నూరు ఫనులున్నా భోజనం చేయాలి. వేయి పనులున్నా స్నానం చేయాలి. లక్ష పనులున్నా దానం చేయాలి. కోటి పనులున్నా హరిని స్మరించాలని శ్లోకార్థం.

కాని ఈ శోకార్థం చదివిన వెంటనే ఈ పనులన్నీ ఎప్పుడు ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి కొందరు పెద్దలు చక్కని అన్వయం చేసి, జవాబు చెప్పారు. నూరు పనులున్నా మధ్యాహ్నం భోజనం చేయాలి. వేయి పనులున్నా సంధ్యాకాలంలో స్నానం చేయాలి. లక్ష పనులున్నా రోజుకు ఒకసారైనా దానగుణం చూపించాలి. కోటి పనులున్నా ఉభయ సంధ్యల్లో భగవంతుని స్మరణ చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఆహారశుద్ధే మనిషికి సత్త్వశుద్ధిని కలుగజేస్తుంది. అలాంటి శుద్ధ సాత్త్విక భోజనాన్ని సాధకుడు గ్రహించాలి. కర్షకుడి కష్టంతో వచ్చిన భోజనం శుద్ధ సాత్వికం, ఉత్తమం. ఇందులో ఎవరినీ మోసం చేయడంలేదు. భూమాత నుండి గింజకు పది గింజలు ఉత్పత్తి చేసి, వాటిని గ్రహించే ఉత్తమోత్తమ లక్షణం ఉంది. మధ్యమం వ్యాపారి ఇచ్చిన భోజనం. చందాభోజనం, వ్యభిచారం, మోసంవల్ల సంపాదించిన భోజనం గ్రహించకూడదు. భోజనాన్ని సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా, చక్కని మనస్సుగల వ్యక్తులతోనే వండించుకొని తినాలి. భోజనం కడుపునిండా తినకుండా కడుపులో రెండు భాగాలు అన్నం ఒక భాగం నీరు, ఒక భాగం ఖాళీగా ఉంచాలి. తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తినే పదార్థం మధురంగా, వేడిగా, ఎక్కువ తామసాన్ని కల్గించే ఉప్పు, కారం, పులుపు, నూనె లేకుండా షడ్రుచులు సమానంగా ఉండే విధంగా ఉండాలి. ఆహారంతోనే దేహం నిర్మాణం అవుతుంది. ఆ దేహాన్ని ఆశ్రయించే మనస్సు, చిత్తం, ఆత్మ లక్షణాలు వర్తిస్తుంటాయి కాబట్టి ఆహారం శుద్ధ సాత్వికంగా ఉండాలి. భోజనం మధ్యాహ్నం తినడంవల్ల ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే రాత్రంతా విశ్రాంతి తీసుకున్నా కూడా శరీరంలో ఉదయమే జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి లక్ష పనులున్నా మధ్యాహ్నం భోజనం చేయాలి.

‘స్నానం మలనిర్మోచనం’ అంటుంది ఆయుర్వేదం. స్నానం చేయడం మన దేశంలో అతి సహజమైన పని. పగలంతా అలసిసొలసిన మనిషికి విశ్రాంతి సమయంలో శరీరంలోని మలినాలు, వ్యర్థపదార్థాలు బయటకు వస్తాయి. ఉదయమే స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది. అంతరశుద్ధికి ధ్యానం, బహిరశుద్ధికి స్నానం చాలా అవసరం. స్వేద రంధ్రాల ద్వారా బయటకు వచ్చిన మురికిని స్నానం ద్వారా తొలగించుకోవడం ద్వారా శరీరం తేలికై ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు నదీ స్నానం చేస్తుండాలి. అలాగే శాస్త్ర నియమం ప్రకారం సముద్ర స్నానం చేయాలి. భగవదారాధనకు ముందు స్నానం చేయడంవల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కోటి పనులున్నా ఉభయ సంధ్యలకు ముందు స్నానం చేయడం మంచిదని శాస్తక్రారులు చెప్పడం జరిగింది.

దానం అనేది పరోపకారం. కొన్ని మతాలు మతావలంబులు ఎవరైనా తమ సంపాదనలో సగభాగం దానం చేయాలన్నాయి. కాని మన మతం సందర్భశుద్ధితో ఏది దానం చేసినా ఫర్వాలేదంటుంది. బలి, శిబి, రంతిదేవుడు, కర్ణుడు- వంటి మహనీయులు చేతికి ఎముక లేకుండా పరోపకారం కొరకు దానం చేసి చరిత్రకెక్కి ఆచంద్రార్కమయ్యారు. కాబట్టి దానగుణం అలవర్చుకోవాలి. మనకు కలిగినదాంట్లో, ఇతరుల అవసరానికి తగినట్లుగా, దాన గ్రహీతలను సోమరులుగా మార్చకుండా దానం చేయాలి. కాబట్టి రోజు లక్ష పనులున్నా దానం చేసే గుణం కలిగి ఉండాలి.

కోటి పనులున్నా హరిని స్మరించాలి. ఎవరికిష్టమైన దేవీ దేవతలను వారు ఆరాధించవచ్చు. మనిషికి పరమాత్మపై ధ్యాసకన్నా లౌకిక ప్రపంచంపై ఎక్కువ కోరికలుంటాయి. వయస్సు పరంగా కలిగే సమస్యల్ని అధిగమించి వైరాగ్యం అలవర్చుకొంటే భగవంతుని వైపు మనస్సు మళ్లుతుంది. ప్రాథమిక దశలో లొంగని మనస్సును వంచి, కోరికలను అరికట్టాలంటే శాస్త్రం చెప్పిన విషయాల్ని అధిగమించకుండా కొన్ని సాధనలు చేయాలి. ఆ సాధనలు క్రమంగా సగుణం నుండి నిర్గుణంవైపు, ఆరాధన నుండి ఆత్మమార్గంవైపునకు సాగాలి. అలా ప్రవృత్తమైన సాధన దినదిన వృద్ధి చెందాలి. ఆ సాధన స్థాయి తీవ్రమైనపుడు నిరాకార తత్త్వ మహిమ వెల్లడైపోయి, అనేక అనుభూతులు కలిగి ఇహంలోని విషయాలన్ని పెద్ద కాంతిగల బల్బు ముందు చిన్నదీపంలా మారిపోతాయి. అందుకే కోటి పనులున్నా భగవంతుడిని స్మరించాలి.

*********************************************
*✍డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి