ఇద్దరు అవధూతలు సాయంసంధ్య వేళ పరాయి రాజ్యంలోకి ప్రవేశించారు. అంతలో వర్షం మొదలైంది. తలదాచుకుందామని చూస్తే ఒక పురాతన దేవాలయం కనిపించింది. అందులో కాలు పెట్టకముందే అది కుప్పకూలింది. రాజభటులు వీరిని ఆలయాన్ని కూల్చిన నేరం కింద నిర్బంధించారు. మర్నాడు రాజు ముందు నిలబెట్టి దేవాలయం కూలడానికి కారణం వారేనని ఆరోపణ చేశారు. రాజు గుడ్డిగా వారి మాటలు నమ్మి అవధూతలకు మరణశిక్ష విధించాడు.

చివరిగా ఏదైనా చెప్పుకోవచ్చని వారితో అన్నాడు. వారిలో ఒక అవధూత.. ‘నా హృదయం ఒక మందిరం. దీనిని పరమాత్మ తన ధ్యానం కోసం నిర్మించుకున్నాడు. మనిషి దేవుని కోసం అక్కడ మందిరం నిర్మించాడు. దానితో దేవునికి నేరుగా సంబంధం లేదు. మనిషి నిర్మించుకున్న ఆలయం కోసం దేవుడు నిర్మించుకున్న హృదయ మందిరం కూల్చేస్తారా?’ అని ప్రశ్నించాడు. దీంతో రాజు పునరాలోచనలో పడ్డాడు. మందిరం మనిషికి అవసరమే. ఆ భౌతికమైన కట్టడంలోని భగవంతుని ముందు మనం నిలబడి.. మన హృదయస్థానంలోకి రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానిస్తాం.

ఇదే ధర్మ సూక్ష్మం. మన పూజలో, తపస్సులో, ఆరాధనలో.. ప్రతి దాంట్లో ఈ ధర్మసూక్ష్మం ఉంటుంది. దానిని పట్టుకోకుండా పైపై మెరుగుల వెంట పడతాం. ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయంలో మనకు కనిపించని ప్రతీకలు, పరమార్థాలు ఉంటాయి. ఉదాహరణకు.. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు, ఎన్ని చోట్ల వెలిగించామనే లెక్కల్లో మునిగిపోతాం తప్ప, మన అంతరంగంలోని ఆత్మ జ్యోతిని వెలిగించడాన్ని విస్మరిస్తాం. ఈ క్రమంలోనే చాలామంది తత్వజ్ఞానం, భక్తి లేకుండా యాంత్రికమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలే ఆచరిస్తారు. లోతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలగాలంటే ధర్మసూక్ష్మం తెలియాలి. అది బీజం వంటిది. అది మన హృదయంలో ఉంటే చాలు. ఎక్కడో ఒక చోట.. ఎప్పుడో ఒకసారి పరిపూర్ణత పొందుతాం.

డాక్టర్‌ పి.భాస్కరయోగి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి