– సమీక్షకులు : డా.పి.భాస్కరయోగి
భారత చరిత్రను అంధకారంలో కలిపి తమకనుకూలమైన వాటిపై తెల్లరంగు వేయడం అలవాటు చేసినవారు బ్రిటిషువాళ్లు. వాళ్ల పాలనా నంతరం తెల్లచరిత్రకు ఎరుపురంగు పూయడం మరో వర్గ వాదులు నేర్చుకొన్నారు. ఇంకా ఓ అడుగు ముందుకేసి ”మేం రాసిందే చరిత్ర, మేం గుర్తించినవాడే వీరుడూ- శూరుడూ” అన్న పెడధోరణిలోకి వామపక్ష చరిత్రకారులు వెళ్లిపోయారు.
ఈ దుర్మార్గపు దౌష్ట్యాన్ని ఎదుర్కోవడానికి కోటా వెంకటాచలం లాంటి పాతకాలపు చరిత్రకారులు ‘చారిత్రకజ్యోతి’ని వెలిగించారు. దాని కొనసాగింపుగా ఇటీవల తెలుగు ప్రజల అదృష్టమా అన్నట్లు ఎం.వి.ఆర్‌శాస్త్రి చరిత్రకు కొత్తరక్తం ఎక్కించారు.
ఇప్పటికే ఏది చరిత్ర?, ఇదీ చరిత్ర, కాశ్మీర్‌ కథ, అసలు మహాత్ముడు వంటి పుస్తకాలు రాసిన శాస్త్రిగారు సర్దార్‌ భగత్‌సింగ్‌ జీవితాన్ని కూడ పుస్తక రూపంలో తెచ్చారు. 304 పుటలతో 47 శీర్షికలతో ఆద్యంతం పఠనీయతతో సాగే ఈ పుస్తకం మన మస్తకాలకు అంటిన మలినాన్ని, మకిలినీ తొలగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

”జనంకోసం జీవించిన –దేశం కోసం మరణించినదైర్యశాలి, త్యాగశీలివెరపెరుగని విప్లవ సేనాని భగత్‌సింగ్‌”

అనీ అతని చరిత్రను ఉన్నదున్నట్లు ఈ జాతికి అందించాలనీ తన సంకల్పాన్ని రచయిత ముఖ పత్రానికి వెనుక భాగంలో చెప్పుకున్నారు. శాస్త్రిగారు ఎంత ప్రఖర జాతీయవాదో ఆయన రచనలు చూస్తే తెలుస్తుంది. కానీ చరిత్ర అనే మారేడు చెట్టుకు మసిపూయడానికి ఆయన ఒప్పుకోరు. కాబట్టే భగత్‌సింగ్‌ ఉరితీయబడడానికి ముందు తన వకీలు మెహతా తెచ్చి ఇచ్చిన లెనిన్‌ జీవిత చరిత్ర, ుష్ట్రవ తీవఙశీశ్రీబ్‌ఱశీఅaతీవ శ్రీవఅఱఅ చదివిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లు రికార్డు చేశారు. అది ఓ చారిత్రక రచయితకు ఉండాల్సిన సహనం.
ఈ దేశంలో నెహ్రూ-గాంధీ కుటుంబం మాటున ఎందరు వీరుల జీవితాలు తెరమరు గయ్యాయో లెక్కపెట్టలేం. ఓ సుభాష్‌, ఓ శ్రద్ధానంద, ఓ భగత్‌సింగ్‌… ఇలా ఎందరికో ఆ కుటుంబం వల్ల అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చాక, స్వాతంత్య్రం రాకముందు ఎందరో వారి అప్రకటిత సూర్యకాంతిలో మిణుగురులై పోయారు. ఆ సత్యాన్ని శాస్త్రిగారు ఓ చోట చెప్తూ.. జాతీయోద్యమంలో ఓ మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ గురించి వినే ‘ఆహా! ఎంతటి దేశభక్తుల వంశం!’ అని కాంగ్రెసు భక్తులు ఓవరైపోతారు. ”నెహ్రూలా శ్రీమంతులు కారు; బహు సామాన్య కుటుంబీకులు. అయినా భగత్‌సింగ్‌ తండ్రి తాతలే కాదు, ముత్తాత కూడా వెరపెరుగని దేశభక్తుడే” అని భగత్‌సింగ్‌ వంశంలో ఎందరో గొప్పవాళ్ళున్నారని చెప్తాడు. వారి జీవితాలను శాస్త్రిగారు మనముందుపెట్టి ఈ వంశం ఏం తక్కువ కాదని ఆధారాలతో సహా నిరూపిస్తారు. చివరకు వాళ్ల తాతముత్తాల విషయాలు చెప్పిన శాస్త్రిగారు, భగత్‌సింగ్‌ ఎంచుకున్న మార్గాన్ని నిర్దేశిస్తారు. ఈ పోరాటాలు వద్దని భగత్‌సింగ్‌ను తన తల్లి వారిస్తే, ఆమెను గట్టిగా వాటేసుకొని ‘ఫతేసింగ్‌ ముని మనవడిగా అర్జున్‌ సింగ్‌ మనవడిగా, కిషన్‌సింగ్‌ కొడుకుగా, అజిత్‌సింగ్‌ అన్న కుమారుడిగా నాకు ఇంకో దారి ఉందా అమ్మా!” అని తల్లిని ప్రశ్నించిన ఘట్టాన్ని శాస్త్రిగారు మన ముందు పెట్టారు.
భగత్‌సింగ్‌ దారి ఎంత ముళ్లదారో అనేకచోట్ల నిరూపిస్తూనే, జలియన్‌ వాలాబాగ్‌ దురంతం తర్వాత దేశ ప్రజల్లో పెల్లుబుకిన ఆగ్రహావేశాన్ని మహాత్మా గాంధీ ఎలా నీరుగార్చారో రచయిత కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు. ”1919 డిసెంబర్‌ ఆఖరులో అమృత్‌సర్‌లోనే జరిగిన కాంగ్రెసు సభలో గట్టి ప్రతిఘటనకు కాంగ్రెసు వాదులందరూ పట్టుబట్టినా, మహాత్ముడు వారి ఆవేశం మీద నీళ్లుచల్లి బ్రిటిషు సర్కారుకు అణగిమణికి ఉండాలనీ, వారు కొత్తగా ప్రవేశ పెట్టిన సంస్కరణలను నమ్ముకొని ప్రభుత్వానికి సహకరించాలనీ చెప్పి బలవంతంగా మెడలు వంచాడు” అంటూ శాస్త్రిగారు గాంధీజీ అతి అహింసా వాదంలోని డొల్లతనాన్ని నిర్మొహ మాటంగా చెప్పారు.
అలాగే రచయిత ఈ పుస్తకంలో పెట్టిన ప్రతి శీర్షిక చదువరులకు ముందుకు వెళ్లడానికి ఉపయోగ పడుతుంది. మట్టిమీద ఒట్టు, 1931 మార్చి 23, తుపాకుల్ని నాటించిన వంశం, ఇంకోదారి ఉందా అమ్మా, ఎవరీ బావమరిది, నన్ను కాల్చు… లేదా కవిత్వం మాను, మేం మళ్ళీ పుడతాం… వంటి శీర్షికలన్నీ ఆసక్తిగా ఉంటాయి. అదేవిధంగా అక్కడక్కడ వివిధ పాత్రలు చెప్పిన సూక్తులు, నినాదాలు, నాయకులిచ్చిన స్టేట్‌మెంట్స్‌ను చారిత్రకా ధారాలుగా చూపిస్తూ పాఠకుల జిజ్ఞాసకు మరింత పదును పెట్టారు.
”ఎవరైనా నా దేశానికి కీడు చేశారు అంటే నా దేవుడిని అవమానించారు అనే నేను ఒక హిందువుగా భావిస్తాను. నా దేశాన్ని సేవించడమే నాకు రాముడిసేవ. దేశసేవే నాకు కృష్ణుడి సేవ. నాలాంటి కొడుకు దగ్గర తల్లికి సమర్పించడానికి ప్రాణం తప్ప మరేదీ లేదు. దాన్నే నేను ఆమె పాదపీఠం ముందు అర్పించుకొంటున్నాను. ఇవాళ భారత్‌ నేర్చుకో వలసింది ఎలా మరణించాలన్నదే, దాన్ని నేర్పటానికి మేము మరణించి చూపటమే మార్గం” అంటూ 1909లో మదన్‌లాల్‌ ధింగ్రా ఉరికంబం ఎక్కే ముందు చెప్పిన మాటలు ఇందుకు ఉదాహరణ.
ఇలాంటి దేశభక్తి ప్రపూరితమైన అనేక అంశాలను ప్రతీ వాక్యంలో నిక్షిప్తం చేసిన రచయిత, ఈ పుస్తకం ద్వారా రెండు గొప్ప మేళ్లు చేశారు. ఒకటి భగత్‌సింగ్‌ చరిత్రను యథాతథంగా తెలపడం. రెండవది ఈ చరిత్ర ద్వారా మెదళ్లలోకి స్వాతంత్య్ర వీరుల త్యాగా నిరీతిని, దేశభక్తిని చొప్పించడం.
చావుకు నెరువని విజయ, వీర స్వర్గాలను పట్టించుకోని ఓ పురుషుని జీవితాన్ని తెలుగు ప్రజలకు అనేక చారిత్రక ఆధారాల ద్వారా అందించాలని తలచుకొన్న రచయిత ఆ పని విజయవంతంగా చేశారు. భగత్‌సింగ్‌ జీవితం రచయిత అక్షరీకృతం వీరత్వం-దేశభక్తి యొక్క టెంపర్‌మెంట్‌ కలిగించా రనడంలో సందేహం లేదు.

భగత్‌సింగ్‌రచన : ఎం.వి.ఆర్‌.శాస్త్రిపుటలు : 304వెల : 200/-ప్రతులకు : దుర్గా పబ్లికేషన్స్‌జి-1, సాయికృష్ణ మాన్షన్‌,1-1-230/9, వివేక్‌నగర్‌,చిక్కడపల్లి, హైదరాబాద్‌ – 500020ఫోన్‌ : 040-27632824,9441257961/62


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి