‘‘మనోబుధ్ధి రహంకార చిత్తం’’ మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే నాలుగు అంతఃకరణంగా యోగశాస్త్రం నిర్వచించింది. అన్నింటిలో మనిషిని మహాత్మునిగా చేసేది చిత్తం (ఆత్మస్వరూపం) మనస్సు (సంసార రూపంలో) మూర్ఖునిగా చేసేది అహంకారం. సంస్కృతంలో అహం అంటే ‘నేను’ అని అర్థం.
‘నేను’ అనే దుర్మార్గమైన అహంకారం మనిషిని పతనంవైపు తీసుకెళ్తుంది. ప్రతి పనీ నేనే చేస్తాను అనే గర్వం కలిగిస్తుంది. మనిషి ఏమీ చెయ్యకుండా పెరిగేది అహంకారమే. అది మనిషి పతనానికి దారితీస్తుంది. మన తత్త్వశాస్త్ర గ్రంథాలన్నీ ఇంచుమించుగా ఈ అహంకారం తగ్గించే పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. అలాగే మన వేదాంతం అంతా నరుణ్ణి నరోత్తముడిగా తీర్చిదిద్దడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.
ఒక వ్యక్తి ఓ ఇల్లు కొత్తగా నిర్మించాడనుకోండి. ‘‘నేను ఇదిగో ఈ ఇల్లు కష్టపడి నిర్మించాను అని చెప్పుకొంటాడు. అదే ఇంట్లో ఏదో జరుగరానిది జరిగిందనుకోండి- దేవుడే ఇదంతా చేశాడు అంటాం. అంటే మంచి జరిగితే నాది నేను అనే అహంకారం పనిచేస్తుంది. చెడ్డ జరిగితే ఇతరులమీద తోసెయ్యడం మనకు అలవాటు. మనిషి అహంకారం వదలిపెట్టి భగవంతునిపై మమకారం పెంచుకోవాలి. స్వార్థబుద్ధి వదలి పరమాత్మ ప్రార్థన చెయ్యాలి. అప్పుడే సత్యపథం లభిస్తుంది. సరైన గమ్యం దొరుకుతుంది. పరమాత్మను చేరడానికి అడ్డుపడే యోగవిఘ్నాల్లో అహంకారం మొదటిదనే చెప్పాలి. అన్నీ పరమాత్మకే సమర్పితం. ఏదైనా ఆయన చలవతో, చొరవతో జరుగుతుంది అనే మనస్సును స్థిరం చేసుకోవాలి. అహంకారం అనేది వయోభేదం లేకుండా ఎవరినైనా ఆవహిస్తుంది. అహంకారం గొప్ప చదువులు చదువుకున్న వారికైనా, దేశమంతా గర్వించే మనిషికైనా పొడచూపవచ్చు. ఏమీ లేనివారికి కూడా అహంకారం వచ్చేస్తుంది. అందుకే అహం కారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎపుడూ నాకే వచ్చు. నేను చేశాను అనే ధోరణికి దూరంగా ఉండాలి. ఎవరైనా నీవు చాలా గొప్పవానివి అని చెప్పినా దానిదేముంది అంతా భగవంతుని దయ అని చెప్పాలి. మంచి జరిగినా చెడు జరిగినా అంతా భగవంతుని ప్రసాదంగా భావించాలి. కుచేలుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లినపుడు కృష్ణుడు ఎంతో ఆదరంగా ఆహ్వానించాడు. తన దగ్గర ఉన్న అటుకులు ఇవ్వడానికి కుచేలుడు సంశయంచాడు. కాని కృష్ణుడు కుశలం అడుగుతూ సంశయస్తున్న కుచేలుడితో మాటా లడుతూనే అటుకుల సంగతి అడిగి మరీ తీసుకొని తిన్నాడు. కాని, కుచేలుడు కృష్ణునితో తాను వచ్చిన విషయం చెప్పలేదు. దాని గురించి కృష్ణుడు ఏమీ చెప్పలేదు. కాని దారిలో ఇంటికి తిరిగి వెళ్లేటపుడు కృష్ణుడు నాకేమివ్వలేదే అను కొన్నాడు. కాని నేను అడిగితే ఇచ్చేవాడేమో కాని నేను అడగలేదు కదా అనుకొన్నాడు. మళ్లీ నేను అటుకుల గురించి చెప్పకపోయనా తీసు కొన్నాడు కదా మరి ఎందుకు నాకు సంపద ఇవ్వలేదు. బహుశా ఆ సంపద నాకు హానిచేస్తుందని అనుకొన్నాడేమోలే అనుకొని భగవంతుని పైభారం వేసి సంతోషంతో ఇంటికి వెళ్లాడు. అదే అహంకారం లేకపోవడం.

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి