‘‘విజయం ముంగిట బొక్క బోర్లాపడ్డ బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచి సంతృప్తిచెందింది’’- ఇది నిన్నటి కర్నాటక ప్రజల తీర్పుపై తెలుగునాట ఓ మీడియా సంస్థ వ్యాఖ్యానం. కన్నడనాట ఫలితాలు వెలువడిన రోజే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో పైవంతెన కూలిపోయి 18 మంది దుర్మరణం చెందారు. అలాగే, మన తెలుగు ప్రజల ఐకాన్ చంద్రబాబు సామ్రాజ్యంలోని గోదావరి నదిలో మునిగిన పడవ ప్రమాదంలో 45 మంది గల్లంతు అయినట్లు వార్తలొచ్చాయి. ఇవేవీ తెలుగు మీడియాకు బొత్తిగా పట్టలేదు. తెలుగు మీడియా కర్నాటక ఎన్నికల ఫలితాలపెనే దృష్టి పెట్టింది.

భాజపాకు 80 సీట్లకు మించి రావని జెడిఎస్ ముఖ్యపాత్ర పోషిస్తుందని, ప్రధాని మోదీ దేవెగౌడను పొగడడం అందుకే అని 15 రోజుల నుండి విశే్లషిస్తున్న మన చానళ్ల జోస్యాలు తలక్రిందులయ్యాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మధ్యాహ్నం 12 గంటల వరకు భాజపాకు 113కుపైగా సీట్లు వస్తున్నాయని చెప్పగానే మన తెలుగు మీడియా ఆస్థాన వ్యాఖ్యాతలు ‘అసలు ఇది గెలుపే కాదు’ అని ఒకరు, ‘అయినా ఏదో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని’ మరొకరు విశే్లషణలు మొదలుపెట్టరు. విచిత్రం ఏమిటంటే నిన్నటి మొన్నటివరకు సిద్ధ రామయ్య గొప్ప సిద్ధాంతకర్త, సంస్కర్త, వ్యూహకర్త అని మాట్లాడిన ఈ విశే్లషకులే మధ్యాహ్నం సరికి నెపం అంతా సిద్ధూపై నెట్టేసి రాహుల్ గాంధీని సేఫ్ సైడ్‌లో ఉంచారు. ముందునుంచి కూడా నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఓ అలవాటు ఉంది. ఏదైనా మంచి జరిగితే అది గాంధీ-నెహ్రూ కుటుంబాల త్యాగంగా, చెడు జరిగితే ముందున్న కీలు, తోలుబొమ్మల తప్పిదంగా చెప్పేస్తుంటారు. ఈ లక్షణం ఇటీవల తెలుగు చాళ్లలో విశే్లషకులు, యాంకర్లు బాగా ఒంట బట్టించుకున్నారు.

చంద్రబాబు భాజపాతో తెగతెంపులు చేసుకొన్నాక కేంద్రంపై మేధోయుద్ధం ప్రారంభమైంది. ‘ప్రపంచం బాధ చంద్రబాబు బాధ, చంద్రమాబు బాధ ప్రపంచం బాధ’ అన్నట్లుగా భాజపాను, ప్రధానిని వీలైనంతమేరకు బోనులో నిలబెట్టే పనికి మీడియా వర్గాలు పూనుకున్నాయి. ఎన్నికలకు ముందు దేవెగౌడను, జెడియస్ బండబూతులు తిట్టిన కాంగ్రెస్- ఫలితాలు వచ్చాక కుమారస్వామి ముందు సాగిలబడితే అది ప్రజాస్వామ్య పరిరక్షణ! మాజీ ప్రధాని అని, వయసులో పెద్దవాడని దేవెగౌడను మోదీ పొగిడితే అందులో భాజపా-జెడియస్‌కు ముందే ఒప్పందం జరిగిందని నిందించారు.
అసలు కర్ణాటక రాష్ట్రం నిండా తెలుగువాళ్లే ఉన్నట్లు, అక్కడి తెలుగు ప్రజలకు కొందరు అధికార ప్రతినిధుల్లా పిలుపు ఇవ్వడం మొదలుపెట్టారు. నిజానికి బళ్లారి.. దాని చుట్టుప్రక్కల ప్రాంతంలోని తెలుగు ప్రజలపై రాయలసీమ ప్రభావం ఉంటుంది. బెంగళూరు, ఇంకా తదితర పెద్ద పట్టణాల్లో ఉద్యోగం కోసం వెళ్లిన అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు కొందరు ఉన్నారు. వారిలో ఎంతమందికి ఓటు హక్కు ఉందో తెలియదు. కానీ మన తెలుగు ప్రాంత నాయకులు కన్నడ ప్రాంత రాజకీయాలను శాసించేటట్లు బీరాలు పలికారు. ఎన్జీవో నేతలు, స్వయం ప్రకటిత మే ధావులు, నటులను కన్నడ ప్రాంతంలోకి పంపించింది ఎవరు? ఇక హైదరాబాదు-కర్ణాటకకు ఒకప్పుడు నిజాం స్టేట్‌లో భాగం. ఇక్కడ మతపరమైన భావోద్వేగాలు ఎక్కువ. ముస్లింల సంఖ్య కూడా ఎక్కువ. అది ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. కానీ ఈ ప్రాంతంలో కూడా భాజపా తన సత్తాను చాటింది. కానీ విశే్లషకులు మాత్రం పక్షవాతం వచ్చినట్లు పక్షపాత ధోరణితో కువ్యాఖ్యానం మొదలుపెట్టారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నట్టేట ముంచిన రాహుల్ నాయకత్వాన్ని ఒక్క వ్యాఖ్యాత కూడా ప్రశ్నించడు! గత అసెంబ్లీలో 122 సీట్లున్న కాంగ్రెస్ 78కి పడిపోయింది. గతంలో 40 సీట్లున్న జెడిఎస్ 38కి దిగజారింది. కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఓడిన మంత్రుల్లో 12 మందిని భాజపా ఓడించింది. క్యాబినెట్‌లోని సగానికిపైగా మంత్రులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. స్టార్ కాంపెయినర్ సిద్ధ రామయ్య జెడిఎస్ అభ్యర్థి టి.జి.దేవెగౌడ చేతిలో 36,042 ఓట్ల తేడాతో చాముండేశ్వరిలో చిత్తుగా పరాజయం పాలయ్యారు. గెలిచిన బాదామిలో 1696 స్వల్ప మెజారిటీతో గట్టెక్కి బయటపడ్డాడు. వీటిని గురించి పెదవయినా కదపని మన టీకాతాత్పర్యకర్తలు గెలిపించిన మోదీ, అమిత్‌షాలను దుర్మార్గులుగా చిత్రీకరించారు.
మోదీని వీలైనంత తెగనాడడం వీళ్ల లక్ష్యం. గతంలో కరుణానిధిని మర్యాద పూర్వకంగా కలిసినా, దేవగౌడను గౌరవించినా, మాణిక్ సర్కార్‌కు, మూలాయంకు, శరద్‌పవార్‌కు నమస్కారం చేసినా అవన్నీ వీళ్ల దృష్టిలో నేరాలే. ప్రతిదాంట్లో రాజకీయ ప్రయోజనం వెతికే వీళ్లకు ఆ పెద్దల వల్ల జరిగన ప్రయోజనమేంటో చెప్పమంటే నోళ్లు వెల్లబెడతారు. నిజానికి సిద్ధరామయ్య గతంలో దేవెగౌడ పాఠశాలనుండే కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అతనికి కుటుంబం ఉండడంవల్ల జెడియస్‌లో రాటుదేలాడు. ఈరోజు జెడియస్ ఇంతలా బలహీనపడడానికి సిద్ధ రామయ్యనే కారకుడు. ఇపుడు దక్షిణాదిలో కాంగ్రెస్ ప్రాబల్యం వున్న పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉత్సాహంతో సిద్ధరామయ్య బాల్య చేష్టలన్నీ   కాంగ్రెస్ అధిష్ఠానం గుడ్డిగా సమర్థిస్తూ వస్తోంది. కన్నడ ప్రాంతానికి ప్రత్యేక పతాకం కావాలని కేంద్రాన్ని అడిగితే భాజపా ఇరకాటంలో పడుతుందని కాంగ్రెస్ జబ్బలు చరచింది. మొన్నటికి మొన్న లింగాయత్ కులస్థుడైన యెడ్యురప్పను బలిపీఠం ఎక్కించాలని లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పించాలని తీర్మానం కేంద్రానికి పంపి మోదీని దోషిని చేయాలనుకొన్నాడు. ఈ పరిస్థితులను మన తెలుగు మాధ్యమాలు గోరంతలు కొండంతలు చేసి సిద్ధూను మోదీకి సమ ఉజ్జీగా భ్రమింపజేశాయి. ఈ విషయాలను తెలుగు నాట మనం విన్నపుడు, చూసినపుడు నిజంగా భాజపా పరిస్థితి అంత అగమ్యగోచరంగా ఉం దా? అనిపించేది. గత 15 రోజుల క్రింద మోదీ కర్ణాటకకు రాగానే సీను మారిపోయింది. 21 రోడ్ షోలతో 219 నియోజకవర్గాల్లో మోదీ తన పదునైన విమర్శలతో సిద్ధ రామయ్యను, రాహుల్‌ను, కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశాడు. టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను కన్నడ ప్రజలపై రుద్దిన కాంగ్రెస్ ప్రభుత్వంపై చారిత్రక దృష్టితో విరుచుకుపడితే, సిద్ధరామయ్య, అతని మంత్రుల అవినీతిని, అతి చేష్టలను సభికులచేతనే తప్పు అనిపించాడు.
ముఖ్యంగా రాహుల్ మోదీని దుమ్ము దులపడానికి తనకు 15 నిమిషాల సమయం కావాలని చెప్పిన విషయాన్ని తిరిగేసి తన వాగ్బాణాలను రాహుల్‌పైనే సంధించాడు. అక్కడనుండే రాహుల్ ప్రచారంలో వెనుకబడ్డాడు. మరోవైపు అమిత్ షా 15 రోజులు అక్కడేకూర్చొని వ్యూహ, ప్రతివ్యూహాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఎందరో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్య చేయబడ్డారు. ఆ ప్రాంతాల్లో కూడా భాజపా విజయం పొందింది. 2013లో 40 స్థానాలున్న భాజపా ఇపుడు 104 స్థానాలను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇంత తతంగం జరిగితే మన ప్రసార మాధ్యమాల కుల కుత్సిత వ్యాఖ్యాతలు గెలిచినవాళ్లను గెలుపే కాదంటారు. పైగా మొదటిసారి డబ్బు వినియోగం ఈ ఎన్నికల్లోనే జరిగిందన్నట్లు మన ప్రచార మాధ్యమాలు ఊదరగొడుతుంటే ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం.
తెలుగు ప్రసార మాధ్యమాలు ఈ ఎన్నికల ఫలితాలను, అనంతరం జరిగిన పరిణామాలను మోదీ, షాలను దుష్ప్రచారం చేయడానికే ఎక్కువ వినియోగించుకొన్నారు. తెలంగాణ ఏర్పడి మంత్రులు, శాసనసభ్యులు ప్రమాణ స్వీకారంపై రెండు చానళ్లు ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తే కెసిఆర్ తీసుకున్న కఠిన నిర్ణయం భాజపా వర్గాలు తీసుకోకపోవడం ఈ వ్యాఖ్యానాలకు కారణం!

ఓ ప్రముఖ చానల్ ప్రియాంక గాంధీ సలహా మేరకు సోనియా గాంధీ చక్రం తిప్పిందని అందువల్లనే బిజెపి ఇరకాటంలో పడిందని వ్యాఖ్యానించింది. అలా అయితే ఫలితాల రోజు సాయంత్రం ఢిల్లీ భాజపా కార్యాలయంలో అమిత్‌షా, మోదీలు నింపాదిగా విజయోత్సవ ర్యాలీ ఎందుకు పెడతారు? ఇరకాటంలో పడినట్లు వాళ్ల ముఖంలో ఎక్కడా కనపడలేదు. పైగా ప్రధాని తన ఉపన్యాసంలో ఈ ఎన్నికల ముందునుండి తమపై ఎలా దుష్ప్రచారం చేసారో చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా తెదేపా-్భజపా విడిపోయాక దక్షిణ భారతదేశంపై ఉత్తరాదివారి దాడి అని జరుగుతున్న ప్రచారానికి ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు. ‘‘హిందీ ఉత్తరాది భాష అంటున్నారు కానీ గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా, పంజాబ్‌లలో తమ కార్యకలాపాలు మాతృభాషలోనే జరుగుతున్నాయి’’ అని ఈ విషయాన్ని ప్రధాని తేల్చేశారు. అయినా ఇండస్ట్రీలో నలభై ఏళ్ళ అనుభవం వున్నవాళ్లు, రేపు ఎక్కువ ఎంపీలను గెలిచి కేంద్రంలో చక్రాలు తిప్పేవాళ్లు నోళ్లు పెద్దవిగా చేసి, తమకు అనుగుణంగా టీవీ యాంకర్ల చేత ప్రశ్నలను వేయించుకొని దేశ వ్యవస్థలను టార్గెట్ చేస్తున్నారు.
ప్రధాని పదవి అనేది రాజ్యాంగబద్ధమైంది. అదేదో దొంగతనంగా తెచ్చుకొని పాలిస్తున్నట్లు నోటికి ఎంతవస్తే అంతగా మాట్లాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి గగ్గోలు పెడుతున్న వీళ్లంతా తాము మద్దతిచ్చి నడిపించిన ప్రభుత్వాల్లో ఇక్కడి రాష్ట్రాలకు ఎంతలా నిధులు తెచ్చారో శే్వతపత్రం ఇవ్వగలరా? అర్థరాత్రి వెళ్లి గవర్నర్ యెడ్యురప్పను ప్రమాణ స్వీకారానికి రమ్మన్నాడని కోర్టు తలుపు తట్టారు. ఇప్పటికే సుప్రీంకోర్టును, సిబిఐని, ఈడిని బోనులో నిలబెట్టారు. ఇపుడు గవర్నర్ల వ్యవస్థపైనే తమ యుద్ధం అంటున్నారు. నెహ్రూ నుండి రాజీవ్ వరకు ఎన్నిసార్లు గవర్నర్లు వివిధ రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన విధించారో లెక్కతేల్చండి. 1984లో రామ్‌లాల్‌ను ఉపయోగించి ఎన్టీఆర్‌ను దెబ్బతీసింది ఎవరు? అంతెందుకు? నీతికి ట్రేడ్‌మార్క్‌గా భావించే చంద్రబాబు ఏ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్‌ను గద్దెదించి అధికారంలోకి వచ్చాడు? వ్యవస్థలను ధ్వంసం చేయడంలో అందరికీ కాంగ్రెస్ పార్టీ కదా ఆదర్శం. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అని ఇపుడు అందరూ అనుసరిస్తారు. ఈ విషయాల్లో సర్కారియా కమిషన్ వందల పేజీల రిపోర్టు ఇచ్చింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసు, మొన్న గోవా ప్రభుత్వ ఏర్పాటు చేసిన సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన నిర్ణయాలు ఎవరికివారు తమకు అనుగుణంగా అన్వయించుకొంటున్నారు. ఇదంతా వదలిపెట్టి తెలుగు నాట మాధ్యమాలు వక్రదృష్టితో కువ్యాఖ్యానాలు చేస్తున్నాయి.

78 సీట్లున్న కాంగ్రెస్ నిన్నటివరకూ దుమ్మెత్తిపోయిన జెడియస్‌కు మద్దతుగా నిలవడం నైతిక విలువలకు తార్కాణమా? 38 సీట్లు ఉన్న జెడియెస్ తగుదునమ్మా అని ముఖ్యమంత్రి పదవిపై కూర్చోవడానికి సిద్ధమైతే అది రాజనీతా? కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? అని తెలుసుకోకుండా ఇతరులను నిందించడమే విశే్లషణ అనుకుంటే దానీ వెనుక ఎవరున్నారో తేటతెల్లం చేయొచ్చు. ఫలితాల రోజు సాయంత్రం- ప్రధాని మాటల్లో, రామ్‌మాధవ్ చేసిన ట్వీట్లో ఒకే ధ్వని వుంది. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు భాజపా రథం అడుగులు వేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అది ఇక్కడి పార్టీలకు, మాధ్యమాలకు ఎందుకు కంటగింపుగా వుంది? అందుకే ఈ వక్రీకరణలు, కువ్యాఖ్యనాలు! రాజకీయాలు చారిటీ కోసం కాదు, అవి ఎప్పుడూ ఉడుకుతున్న రక్తం లాంటివే అని గుర్తించాలి!

*************************************************
✍✍- డాక్టర్. పి. భాస్కర యోగి 
Published Andhrabhoomi :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి