• మహా ఒప్పందం తెలంగాణాకు శాపం. రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం.
– పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌రెడ్డి.
గడ్డివాము మీద కూర్చున్న కుక్క’ గడ్డి తినదు. ఆవులను తిననివ్వదు. గత పదేళ్ళ నుండి మహారాష్ట్రలో, తెలంగాణలో అధికారం వెలగబెట్టింది తమ పార్టీనే. మీకూ, అధిష్టానానికి దున్నమీద వర్షంపడ్డట్లు అప్పుడు ఉండేది. కనీసం మీరు అధిష్టానానికి ఎన్నడైనా ఓ విజ్ఞప్తి చేశారా? సోనియాగాంధీని చూడడమే మీకు మహాద్భాగ్యం. కర్ణాటకవాళ్లు ఆల్మట్టి కడితే, మహారాష్ట్రవాళ్ళు బాబ్లీ కడితే మౌనమునుల్లా ఉన్న మీకు మాట్లాడే హక్కుందా? ఆల్మట్టి కట్టిన ఆనాటి కన్నడ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి గాంధీభవనంలో సన్మానం చేసిన సంగతి మరచిపోయారా?
  •  కాంగ్రెస్‌ నాయకులారా! జానారెడ్డిగారిని చూసి నేర్చుకోండి.
– ఎంపీ కల్వకుంట్ల కవిత.
ఆయనంతే కవితక్కా! అసలు కాంగ్రెస్‌ పార్టీదే ఓ వింత విధానం. ‘తల్లి దెయ్యం పిల్ల పగడం’ అన్న పొడుపు కథలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం.
  • రెండు పంటలకు నీళ్ళిస్తే టీఆర్‌ఎస్‌ పక్షాన పనిచేస్తా.
– కాంగ్రెస్‌ నేత జానారెడ్డి.
 ఇప్పుడు ఒకటే పంటకు నీళ్ళుస్తున్నారనా మీ ఉద్దేశ్యం?
  •  మా బ్రహ్మోస్! మా ఇష్టం!
– చైనాకు భారత్‌ స్పష్టీకరణ.
భళా భారత్‌
  • దావూద్‌ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడు.
– ఐరాస వర్గాలు.
అయితే ఏంటి? మొన్నటివరకూ నయీం తెలంగాణలోనే ఉన్నాడు. ఏం చేశారు?
  •  రామరాజ్యం ఏర్పాటుకు ఆదేశించలేం. అనుకున్నవన్నీ మేం చేయలేం. మాకున్నవి పరిమిత అధికారాలే.
– సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.
రామరాజ్యం చేయరు, రామమందిరం కట్టరు, ఇది ప్రజాస్వామ్య పరిహాసం. మీరు మాత్రం ఏం చేస్తారు?
  •  బెంగాల్‌పై కేంద్ర వివక్ష ఇలాగే కొనసాగితే ఢిల్లీలో ఆందోళన చేపడతా.
– బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.
అదే అనుకుంటున్నాం! ఢిల్లీలో కేజ్రీవాల్‌ ఒంటరైపోయాడు. మీరూ వెళ్తే బాగుంటుంది.
  •  నేను ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా.
– రాహుల్‌గాంధీ.
 ముందు చేసిన వాటికా? కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌కా? స్పష్టం చేయి రాహుల్‌ భయ్యా!
  •  ఉగ్రవాదం నిర్మూలిస్తేనే పాక్‌కు మనుగడ.
– నవాజ్‌షరీఫ్‌, పాక్‌ ప్రధాని.
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే.
  • ‘రావుల’ పాలనలో ఏమీ రావు.
– మధుయాష్కీ కాంగ్రెస్‌ నేత.
 అమ్మ పాలనలో అన్నీ వచ్చాయా?!

– డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి