ఒకడు అందమైన అద్దాలమంటపం లాంటి ఇల్లు కట్టుకొన్నాడు. నీ పక్కింటివాడు “నీ ఇంటిపై రాయి విసురుతా!” అన్నాడు అని ఎవరో చెప్పాడు. ఇక ఈ పెద్ద భవంతి వాడికి నిద్రలేదు రాత్రింబవళ్లు వాడు ఎప్పుడు కొడతాడా! అనా ఎదురు చూడసాగాడు. వాడి మానాన వాడున్నాడు. కానీ ఈ అద్దాలమేడ వాడు మాత్రం  వాడు ఎప్పడు కొడతాడా? వానిపై ఎప్పడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెడదామా అని చూస్తేన్నాడు. ఆఖరుకు విసుగెత్తి ఓ రాయి తీసుకెళ్లి ఎదురింటి వాడికి ఇచ్చి “నీవు కొడితే గాని నేను ఊరుకోను” అన్నాడు. అసలు ఎదురింటి వాడికి ఆ ఆలోచనే లేదు. కర్ణాటక రాజకీయ పరిణాయాలపై ప్రతిపక్ష పార్టీలకు, మీడియాకు తెలుగురాష్ట్రాల అధికారపార్టీలకు మరీముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇలాంటి దుగ్ధనే కన్పించింది.

రాజ్యాంగ బద్దంగా అతిపెద్ద ఏకైక పక్షంగా అవతరించిన భాజపాను గవర్నర్ పిలవగానే మైండ్‌గేమ్ ప్రారంభమైంది. గవన్నర్‌కు విచక్షణ అధికరాలుంటాయన్న విచక్షణ లేని వాళ్లు గవర్నర్‌కు అధికారమే లేదన్నట్లు మైమరిపింపజేసారు! అమిత్‌షా నరేంద్రమోదీ స్వయంగా మాఫియా  డాన్లలాగా మారుతి వ్యాన్లలో వచ్చి కాంగ్రెస్ ఎమ్మోల్యేలను ఎగిరేసుకుపోతున్నట్లు ప్రచారంతో ఊదరగొట్టారు. ఇక తెలుగు చానళ్లలో గొవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన విషయాలపై చర్చ దానికి ఎన్నిసార్లు భాజపావారు సమాధానం చెప్పినా అవే ప్రశ్నలు.! ఇప్పడు కమ్యూనిస్టు విశ్లేషకులు రాజ్యాంగ రక్షకుల్లా ఫోజులిస్తూ ఉండడం అతి సహజం.

కానీ తెలుగుదేశం ప్రతినిధలు 21మంది వైయస్సార్ సీపీ ఎమ్మోల్యేలను తమ పార్టీలో కలుపుకొని మంత్రి పదవులు ఇచ్చి ‘చిన్నయసూరి నీతి చంద్రిక’ వల్లించడం ఏంటని మెడమీద తలకాయ ఉన్నవాళ్లంతా ఆలోచించడం మొదలుపెట్టారు. కొందరు ఓట్ల శాతం భాజపాకన్నా కాంగ్రెస్‌కు ఎక్కువగా ఒకటి, రెండు శాతం ఉందని శాతం కొత్తతర్కం ప్రతిపాదిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓట్లు ముఖ్యమా! సీట్లు ముఖ్యమా! 38 సీట్లు గెలిచిన జేడియస్ పార్టీ కుమారసాస్వమి ముఖ్యమంత్రి కావడం నైతికతనా! ఇంకొందరు నాలుగు అడుగులు ముందుకేసి ప్రాంతీయ పార్టీలదే ఈ హవా, జాతీయ పార్టీలను తిరస్కరించారు అంటున్నారు. ఇదొక విడ్డూరం!

మొన్నటివరకు సిద్ధరామయ్యను మించిన నాయకుడు లేడని ఊదరగొట్టిన ఈ భాజాలు ఇప్పుడు కుమారస్వామిని మించిన నాయకుడు లేడని ఊదరగొట్టిన ఈ భాజాలు ఇప్పడు కుమారస్వామిని మించిన  వ్యూహకర్త లేడని మురిసిపోతున్నాయి. కర్ణాటకలో ఎమ్యెల్యేలను గోడ దూకకుండా స్కెచ్ వేసింది ప్రియాంక గాంధీ అని, దానిని అమలు చేయించింది సోనియా అని మొదటి రెండు రోజులు ప్రచారం చేసుకొన్న కాంగ్రెస్ వార్గాలు యొడ్యురాప్ప రాజీనామా చేసి వెళ్లిపోగానే రాహుల్ గాంధీని మీడియా ముందుకు తెచ్చారు. ఆయన యధాలాపంగా మోదీ, అమత్‌షాలపై దుమ్మెత్తి పోసి నేనూ ఈ ఎపిసోడ్‌లో ఉన్నానని కన్పించి వెళ్లిపోయాడు. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్  15 చోట్ల ప్రచారం చేస్తే 14 చోట్ల ఓడిపోయారు. గత అసెంబ్లీలో 122 సీట్లున్న కాంగ్రెస్ 78 సీట్లకు దిగజారితే రాహుల్ గాంధీ గెలిపించాడట.

ఈయనతో పాటు క్యాంపు రాజకీయాలు పకడ్బందీగా అమలు చేసే డి.కె. శివకుమార్ కూడా ఈ ఎపిసోడ్‌లో బాగానే ప్రచారం పొందారు. ఏమీ చేయాలకున్నా జి. పరమేశ్వర్ కేపీసీసీకి బాగానే మైలేజ్ కల్పించారు. ఇక స్టార్ క్యాంపేయినర్ సిద్దరామయ్య ఒకప్పుడు దేవేగౌడ పార్టీ జెడీయస్‌ను నిండా ముంచినవాడు. అసలు ఒకప్పుడు కర్ణాటక సామ్రాజన్ని తమ కనుపన్నల్లో నడిపిన జేడియస్ 38 సీట్లకు దిగజారడానికి మూలమైన కర్ణచావు కారణాల్లో సిద్ధరామయ్య ఒకడు. దేవెగౌడ ఒక్కలింగ కులస్థుడైతే, యెడ్యురప్ప లింగాయత్. ఈ మూడు కులాల్లో లింగాయత్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎప్పుడూ అన్యాయమే జరిగింది. లేకలేక అందులో  పుట్టుకొచ్చిన యెడ్యురప్పకు మూడుసార్లు పదవీభంగమే జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యెడ్యూరప్పను బలపరీక్షకు ముందే రాజీనామా చేయించి లింగాయతుల్లో మంట పుట్టించింది.

2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో దాని ప్రభావం చూడవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొందరు కన్పించని బీజేపి శత్రు పక్షవ్యూహకర్తలు ఉన్నారు. అందులో కర్ణాటక రాజకీయ పరిణామాలను తన చక్రం ద్వారా మార్చేస్తారని చెప్పుకొంటున్న చంద్రబాబు ప్రధానమైన వ్యకి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు బహుశా ఆయన భోజనం చేసి ఉండడు. తన యావశ్శక్తిని ఉపయోగించి భాజపాను నిలువరించడానికి ఎన్నికల్లో ప్రయత్నించాడు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ తెచ్చానని చెప్పినట్లే కుమారస్వామిని ముందు ఎమ్మేల్యేలను కాపాడుకో అని చెప్పింది ఈ వ్యూహకర్తనేనట. అందుకే బీజేపి ఖంగుతిందని పచ్చమీడియా కోడై కూస్తుంది. అసలు కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే తెలుగునాట టీవీలు ప్రదర్శించిన అత్యుత్సాహం మన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లే తలపించింది.

నిరంతరాయంగా సాగించిన ఈ చర్చలు, విశ్లేషణల సారాంశం భాజాపాను అపఖ్యాతి పాటు చేయడం, మోదీ అమిత్‌షాలను దుమ్మెత్తిపోయడం కానీ యెడ్యూరప్ప భావోద్వేగంతో ఉపన్యాసం చేసి రాజీనామా ఇవ్వగానే వీళ్లు నింపిన బెలూన్లు ఫట్‌మని పగిలిపోయాయి. నిజాయితీగా రాజీనామా ఇచ్చిన యెడ్యూరప్ప చట్టం ద్వారా కాకుండా, దొడ్డి దారిన సీఎం అయినట్లు ప్రచారం చేస్తారు.  గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రక్రియ జరుగునట్లు దుష్ప్రచారంతో గగ్గోలు పెడుతుంటే భాజపా సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని అనిపించింది. హైదరాబాద్ నడిబొడ్డున హోటళ్లలో ఎమ్మేల్యేలను దాచి పెట్టడం ప్రజాస్వామ్యం!  వాళ్లు వాష్‌రూమ్‌కు కూడా నటుగురు గూఢచారులను పంపడం ప్రజాస్వామ్యం! కోళ్లలా బంధించి చిన్నపిల్లల్లా అన్నాలు తినిపించి క్యాంపు రాజకీయాలు నడపడం ప్రజాస్వామ్యం! ప్రజా స్వామ్యయుతంగా ఎక్కువ సీట్లు గెలిచిన వారిని గవర్నర్ గద్దెపైకి పిలిస్తే అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపుతట్టడం ప్రజాస్వామ్యం! ‘మీరు అనుమానపడుతున్నారు కాబట్టి 15 రోజుల్లో కాకుండా మరుసటి రోజే బలపరీక్ష చేయాలి’ అని సుప్రీంకోర్టు నిర్దేశించడం గవర్నర్ అధికారాన్ని ప్రశ్నించడం కాదు.

కోర్టుకు వెళ్లిన బాధితులకు అనుమాన నివృత్తిని కలిగించినంత మాత్రాన గవర్నర్ నిర్ణయం తప్పు అని కోర్టు ఎక్కడా చెప్పలేదు. అదే  ఊపులో బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమించారని కూడా కోర్టుకు వెళ్లారు. ఎప్పుడో బోపయ్య చేసిన పనికి సుప్రీంకోర్టు అతన్ని మందలించిందని అభియోగం. పరాజకీయ నాయకుణ్ణి ఈ దేశంలో కోర్టులు తలంట లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న సోనియా, రాహుల్‌లు ఈ తర్కం ప్రకారం పదవుల్లో ఉండవచ్చా! ఒకవేళ మొన్న సుప్రీంకోర్టు యెడ్యురప్పకు అనుకూలంగా మాట్లాడి ఉంటే ఏం జరిగేది? చంద్రబాబు కనుసన్నల్లో నడిచే న్యాయమూర్తులు మొన్నటి వరుకు కోర్టుల్లో ఉన్నారని ఎన్నోసార్లు ఈరోపణలు వచ్చాయి. కానీ ఏనాడు ఇతర పార్టీల నాయకులు గగ్గోలు పెట్టలేదే? కానీ సుప్రీంకోర్టునే బోనులో నిలబెట్టే పని కొందరు ఇటీవల చేస్తూనే కర్ణాటక విషయంలో ప్రజాస్వామ్యం కాపాడిందని నీతి వాక్యలు వల్లిస్తున్నారు.

ఇదేం ద్వంద్వ వైఖరి! ఇటీవల గుజరాత్‌లో జరిగే ప్రతి చెడ్డ పనిని మోదీ, షాలే చేయిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి ఇటీవల గుజరాత్‌లో ఓ గాయకుడు పాటల్లో శ్రోతల్ని ముగ్ధుల్ని చేస్తే, అతనిపై కొందరు నోట్ల వర్షం కురిపించారు. దానిని కూడా ఓ తప్పుగా గుజరాత్ వారు ఇలాంటి తప్పులు చేస్తారన్నట్లుగా, హెడ్‌లైన్‌లో పెట్టి పరోక్షంగా ప్రజల మనస్సును తలక్రిందులు చేస్తారు! తమిళనాడులో అన్నాడిఎంకెలో లుకలుకలు పడితే కేంద్రం కాస్త పెద్దన్నపాత్ర పోషిస్తే బీజేపీ వాళ్లదే ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నట్లు మాట్లాడటం, కర్ణాటకలో పద్ధతి ప్రకారం యెడ్యురప్ప గద్దెనెక్కితే అదేదో నేరం అన్నట్లు భ్రమింపజేయడం మైండ్ గేమ్ కాదా? మోదీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడను పొగిడినా, చెన్నైకి వెళ్లినపుడు కరుణానిధిని మర్యాద పూర్వకంగా కలిసినా పెడార్థాలు తీసేవారు ఎన్నికల ఫలితాల విషయంలో జేడీఎస్ పాత్రను లౌకికవాద రక్షణ అంటారా..? 

తమిళనాడులో కమల్‌హాసన్‌కు, కర్ణాటకలో ప్రకాష్‌రాజ్‌లను వెనుక నుండి ఎవరు నడిపిస్తున్నారో తెలియదా? కేవలం ఆరోపణలు చేసే వారికే రాజ్యాంగం హక్కులు ఉంటాయా? ప్రధానికి, గవర్నర్‌కు, కోర్టుకు మాట్లాడే అర్హత ఉండదా? ఆరోపణలు చేసే వారు హక్కుల కోసం పోరాడే వాళ్లు గోప్పవాళ్లా?, మౌనంగా తిట్లను భరించే వాళ్లు, తెలివి తక్కువ వాళ్లు దుర్మార్గులా? ఈ విషయంలో కేసిఆర్‌ను భాజపా నేతలు అనుసరించి ఉంటే కుల పార్టీల కోసం కుతకుత ఉడికి పోయే ప్రసార మాధ్యమాలు ఎన్ని మీటర్ల లోతున పాతరేయబడేవో? తెలంగాణ ఏర్పడ్డాక శాసన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని అవమాన పరిచినందుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మరీ దగ్గును దుమ్మును లేకుంగా చేసాడు కేసీఆర్.

అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబును ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికేట్లు చేసి మూటాముల్లే సర్దుకొని ఆంధ్రాకు వెళ్లపోయేట్లు చేశాడు. పదేళ్లు విభజన చట్టం ప్రకారం హైదరాబాదులో ఉండటానికి అవకాశం ఉన్న చంద్రబాబు కోరలు పీకి ఎన్టీర్ ట్రస్ట్ భవన్ అద్దెకిచ్చే విధమైనా పరిస్థితి కల్పించాడు. కానీ భాజాపా వాళ్లు కర్ణాటకలో 104 సీట్లు గెలిచినా తెలుగునాట ఎన్నికల్లో ఓడిపోయేంత దుష్పచారం మూటగట్టుకొన్నారు. 15 రోజుల్లో 21 రోడ్డుషోలతో 219 నియోజక వర్గాల్లో పర్యాటించి 104 సీట్లు సాధించిన నరేంద్ర మోదీని విజయం వరించినా దుష్పచారం దుమ్ములో కలిపేశారు. 2013లో 40 స్థానాల నుండి 104కు ఎదిగిన భాజపాను విలన్‌గా చూపిస్తూ , 38 సీట్లున్న కుమారస్వామి కుర్చీకోసం ప్రాకులాడితే 78 సీట్లున్న కాంగ్రేస్‌పార్టీ జీడియస్ ముందు చేతులు కట్టుకొని నిలబడితే అది విజయంగా అభివర్ణించే దుస్సాహసం ముందు గెలుపెవరిది? ఓటమెవరిది?


 ***************************************************
  
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి