ఒకప్పుడు మనదేశంలో గురుకులాల్లో సహజసిద్ధమైన జీవితాన్ని ప్రబోధించేవారు. రాగద్వేషాలు లేని విద్య అందులో బోధింపబడేది. స్వార్థచింతన వదిలిపెట్టి పరోపకారమే పరమావధిగా జీవించాలి అనేది భారతీయ గురుకులాల విశ్వజనీన ప్రబోధం. కానీ ఇవాళ మెకాలే వేసిన బీజం మహావృక్షమై కూర్చుంది. మన మూలాలను, మూల్యాలను వదిలిపెట్టి విద్య నేర్పిస్తున్నాం. ఆహారంతో విషయలోలత్వం పెరిగిపోయింది. ఉదాహరణకు మనదేశంలో ప్రస్తుతం ఓ సర్వే ప్రకారం స్త్రీలల్లో 45% మంది టివి సీరియళ్లు, సినిమాల ప్రభావంతో తమ సృజనాత్మకతను కోల్పోతున్నారట. అలాగే యువకుల్లో 60% మంది సినిమాలు, క్రికెట్, సినిమా పాటల వల్ల తమ సృజన శక్తిని పోగొట్టుకుంటున్నారట.
అలాగే యువకుల్లో 10% మంది మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలై మనస్సును మలినం చేసుకొని తమలోని అన్ని శక్తులను కోల్పోతున్నారట! ఆలోచిస్తే - మన సమాజానికి మూల స్తంభాలైన స్త్రీలు, యువకులు తమ చైతన్యాన్ని ఇంత సులభంగా కోల్పోతే ఎవరు ఈ దేశాన్ని కాపాడుకుంటారు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో “ఎప్పుడూ విషయలోలుడుగా ఉండే వ్యక్తికి వాటితో బంధం ఏర్పడుతుంది, ఆ బంధం వల్ల కామము (కోరిక), కామం వలన క్రోధం, క్రోధం వల్ల విభ్రాంతి - దాని వలన మతిమరుపు, దాని వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సర్వనాశనం అవుతుంది”. పై గణాంకాలను శ్రీకృష్ణుడి ప్రబోధానికి అన్వయించి చూస్తే మనం -మన సమాజం ఎంత దౌర్భాగ్య స్థితిలోకి జారుకుంటున్నాం అనేది అవగతమవుతుంది.
“ఏ జాతి తమ అస్తిత్వాన్ని గుర్తించకుండా పరసంస్కృతి వైపు పరుగు లెడుతుందో దాని పతనం దగ్గర్లోనే ఉంది” అన్న స్వామి వివేకానందుని మాటలు సదా స్మరణీయం. నిమిషానికి వందల విమానాలను ఆకాశంలోకి ఎగిరిస్తూ ఎంతో ఇంధనాన్ని ఫ్లోరోకార్బన్‌లుగా మార్చి వాయు కాలుష్యాన్ని కలిగిస్తున్న అమెరికా పర్యావరణాన్ని గురించి మాట్లాడుతుంది. పశుమాంసాన్ని విపరీతంగా తింటూ వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటాయి అరబ్ దేశాలు. వాటి రవాణా కోసం వాడుతున్న ఇంధనం, పశువ్యర్థాల వల్ల ప్రపంచ పర్యావరణం ధ్వంసమవుతుంది. మన పూర్వీకులు మాత్రం పర్యావరణం నష్టపోకుండా ఇందనం ఎక్కువ ఖర్చు కాకుండా జీవించే విధానం అలవాటు చేశారు.
కానీ గ్లోబలైజేషన్ అనే వైదేశిక ఉచ్చులో మనం కూడా పడిపోయాం. హిందూ జీవన విధానాన్ని ఆర్థికంగా, భౌతికంగా ధ్వంసం చేసినా అంతరంగంలో మన జీవన విధానాన్ని మన సంప్రదాయం నుండి దూరం చేయలేకపోయారు. ప్రపంచానికి పెద్దన్నలుగా చెప్పుకునే దేశాలు వాటిలో ఆచరించే మతపరమైన విలువలు హానికారకంగా ఉన్నాయి. అణుబాంబులు చూపించి ప్రపంచంలో గొప్పవాళ్లము అనుకుంటున్న ఒకవర్గం వైపు, ‘అంతా నామతస్థులే ఈ భూమిపై ఉండాలి’ అనుకునే ఇంకోవర్గం - ఈ రెండూ రెండు మతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఈ రెంటికీ అతీతంగా ఆలోచించగలిగి జీవనవిధానాన్ని దైవికంగా - దివ్యంగా జీవించేది హిందువులు మాత్రమే !
పైన చెప్పినట్లు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి జీవించడం మన సంప్రదాయం కాదు. ఆటంబాంబులతో కాకుండా ఆదర్శ భావాలతో జీవించడం హిందువుల రక్తంలోనే ఉంది. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి లక్షల కోట్ల ధనం వెచ్చిస్తున్న ప్రపంచ దేశాలు తాము చేస్తున్న మానవ హననాన్ని గుర్తించడం లేదు. ఉదాహరణకు మన జీవన విధానంలోని వైరాగ్యం, తపస్సు, కర్మలు, దానం, జ్ఞానం ఇవన్నీ మనకు గొప్ప జీవన పాఠాలు. అలాగే మన శాస్త్రాలు మనల్ని విశిష్ట జీవనంతో జీవించమని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు మనకు వాస్తుశాస్త్రం ఉంది. అందులో మొత్తం పర్యావరణ విజ్ఞానం ఉంది.
గాలి, వెలుతురు సరిగ్గా పొందడం కోసం గవాక్షాలు, ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలో వాస్తుశాస్త్రం చెబుతోంది. చక్కగా వెలుతురు, గాలి ప్రసరించే ఇల్లును చూడండి. విద్యుత్ అవసరమే లేదు. విద్యుత్‌ను అవసరానికి మించి వాడటం పర్యావరణ ధ్వంసమే అవుతుంది. అలాగే పసుపు వాడకం ఓ సంప్రదాయం క్రింద చెప్పారు. కానీ అది రోగక్రిముల నాశనకారి. అందుకే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దాని పేటెంట్ హక్కును కొట్టేయాలని చూస్తున్నాయి. కుంకుమను కూడా పసుపు నుంచే తయారు చేస్తారు. మనం తిలకం / బొట్టు ధరించే చోట “పీనిరూల్ గ్లాండ్” ఉంటుంది. శాస్త్రాలు దానిని ఆత్మస్థానం అని చెప్పాయి. దీని నుంచి స్రవించే మెలటోనిన్, పెరిటోనిన్ అన్న పదార్థాలు జ్ఞాపకశక్తి, ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కుంకుమ (పసుపు) ధరించాలి. మన జీవన విధానం అంతా సైన్సే.
సైన్సు - అనే పదానికి సమానార్థకంగా ‘విజ్ఞానం’ అని అంటున్నాం. శాస్త్రం,- శాస్త్రీయత అంటే అవేమీ జడ పదార్థాలు కావు. అవేమీ హిందూ ధర్మానికి తెలియనివి కావు. ఏదైనా పనిని ఓ నిబద్ధతతో చేయగలిగి, పద్ధతి, క్రమం తెలిసి ఫలితాలను రాబట్టగలిగితే అదే శాస్త్రీయత. మనకు ఎప్పటి నుండో శాస్త్రీయత ఉంది. అందుకే స్వామి దయానంద సరస్వతి చెప్పిన మాటలు మనం మననం చేసుకోవాలి. “మీ పూర్వీకులు అరణ్యాలలో నివసించిన అనాగరిక మనుషులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞాన బిక్షను పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు. విశ్వవిజేతల యశోగానమది. మీ వేదవేదాంగ శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహామహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేల్కొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వభావంతో పులకించండి” చూడండి! స్వామీజీ మాటలు ఎంత ప్రేరణదాయకంగా మనల్ని మనం తరచి చూసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయో..
***************************************************
ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి 卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ卐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి