక అవయవాలైన జ్ఞానేంద్రియాలకు, అంతఃకరణానికి ఉంది. మన ప్రక్కనున్న శబ్దాన్ని వింటున్నాం. మన ఎదురుగా ఉన్న రూపాన్ని చూస్తున్నాం. అంటే మనకు దూరంగా వున్న శబ్దాన్ని, రూపాన్ని కూడా చూడగలమన్నమాట. సాధన వల్ల అది సాధ్యం అవుతుందని మన యోగశాస్త్రం నిరూపిస్తే, అనేక కారణాల వల్ల కూడా అలాంటి అంతర్గత శక్తులు చైతన్యవంతం అవుతాయని పాశ్చాత్యులు నిరూపించారు. దానిని సమన్వయ దృష్టితో చూడకుండా బిజెపి ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి అది ఛాందసం, మతతత్వం అని ప్రచారం చేయడం తగదు. శబ్ద రూపాలను ఆనాడు వారు ఆత్మశక్తి ద్వారా, అంతర్గత శక్తి ద్వారా దర్శిస్తే, ఈనాడు దానిని ఓ యంత్రంలోకి మార్పు చేసుకొని కంప్యూటర్‌లో దర్శిస్తున్నాం. అది కొందరికే పరిమితమైతే, ఇది అందరి వద్దకు చేరింది.
సంజయుడు మత గురువో, ఆధ్యాత్మికవేత్తనో, ఋషిసంతతి వాడో కాదు. సాధారణమైన వ్యక్తే. అతని దగ్గర కూడా పైన చెప్పిన పాశ్చాత్యులలాగా ఓ విశేష శక్తి ఉంది. అది మన వారసత్వం అనుకోవడానికి సిగ్గెందుకు? కంటికి కన్పించేదే శక్తి అనుకుంటే అది అవివేకం. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తి మనకు కన్పిస్తున్నాయా? ‘కోట్రేసర్’ అనే చిన్న వస్తువు చిన్న బ్యాటరీతో పనిచేసే యంత్రం. మన తాళపు చెవికి దానిని తగిలించి, మనం విజిల్ వేస్తే దాని నుండి కూడా బదులుగా విజిల్ వస్తుంది. అది నిర్ణీత పౌనఃపున్యం ఉన్న శబ్ద తరంగాలకు స్పందిస్తుంది. ఇదంతా మన కంటికి కన్పించకుండా జరుగుతుంది. అలాగే శబ్ద తరంగాలను, కాంతి కిరణాలను నియంత్రించే వ్యవస్థ మనకు పురాణాల్లో ఎన్నోచోట్ల కన్పిస్తుంది. మంత్ర శాస్త్రం అంతా ఈ ధ్వని తరంగాల వల్ల సంభవించేదే కదా! మంత్ర విద్యను సైన్సు అంటే మనం నమ్మం. దానిని కూడా బ్యూరెట్లలో, పిప్పెట్లలో పెట్టి చూపిస్తేనే నిజం అనుకుంటాం.
మనకు ఆత్మవిద్య స్థూల జగత్తు, సూక్ష్మ జగత్తు అని రెంటినీ చెప్పింది. స్థూల శరీరం - సూక్ష్మం మనస్సు. ఒకటి కంటికి కన్పిస్తుంది మరొకటి అమూర్త్భావనగా ఉండి అన్ని ఉద్వేగాలను కల్గిస్తుంది. మనం ఒకప్పుడు మంత్రయుగంలో జీవిస్తే ఇపుడు యంత్ర యుగంలో జీవిస్తున్నాం.

విప్లవదేవ్ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని, యువకులు ఆవులను కొనుక్కొని ఉపాధి పొందాలని సూచించడంపైనా కొందరు దుమారం రేపారు. ఈ రోజు ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో 15 కిలోల ఎల్‌పిజి సిలెండర్ చొప్పున- 135 కోట్ల మంది వాడితే ఎంత భూగర్భ వాయువులు మనం నష్టపోతున్నాం? మరి ఆవు పేడ ద్వారా గోబర్‌గ్యాస్ ప్లాంట్లు నిర్మిస్తే మనం ఎంతగా ప్రకృతిని రక్షించినవాళ్లం అవుతాం. ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల జనాభా దాదాపు 90 కోట్లు. వారి విద్యుత్ అవసరాలకు బదులుగా ఆవుపేడతో ఉత్పత్తయ్యే శక్తిని వినియోగిస్తే మనం సహజ వనరుల్ని కాపాడినవాళ్లం కామా? ప్రపంచం మొత్తం మీద అత్యధిక పశు సంపద ఉన్న మనం మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేసి సహజ వనరులకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టలేమా? యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా వారి సర్వే ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాస్, 80 టన్నుల సేంద్రియ ఎరువు, 200 లీటర్ల కీటక నివారణ ఔషధాలు పొందవచ్చు. వారు నివేదిక ఇచ్చిన 1989 నాటికే వాటి విలువ 17,885/- రూ.ల అయితే ఈ రోజు ఎంత ఉంటుందో ఆలోచించండి. ‘గ్రీన్ హౌస్’ ప్రభావంతో 1995లో వాతావరణంలో 6.2 బిలియన్ మెట్రిక్ టన్నులున్న కర్బన ఉద్గారాలు ఇపుడు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ముప్ఫై ఏళ్ళ క్రింద 25 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఇపుడు 45 డిగ్రీలకు చేరింది. సహజ వనరుల్ని ధ్వంసం చేయడం వల్ల భూగోళం వేడెక్కి జలవనరులు క్షీణించి వడగాలులు, అతివృష్టి, అనావృష్టి, ఉష్ణ సంబంధ వ్యాధులు, వాటిని నివారించేందుకు మందులు.. ఇలా ప్రకృతి బీభత్సం యథేచ్ఛగా జరిగిపోతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఆవు’ను పెంచుకోండని విప్లవ్‌దేవ్ చెబితే అది ‘మతోన్మాదం’ అని దుష్ప్రచారం చేస్తారా?

గణేశుడిని సృష్టించేటపుడు శివుడు ఏనుగు తలను మనిషి తొండానికి అతికించాడని, అతనే మొదటి ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడని ప్రధాని మోదీ మన ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేస్తే అది అశాస్ర్తియమా? ఏదైనా చరిత్రను రికార్డు చేసేటపుడు ముందు వెనుకలను ప్రస్తావించడం తప్పెలా అవుతుందో ఈ అపర మేధావులే చెప్పాలి. త్రిపురలో దశాబ్దాల మాణిక్ సర్కార్‌ను- అదీ నిప్పులాంటి నాయకుణ్ణి త్రోసిరాజని అధికారం పొందిన విప్లవ్‌దేవ్‌ను వీలైనంత ఎక్కువ అపఖ్యాతి పాలు చేయడమే ఇందులోని రహస్యం. ఎందుకంటే బ్రద్దలైన కోటను మళ్లీ ఐదేళ్లలో పొందాలంటే గద్దెనెక్కిన వ్యక్తి నిజాయితీగల వ్యక్తి అయినా సరే- అతణ్ణి వివాదాస్పదుడిగా, విలన్‌గా చిత్రీకరిస్తే తమ పని విజయవంతం అవుతుందనేది వామపక్ష మేధావుల వ్యూహం.

******************************************************
✍✍- డాక్టర్. పి. భాస్కర యోగి 
Published Andhrabhoomi :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి