హైదరాబాద్, డిసెంబర్ 18: శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం రసరమ్యమైనదని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో శతకాలకు, సంకీర్తనలకు, గేయసాహిత్యానికి కొరత లేదని పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై శతక సంకీర్తనా, గేయ సాహిత్యం అంశంపై జరిగిన చర్చా గోష్టిలో దేవాదాయ మంత్రి సి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ జె బాపురెడ్డికి, డాక్టర్ వెలిచాల కొండలరావులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పద సంకీర్తనా సాహిత్యంపై పి భాస్కరయోగి, తెలంగాణ సినీ గేయ కవిత్వంపై సుద్దాల అశోక్‌తేజ, తెలంగాణ లలిత గేయాలపై వడ్డేపల్లి కృష్ణ, శతకసాహిత్యంపై తిరునగరి, జానపద గేయ సౌందర్యంపై పోద్దుటూరి ఎల్లారెడ్డి ప్రసంగించారు. పి వారిజ రాణి సమావేశకర్తగానూ, గాజుల రవీందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
మహిళా సాహిత్యం
ప్రాచీన సాహిత్యంలో మహిళ పాత్ర చాలా కీలకమైనదేనని, సాహిత్యంలో మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సోమవారం నాడిక్కడ జరిగిన తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు పేర్కొంది. రవీంద్రభారతి డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికపై జరిగిన ఈ సదస్సుకు కవయిత్రి ఆచార్య సూర్య ధనంజయ్ అద్యక్షత వహించగా, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాచీన కవిత్వం- మహిళలు అనే అంశంపై డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, వచన సాహిత్యం- మహిళలు అంశంపై కొండపల్లి నిహారిణి, వచన కవిత్వం- మహిళలు అనే అంశంపై జూపాక సుభద్ర, స్ర్తిల కథా సాహిత్యంపై గోగు శ్యామల మాట్లాడారు. మహిళా సాహిత్యం మరింత విస్తృత రూపాన్ని సంతరించుకుందని డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి పేర్కొన్నారు.
సాయంత్రం తెలుగు యూనివర్శిటీలో జరిగిన మరో కార్యక్రమంలో కవిసమ్మేళనం జరిగింది. ఇందులో కవి యాకుబ్, పాపినేని శివశంకర్, తిరుమల శ్రీనివాసాచార్య పాల్గొనగా, డాక్టర్ దేవరాజు మహరాజు అధ్యక్షత వహించారు.

Published Tuesday, 19 December 2017 ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి