పసుపు వాడకం ఓ సంప్రదాయం క్రింద చెప్పారు. కానీ అది రోగక్రిముల నాశనకారి. అందుకే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దాని పేటెంట్ హక్కును కొట్టేయాలని చూస్తున్నాయి. కుంకుమను కూడా పసుపు నుంచే తయారు చేస్తారు. మనం తిలకం / బొట్టు ధరించే చోట “పీనిరూల్ గ్లాండ్‌” ఉంటుంది. శాస్త్రాలు దానిని ఆత్మస్థానం అని చెప్పాయి. దీని నుంచి స్రవించే మెలటోనిన్, పెరిటోనిన్ అన్న పదార్థాలు జ్ఞాపకశక్తి, ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కుంకుమ (పసుపు) ధరించాలి. మన జీవన విధానం అంతా సైన్సే. సైన్సు - అనే పదానికి సమానార్థకంగా ‘విజ్ఞానం’ అని అంటున్నాం. శాస్త్రం,- శాస్త్రీయత అంటే అవేమీ జడ పదార్థాలు కావు. అవేమీ హిందూ ధర్మానికి తెలియనివి కావు. ఏదైనా పనిని ఓ నిబద్ధతతో చేయగలిగి, పద్ధతి, క్రమం తెలిసి ఫలితాలను రాబట్టగలిగితే అదే శాస్త్రీయత.

మనకు ఎప్పటి నుండో శాస్త్రీయత ఉంది. అందుకే స్వామి దయానంద సరస్వతి చెప్పిన మాటలు మనం మననం చేసుకోవాలి. “మీ పూర్వీకులు అరణ్యాలలో నివసించిన అనాగరిక మనుషులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞాన బిక్షను పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు. విశ్వవిజేతల యశోగానమది. మీ వేదవేదాంగ శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహామహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేల్కొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వభావంతో పులకించండి” చూడండి! స్వామీజీ మాటలు ఎంత ప్రేరణదాయకంగా మనల్ని మనం తరచి చూసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయో..

అందుకే అత్యంత ప్రాచీన సంస్కృతికి వారసులైన మనం మన సంస్కృతిలోని శాస్త్రీయతను, సామాజిక భావనను తెలుసుకొని జీవించాలి. మన జీవనంలో అత్యంత ప్రముఖమైనది కుటుంబ వ్యవస్థ. ప్రపంచాన్నే కుటుంబంగా భావించాలనే “వసుదైక కుటుంబం” అన్న ఉదాత్త భావనను హైందవ ధర్మం ప్రచారం చేసింది. ఇతర మత సంస్కృతుల నుండి మనల్ని వేరు చేసి, ఉన్నత స్థానంలో భారత జాతిని నిలబెట్టేది కుటుంబ వ్యవస్థ. పాశ్చాత్య దేశాల్లో ఒక స్త్రీగాని, పురుషుడిగాని ఏడు పెళ్ళిళ్లు చేసుకోవడం, ఏడు ఇళ్లు మారడం, ఏడు ఉద్యోగాలు చేయడం అత్యంత సహజం. మనకు అలా కాదు. వివాహ బంధం వేసి మూడుముళ్లు, ఏడు అడుగులు వేస్తే జన్మజన్మలు వారి బంధం విడిపోకుండా ఉంటుంది.

ధర్మేచ, అర్థేచ, కామేచ అనే పురుషార్థాల సాధనకు ఇద్దరు కలిసి ముందుకు సాగుతారు. “నాతిచరామి” (నేను అతిగా చరించను) అని ప్రమాణం చేస్తారు. ‘యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” - ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అన్నట్లు మనం స్త్రీని గౌరవిస్తాం. స్త్రీని భోగ దృష్టితో కాకుండా, యోగ దృష్టితో పూజిస్తాం. సమాజ హితం కోసం స్త్రీ ఈ దేశంలో త్యాగబుద్ధిని ప్రదర్శిస్తుంది. దేవతలు, రాక్షసులు హలాహల మథనం చేస్తున్నప్పుడు మొదట ‘విషం’ బయటకు వస్తుంది. పార్వతి తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి ఆ కాలకూట విషాన్ని స్వీకరించమని చెబుతుంది. సమాజ హితాన్ని కోరి.. 

‘’మ్రింగేడిది గరళమనియు
మ్రింగేడి వాడు విభుండనియు, మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ తన
మంగళ సూత్రమ్మునెంత మదినమ్మినదో”

ఇంత గొప్ప ధర్మానికి వారసులం మనం.గృహస్థధర్మ ప్రకారం జీవించే రంతిదేవుడు తన దగ్గరున్న సమస్తం దానం చేశాడు. చివరకు 48 రోజులు ఉపవాసం ఉన్నాడు. చివరకు కొన్ని మంచినీళ్లు లభించాయి. అవి కూడా దానం చేశాడు. అంతకష్టం కలిగిన తర్వాత కూడా ఆయన చెప్పిన విషయం “అఖిల దేహ భాజాం ఆర్తిప్రపద్యే” ‘సమస్త ప్రాణుల బాధలను స్వీకరించే గుణం నాకివ్వు’ అంటాడు. హిందూ జీవన విధానమంటే అదీ.. పుట్టలో, మట్టిలో దైవీ భావనను గమనించే మనం మట్టిని, భూమిని ఉపయోగించుకొన్నందుకు కృతజ్ఞతగా “మృత్తికాసూక్తం”, భూసూక్తం పఠనం చేస్తాం. ఉదయం నిద్రలేవగానే ‘కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతీ కరమధ్యేతు గోవిందా ప్రభాతే కరదర్శనం’ అని దేవతలను అరచేతిలో దర్శనం చేస్తాం.

భూమిని తల్లిగా భావించే మనం” సముద్ర వసనే దేవీ, పర్వతస్తనమండల, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే..” అంటూ నేలతల్లికి వందనం చేస్తాం..మనం తిన్నప్పుడు “అహంవైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితా” అనే గీతా శ్లోకం చదివి మనకు ఉదర రోగాలు రాకుండా చూడమని జఠరాగ్నిని ప్రార్థిస్తాం. తీర్థం ఇచ్చే అర్చకుడు “అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం పాదోదకం పావనం శుభం” అంటూ మనల్ని అకాలమృత్యువు కబళించవద్దని, సర్వ వ్యాధులు నివారించాలని ఆశీర్వదిస్తాడు. మన పెద్దలు పూర్వం ఏవైనా ఋణపత్రాలు రాసుకుంటే సూర్యచంద్రుల సాక్షిగా... అని రాసుకునేవాళ్లు ఎంత గొప్ప విషయం.

ప్రతిరోజు మనం చేసే మంచి పనులకు సమయం చూసి చేస్తాం. సామాన్యుని దగ్గర నుండి అందరూ పంచాంగ విజ్ఞానం ఏదోవిధంగా కలిగి ఉంటారు. తిథి, వార, నక్షత్రాలను మన నిత్య జీవితంలో భాగం చేసుకున్నాం. ‘అనాయాసేనమరణం వినాదైన్యేన జీవనం’ అనేది ఓ సూక్తి. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఇవి కోరుకోవాలి. దైన్యం లేకుండా జీవించడం, ఆయాసం లేకుండా మరణించడం. ఇది హిందువు కోరుకునేది. ఆసన, ప్రాణాయామాల ద్వారా జీవించడం. రోగకారకమైన క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే యోగసాధన అవసరం. దాని వల్ల మందులు అవసరం లేని సహజ జీవనం మనం గడపవచ్చు.

అలాగే భక్తితో జీవించడం. ‘జంతూనాం నరజన్మదుర్గభం’ భగవంతుడా! 84 లక్షల జీవరాసుల్లో నన్ను ‘మానవుడు’ అనే ఉన్నత జీవిగా పుట్టించావు. ఈ జన్మ నన్ను నీవైపు తీసుకపోయే గొప్ప మార్గాన్ని అందిస్తుంది. కాబట్టి నీ సహకారంతో ఈ జన్మ సార్థకం చేసుకుంటాను. అని దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇలా హిందువు తన జీవితంలో ప్రతి అంశను, ప్రతి నిమిషాన్ని భగవద్దత్తంగా స్వీకరించి నిరాడంబర జీవితానికి, నిష్కల్మష జీవితానికి పెట్టింది పేరుగా నిలిచాడు. భౌతిక జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని కలగలుపుకొని జీవనం సాఫల్యం చేసుకోవడమే మన ఋషులు మనకు ఇచ్చిన గొప్ప సూత్రం. అదే మన ఆచరణ. మన జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లకు, వైవిధ్యానికి దివ్యఔషధం.. 

***************************************************
ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి 卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ卐
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి