భారత్‌లో హిందువుల సాకార ఆరాధ్య స్థానం దేవాలయం. దైవభక్తి ప్రేరణ కోసం, ధర్మప్రచారం కోసం ఎన్నో ఆలయాలు మన దేశంలో నిర్మించబడ్డాయి. అన్ని వర్గాలవారూ సమష్టిగా దైవారాధన చేయాలనే సదుద్దేశంతో చక్రవర్తులు, దాతలు భారీ సంఖ్యలో వీటిని నిర్మించారు, ఇప్పుడు కూడా నిర్మిస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్ర, వైష్ణోదేవి దర్శనయాత్ర, చార్‌ధామ్ యాత్ర మనకున్న దర్శనాల ఉత్సుకతను తెలియజేస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తంజావూరు బృహదీశ్వరాలయం మొదలుకొని ఓ చిన్న వీధిలో ఉండే గ్రామ దేవత ఆరాధన వరకు అన్నీ హిందువులకు దర్శనీయ స్థలాలే.
ఇటీవల ఆలయాల నిర్వహణ విషయంలో హిందువుల భాగస్వామ్యం కన్నా ఇతరుల జోక్యం ఎక్కువ కావడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందరో గొప్పవాళ్లు గుడులను అభివృద్ధి చేశారు. వాటిని సామూహిక ప్రార్థనాస్థలంగా మార్చే ప్రయత్నం జరగగానే అహంకారాలు, పదవులు, భేషజాలు, పార్టీలు, కులాలు అన్నీ అడ్డు వస్తున్నాయి. ఆలయం అనేది మతపరంగా ముఖ్యమైన శ్రద్ధాకేంద్రం. వ్యక్తికి ఆధ్యాత్మికతలోని ప్రాథమిక సూత్రాలను నేర్పించి ధార్మికతత్వం వైపు ఆలయం నడిపిస్తుంది. ఆలయాల్లో వివిధ ఉత్సవాలు, పర్వదినాల సందర్భంగా ఎందరికో ఉపాధి దొరుకుతుంది. అమూర్తమైన దేవుణ్ణి మూర్తి రూపంలో ఆవిష్కరింపజేసి భక్తినీ, భయాన్ని కలిగించి సమాజ శాంతికి దోహదం చేస్తుంది- ఆలయం. అలాంటి ఆలయాలు ఒకప్పుడు విదేశీ మత వౌడ్యంతో ధ్వంసమైతే, ఇపుడు మనమే ధ్వంసం చేసుకుంటున్నాం.
గజనీ మహమ్మద్ క్రీ.శ.1024లో 16వ దండయాత్రగా సోమనాథ దేవాలయంపై దాడి చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. బాబర్ సేనాని మీర్ బాఖీ అయోధ్యలో రామాలయం ధ్వంసం చేయించాడు. దేశానికి స్వా తంత్య్రం వచ్చాక సోమనాథ దేవాలయం మాత్రం సర్దార్ పటేల్, రాజేంద్రప్రసాద్, కెఎం మున్షీ వంటి నేతల చొరవతో పునరుద్ధరించుకోగలిగాం. కానీ ధ్వంసమైన దేవాలయాలకు ఆత్మగౌరవం కల్పించలేకపోయాం. ఆలయాలు సమాజ ఐక్యతకు అవసరం అని గుర్తించలేకపోయాం.
స్వాతంత్య్రం వచ్చాక ఆలయ వ్యవస్థపై దృష్టిలేని పాలకులు సరికొత్త వ్యవస్థను సృష్టించలేక పోయారు. అందువల్లనే ఎన్నో వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బ్రిటీషు వారు ‘రిలీజియల్ ఎండోమెంట్ యాక్ట్-1863’ను తెచ్చారు. ఆ తర్వాత హిందూ దేవాలయ వ్యవస్థను ఈ చట్టం క్రిందకు తెచ్చి హిందువుల గొంతు కోశారు. ఇప్పటికీ అదే ఛత్రఛాయల్లో నడుస్తున్న ‘దేవాదాయ ధర్మాదాయ శాఖ’కు పట్టిన మకిలి అంతా ఇంతా కాదు. ఇందులో కుల పక్షపాతం, ఆశ్రీత పక్షపాతం, అవినీతి, ధర్మంపై శ్రద్ధ లేకపోవడం.. చివరకు పాలకులు నడిపే దేవాలయాలపై వారికే అశ్రద్ధ! తెలుగు ప్రాం తాల్లో లక్షల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం కావడానికి దేవాదాయ ఉద్యోగుల, అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణం. అధికారంలో వున్న పార్టీలు తమ అవసరాలకు ఉపయోగపడిన రాజకీయ నాయకులకు పదవులిచ్చి దేవాలయాలను వారికి స్వాధీనం చేస్తున్నాయి. లిక్కర్ మాఫియాలు, అవినీతి పరులకు దేవాలయాలను అప్పగిస్తే అక్కడ ఉండేది అరాచకమే. ఆలయ భూములను భూబకాసురులు కబ్జా చేస్తున్నా పాలకులు కళ్లప్పగించి చూస్తారు. హిందుత్వకు ఆగర్భశత్రువులైన కమ్యూనిస్టులు ‘దేవాలయ భూములు పేదలకు పంచాలి’ అని నినదిస్తుంటారు. కానీ చర్చి భూములను, వక్ఫ్ భూములను కనీసం ఆయా మతాల్లోని పేదలకైనా పంచాలని ఎన్నడూ అడగరు.
తాజాగా తిరుమల ప్రధాన పూజారి రమణ దీక్షితులు రేపిన మంట- రాజకీయ పార్టీల వివాదంగా మారింది. కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రమణ దీక్షితులు ఎక్కువగా గౌరవించారనే ఈ అలజడి ప్రారంభమైందట! దీక్షితులు రెండు ముఖ్యమైన ఆరోపణలు చేశారు. తిరుమల ఆలయంలో ఆగమశాస్త్ర విరుద్ధంగా కైంకర్యాలు జరిపేందుకు పెద్దలు, అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, స్వామివారి ఆభరణాలు, రత్నాలు సురక్షితంగా లేవని ఆరోపించారు. ఆ మరుసటి రోజే అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయిస్తూ టీటీడీ బోర్డు అతణ్ణి తొలగించింది. ఈమధ్యనే టిటిడి బోర్డు అధ్యక్షునిగా పుట్టా సుధాకర్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే వివాదం మొదలైంది.
భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పబడే తిరుమలలో హిందూ ధర్మాన్ని నూటికి నూరుపాళ్లు విశ్వసించే వ్యక్తులు టీటీడీ బోర్డు అధికారులుగా ఉండాలనే నైతిక సూత్రం ప్రభుత్వం గౌరవించడం లేదని ఆందోళన ప్రారంభమైంది. క్రైస్తవ సువార్త కూటముల్లో విశ్వాసిగా పాల్గొన్న సుధాకర్ టీటీడీ చైర్మన్‌గా పనికిరాడని హిందూ సంస్థలు ఆందోళన ప్రారంభించాయి. బోర్డు సభ్యురాలిగా నియామకమైన తెదేపా ఎమ్మెల్యే అనిత- ‘నేను క్రైస్తవురాలిని’ అని చెప్పుకొన్న వీడియోలు బయటపడేసరికి ఏపీ సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గి, ఆమెను స్వచ్ఛందంగా విరమింపజేశారు. పెద్దనోట్ల రద్దు సమయంలో గుట్టలకొద్దీ కరెన్సీ కట్టలతో దొరికిపోయిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి అవినీతిని దేశమంతా చూసింది. ఇతనికి చంద్రబాబు కుమారుడైన లోకేశ్‌తో సంబంధాలున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
పుట్టా సుధాకర్‌పై ఆరోపణలు రాగానే ప్రభుత్వం యాదవులను ఎగదోసింది. హిందూత్వాన్ని వందశాతం విశ్వసించే మరే యాదవుడికైనా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినా- హిందూ ధార్మిక సంస్థలకు అభ్యంతరం ఏముంటుంది? సౌదీలో శ్రీరాముడి ఫొటో పెట్టుకోవడం నిషిద్ధం. క్యాథలిక్కులు మూడో ప్రపంచానికి చెందిన బిషప్పును ఎప్పుడూ పోప్ కానివ్వరు. వారి సిద్ధాంతాలు తప్పుకాదు. కానీ హిందూత్వపై విశ్వాసం లేని వారు తిరుమలను పాలిస్తారా? ఈ వివాదం చల్లారకముందే అమిత్ షాకు రమణ దీక్షితులు ఘనస్వాగతం పలకడం, అదే రోజు అమిత్ షా కాన్వాయిపై దాడి చేయడం, మరుసటి రోజు ప్రధాన అర్చకుణ్ణి తొలగించడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది.
రమణ దీక్షితులపై గతంలో ఆరోపణలున్నమాట వాస్తవం. అయితే, ఇప్పుడు ఆయన చేసిన ఆరోణలకు జవాబివ్వకుండా తాజా పరిణామాల్లో భాజపాను, అమిత్ షాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. రమణ దీక్షితులు పాల్గొన్న మీడియా సమావేశంలో ఇద్దరు తమిళనాడు భాజపా నాయకులు పాల్గొన్నారని, అమిత్ షాను, రాజనాథ్ సింగ్‌ను ఢిల్లీలో రహస్యంగా కలిశారనీ, ఎప్పుడూ లేనిది ఓ అర్చకుడు తన అభియోగాలను ‘హిందూ ఓరియెంటెడ్’గా చేశాడని చంద్రబాబు ప్రభుత్వం మండిపడింది. నిజానికి తిరుమలలో వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో నాస్తికుడైన భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం, తిరుమల ఏడుకొండలను రెండు కొండలుగా చేయాలనుకోవడం, తిరుమలపై అన్యమత ప్రచారం జరగడం, తిరుమల నిధులను మళ్లించడం, తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు.. ఇవన్నీ వివాదాలే! కానీ ఆయా సందర్భాలలో వాటిని మరుగుపెట్టి మాట్లాడడం జరిగింది. తిరుమలలో వయోపరిమితిని అర్చకులపై విధించాక చిన్న చిన్న దేవాలయాల్లో పూజారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ విషయంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడిన మాటలు మంటలే పుట్టించాయి. ఆ తర్వాత ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది కానీ ఇదంతా రాజకీయంగా దుమారం రేపుతోంది.
తెదేపాకు వెన్నుదన్నుగా ఉండే విశే్లషకులు దీనిని భాజపాపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతంలో రాముణ్ణి ఆధారం చేసుకొని, దక్షిణ భారతంలో వెంకన్నస్వామిని ఆధారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని రోజూ కథనాలు వండుతున్నారు. తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంపై రిపబ్లిక్ చానల్‌లో ఆర్నాబ్ గోస్వామి, జీటీవీ యాంకర్లు చర్చ చేయడంతో ఇది ఇపుడు జాతీయాంశంగా మారింది. ఈ విషయంపై హిందూ ఫైర్‌బ్రాండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తీవ్రంగా స్పందించారు. ఒకవేళ సుబ్రహ్మణ్యస్వామి సీరియస్‌గా తీసుకుంటే చంద్రబాబు కష్టాల్లో పడ్డట్టే అని విశే్లషకులు అంటున్నారు.
నిజానికి తిరుమలలో పరిశుభ్రత తప్ప, మిగతా విషయాల్లో సామాన్య భక్తులకు చాలా కష్టాలున్నాయి. తరతరాలుగా తిష్టవేసుకొని కూర్చొన్న చాలామంది అధికారులకు, రాజకీయ ప్రాబల్యంతో వస్తున్న బోర్డు సభ్యుల్లో చాలామందికి హిందూ ధార్మిక అంశాలపై అవగాహన లేదు. వారికి అధికార దర్పం తప్ప హైందవ ధర్మ అభివృద్ధికి సంబంధించిన మనసు లేదు. పోనీ దేవాలయం మొత్తం ధర్మాచార్యులకు అప్పజెప్పాలన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
తమిళనాడులో ఎన్నో దేవాలయాల్లో ఈ స్వతంత్ర వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది. తిరుమల అభివృద్ధిలో ఎందరో ఐఎఎస్ అధికారుల పాత్ర చాలా గొప్పగా వుంది. కానీ క్రింది స్థాయిలో పేరుకుపోయిన జాడ్యం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నది. ఇపుడు టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ నియామకం వెనుక ఉన్న రహస్యం ఏంటో చంద్రబాబు చెప్పాలని హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడి సంప్రదాయం, ధర్మం, సాహిత్యం తెలిసిన ఎందరో నిజాయితీపరులైన ఐఏఎస్‌లు ఉండగా ఉత్తర భారతానికి చెందిన అధికారిని నియమించడం వెనుక మతలబు ఏమిటి?
తిరుమల ఒక ఉదాహరణ మాత్రమే. తెలుగు నాట ఎన్నో దేవాలయాల్లో ఈ దుస్థితి నెలకొని ఉంది. ఇతర మతాల విషయంలో, వారి శ్రద్ధా కేంద్రాల విషయంలో నిరాసక్తంగా ఉండే పార్టీలు హిందువుల విషయంలో మితిమీరిన జోక్యానికి కారణం ఏమిటి? కరాచీలో వుండే నూరేండ్ల నాటి దేవాలయాన్ని ఒక పాకిస్తాన్ పఠాన్ ఆటో గ్యారేజ్‌గా ఉపయోగించుకుంటున్నాడని ఓ పత్రిక ప్రకటించింది. భక్తి లేకుండా కేవలం పదవుల కోసం, అధికార దర్పం కోసం, రాజకీయ నిరుద్యోగులకు నీడ కల్పించేందుకు దేవాలయాలను ఉపయోగించుకోవడం చూస్తే పాకిస్తాన్‌లోని పఠాన్‌కూ వీళ్లకూ తేడా లేదనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ గణేశ చవితి పూజలో పాల్గొన్నందుకు ముంబయిలోని దారుల్- ఇఫ్తా- మంజర్- ఏ- ఇస్లాం అనే సంస్థ అతనిపై ఫత్వా జారీ చేసింది. మరి సువార్త సభల్లోకి ముఖ్య అతిథులుగా వెళ్ళేవాళ్లు, ఇఫ్తార్ విందుల్లో టోపీలు ధరించేవారు హిందూ ఆలయాలకు అధిపతులుగా ఎలా కొనసాగుతారు? ‘దేవుణ్ణి పూజించేవారు బుద్ధిహీనులు’ అన్న రామస్వామి నాయకర్ విగ్రహాన్ని ప్రఖ్యాత శ్రీరంగం దేవాలయం ఎదుట నెలకొల్పడానికి అప్పటి డిఎంకె ప్రభుత్వం అనుమతి ఇచ్చింది! ఇంకెన్నాళ్లు ఈ దేశంలో హిందువుల పరాధీన మనస్తత్వం..?
*************************************************
✍✍- డాక్టర్. పి. భాస్కర యోగి
Published Andhrabhoomi :
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి