‘‘రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః పాపేపాపాః సమే సమాః
లోకాస్తమనువర్తంతే యథారాజా తథా ప్రజాః’’

‘‘రాజు ధర్మాత్ముడయితే, ప్రజలు ధర్మిష్టులవుతారు. రాజు పాపి అయితే, ప్రజలూ పాపిష్టులవుతారు. రాజు రెండింటా సమానుడుగా ఉంటే, ప్రజలూ సమానులుగా ఉంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలూ అట్లాగే ఉంటారు’’.

రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములుగాను, దుర్మార్గుడైతే మూర్ఖులుగానూ ఉంటారు అనే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని బసవేశ్వరుడు గొప్ప రాజ ధర్మాలను తన వచనాల్లో ప్రజలకందించాడు. బిజ్జలుని కొలువు కూటమిలో మంత్రిగా పనిచేసిన బసవేశ్వరుడు రాజనీతిని ఆచరించి చూపాడు. రాజు ధర్మం తప్పి ప్రవర్తించినపుడు తాను ధర్మంవైపు నిలబడి, ఉద్యమించి ధృవతారగా నిలిచిపోయాడు.

ఈ రోజు రాజనీతికి నిండా మురికి అంటుకుంది. వారసత్వం, ఆశ్రీత పక్షపాతం, స్వార్థం, పదవీలాలసత్వం, అవినీతి, హింస- ఇవే ఈనాటి రాజనీతి సూత్రాల కొరకంచులు. ఇవి ఆ కాలంలో కూడా ఉండవచ్చు. కానీ బసవేశ్వరుడు వీటన్నిటి జాడ్యాన్ని వదిలించగల ‘లింగాయత’ స్వభావాన్ని ప్రజల హృదయాల్లో నాటుపెట్టాడు.

‘మొన చెడిన తరువాత కత్తి ఏమి చేస్తుంది?
విషం పోయిన తరువాత పాము ఏమి చేస్తుంది?
మాట తప్పిన తరువాత దేవా! బల్లదుడైన భక్తుడు ఏమి చేస్తాడయ్యా!’’
మామూలు మనుషులకు మాట ప్రాణం అయితే మరి రాజుకు ఎలా ఉండాలో మనం ఆలోచించవచ్చు.

‘‘కూడదు కూడదు భక్తునికి పరధనం, పరసతి’’ అంటాడు ఓ చోట. కాబట్టి ‘్భక్తి’ నియమాన్ని సామాన్యుడి నుండి రాజు వరకు అందరూ ఆచరిస్తే, ఈ సూత్రాలను పాటిస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. ఇవాళలాగా లక్షల కోట్లు దోచుకోవడం, దాచుకోవడం సాధ్యం కాదు. డబ్బు సర్వజన సామాన్యమై అందరికీ అందుతుంది.

రాజు ధర్మస్వరూపుడై ఉండాలి. అప్పుడు ప్రజలు వైదేశిక శక్తులనుండి, అంతర్గత అశాంతులనుండి శాంతిగా ఉంటారు. రాజుకు ధర్మాన్ని ప్రబోధించే సరైన గురువులుండాలి. రాజు తాను దేవునికి దాసుడై ఉండాలి. అపుడు పదవి అహంకారం అణగుతుంది. ఎందుకంటే తాను అందరిపై పెత్తనం చేస్తున్నపుడు తాను గొప్ప అనే అహంకారం కలుగుతుంది. అది పోవాలంటే దేవునికే తాను దాసానుదాసోహం అనుకోవాలి. తన పదవి, ధనం, భోగం- అన్నీ భగవంతుని ప్రసాదం అనుకుంటే ప్రజల్ని హింసించే పని చెయ్యడు.

‘‘సైనికుణ్ణి కాదు నేను, ప్రభువు కోసం ప్రాణం ఒడ్డే సేవకుణ్ణి నేనయ్యా!
పనిచెరచి పరుగు తీసే పనివాణ్ణి కాదు నేనయ్యా
విను కూడల సంగమదేవా!’’

పదవి శాశ్వతం కాదు. ఎవ్వరినైనా మృత్యువు వరిస్తుంది. పేద నుండి రాజు వరకు ఎవరైనా యముని ముందు తలవంచాల్సిందే అన్న సత్యం ప్రభువుకు తెలియాలి. అపుడు శరీర భ్రాంతి అతడ్ని వదులుతుంది. ప్రజలు సుఖంగా ఉంటారు.

‘‘రేపు వచ్చేది మాకీనాడే రానీ
నేడు వచ్చేది మాకిప్పుడే రానీ
దానికి బెదిరేదెవరు! దానికి భీతిల్లేదెవరు!
‘జాతస్య మరణం ధ్రువం’ అన్నారు గనుక
మా కూడల సంగమదేవుడు వ్రాసిన రాతను తప్పించడం
హరి బ్రహ్మాదులకూ అలవిగాదు
రాజు ధర్మమార్గంలో నడచి ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాలి. అప్పుడే దేశం క్షేమంగా ఉంటుంది.

*********************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి