సర్వేచ సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దు:ఖ భాగ్‌భవేత్॥
లోకంలోని అందరూ సుఖంగా ఉందురుగాక! అందరూ రోగములు లేనివారై ఉందురుగాక! అందరూ శుభములనే చూచెదరుగాక! ఏ ఒక్కరును దు:ఖము పొందకుండెదరుగాక! అని పరమాత్మను ప్రార్థించిన హిందూజాతి ‘కులం ఉచ్చులో ఎందుకు చిక్కుకుంది? ఈ రోజు వరకు హిందువుల అనైక్యతకు కారణమైన ‘కులరాక్షసి’ని పెంచిపోషిస్తున్నది ఎవరు అనేది ప్రతిహిందువు గ్రహించాలి. అయితే ఇటీవల ‘పరిశోధనలు, ఆలోచనలు’ ఓ రహస్యాన్ని శోధించాయి. అది ప్రతి హైందవ బుద్ధిజీవిని ఆలోచింపజేసేటట్లుగా ఉంది.
హైందవ ధర్మాన్ని కుణ్ణంగా అధ్యయనం చేసినవారు, హిందుత్వాన్ని ఆచరించేవారు ఎవరూ అస్పృశ్యత, అంటరానితనం, ఆలయ ప్రవేశ నిషేధం- అనేవి ఆచరించరు? కేవలం కులస్పృహతో జీవిస్తూ ఎలాంటి తాత్విక, సామాజిక చింతనలేని వ్యక్తులే ‘అస్పృశ్యత’ పాటిస్తున్నారు. అది రెండు గ్లాసు పద్ధతి కావచ్చు; ఆలయ ప్రవేశం నిషేధం కావచ్చు. ఏదైనా హిందుత్వానికి వ్యతిరేకమే. హిందుత్వంలోని మూలసిద్ధాంతాలను అర్థం చేసుకొని వ్యక్తులు హిందూధర్మ వ్యతిరేక పద్ధతులను ఆచరించడం గర్హనీయం. ముఖ్యంగా మనిషికి ఆరాధన కోసమే మతం ఊతమిస్తుంది. హిందువుల ముఖ్య ఆరాధన కేంద్రం ఆలయం.
అలాంటి ఆలయానికి హిందువులంతా అన్ని వర్గాలవారు కర్తలే. ఆలయంలోని దేవుడు అందరికీ సమానుడే. పంచభూతాలు భగవంతుని సృష్టి. వాటి ద్వారానే ప్రపంచంనడుస్తున్నది ఇవి సృష్టిలోని మానవులకంతా సమానం. వాటి లక్షణాలు-అనుభవాలు ప్రతివారికి సమానం. మరి భగవంతుడి సృష్టిలోని పంచభూతాలే అందరికి సమానమైనపుడు, భగవంతుడు ఎందుకు అందరివాడు కాకుండా పోతాడు? ఆయన నివసించే ఆలయం ఎందుకు అందరి స్వంతం కాకూడదు ఇది ఈరోజు మన సమాజంలోనికి తీసుకెళ్లాల్సిన సందేశం...
ఆలయం ఎవరి కోసం...
శ్రుతి స్మృతి విధానేన పూజాకార్యయుగత్రయే
ఆగమోక్త విధానేన కతాదేవాన్ యజేత్సుధీ: ॥
శ్రుతి, స్మృతి విహితాలైన పూజావిధులు కృత, త్రేత, ద్వాపరయుగాలకు పరిమితమైనవి. ఇక కలియుగంలో ఆగమోక్త పూజావిధితో బుద్ధిమంతులు దేవుణ్ణి అర్చించాలని ఆగమాలు తెలియజేస్తున్నాయి.ఇక్కడ ఫలానా ‘కులం’ వాళ్లు మాత్రమే దేవుణ్ణి అర్చించాలని లేదు. భారతీయ ఋషులు విద్యుత్తు శబ్దరూపమనీ, దానికి పునాదిధ్వని అనీ, లోతైన చింతనతో చెప్పారు. అందుకే శబ్దబ్రహ్మ అని పరమాత్మను పిలిచారు. గోపురం క్రింద కూర్చొని నిజమైన ధ్వని ‘ఓం’ అని ఉచ్చరించినపుడు దేవాలయం మాయమై శబ్ద బ్రహ్మ అయిన పరమాత్మ మిగులుతాడు; అలాంటి శబ్దబ్రహ్మను తెలుసుకొనే ఏకైక పరిశోధనాకేంద్రము ఆలయం. అలాంటి ఆలయోంకి ప్రవేశించే హక్కు ప్రతి హిందువుకు ఉంది. ఆలయం సామాజిక, తాత్విక, ఆధ్యాత్మిక, సేవలకు కేంద్రస్థానం పై సేవలు అందించాలనుకొన్న అందుకోవాలనుకొన్న ప్రతి హిందువు కోసం కోవెల వెలసింది.
ఈ భేదభావాలేమిటి ?
“యామాం వాచం కల్యాణీ మావదాని జనేభ్య:
బ్రహ్మరాజన్యాభ్యాగ్‌ం శూద్రాయ చార్యాయచ
స్వాయచారణాయ”
(య) ఎట్లునేను (జనేభ్య:) మనుషులందరికొరకు (ఇమామ్) ఈ (కల్యాణీమ్) కల్యాణం అనగా సంసారసుఖం, ముక్తి సుఖం ఇచ్చే ఋగ్వేదాది చతుర్వేదవాణిని ఉపదేశించుచున్నానో... అంటూ యజుర్వేదం మం త్రంలో ద్రష్టలు ఉపదేశిస్తున్నారు. కానీ... ఈ సత్వాన్ని కొందరు మధ్యయుగాల మనస్తత్వంగల కుల తత్వవాదులు విస్మరించి దేవుణ్ణి దేవతత్వాన్ని మన సమాజాని కొన్ని వర్గాలకు దూరం చేశారు. ఇటీవలికాలంలోఇతర మతాలకు కొమ్ముగాసే కుహనా లౌకికవాదులు క్రింది మంత్రాన్ని చూపి అర్థం లేని భాష్యం చెబుతున్నారు. “ప్రజా పతయో బ్రాహ్మణోస్యముఖమాసీత్. బాహూరాజన్యకృత. ఊరూ తదస్యయద్వుశ్యై: పద్భ్యాగ్ శూద్రో అజాయత: బ్రహ్మణులు ముఖం నుండి, బాహువులనుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు జన్మించారని ఈ మంత్ర భావం.. శూద్రులు పాదాలనుండి జన్మిస్తారా? అంటూ సమాజంలో లేని కలతలు సృష్టిస్తున్నారు.
కొన్ని వర్గాలను హిందువుల నుండి దూరం చేయాలని చూస్తున్నారు. ఈ మంత్రార్థం అలాంటి మూఢులకు విశ్లేషించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏవ్యక్తి గర్భం నుండి కాకుండా శరీరపై భాగం నుండి జన్మించరు. మనుషులేమీ చెట్లకు పిందెలు, కాయలు కాసినట్లు శరీర అవయవాలకు పుట్టరు, ఉదాహరణకు అర్థనారీశ్వర స్వరూపంలో శివపార్వతులు కలిసి ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసి స్త్రీ, పురుషులు ఎక్కడైనా ఒకరికొరకు అతుక్కొని ఉంటారా? అని అజ్ఞానాంధకారంతో అడిగితే వాళ్ల జ్ఞానపరిమితి అంతే అనుకోవాలి ఎక్స్, వై క్రోమోజోములను సూచించి డిఎన్‌ఎ నిర్మాణం ఎలా చెప్తామో నారీ, ఈశ్వరులిద్దరూ స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తికి ప్రతీకలుగా చెప్పే దృశ్యమది.
ఈ తత్త్వం అర్థం చేయించడానికే అలాంటి ఏర్పాటు చేశారు మన ఋషులు. ఇక్కడ కూడా విరాట్పురుషుడు సమాజానికి ప్రతీక. ఆయన తలభాగం (జ్ఞానభాగం) బ్రాహ్మణులు, బాహువులు (శక్తి భాగం) క్షత్రియులు, తొండలు (సమాజభారం మోసే ఆర్థికస్థానం) వైశ్యులు, (సేవాదృష్టి అందరిని కాపాడుటకు సేవ చేసేవి) పాదాలు శూద్రులు. అనేవి ప్రతీకలు. ఈ విషయాన్ని మరుగుపరచి వ్యక్తులకు, కులాలకు ఆపాదించి సమాజంలో అంతరాలు సృష్టించడం ఎంతవరకు సబబు? అలాగే భగవద్గీతో కృష్ణుడు చెప్పిన “చాతుర్వర్ణం మాయాసృష్టం” అనే మాటను పట్టుకొని హైందవ సమాజం నాలుగు వర్ణాలుగా విభజించబడెనని కృష్ణుడే చెప్పాడని వాదిస్తుంటారు.
అదేశ్లోకంలో “గుణకర్మ విభాగశః” గుణాన్ని, కర్మలను ఆధారం చేసుకొని విభజించానని చెప్పిన విషయాన్ని విస్మరిస్తారు. పూర్వం మనుషులు నీతి-నిజాయితీలే పునాదులు కల్గినవారు ముఖ్యంగా హిందూవ్యవస్థలో వీటికి పెద్ద పీఠం వేశారు. ఒక కులానికి ఇంకో కులంవారు ‘సేవ’ చేయడం పరమార్థంగా భావించారు; వారికి అలాంటి తాత్విక పునాది ఉండేది. ‘భజ్‌సేవాయాం’ భక్తి అంటే సేవ అనే దృష్టి హిందువుల నరనరాల్లో జీర్ణించుకొని ఉంది. ఆ దృష్టి కులాన్ని సేవామార్గంగా మలచింది. అలాగే ‘కులం సామాజిక అనుసంధానం’గా ఉండేది.
****************************************************
ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ卐
ॐ విజయక్రాంతి ॐ 卐 బుధవారం, మే 16, 2018 ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి