ఈ రోజుల్లో ఛాలామంది దుఃఖంతో కూడిన ముఖంతో, కన్నుల్లో దీనత్వంతో కన్పిస్తారు. కొందరివి ఆర్థిక బాధలు, పేదరికపు సమస్యలు అయితే, చాలామంది సమస్యలు హృదయ దౌర్బల్యానికి సంబంధించినవే. ఉరుకులు పరుగుల జీతం ఈ రోజుల్లో చిన్నపిల్లవాని దగ్గరనుండి వృద్ధుల వరకు ఒకటే వింత. ఈ చిన్న కుర్రాన్ని చూస్తే...

వాడు చదివేది ఎల్‌కేజి
వాడి మెడకు ట్వంటీకేజి,
వాడికో టిఫిన్ ప్యాకేజి,
వాడి వాటర్ డబ్బా లీకేజి,
వాడి చదువే ఓ పెద్ద డ్రైనేజీ..

అన్న హాస్య చమత్కారం గురొస్తుంది. యువకులను చదువు.. కెరీర్, మహిళలకు ఇల్లు.. భర్త.. పిల్లలు.. అత్త.. మామగారు.. ఆఫీసు.. ఉద్యోగం.. రైతులకు.. కరెంటు.. విత్తనాలు.. ఎరువులు.. వృద్ధులకు రోగాలు.. నొప్పులు.. ఇలా ఎవ్వరిని చూసినా సమస్యలు.. దుఃఖం ఆవరించిన హిమాలయ పర్వతాలను మోస్తున్న బాధ. దుఃఖ నివారణకు ఋషులు అష్టాంగయోగం చెబితే, బుద్ధుడు అష్టాంగ మార్గం చెప్పాడు. ధ్యానం.. యోగం, తత్త్వం.. సమాధి ఎన్ని ఔషధాలున్నా మనల్ని చింతలు మాత్రం వదలడంలేదు. చితి-చింతకు మధ్య సున్నా మాత్రమే తేడా. చితి కట్టెలతో మనిషి శరీరాన్ని దహిస్తుంది. చింత ఎలాంటి కట్టెలు లేకుండా శరీరాన్ని, మనసును కాల్చి బూడిద చేస్తుంది. జీవితానికి సరైన ప్రణాళిక మార్గదర్శనం లేకపోతే చింతనే దుఃఖరూపం పొందుతుం ది. దుఃఖం ఎక్కడనుండి వస్తుందో తెలిస్తే దాన్నుండి తప్పించుకోవడం తేలిక.

ఓ గ్రామంలో ఒకరు పాత ఇల్లు ఉండగానే క్రొత్త ఇల్లు నిర్మించుకొన్నాడు. పాత ఇంట్లోని సామాన్లు.. వస్తువులు.. అన్నీ క్రొత్త ఇంటికి మార్చుకొన్నాడు. కాని పాత ఇంట్లోని నిలువుటద్దం మాత్రం ద్వారం కొలతకన్నా పెద్దదిగా ఉంది. క్రొత్త ఇంట్లోకి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అలా వదలిపెట్టడం యజమానికి ఇష్టం లేదు. కాని ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు. నలుగురు తెలివైన గ్రామ పెద్దలను కూర్చోబెట్టి సలహా తీసుకొందామని పిలిపించాడు. అందులో ఒకరు అద్దం వదిలేయమన్నాడు. మరొకరు అద్దాన్ని పగులగొట్టమన్నారు. ఇంకొకరు ద్వారమే పగులగొట్టమన్నారు. చివరి వ్యక్తి మాత్రం కొంచెం బుద్ధితో ఆలోచించి ‘అసలు అద్దం బిగించినపుడు లోపలకు ఎలా తీసుకెళ్లారో ఆలోచించండి.. బయటకు తీసుకొచ్చే మార్గం అదే తెలుస్తుంది’ అన్నాడు. వేదాంతులు దుఃఖం విషయం వస్తే ఇలాంటి సలహానే ఇస్తుంటారు. అసలు దుఃఖం ఎలా మనలోపలకి ప్రవేశించిందో తెలిస్తే, దాన్ని బయటకు పంపడం తేలికవుతుంది అంటారు.

కొందరు సంసారం దుఃఖ కారణం అనీ, మరికొందరు భార్య ప్రతిబంధకం అనీ చెప్తుంటారు. సృష్టి నడవాలంటే సంసారం లేకుండా ఎలా? భార్య భర్తకు దుఃఖం అయితే భార్య వేదాంతిగా మారితే ఆమెకు భర్త కూడా దుఃఖమే కదా! ఇక్కడ స్త్రీ, పురుష లింగభేద నిష్పత్తి ప్రధానం కాదు- ‘జీవుడు’ ప్రధానం అన్నది ఆలోచించాలి. స్త్రీని స్త్రీ అనే శారీరక దృష్టితో చూసి దుఃఖ కారణం చెప్పొచ్చు. కాని అది సరైనది కాదు. విత్తనం అమ్మ, ఆమె లేకపోతే సృష్టి అనే మహావృక్షం బోన్సాయ్ మొక్కగా మారిపోతుంది. ఆమె భూమాత రూపంలో ప్రపంచానికి అన్నం పెడుతుంది. నదిగా మారి దాహార్తిని తీరుస్తుంది. ఆకాశంలో విద్యుల్లతగా మారి మన జీవితాల్లో తేజస్సు నింపుతుంది. గాలిగా మారి మనకు శ్వాసనిస్తుంది. అగ్నిగా మారి అన్నాదులను శరీరానికి అందిస్తుంది. ఆమె పంచభూత స్వరూపం. స్త్త్రీ  మూర్తి నిజంగా శ్రీ మూర్తియే.
ధనం దుఃఖానికి మూలం అనేది మనకు తెలుసు. ధనమొక ఆకర్షణ. ‘జేబులో డబ్బు మనిషికి పట్టిన గబ్బు’ అన్నమాట ఊరికే రాలేదు. దేశాన్ని పాలించే రాజు దారివెంట వెళ్తుంటే కన్నంలో ఉన్న కప్ప బయటకు వచ్చి రాజుగారిపై అహంకారంతో కాలు లేపి తన్నబోయిందట. అంతకుముందురోజు అటునుంచి వెళ్తున్న ఓ వ్యక్తి జేబునుండి పైసా జారిపడి దొర్లుకుంటూ కప్ప కన్నంలోకి వెళ్లిందట. డబ్బు స్పర్శ తగిలిన కప్పకు రాజునే కాలెత్తి తన్నాలనే అహంకారం వచ్చిందని శ్రీరామకృష్ణ పరమహంస డబ్బు గురించి ఉదాహరణ చెప్పారు. పదవులు మనిషికి దుఃఖాన్ని కల్గిస్తాయి. అది ముళ్ల కిరీటం లాంటిది. అది కిరీటమే అయినా ముళ్లు గుచ్చుకోవడం ఖాయం. పదవిని పదిమంది కొరకు కాకుండా తనమంది కొరకు ఉపయోగిస్తే దుఃఖం తప్పదు.
కాబట్టి దుఃఖం అనేక కారణాలవల్ల మనసులో ప్రవేశించినా దాన్ని బయటకు పంపించే మార్గం వెతకాలి.బుద్ధిమంతుడగు వివేకశీలుడు వాటియందు రమించడు. అన్న గీతావాక్యాన్ని గుర్తు చేసుకోవాలి.

*********************************************
*✍డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి