‘‘ఏమంఢీ! నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు’’- ఇది పాశ్చాత్యులను ఉద్దేశించి ఏర్పడ్డ హాస్య సన్నివేశం. నిజమే! వాళ్ళ దేశాల్లో ఒక స్ర్తి తన భాగస్వామితో ఏడు ఏళ్లు కలిసి ఉండదు. ఓ పురుషుడు తన భాగస్వామితో ఏడు ఏళ్లు కలిసి సహజీవనం చేయడు. ఎవ్వరూ ఏడేళ్ళు ఓ చోట స్థిరంగా ఉండరు. ఎవ్వరూ ఏడేళ్ళు ఓ ఉద్యోగం చేయరు. భార్యాభర్తలు అని వారు పిలుచుకోవడంకన్నా ‘భాగస్వామి’ అనే పిలుచుకొంటారు. భాగస్వామి వేద మంత్రాలతో, పెళ్లి పెద్దల సమక్షంలో నిర్ణయం కాదక్కడ. ఎవరికివారే నిర్ణయించుకుంటారు. ఎవరికి వారే విడిపోతారు. ఇది పాశ్చాత్యుల ప్రణయ కలహ పరిణయం. ఈ జాడ్యం మనకూ విస్తరిస్తున్నది. రోజురోజుకూ మన దేశంలో పెరుగుతున్న విడాకులు చూస్తే మన కుటుంబ వ్యవస్థ ఎలా ధ్వంసం అవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లవాడిని తల్లి పెంచుతుంది. ఆ పిల్లవాడికి తల్లే సర్వస్వం. కొన్నాళ్లకు వాడికి పెళ్లవుతుంది. కొంత ప్రేమ భార్యపైకి మళ్లుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులకు సంధికాలం. కొడుకుకు సంతానం కలగగానే తాతా, నాయినమ్మలకు వాడిపై బంధం. కొడుకుపై వున్న ప్రేమ కొంత కొడుకు సంతానంపైకి మరలుతుంది. స్ర్తిలయినా అంతే. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రధాన ఘట్టం. ఉదాహరణకు తల్లిప్రేమను బెజ్జమహాదేవి కథలో పాల్కురికి సోమన వర్ణిస్తూ శివుడికి తల్లి లేకపోవడం ఎలాంటి ఇబ్బంది కల్గించిందో చెబుతూ-
''తల్లి గల్గిన యేల తలజడల్ గట్టు
తల్లి పాములనేల ధరయింపనిచ్చు
తల్లి యున్న విషంబు త్రావనేలిచ్చు
తల్లి బూడిదయేల తాబూయనిచ్చు''
అని వర్ణిస్తాడు. ఇది కుటుంబ వ్యవస్థకు మచ్చుతునక.
మొదట మన సంస్కృతిని ధ్వంసం చేసింది విదేశీ భాష ఆంగ్లం. మన కుటుంబ వ్యవస్థలో ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకంగా పిలుచుకునే వరుస ఉంటుంది. వావి వరుస లేకుండా మనం ఉండలేం. కాని ఆంగ్లేయుల దురాక్రమణవల్ల, వారి సంస్కృతివల్ల స్ర్తి పురుషులు రెండే సంబంధాలతో మిగిలిపోయారు. మగవాళ్లంతా ‘అంకుల్స్’, ఆడవాళ్ళంతా ‘ఆంటీలు’. ఉదయం లేచింది మొదలు పక్కింటి అంకుల్.. రిక్షా అంకుల్.. వాచ్‌మెన్ అంకుల్.. చెత్త ఎత్తే చెత్త అంకుల్.. సాయంత్రం వరకు మనదీ మన పిల్లలదీ ఆంగ్లబుద్ధి. మన పండుగలు పబ్బాలు జరిగితే పూర్వం ఇళ్లు సందడిగా ఉండేవి. అందరూ ఒకరి ఒకరు చెప్పుకొని కష్టసుఖాలు పంచుకొనేవారు. పెళ్లిళ్లు జరిగితే ఒకరి ఇంట్లో మరో కుటుంబ సభ్యులంతా పనిచేసేవారు. దాంతో పెళ్లివారికి అనవసర ఖర్చులు తగ్గేవి. ఇప్పుడు ఫంక్షన్ హాలుకు నేరుగా రావడం, భోజనాలు చేయడం, ఎవరిమానాన వారు వెళ్లిపోవడం. పూర్వం ఇళ్ళలో ఏవైనా కార్యక్రమాలు అయితే అందరూ కూర్చొని భోజనం చేసేవాళ్లు. ఇప్పుడంతా బఫెల్లో మాదిరి ‘బఫే’. పాశ్చాత్య దేశాల్లో కొద్దిమందితో కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్లకు ‘బఫే’ సరిపోయింది. ఏ చిన్న కార్యక్రమం అయినా వందలమంది ఉండే మనం విస్తరి భోజనం వదలిపెట్టడం దురదృష్టం.ఇప్పుడు మంగళసూత్రం మెడలో లేకుండా బజార్లో, కార్యాలయాల్లో కన్పడే స్ర్తిలను చూస్తాం. మెట్టెలు లేకుండా మెలిగే మెలతలనూ చూస్తాం! ఇది మన సంస్కృతి ప్రత్యేకత ఎలా అవుతుందో ఆలోచించాలి. మంగళసూత్రం బరువవుతుందనుకొనే వారు నవమాసాలు మోసి బిడ్డల్ని ఎలా కంటారు?
''మింగ్రెడువాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో''
హలాహల భక్షణంలో ముందు నిలబడ్డ శివుణ్ణి పార్వతి ప్రోత్సహించిన విధం ఈ పద్యంలో తెలుస్తుంది. సమాజానికి మేలు జరుగుతుందంటే భర్తను కూడా త్యాగానికి సిద్ధపడమనే స్ర్తిత్వం మనది. ‘పుత్ర’ శబ్దం స్ర్తి, పురుషులద్దరికీ (సంతానం) ఆధునిక కాలంలో వర్తిస్తుంది. ఇవాళ అన్ని రంగాల్లో ఇద్దరూ రాణిస్తున్నారు. కానీ ఇవేవీ ఆలోచించకుండా మగ సంతానం కోసం ‘భ్రూణహత్యలు’ చేయడం మన చరిత్రకు అవమానం. అలాగే కట్నం కోసం అత్తమామల్ని, భార్యను పీడించి హింసించి, చంపడం మన ఆధునికత ఎలా వెర్రివేషాలేస్తుందో తెలుసుకొనే ఉదాహరణ. చిన్నపుడు ఎంతో గారాబంగా పెంచిన తల్లిదండ్రులను భార్య మాటలు విని వేరుకాపురం పెట్టి బాధపెట్టడం మన చరిత్రకు కళంకం.
ప్రపంచంలోనే ప్రసిద్ధి వహించిన మన కుటుంబ వ్యవస్థను మనం నిలబెట్టుకోవాలి. ఒప్పుడు రామానందసాగర్ తీసిన టీవీ రామాయణం వచ్చిన సందర్భంలో ఉత్తర భారతంలో హిందీ మాట్లాడే 4, 5 రాష్ట్రాల్లో పోలీసు కేసులు తగ్గిపోయాయని ఓ సర్వే చెబుతున్నది. అలాంటిది ఈ రోజు సీరియళ్లలో ఆడవాళ్ళను విలన్లుగా చూపించి, చెడ్డ ఆలోచనలు లేని వాళ్లకు కూడా ఆ మార్గంలో వెళ్ళేందుకు అవకాశం కల్గిస్తున్నవి మన ప్రసార ప్రచార మాధ్యమాలు. ఎంతో గొప్ప ఆప్యాయత, అభిమానంగల ఈ కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకొంటేనే మన దేశానికి గల ‘విశ్వగురువు’ వసుధైక కుటుంబం అన్న పేరు స్థిరంగా ఉంటుంది.

*************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి