వేదాంత చక్రవర్తిగా పేరొందిన జనక మహారాజు గొప్ప జ్ఞాని. గుర్రం ఎక్కడానికి వాడే రికాబులో కాలు పెట్టేంత సమయంలో ఆత్మజ్ఞానం పొందవచ్చు అన్న ప్రమాణం ఆయన విన్నాడు. క్షణకాలంలో వేదాంత పరిజ్ఞానం అనుభవంలోకి తెచ్చే సుజ్ఞాని కోసం వెతికాడు. దానికి అష్టావక్రుడే సరైనవాడన్నారు పండితులు. అష్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు.. గొప్ప పండితుడైన తన తండ్రి రోజూ వేదాలు వల్లిస్తుంటే విని ఒక రోజు గర్భంలోంచే పలికాడు. ‘‘వేదాన్ని కేవలం వల్లెవేయడం వల్ల ప్రజ్ఞను నీవు కనుక్కోలేవు. సత్యానికి దాన్ని జోడించు. అది మన అంతరంగంలో ఉంటుంది’’ అన్నాడు. గర్భస్థ శిశువు మాటలతో అహం దెబ్బ తిన్న ఆ తండ్రి.. ‘అష్ట వంకరలతో జన్మిస్తావు’ అని కొడుక్కి శాపమిచ్చాడు. అలా జన్మించినవాడే అష్టావక్రుడు. వేదాంత జ్ఞానం తెలపడానికి జనకుని సభకు వచ్చిన అష్టావక్రుని చూసి అందరూ నవ్వారు. వెంటనే ఆయన ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని ప్రారంభించాడు. ‘మీరు చర్మాన్ని, ఎముకల గూడును చూసి నవ్వుతున్నారా? ఎంత అజ్ఞానం? అంతఃకరణ పొందని వారు ఎన్నటికీ పండితులు కాలేరు’ అన్నాడు. దీంతో సభలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. జనకుడు అష్టావక్రుని పాదాలపై పడి తనకు పూర్ణ ప్రజ్ఞను ప్రసాదించమని వేడుకున్నాడు. అప్పుడు అష్టావక్రుడు ‘భౌతిక దృష్టి గలవారు కంటికి కనిపించేవాటికి ప్రాధాన్యతనిచ్చి అస్తిత్వాన్ని వదిలివేస్తారు. గ్రంథస్థమైన జ్ఞానం మాత్రమే నిజమైన ప్రజ్ఞ కాదు. అది ఒక సాధనం మాత్రమే. ప్రజ్ఞ అనేది ఒక అగ్నిజ్వాల అయితే.. ఈ భౌతిక పరిజ్ఞానం దాన్నుంచి పుట్టిన బూడిద. అసలు తత్వాన్ని గ్రహించి జీవించడమే ప్రజ్ఞ. కానీ జీవులు విషయ వాంఛలతో నిరంతరం పుడుతుంటారు, మరణిస్తుంటారు. కోరికలు, కోపం, ద్వేషం, అసూయ వంటివి నిత్యమరణాలు. కాబట్టి విముక్తి కోరేవారు విషయవాంఛలను విషంలా త్యజించాలి. క్షమాగుణం, నిష్కాపట్యం, ప్రేమ, దయ, సంతృప్తి, అహంకారం వదలడం, మమకారం లేకుండా బతకడం అనేవాటిని అమృతంలా స్వీకరించాలి’’ అంటూ ప్రవచించాడు. అదే అష్టావక్ర గీత. భగవద్గీత తర్వాత ఆత్మజ్ఞానం ప్రబోధించే విషయంలో అష్టావక్రగీత అసమాన వేదాంత గ్రంథం.


-డాక్టర్‌ పి.భాస్కర యోగి
ఆంధ్రజ్యోతి నవ్య నివేదన
08-01-2018 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి