‘‘కంఠుగాడి కాశీయాత్ర’’
ఎ.ఎన్.జగన్నాథశర్మ
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
పావన క్షేత్రాల వాసి... వారణాశి! పాప వినాశి... కాశి!! హిందువుల ముక్త్ధిమాల్లో ముఖ్యమైన క్షేత్రం. ‘‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’’- కాశీలో మరణిస్తేచాలు ముక్తి అనే మాట శాస్త్ర ప్రసిద్ధం. అలాంటి కాశీ క్షేత్రాన్ని పురాణాలు, యాత్రా చరిత్రలు ఎంతగానో వర్ణించాయి. తెలుగువాళ్ల భాగ్యమా అన్నట్లు ఏనుగుల వీరాసామయ్య ఏకంగా ‘కాశీయాత్రా చరిత్ర’నే రచించి త్రోవ వెంబడి తాను చూసిన విషయాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేసాడు. దానివల్ల అలనాటి మన సాంఘిక పరిస్థితులన్నీ వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఆయల సోమయాజుల నీలకంఠేశ్వర (ఎ.ఎన్) జగన్నాథశర్మ సుప్రసిద్ధ కథకుడు. కథా రచనలో అందెవేసిన చేయి ఆయనది. 72 పుటలతో 16 ఉపవిభాగాలను పెట్టుకొని ‘‘కంఠుగాడి కాశీయాత్ర’’ పేరుతో ఈ పుస్తకం యాత్రాచరిత్రల్లో గొప్ప పుస్తకం. బహుశా! తన పేరులోని నీలకంఠేశ్వర-లోని ‘కంఠు’ను ప్రధాన పాత్రధారిగా చేసిన రచన ఇది. ఇందులో ఆధునిక కాలంలో కాశీ వెళ్లే ప్రయాణికుల మనస్తత్వం అంతా కన్పిస్తుంది. దీనికి అక్కడక్కడ కొన్ని శ్లోకాలు, కాశీకి సంబంధించిన కావ్యాల్లోని పద్యాలు, ఆచారాలకు సంబంధించిన శాస్తవ్రాక్యాలు పెడితే ఇదో ప్రామాణిక యాత్రా గ్రంథమే అయ్యేది. కానీ ఆధునిక కథారచయిత పాటించిన అన్ని నియమాలు రచయిత పాటించాడు. ఎక్కడా బోరురాకుండా ఉండే విధంగా చక్కని ధారలో రచన సాగింది. రచనకు ‘పఠనీయత’ చాలా ప్రధానం. చదువరులు చదువుతూ ఉంటే వదలకుండా ఉండాలి. అలా జాగ్రత్తలన్నీ తీసుకొని శర్మగారు తాను చెప్పే విషయాన్ని అందించారు.
కంఠు అనే వ్యక్తి తన స్నేహితుడు మాణిక్యం ద్వారా తెలుసుకొని కాశీకి బయల్దేరే ఘట్టంతో ఇది మొదలవుతుంది. అయితే ఇద్దరు త్రాగుబోతుల మధ్య కాశీయాత్ర చర్చరావడం ఎందుకో మనకు అర్థం కాదు! మొత్తానికి కాశీయాత్రను ఆద్యంతం తన రచనాస్ఫూర్తితో రచయిత కళ్లకు కట్టించాడు. రచన మొత్తంలో ‘నాటకీయత’ అద్భుతం. అక్కడక్కడ తెలంగాణ మాండలిక ప్రయోగం చేశారు. ‘‘బుర్ర ఖరాబైందా!’’అన్న మాట ఆటోవాడితో అనిపిస్తాడు. కానీ తెలంగాణలో ధమక్ ఖరాబైందా! అంటారు.
కాశీ ప్రాశస్త్యం గురించి ఇద్దరు స్నేహితులు మాట్లాడుతూ ‘‘కాశీ విశే్వశ్వరుణ్ణి చూడని కళ్లు, కళ్లుకాదు బాబోయ్! అవి పగిలిన గనే్నరు కాయలు. చిరిగిన చొక్కాజేబులు. నలిగిన వంద రూపాయల నోట్లు అంటూ కమలాక్షునర్చించు కన్నులుకన్నులు’’ అన్నట్లు వర్ణిస్తాడు.
కాశీ ఉనికిని ప్రసంగ వశంగా చెబుతూ ‘‘కాశీ ఉత్తరప్రదేశ్‌లో గంగానది ఒడ్డున ఉన్నది. దేశానికే ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని. ఇక్కడే గోస్వామి తులసీదాసు ‘రామచరితమానస్’ రచించాడు అంటూ తాను పాఠకులకు మరోక్రొత్త సమాచారం చెప్పాడు. కాశీ విశేషాలేకాకుండా దారిలో కన్పడిన అనేక విషయాలు సమాచారం రూపంలో అందిస్తాడు. అది రచయిత నైపుణ్యానికి, రచనాకౌశలానికి నిదర్శనాలు. ఈ గ్రంథంలో అలాంటివి బోలెడెన్ని ఉన్నాయి. కేవలం ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న పద్ధతిలో కాశీయాత్రను గురించి చెప్పకుండా అడ్డుగా వచ్చిన ఎన్నో విషయాలను స్పృశించారు. కేదారేశ్వరం గురించి, గంగాహారతి గురించి, దశాశ్వమేథ్‌ఘాట్ గురించి.. ఇలా ఎన్నో క్షేత్రాల మహిమలు సంప్రదాయాల సంబురాలను చక్కగా విశే్లషించారు.
అక్కడక్కడ రచయిత చక్కని హాస్యాన్ని పండిస్తాడు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో యాత్రలప్పుడు జరిగే సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించాడు. కంఠు భార్య అతణ్ణి కాశీ పంపుతూ తర్వాత ఫోను చేస్తుంది. వారిద్దరిమధ్య సంభాషణ హాస్యరసాన్ని పండిస్తుంది.
‘‘కాశీనుంచి నాకేమీ అక్కరలేదు. బెనారస్ సిల్కు చీరలు, శివలింగాలంటూ వృథాఖర్చులు చెయ్యకు! వెళ్లినవాడివి వెళ్లినట్టుగా రా’’ చాలు.
సరే! అన్నట్లు కాశీలో నీకు నచ్చింది వదలిరావాలట! ఏం వదులుతావు? ‘‘నువ్వు నాతో రావట్లేదు కదా?’’ - అంటూ భార్యకు చురక అంటిస్తాడు కంఠు. ఇలా ప్రతి సంఘటనను రచయిత శిల్పాన్ని మలచినట్లు మలచి పాఠకులకు సుందర దృశ్యాలు చూపించారు.
ఈ పుస్తకంలో కాశీయాత్రకు సంబంధించిన రంగుల చిత్రమాల అనుబంధంగా చేర్చి మరింత శోభను చేకూర్చారు. వారణాసి రైల్వేస్టేషన్, వీధులు, గంగా హారతి, కాశీవిశ్వనాథుడు, మణికర్ణక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, విష్ణుపాదం, బోధ్‌గయ చిత్రాలు చాలా సుందరంగా అందించారు.
మదన్‌మోహన్ మాలవ్యా, సంకట మోచన్ హనుమాన్, మాధవేశ్వరి శక్తిపీఠం, ఆనంద్‌భవన్, త్రివేణీ సంగమం, మహాబోధి... గయాసురుడు మొదలైన అనేక విషయాలను గురించి చాలా సమాచారం సంభాషణల్లో తెలియజేసారు. ‘వ్యాసకాశి’ని గురించైతే సమగ్ర సమాచారం అందించారు. వ్యాసుడు కాశిని విడవడానికిగల పౌరాణిక గాథను వివరించారు.
మొత్తానికి ఇటీవల కాలంలో ఓ పెద్ద క్షేత్రానికి సంబంధించిన యాత్రా చరిత్రను సమగ్రంగా, కథాకథనరూపంలో ఎవరూ రాసినట్టు లేరు.
పాఠకులను తనతో తీసుకెళ్తున్నట్లు ఈ కథనం సాగించడం వెనుక జగన్నాథశర్మగారి అనన్యసామాన్య కృషి ఉంది.
డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి