మన మహనీయులు
(సంకలనం)
-డా.ఆర్.ఎస్.నరేంద్ర
వెల: రూ.250/-
ప్రతులకు: సద్గుణ
బాలపక్ష పత్రిక
2-4-740/4/2
హర్రాజ్‌పెంట
కాచిగూడ,
హైదరాబాద్-27.
9441433188
**
మనల్ని మనం సంస్కరించుకోవాలంటే ‘నీతిశాస్త్రం’ కావాలి. మనల్ని మనం పరీక్షలో నిలబెట్టుకోవాలంటే ‘చట్టం’ కావాలి. దేశంలోని 130 కోట్ల మందిని చట్టం పరిధిలో కాపలా కాయాలంటే 130 కోట్ల మంది పోలీసులు కావాలి. కానీ నైతిక విలువల చట్రంలో బంధించాలంటే కొందరు మహాత్ములైతే చాలు. ఈ మహానుభావులు ఏ రంగంలో పని చేసినా దానిని సరైన దిశలో నడిపిస్తారు. ఆధ్యాత్మిక రంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, సంఘ సంస్కరణం, సమాజసేవా రంగం, సాహిత్య రంగం, స్వాతంత్య్రోద్యమం.. ఇలా ఏ రంగమైనా అలాంటి మహనీయుల కృషి అనన్య సామాన్యం.
అలాంటి ఓ వంద మంది మహానుభావులను వారి జీవితాన్ని, ప్రబోధాలను ‘మన మహనీయులు’ పేరిట 208 పుటల్లో డి.ఆర్.ఎస్.నరేంద్ర ప్రచురించారు. ముఖ్యంగా చిన్నారి బాలలకు సరైన క్రమశిక్షణ నేర్పించడానికి, వారికి మహానుభావుల ప్రబోధాలను అందుకొనే అవకాశం కల్పించారు. ఈ రోజుల్లో సినిమా తారలు, క్రీడాకారులు మాత్రమే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి గడ్డు రోజుల్లో ఈ పుస్తకం వంద మంది గొప్పవాళ్ల జీవితాన్ని పాఠకుల ముందుబెట్టి ఓ విజయమే సాధించినట్లు భావించవచ్చు.
వినోదంతోనే కాలక్షేపం చేస్తున్న బాలలకు ఇది ఓ విజ్ఞాన సర్వస్వం. వ్యక్తిత్వ వికాసం పేరుతో ఇవాళ జరుగుతున్న వ్యాపారం ఓ కుట్రగా అనిపిస్తుంది. అందరూ ప్రబోధాలు చేసేవారే మార్కెట్‌లో కన్పిస్తున్నారు. కానీ ఆచరించడంలో, ఆచరింపజేయడంలో మాత్రం వెనుకబడుతున్నారు. గొప్పవాళ్ల జీవితాల నుండి ఆచరణాత్మక స్ఫూర్తి పొందడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంది.
మనం గతాన్ని సంస్మరించుకొంటేనే వర్తమానంలో తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అంతేగాకుండా గతాన్ని తెలుసుకొని తమ పిల్లలకు చెప్పే తల్లిదండ్రుల కొరత చాలా ఉంది. పిల్లలు మానసికంగా ఎదగడానికి ఇలాంటి గత చరిత్రలు, వారి సేవాదృష్టి, త్యాగబుద్ధి, నాయకత్వ పటిమ ఎంతో ఉపయోగపడుతుంది.
యాంత్రికంగా జీవిస్తున్న మనుషులను టీవీలు, కంప్యూటర్లు, నెట్‌లు, సెల్‌ఫోన్లు ఆక్రమించేశాయి. అలాగే మనలను విచ్ఛిన్నం చేయడానికి కులం, మతం, ప్రాంతం, భాష, రంగు, లింగం అన్న ప్రాతిపదికగా తీసుకొని అస్తిత్వ వాద శక్తులు భారత జాతిని ముక్కలు చేయాలని సూచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నట్లుగా బాలలకు ఘనమైన గత చరిత్ర చెప్పేందుకు రచయిత చేసిన ప్రయత్నం ముదావహం.
పురాణాలు సముద్రాల్లా ఉంటాయి. అందులోని పాత్రలు అనర్ఘ రత్నాలు. మొత్తం పురాణం చదవడం ఈ రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. పురాణాల ద్వారా ఈ జాతికి అందించిన వ్యక్తిత్వాలు సూర్యచంద్రులున్నంత వరకు ఆదర్శమే. అలాంటి వాళ్లలో భగీరథుడు, శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, శ్రవణ కుమారుడు, శిబి, ఏకలవ్యుడు మొదలైన పురాణ పురుషుల పాత్రలను రచయిత ఇందులో పరిచయం చేశారు.
ప్రతి వారి జీవితాన్ని రచయిత సరళ శైలిలో, కేవలం రెండు, రెండున్నర పుటల్లో రచించడం వల్ల పాఠకులకు విసుగు లేకుండా ముందుకు సాగుతుంది. అక్షరాలు పెద్దగా ఉండడం వల్ల చదువరులకు సౌకర్యంగా ఉంది. అలాగే కథలను సాగదీయకుండా నేరుగా చెప్తూ రచయిత ద్రాక్షాపాక న్యాయం పాటించాడు.
అంత పెద్ద భగీరథ చరిత్రను ఆసక్తిగా రచించి ‘అల్పాక్షరాల అనల్పార్థ రచన’లాగా ఈ రచన సాగింది. పట్టుదలకు మారుపేరైన భగీరథ చరిత్ర విద్యార్థులకు చదువు మధ్యలో వచ్చే ఆటంకాలను లెక్కపెట్టకుండా ముందుకు సాగడానికి అవకాశం కల్పిస్తుంది. భగీరథ ప్రయత్నం ఎలాంటిదో చదువరుల పట్టుదల అలా ఉండాలని ఈ కథ సూచిస్తుంది.
శ్రీరామ చరిత్ర ధర్మానికి ప్రతిరూపం. మానవుడిగా వచ్చిన దేవుడు సాధారణమైన వ్యక్తిలా కష్టాలను అనుభవిస్తూనే ఎలా జీవితం గడిపాడో రామచరిత్ర వివరిస్తుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌ల్లో చేర్చి న్యూక్లియర్ సంసారాలు చేస్తున్న నేటి యువతకు శ్రవణ కుమారుని కథ అత్యంత స్ఫూర్తిని కలిగిస్తుంది.
కంప్యూటర్‌నే గురువుగా భావిస్తూ కాలం గడిపే మనకు ఏకలవ్యుని జీవితం - గురువు లేకుండా విద్య నేర్చుకోవడం మనకు ఆసక్తిని కలిగిస్తుంది. హనుమంతుని జీవితంలోని ఆధ్యాత్మికతకన్నా అతని కార్యశూరత, విజ్ఞతను ఇందులో చక్కగా చిత్రీకరించారు. హనుమంతుడు ఎవరితో ఎప్పుడు, ఎలా మాట్లాడాలో చక్కగా నేర్చుకొన్నాడు. నాలుక చివరి నుంచి మాట్లాడడం కాక గొప్ప చిత్తశుద్ధితో, నిజాయితీతో మాట్లాడడం ద్వారా అందరినీ చివరకు శత్రువులను కూడా తన మాటలతో మెప్పించగలడని పేరు తెచ్చుకొన్నాడు’ (పు.18) అంటాడు. వ్యక్తులు ఏ సమయంలో ఏం చేశారన్న తేదీలను చెప్పడంకన్నా వాళ్ల జీవితాల సందేశం రచయిత అందించడానికి ప్రయత్నించాడు.
త్యాగం, దానగుణాల్ని చెప్పడానికి శిబి చక్రవర్తిని గురించి చెబితే రాజకీయ వ్యూహాలు, లీలలు శ్రీకృష్ణుని జీవితం తెలియజేస్తాయి.
పురాణ పురుషులు ఆదర్శాలను నెలకొల్పితే వాటిని లోకానికి తమ ప్రబోధం ద్వారా అందించిన వారు మహర్షులు. రామచరిత్రను లోకానికి అందించినవారు వాల్మీకి కాగా, భారతీయ మనస్తత్వాన్ని మహాభారతం రూపంలో ఆవిష్కరించినవాడు వేదవ్యాసుడు. మహర్షుల్లో వీరిద్దరికి అగ్రస్థానం ఇస్తాం. క్రౌంచ పక్షుల మరణంతో తీవ్ర కలత చెందిన వాల్మీకిలో కలిగిన శోకం - శ్లోకంగా రూపాంతరం చెందింది. ఆ ఘట్టాన్ని రచయిత నరేంద్ర చక్కగా వివరిస్తూ ‘ఓరీ! నీచుడా! నీకు అణువంతైనా జాలి లేదా? అవి ప్రేమించుకుంటున్నాయని చూసి కూడా నీ కసాయి చేయి వెనక్కి తగ్గలేదా?’ అంటూ మా నిషాద శ్లోకాన్ని బాలలకు తగినట్లుగా అనువదించారు.
భాగవతం వ్యాస మహర్షి చెప్పినా అది ‘శుకాలాపాభిరామం’లో - శుకమహర్షి నోటి నుండి వెలువడింది. అలాంటి శుక మహర్షి జీవితాన్ని కూడా ఇందులో అందించడం విశేషం.
హైందవ సామ్రాజ్య విస్తరణలో ఛత్రపతి శివాజీకి ఎంత పాత్ర ఉందో, ఆయన వెంబడి ఉండి నడిపించిన సమర్థరామదాసు గురించి చాలామందికి తెలియదు. ‘సన్యాసి రూపంలో దేశమంతా సంచరిస్తూ ‘జయజయ రఘు వీర సమర్థ’ అని ఘోషిస్తూ, ‘్భక్షాటనతో జీవించిన ఈ అలౌకిక పురుషుని జీవితము మనకు అత్యంత స్ఫూర్తిదాయకము’ అంటూ రచయిత ఉటంకింపు గమనించదగింది.
ఇది బాలలకు సంబంధించిన పుస్తకం. పెద్దవాళ్లకు తగినంత సమాచారం ఇచ్చినా బాలలకు ఎక్కువ ప్రేరణదాయకంగా ఉంది. అందుకే బాలభక్తులను, వీరులను ప్రత్యేక ఆధ్యాయంలో చెప్పుకొచ్చారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, నచికేతుడు వంటి చరిత్రలు ఎంతో స్ఫూర్తిదాయకం. అవి చాలామందికి సుపరిచితం. మనకు పరిచయం లేని హకీకత్‌రాయ్ వంటి బాలవీరుని చరిత్ర తెలపడం ఈ పుస్తకం ప్రత్యేకత.
ఆధ్యాత్మికవేత్తలుగా, ధర్మాచార్యులుగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన ఆదిశంకరులు, గౌతమబుద్ధుడు, గురునానక్, గురుగోవింద్ సింగ్, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరామశర్మ, భక్తరామదాసు, సంత్ సేవాలాల్ మహరాజ్‌ల జీవితాలను అందించి ఎన్నో కొత్త విషయాలు తెలిపారు. ఇందులో కొందరు లోకప్రసిద్ధులు. సంత్ సేవాలాల్ మహరాజ్‌ను గిరిజనులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన జన్మదినోత్సవం ఇటీవల ఘనంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. కానీ చాలామందికి ఆయన గురించి తెలియదు. ఇలాంటి రచనల ద్వారా కొంతైనా సమాజానికి తెలిసే అవకాశం ఉంది.
ఇలాంటి సత్పురుషులు, పురాణ పురుషులే కాకుండా మన దేశంలో పుట్టిన శాస్తవ్రేత్తలైన ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, వరాహమిహిరుని వంటి వాళ్లను గురించి చాలా గొప్పగా చెప్పారు. ‘ఖగోళ విజ్ఞానంలో ముందు తరాల వారిని మించిపోయిన భాస్కరుడు న్యూటన్‌కన్న శతాబ్దాల పూర్వమే భూగురుత్వాకర్షణ గురించి ప్రస్తావించాడు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలోని గోళాధ్యాయంలో ‘ఆకర్షత శక్తిశ్చమహి’ అన్నాడు (పు.107) అని భాస్కరుని గురుత్వాకర్షణ సిద్ధాంతం విశదీకరించాడు.
మన ప్రాచీనులతోపాటు ఆధునిక భారతీయ శాస్తవ్రేత్తలైన హోమీబాబా, సత్యేంద్రనాథ్ బోస్, విక్రం సారాభాయ్, ఖొరానా, డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం వంటి శాస్తవ్రేత్తల జీవన చిత్ర ప్రదర్శన చేశాడు రచయిత.
భగత్‌సింగ్, ఆజాద్‌లతో పాటు లోకంలో ప్రసిద్ధి లేని వాసుదేవ బలవంత ఫడ్కే, ఖుదీరాం బోస్, మదన్‌లాల్ ఢింగ్రా వంటి అజ్ఞాత దేశభక్తుల జీవితాలను లోకానికి తెలియజేశారు. రమణమహర్షి, బ్రహ్మనాయుడు, పూలే, కందుకూరి, భోగరాజు, దీన్‌దయాల్ ఉపాధ్యాయ వంటి సంస్కర్తలను, ఆధ్యాత్మికవేత్తలను పరిచయం చేస్తూ చివరగా గోండు వీరుడు కొమరం భీంను పరిచయం చేసి ముగించాడు.
మొత్తానికి వివిధ రంగాలకు చెందిన శతాధిక భారతీయ మహనీయులను తెలుగు పాఠకులకు అందించడం గొప్ప సాహిత్యసేవ అని చెప్పవచ్చు.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి