అమృతోపనిషత్తులు
1, 2 భాగాలు
యం.వి.నరసింహారెడ్డి
639 పుటలు
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో..
**
భారతీయ వేదాంతానికి ముఖ్యాధారాలు ఉపనిషత్తులు. వేద పరిజ్ఞానం సామాన్యుడు పొందడం కష్టమని వేద ప్రతిపాదిత అనేక విషయాలు ఉపనిషత్తుల ద్వారా సమాజానికి అందించారు మహర్షులు. స్వామి దయానంద సరస్వతి వేదం ప్రమాణాన్ని చేసుకొని జనంలోకి వెళితే స్వామి వివేకానందుడు ఉపనిషత్తులనాధారం చేసుకొని సమాజాన్ని ఉర్రూతలూగించాడు. అదే వేదానికి ఉపనిషత్తుకు ఉన్న భేదం. ఉపనిషత్ ‘జ్ఞానం’ ఆధారంగా ముందుకు సాగుతుంది. మనిషిలో వికాసం, చైతన్యం కలిగిస్తుంది. అలాంటి ఉపనిషత్తులు వేదాలకు చివర ఉన్నాయి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు మొత్తం ఉండగా ప్రస్తుతం 108 మాత్రమే లభ్యమవుతున్నాయి. అందులో ఋగ్వేదానికి సంబంధించి 10 ఉపనిషత్తులు, శుక్ల యజుర్వేదానికి 19, కృష్ణయజుర్వేదానికి 32, సామవేదానికి 16, అధర్వణ వేదానికి 31 మొత్తం 108 ఉపనిషత్తులున్నాయి. 108 ఉపనిషత్తుల నుండి 108 మహావాక్యాలను ఏరి శ్రీరాముడు హనుమంతుడికి ఉపదేశించాడని ఐతిహ్యం. ఈ 108 ఉపనిషత్తులను హనుమకు శ్రీరాముడు ఉపదేశం చేశాడని చెప్పబడింది. అయితే ఈశ, కన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరాయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక- అనే దశోపనిషత్తులకు త్రిమతాచార్యులు భాష్యం రచించారు. అందువల్ల అవి ప్రసిద్ధం అయినాయి. ఆ తర్వాత ఆంగ్లంలో ప్రాచ్య, పాశ్చాత్యులు ఏడుగురు ప్రసిద్ధులు వ్యాఖ్యానం రాయగా, తెలుగులోనే 25 మంది మహాపండితులు ఈ ఉపనిషత్ వాఙ్మయాన్ని జనంలోకి తెచ్చారు. ప్రస్తుతం యం.వి.నరసింహారెడ్డిగారు తేటతెలుగులో, సరళ సుందరంగా ‘‘అమృతోపనిషత్తులు’’ ప్రథమ భాగం, ద్వితీయ భాగాలుగా అందించారు. 338 పుటలతో 60 ఉపనిషత్తులను ప్రథమభాగంగా, 301 పుటలతో 48 ఉపనిషత్తులతో ద్వితీయ భాగంగా అనువాదం చేశారు. దాదాపు 639 పుటలతో 108 ఉపనిషత్తులు అందించడం వారి కృషి/ బహుధా ప్రశంసనీయం. నరసింహారెడ్డి కేవలం ఉన్నదున్నట్లు అనువాదం చేయకుండా ఆయా ఉపనిషత్తులు- ఏవిధమైన నడకను, మతాన్ని, అభిమతాన్ని కలిగి ఉన్నాయో తెలియజేశారు. కొన్ని వైష్ణవాన్ని, మరికొన్ని శైవాన్ని, ఇంకొన్ని వేదాంతాన్ని, కొన్ని యోగాన్ని, సన్యాసాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఏ ఉపనిషత్ ఏ విధమైన మార్గంలో నడుస్తుందో రచయిత విషయ సూచికలో ఆయా ఉపనిషత్‌ల ఎదురుగా సూచించారు. తద్వారా మనకు దాన్ని ఎన్నుకోవచ్చు. లేదా విషయాన్ని వింగడించుకోవచ్చు. ప్రథమభాగంలో 60 ఉపనిషత్తుల తర్వాత వేదాల పరిచయం, తాను గతంలో రచించిన వేదాలను (అనువాదం) సమీక్ష చేశారు. ప్రతి ఉపనిషత్తుకు చిన్నపాటి పరిచయం, శాంతి పాఠం అందించారు. శంకరుడు చేసిన దశోపనిషత్తుల భాష్యాలను- సారాంశాన్ని ఆయా ఉపనిషత్తుల దగ్గర అనుబంధంగాచేర్చి మరింత శోభను కూర్చారు. శంకరుపై, అద్వైతముపై రచయితకు వల్లమాలిన అభిమానం ఉంది అనడానికి ఈ క్రింది మాటలే సాక్ష్యం ‘‘చాలావరకు ఉపనిషత్తులు శంకర భగవత్పాదులు చెప్పిన అద్వైత వాదమునే సమర్ధించుకున్నవి’’అని తన ముందుమాటలో చెప్పుకొన్నాడు.
ఉపనిషత్తులా ధారంగా మానవుల్లో పంచభూతాల స్థితి ఉందో రచయిత వివరిస్తూ ‘‘ఆత్మను పురుష రూపములో జలమయ ప్రపంచంనుండి బయటకు తీశాడు. ఆ పురుషుడి నోటినుండి అగ్ని వచ్చింది. ముక్కుపుటముల నుండి గాలి వచ్చింది. కన్నులనుండి సూర్యుడొచ్చాడు. చెవులనుండి దిక్కులు మరియు స్వర్గము, చర్మము నుండి మొక్కలు మరియు చెట్టు, మనస్సునుండి చంద్రుడు, నాభి నుండి మృత్యువు వచ్చాయి. మనిషిని సృష్టించి, పంచభూతాలను ఆదేశించి మనిషిలో ఆవహింపజేసి మనిషి మనుగడకు వారసుడయ్యాడు బ్రహ్మ’’ అంటూ రచయిత పరబ్రహ్మ స్వరూపంయొక్క విరాట్ తత్వాన్ని ప్రతిపాదించాడు.
ఉపనిషత్తులు నిజానికి సంస్కృతంలో రాయబడ్డ గొప్ప జ్ఞాన సూత్రాలు. అవి నరసింహారెడ్డిగారు తెలుగు ప్రజలకు అందించడానికి అదీ చాలా సులభ శైలిలో నవలా పద్ధతిలో రాయడం అభినందనీయం. సమయ పేదరికంతో సతమతమవుతున్న మనుషులకు ద్రాక్షాపాక న్యాయంగా వీటిని అందించారు. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులోని ‘‘అరుణ కమల సంస్థా’’ అనే మంత్రాన్ని ఎంత చక్కగా అనువాదం చేశారో చూస్తే ముచ్చటగా ఉంటుంది.
రమణ మహర్షిలా ‘‘నేను ఎవరు?’’ అని ప్రశ్నించుకోవాలి. దానినే ఉపనిషత్తులు ‘‘మనల్ని మనం తెలుసుకోవాలి’’అని ప్రతిపాదించాయి. జ్ద్యీ ఘౄ ని? అన్న ఎఱుక అందిపుచ్చుకోనివాడు అజ్ఞాని అని మహాత్ములెందరో తెలిపారు. ఇదంతా ఉపనిషత్తుల సారమే! దానిని ఓచోట రచయిత చెప్తూ ‘‘పరమాత్మ అందరి ఆకాంక్షలు తీర్చువాడై ఉన్నాడు. తెలివిగలవాడు తనలోనే సర్వంతర్యామిని వీక్షించగలడు. అలాంటివారు శాశ్వతమైన జీవితాన్ని, శాంతిని పొందగలరు. గ్రీకు సిద్ధాంతం, మన సిద్ధాంతం ఒక్కటిగానే కన్పించుచున్నది. ఆ నినాదమేమనగా ‘‘మనము మనల్ని తెలుసుకోవాలి’’ అంటాడు. భారతీయ వేదాంతం మెట్ట వేదాంతం కాదు. వేల యేళ్ల పరిశోధన అనేక రకాల ప్రకల్పనలను చేధించింది. సత్య మార్గాన్ని చేరింది. మనిషిని పాపిగాకన్నా ఉన్నతునిగా చేయాలని సంకల్పించింది. మహోన్నత్వం సాధించడం పరమాత్మతో ఏకత్వం పొందడమే! మరి ఆ ఏకత్వం సాధించడానికి కావలసిన మార్గాలను అందించింది. మనుషులు ఉన్నతులు కావడానికి కావలసిన దారులను మూసుకుపోకుండా చేతిని అందించింది ఇదే విషయాన్ని అనువాదకుడు ‘‘మానవుడు ఎన్ని చెడుపనులు చేసినప్పటికిన్ని మళ్లీ పునీతుడయ్యే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకవేళ చెడు పనులు మానుకోకుండా ఉంటే మాత్రం వారు మరుజన్మలో కుక్కగా, పందిగా, క్రిమికీటకాదులుగా, చేపగా, పక్షిగా, సింహంగా, ఎలుగుబంటిగా, పాముగా ఆయా ధాన్యములుగా, పొదలుగా, చెట్లుగా, విత్తనాలుగా జన్మించెదరు’’అంటాడు. మనిషికున్నవి రెండుమార్గాలు ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ఏది నీ ఇష్టమో తేల్చుకోమంటుంది ఉపనిషత్తు.
మనుషులంతా సిరిదాసులై భోగభాగ్యాలకే విలువ ఇస్తున్న ఈరోజుల్లో కఠోపనిషత్తు ప్రతి ఒక్కరూ చదవాలి. దేహం మాత్రమే శాశ్వతమని నమ్మే మనిషి శారీరక సుఖాలకు, ధన ధాన్యాలకు, ప్రలోభాలకు లొంగిపోతున్నారు. తనకున్న నిజస్వరూపాన్ని తెలుసుకోలేక మృత్యువాత బడుతున్నాడు. పాపాలే రోగాల రూపాలనెత్తి వెంట తరుముతున్నాయి. అలాంటి తరుణంలో నచికేతుడు కఠోపనిషత్తులో చెప్పిన సందేశం పరమాద్భుతం.
వ్యాసమహర్షి వేదాలను వింగడించి భారత, భాగవత, బ్రహ్మసూత్రాలను రచించి, అష్టాదశ పురాణాలను ఈ జాతికి అందించాడు. అలాంటి వ్యాస మహర్షి కుమారుడు శుకబ్రహ్మ. జ్ఞానాన్ని ఔపోసన పట్టిన వ్యాసుడు శ్రీ శుకుడు సన్యాసాశ్రమానికి వెళ్తుంటే వియోగ దుఃఖంలో మునిగిపోతాడు. శ్రీశుకుడు మాత్రం పరబ్రహ్మ రూపసాగరంలో మునకలేస్తాడు. పుత్రవియోగంతో వ్యాసుడు తన కుమారుణ్ణి గద్గద స్వరంతో గట్టిగా పిలుస్తాడు.
‘‘ఆ పిలుపుకు ప్రత్యుత్తరముగా సంపూర్ణ ప్రకృతి, జీవ నిర్జీవులు ప్రతిగా నినదించెను’’అని శుక రహస్యోపనిషత్తు తెలియజేస్తుంది. జీవ నిర్జీవుల్లోని బ్రహ్మతత్వం అంత గొప్పది ‘అంతా బ్రహ్మమయం’ అనుకోనంత కాలం ప్రకృతి మాయ మనిషిని చుట్టేస్తుంది. అంతా బ్రహ్మమే- ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మం’’అన్న ఉపనిషత్తు వాక్యాన్ని స్మరిస్తే కలిగేది బ్రహ్మానందమే! ఆ బ్రహ్మానందాన్ని కలిగించడమే కాదు అందులో ఓలలాడించడమే ఉపనిషత్తుల ప్రధాన కర్తవ్యం.
మన శాస్త్రాల్లో ఒక పదానికి అనేక అర్థాలుంటాయి. బాహ్య, అంతర, లౌకిక, అలౌకిక, అర్థాలేకాక ‘పదం’దానికన్నా చేత- అనగా పనివల్ల కొత్త అర్థాన్ని పొందుతుంది. అలాంటి వాటిలో ‘మనస్సు’ ఆత్మ ఈ రెండూ ఒకటే అనుకొంటాం. అంతఃకరణంలోని మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఈ నాలుగు బాహ్యంగా, అంతరంగా పొందే వేర్వేరు స్థాయిలనుబట్టి అర్థం మారుతుంది. ఆత్మ-సంసారం వైపు ఉంటే మనస్సు. భగవంతుని వైపు ఉంటే చిత్తం. ఇలాంటి అర్థాలను మహోపనిషత్తు వివరిస్తూ ‘‘ఆత్మను ఒక తావులో మనస్సు అని, మరొక తావులో బుద్ధి అని, వేరొక తావులో జ్ఞానమని, ఎచ్చటైనా క్రియ అని, వేరొక తావులో అహంకారమని మరొక తావులో చిత్త రూపమని అంటుంటాము. ఇది ఒక తావులో ప్రకృతి అని, మాయ అని అనబడుతుంది’’ అని తెలియజేసింది.
ఇలా ఉపనిషత్తులను చక్కని సామాన్యుల తెలుగులో అనువదించి తేనె నోట్లో వేసుకొన్నట్లు తెలియజేసారు నరసింహారెడ్డిగారు. ఎక్కడా పదాడంబరానికి పాండిత్య ప్రకర్ష ప్రదర్శనకు వెళ్లకుండా సామాన్యుల మనస్సుల్లోకి ఉపనిషత్తులను ఎక్కించాలనే మంచి ప్రయత్నం ఇది. శ్రీరాముడు హనుమంతుడికి 108 మాత్రమే మహావాక్యాలు చెబితే ఈ అమృతోపనిషత్తుల్లో అడుగడుగున అమృత బిందువులే. ఆస్వాదిస్తే ఆత్మ అవగతమవుతుంది. ఆనందం విశదమవుతుంది. 108 ఉపనిషత్తులను 2 భాగాల్లో సామాన్యుని దరి జేర్చే ఈ ప్రయత్నం శ్లాఘనీయం. సమయం లేక అజ్ఞానమయమైన లోకాన్ని ఉద్ధరించే అద్భుత ప్రయత్నం ఇది. ఉపనిషత్తులంటే సమీపంలో కూర్చొని అధ్యయనం చేసేవి. నరసింహారెడ్డి తెలుగు వాళ్లందరిని తనదగ్గర కూర్చోబెట్టుకొని అధ్యయనం చేయించినట్లుంది. తెలుగు ప్రజలను వేదాంతంవైపు నడిపే మరో ప్రయత్నం.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి