ఇప్పటివరకు శంభూకుని పేరుతో రామునిపై రాళ్లు వేసేవారు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు పులికొండ సుబ్బాచారి శ్రీకృష్ణుణ్ణి బోను ఎక్కించే ప్రయత్నం చేశారు (వివిధ, జూలై 31). వ్యక్తిగత కులద్వేషాన్ని రామ ద్వేషంగా మార్చుకొన్న పెరియార్‌ రామస్వామి కొసను అందుకొని తెలుగునాట త్రిపురనేని రామస్వామిచౌదరి ‘శంభూకవధ’కు బీజం వేశాడు. వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణంలో ఎక్కడా శంభూక వధ లేదు. వాల్మీకి కృతమో కాదో ఈ రోజుకూ పరిశోధకులు తేల్చని ఉత్తరకాండలోని కథను విశేష ప్రాచుర్యంలోకి తెచ్చారు. శంభూకుడు శూద్ర వైద్యుడని వైదిక గ్రంథాలలోనున్న విషయం చాలా మందికి తెలియదు. బ్రాహ్మణ బాలుడు అనారోగ్యంగా ఉంటే శంభూకుడు తపస్సు చేస్తూ అతనికి వైద్యం చేయలేదు. తన వృత్తిధర్మం సరిగ్గా నిర్వర్తించ లేదని రాముడు అతణ్ణి సంహరిస్తాడు. అంతేకాని శూద్రుడు తపస్సు చేసినందుకు కాదు.

 
త్రిపురనేని తర్వాత నార్ల, రంగనాయకమ్మ వంటివాళ్లు శంభూక వధను ఘోర తప్పిదంగా చూపించి రాముణ్ణి విలన్‌గా మార్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు శ్రీకృష్ణుని వంతు. ఇవాళ్టి కులాల సమాజాన్ని 5వేల యేళ్ల నియమాలతో పోల్చి వాదించడమే విడ్డూరం. ప్రతి సంఘటనలో బాధితుడైన ప్రతి వ్యక్తికీ ఒక కులం, మతం, ప్రాంతం, భాష తప్పక ఉంటుంది. కాబట్టి అస్తిత్వాలు- ఐడెంటిటీలు పేర అవతలివాళ్లను నిందించేందుకు ఇది సాకు మాత్రమే. శత్రుపక్షంవైపు మీడియా లో మాట్లాడితేనే సహించలేని రాజకీయ వ్యవస్థను ఈ రోజు చూడడం లేదా! మరి శత్రువుకు సంబంధించిన సేవకుడు అంతలా మాట్లాడితే జరిగేది ఏంటి? కృష్ణుడు ఆ దాడి తన శత్రువు కంసుడిని సమర్థించే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చేసిందే కానీ, ప్రీప్లాన్డ్‌ కాదు. రజకశ్రేష్ఠా! అని సంబోధించి మర్యాదగానే బట్టలు అడిగారు బలరామకృష్ణులు. శత్రువుపై యుద్ధానికి వెళ్తున్నవాళ్ళకు అదే శత్రువును సమర్థిస్తూ పలికిన నిష్ఠూర వాక్యాలు వాళ్ళ ఇగోను హర్ట్‌ చేశాయి.
 
‘‘ఎట్టెట్టా! ప్రభువుగారి వస్త్రాలు ఇవ్వమంటారా? ఇది న్యాయమా! వాటిని ధరించడానికి మీరు యోగ్యులా? పాలు, పెరుగు అపహరించి తలకొవ్ర్వి ఇలా కూశారు. కాకపోతే గొల్లవారైన మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? కంస మహారాజు ఆగ్రహానికి గురైన మీకు ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి ఈ బట్టలు అడుగవద్దు’’ అంటాడు.
పోతన భాగవతంలో అనువాదం ఇలా ఉంటే వ్యాస భాగవతంలో మూలంలో స్వల్పభేదం ఉంది. ఇలాంటి చర్చల్లో మూలాలను పరిశోధించకుండా పోతన ఆధారంగా చర్చ చేయడం అసంగతమే అవుతుంది. వ్యాస భాగవతం దశమ స్కంధం (పూర్వార్థం) 41 అధ్యాయంలో 32వ శ్లోకం నుండి 37వ శ్లోకం ఈ ఘటన ప్రస్తావించబడింది:
దేహ్యావయోస్సముచితాన్యంగవాసాంసిచార్హతోః/ భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః
 
ఓయీ! మేము చక్కని వస్త్రములకు తగినవారము. మాకట్టి వస్త్రమ్ములనిమ్ము. మాకిచ్చినచో నీకు గొప్ప శ్రేయస్సు కలుగగలదు.
సాక్షేపం రుషితః ప్రాహ భృత్యోరాజ్ఞస్సుధర్మదః
కోపించినవాడై నిందతో కూడుకొన్నట్లుగా ఇట్లు పలికెను.
ఈదృశాన్యేవ వాసాంసి నిత్య గిరివనేచరాః/ పరిధత్త కిముద్వృత్తా రాజద్రవ్యణ్యభీప్సథ
ఓయీ! మీరు సదాచారమును విడిచిపెట్టి రాజు వస్త్రములను కోరుచున్నారు. నిత్యము కొండలపై అడవులలో తిరిగే మీరు వస్త్రములనే ధరించెదరా!
యాతాశుబాలికామైవం ప్రార్థ్యంయదిజిజీవిషా/ బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులానివై
 
ఓ అజ్ఞానులారా! తొందరగా వెళ్లుడు. మీకు బ్రతకాలని ఉంటే కోరికలు కోరకుడు. గర్వించిన వ్యక్తిని రాజభటులు బంధించి కొట్టి వాని సంపదను లాగుకొనెదరు.
ఏవం వికత్థమానస్య కుపితో దేవకీసుతః/ రజకస్య కరాగ్రేణ శిరః కాయాద పాతయాత్‌
శ్రీకృష్షుడు కోపించినవాడై ఈ విధముగా బీరములు పలికిన రజకుని తలను చేతి గోటితో మొండెము నుండి వేరు చేసెను.
 
మంచితనంతో బట్టలడిగితే వాళ్ళ కులాన్ని, శక్తిని ఎత్తిపోస్తూ మాట్లాడటం అతిగాకపోతే ఇంకేమిటి? అతను రాజగృహ బాధ్యుడి గా మాట్లాడకుండా బలరామకృష్ణులనుద్దేశించి తిట్లు తిట్టాడు. పాలు, పెరుగు దొంగలు అని, యోగ్యత లేదని, కులపరంగా గొల్లవారని తెలుగు భాగవతం లో ఉంటే; గిరి, వనాల్లో సంచరించేవాళ్ళని సంస్కృత భాగవతంలో ఉంది. ‘రజకశ్రేష్ఠుడా’ అని సంబోధించి బట్టలడిగిన పాపానికి ఇన్ని తిట్లు తిడితే వీరులైన బలరామకృష్ణులు ఎలా సహిస్తారు?
 
దారిన పోతున్న రజకుణ్ణి బట్టలు అడగడమే తప్పన్నట్లుగా అతడు ప్రవర్తించాడు. ఏదో సైన్యాధ్య క్షుడిలాగా మాట్లాడితే యుద్ధానికి వెళ్తున్నవాళ్లు ఊరుకుంటారా? ముష్టిక చాణూరులనే మల్లయుద్ధం లో ఓడించిన యదువంశ క్షత్రియులు చేతులు ముడుచుకొని కూచుంటారా? గిరివనచరులు అని ప్రస్తావించడం కులపరమైన విమర్శ కాదా! ఈ రోజుల్లో గిరిజనులను ఇలాగే కుల దూషణ చేస్తూ మాట్లాడితే ‘అట్రాసిటీ కేసు’ పెట్టరా? చర్యలోని లోపాలను గుర్తించకుండా ప్రతి చర్యను మాత్రమే ప్రశ్నించే మన మేధావులకు శతకోటి నమస్కారాలు!
 
ప్రతి సంఘటనను కులం దృష్టితో చూస్తే కులాల మధ్య ఘర్షణలు తప్ప ఇంకేం మిగలవు. వ్యక్తిగత పేరు ప్రతిష్ఠల కోసం పౌరాణిక పాత్రలను అపఖ్యాతి పాలు చేయడం, వాళ్ళను విలన్లుగా చూపడం తెలుగునాట కొత్తేం కాదు. రాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను తిట్టేవాళ్ళంతా మా విమర్శ సాహిత్య దృష్టితో అంటారు. అదే పాత్రలను, వాటి వ్యక్తిత్వాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలంటే అవన్నీ మతానికి సంబంధించినవి అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను పాఠకులు అర్థం చేసుకొంటున్నారు కాబట్టే ఇటీవల ఉధృతి తగ్గింది. కానీ సుబ్బాచారి కొత్త అస్త్రాన్ని నూరుదామని ప్రయత్నించడం సూర్యునిపై దుమ్మెత్తి పోయడమే. ఓ పర్యాయం తమిళనాడు కోర్టులో అదేపనిగా రాముణ్ణి నిందిస్తున్న నాయకుణ్ణి ఓ జడ్జి మందలిస్తూ, ‘‘పది తలలు, ఇరవై చేతులున్న రావణుడే ఏం చేయలేక పోయాడు; చచ్చు ఓ నోరు, రెండు చేతులున్న నీవేం చేస్తావులే పో!’’ అన్నాడట.

డాక్టర్. పి. భాస్కర యోగి 
ఆంధ్రజ్యోతి
  • ఎడిటోరియల్
  •  
  • వివిధ 13-08-2017 



  • కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి