•  ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ముస్లిం అమెరికన్లపై వివక్షకు నేను వ్యతిరేకం. ఇస్లామిక్‌ స్టేట్‌ నాశనమై తీరుతుంది.
– తన చివరి అధ్యక్ష ప్రసంగంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా
ఇస్లామిక్‌ స్టేట్‌ నాశనమౌతుంది. కానీ అందుకోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి ఒబామా జీ..!
  • కాంగ్రెసులోనే అచ్ఛేదిన్‌ సాధ్యం. రెండున్నరేళ్ల ఎన్డీయే పాలనలో దేశం 16 ఏళ్లు వెనుకబడింది. వ్యవస్థల్ని దిగజార్చిన బిజెపి. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయం. భాజపా ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో భయోత్పాతం. మోదీని ఓడించి చూపిస్తా !
– కాంగ్రెసు నేత రాహుల్‌గాంధి
 రాహుల్‌జీ మోదీని తప్పక ఓడించాలి. ఎందుకంటే ! ఆయన కుటుంబంలో రాజకీయ నాయకుడు ఆయనొక్కడే. మీ వలె తాతలు తండ్రుల బ్రాండ్‌మీద ఆయన రాలేదు. ఆయనపై క్విడ్‌ప్రోకో కేసులు లేవు. మీడియాలా బ్లాక్‌ మెయిలింగ్‌, ఫోను ట్యాపింగ్‌లు చేయరు. గడ్డి, గలీజ్‌మైనింగ్‌ కుంభకోణం లేదు. రాబర్ట్‌ వాద్రా లాంటి అల్లుడు ఆయనకు లేడు. బొగ్గు, 2జి, 3జి కుంభకోణాలు లేవు. హౌసింగ్‌ కుంభకోణం లేదు. సత్యం, హవాలా, ఆరోగ్యశ్రీ కుంభకోణాలు లేవు. జెయం.యం. యూరియా లేదు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, ఆయిల్‌ కుంభకోణం లేదు. జీవిత భీమా, అగస్టా కుంభకోణం లేదు. టెలికాం, స్టాంప్‌ కుంభకోణం, భోపాల్‌ దుర్ఘటన లాంటివి ఆయన చేయలేదు. నీరారాడియా టేప్‌ల కేసుల్లేవు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక లాంటి వాటి ఆస్తులు బినామీలకు అమ్మి క్యాష్‌ చేసుకోలేదు. ఏ కుంభకోణం చేయని ఇలాంటి వ్యక్తి ఈ దేశానికి అవసరమా! మీరైతే పైన చెప్పిన అన్ని ఘనకార్యాలు సమర్థంగా చేయగలరు.
  • పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కోరినందుకు నాతోపాటు ప్రశాంత్‌ భూషణ్‌ను వెళ్లగొట్టారు. కేజ్రీవాల్‌ మోదీని, పార్టీని తన గుప్పిట్లో పెట్టుకొన్నారు.
– యోగేంద్రయాదవ్‌, ఆప్‌ బహిష్కృత నేత
 కేజ్రీవాల్‌ను తిట్టే సమయంలో కూడా మోది పేరు లేకుండా మాట్లాడలేక పోతున్నారు.
  •  విపత్తును కొని తెచ్చిన నోట్ల రద్దు. ముందున్నది ముసళ్ల పండుగ
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
 అయ్యో! మౌన మునీశ్వరా.. నోరు తెరిచారా.. !!!
  •  ఓ యువతా.. నల్లధనంపై పోరాడండి, అది దేశాన్ని నాశనం చేసింది. క్రియేటివిటీ కనెక్టివిటీ, కలెక్టివిటీపై దృష్టి పెట్టడండి
– ప్రధాని నరేంద్రమోదీ
 డెబ్భై ఏళ్లు వయసున్న మీరు యువకుల్లో శక్తి నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల యువకుడేమో ముసలివాడిలా దేశాన్ని నిర్వేదానికి గురిచేస్తున్నాడు.
  • ప్రత్యేక ¬దా, ప్రత్యేక ప్యాకేజి, పెద్దనోట్ల రద్దు అంశాల్లో మోది, వెంకయ్య, చంద్రబాబు మూర్ఖుల్లా వ్యవహరిస్తున్నారు. ఇందుకుగాను నరేంద్రమోదికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు.
– సిపిఐ నేత నారాయణ
 నిజమే నారాయణా! యాకూబ్‌ మెమెన్‌కు ఉరిశిక్ష వేయవద్దని, వేసాక ఎందుకు వేసారని.. మీరు-మీ పార్టీల అనుబంధ సంఘాలు ర్యాలీ తీయండి. దేశంకోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్లను కాల్చేయమని, ఉరి తీయమని మీలాంటి వాళ్లు స్టేట్‌మెంట్లు ఇవ్వండి. భూస్వామ్యం, ఫ్యూడలిజం, ప్రజాకోర్టు ఇంక్విలాబ్‌ లాంటి పదాలు దయచేసి వాడకండి. వినివిని 75 ఏళ్ల నుండి భారత ప్రజలు విసిగిపోయారు.
  • టివి కార్యక్రమాలపై ఫిర్యాదులు పరిష్కరించేందుకు చట్టబద్ధ యంత్రాంగం ఉండాలి.
– కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
బాబ్బాబు ! దయచేసి ఈ పని అర్జెంటుగా చేయండి !
  • ఓట్లేస్తేనే నాయకులవుతారు. ప్రజలనే గ్రహింపు రావాలి. రాజకీయ ప్రక్షాళన చేస్తా ! జనం మార్పు కోరుకుంటున్నారు.
– జెఎసి నేత కోదండరాం
 మార్పు మేధావుల పేరుతో చలామణి అయ్యేవారిలో రావాలి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటి పడికట్టు పదాలతో మోసం చేసే కాలం పోయింది. మెజార్జీ ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. మిమ్మల్ని వాడుకొని రాజకీయ నాయకులు అందలమెక్కారు. అది కూడా ధైర్యంగా మాట్లాడలేని దుస్థితి మీది.

డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి