ఆశ్రీతపక్షపాతం, అధికార వ్యామోహం, వారసత్వ రాజకీయం, కుల, మత, రాజకీయం, అవినీతి అనే పంచ లక్షణాలను తిని బలిసిన రాక్షసి ఈనాటి రాజకీయం. ఇందులో తమకనువైన లక్షణాలను మెడలో వేసుకొనే మొండి గద్దలకు సన్యాసులు తిరుగుబాటు చేయడం ‘మతోన్మాదం’లా కన్పిస్తుంది.
సంసారులుగా ఉండి తాము చేయాల్సిన పరోపకారం మరచి, స్వార్థంతో ప్రవర్తిస్తున్న శక్తులకు, సర్వసంగ పరిత్యాగి దేశం కోసం నాలుగడుగులు ముందుకేస్తే అది మతోన్మాదంగా కన్పించడం సబబే! అసలు సన్యాసులు, ఋషులు రాజకీయాలు చేయకూడదా?
శ్రీరాముడికి ధర్మయోగం బోధించి తాత్వికుడిగా మార్చిన వశిష్ఠుడు ఋ షికాదా? శ్రీరామలక్షణులకు యుద్ధ విద్యలు నేర్పించి రాక్షస సంహారం చేయించిన విశ్వామిత్రుడు రాజర్షి, బ్రహ్మర్షి కాదా? భారతజాతికి వేల యేండ్లకు సరిపడే గీతను బోధించి రాజకీయ కురుక్షేత్రం నడిపిన శ్రీకృష్ణుడు ఎవరు? ఆయన దర్శనం కోసం తరతపించిన, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఎందరు లేరు?
సమర్థ రామదాసస్వామి మంత్రదండంతో శివాజీని ఛత్రపతిగా మార్చలేదా? బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠం నవలలోని సన్యాసుల తిరుగుబాటు వందేమాతర ఉద్యమానికి ఊపిరినిచ్చి బ్రిటీషువాళ్లను వెళ్లగొట్టేలా చేయలేదా? దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే పాషండ మతాలను చీల్చి చెండాడడానికి ఆదిశంకరుని అద్వైతం తోడ్పడలేదా? ఇలా చెప్పకుంటూ పోతే భారత చరిత్ర నుండి సన్యాసుల గొప్పతనాన్ని గూర్చి వందల ఉదాహరణలివ్వవచ్చు.
రాజకీయ నాయకులు ఎన్ని రంకులు, బొంకులు ఆడినా తప్పులేదు కాని అవినీతిని గురించి ఓ సన్యాసి ప్రశ్నించడం ఎలా తప్పు? కాషాయం రంగును చూస్తేనే ‘కషాయం’గా భావిస్తున్న లౌకికవాదులకు, మతతత్త్వ వాదులకు వర్గ తత్త్వవాదులకు, స్వార్థ హిందువులకు రాందేవ్ బాబా దీక్ష కంటగింపుగా మారింది. లాడెన్‌ను ‘లాడెన్‌జీ’ అని పిలిచే ఓ నాయకుడు రాందేవ్‌ను ‘మోసగాడు’ అంటూ పదే పదే నొక్కి వక్కాణిస్తున్నాడు. ఈ విషయాలు సమాజం గమనించలేదని, మా గంపగుత్త ఓట్లు మాకు పడితే చాలనుకునే దుర్వ్యాపారులకు బాబా దీక్ష అశనిపాతమే.
చిన్నతనంలోనే గురుకులంలో ప్రవేశించి ఆచార్యులవద్ద శాస్ర్తియంగా షడంగాలు, వేదం, శాస్త్రం అభ్యసించి, ధర్మజీవనం కొరకు జీవితం అర్పించుకొన్న మహనీయుడు బాబా రాందేవ్, కేవలం ఆధ్యాత్మికులు దేశంలో చాలామంది ఉన్నారు. కాని దేశాన్ని ప్రేమించేవారు కొందరే! ఈ దేశంలోని భాషలు, వ్యాపారం, నల్లధనం, ఆరోగ్యం, శాస్త్రాలు, మాంసాహారం, గోహత్యా నిషేధం, మద్యనిషేధం.. ఇలా అనేక అంశాలపై ఆచార్య బాలకృష్ణజీ, శ్రీ రాజీవ్‌దీక్షిత్‌లతో కలిసి గొప్ప అధ్యయనం చేసిన రాందేవ్ ఈ దేశానికి సనాతన వైదిక సంస్కృతిని అందించాలనుకుంటున్నారు.
ధర్మంకోసం దేశంకోసం తపించే మనసున్న సన్యాసులను ఈ జాతి ఎప్పుడూ ఆదరించింది. స్వామి దయానంద సరస్వతి, వివేకానంద స్వామి, ప్రొఫెసర్ రామతీర్థ, కంచి పరమాచార్య, స్వామి చిన్మయానంద జీవితాలే మనకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఇక ముందు కూడా కాషాయ వస్త్రాలు కట్టిన మహనీయుల అడుగుజాడల్లో నడుద్దాం!
*********************************************
*✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి