శ్రీ రామాయణ సారామృతము
మూల్యం: అమూల్యం
ప్రతులకు: చల్లా లక్ష్మణరావు
పురోహితులు
శివాలయం వద్ద
రావూరిపేట గ్రామం
వేటపాలెం పోస్ట్
ప్రకాశం జిల్లా-523 187
9290813963
**
‘సూర్యచంద్రులున్నంత వరకు భారతదేశంలో రామాయణం ఉంటుంది. రాముని చరిత్ర ఈ దేశ సంస్కృతికి మూలాధారం’ -అలాంటి రామచరిత్ర వాల్మీకి మహర్షి లోకానికి అందిస్తే అందులో ‘్భక్త్భివం’ చేరి ఏది వాల్మీకి రామాయణమో! ఏది కాదో తేల్చుకోలేనంత కలగలసిపోయింది. అందుకే రామాయణంపై అనేక మంది పరిశోధనలు చేశారు. రామకథను అనేక మంది అనేక ప్రక్రియల్లో రచించారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాస్తే, వేపూరు హనుమద్దాసు లాంటి గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో! అంత నిత్య నూతనంగా ఉంటుంది. మరి ఇన్నిసార్లు, ఇంతమంది ఎందుకు రామాయణం రచించాలి? మిఠాయి అనే పదం ఒక్కటే. కానీ అందులో జిలేబీ రుచి వేరు. కలకండ రుచి వేరు, కాజా రుచి వేరు! అన్నింటినీ మిఠాయనే పిలుస్తాం కానీ దేని రుచి దానిది! అలాగే రామాయణంలోని రామకథ ఒక్కటే! కానీ ఒక్కొక్కరిది ఒక్కో కోణం. మరో కోణంలో రామకథను అందించే ప్రయత్నంలో భాగంగా జ్యోతిష, అర్చక విద్యల్లో నిష్ణాతుడైన చల్లా రామారావు ‘శ్రీ రామాయణ సారామృతము’ పేరుతో 59 శీర్షికలతో 357 పుటలతో ఈ పుస్తకం అందించారు.
రచయిత జ్యోతిర్వేత్త అవడంవల్ల రామాయణంలో జ్యోతిషం కోసం వెదికినట్లు అనిపిస్తుంది. వివాహ నక్షత్రాల జాబితా నుండి పుష్యమీ నక్షత్రం తొలగించడం సమంజసం అవునా! కాదా! పెద్ద చర్చనే చేశాడు. అలాగే శ్రీ సీతారాముల వివాహ ముహూర్త విషయాలను జ్యోతిష గ్రంథాల ఆధారంతో చక్కని విశే్లషణ చేశారు. అదే విధంగా రామాయణంలో ‘వాస్తు విషయాలు’ వివరించారు.
రామారావు తీసుకున్న 59 అంశాలు ధర్మ సందేహాల్లో ప్రశ్నోత్తర పద్ధతి పాటించినట్లు -తానే ఓ శీర్షిక తీసుకొని దానిలో సారాన్ని మొత్తం చక్కగా అధ్యయనం చేసే విధంగా విశే్లషణ చేశారు. ఉదాహరణకు దశరథుడు అసత్యవాదా? తాను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కున్న కైక! హనుమంతుడు నవ వ్యాకరణకర్త! శివధనుర్భంగం!.. ఇలా ప్రతి ఘట్టాన్ని అవపోసన పట్టి దాని సారాన్ని గ్రంథంలోకి చేర్చారు. అలాగే ఆయా ఘట్టాలలో తాను ఎన్నుకొన్న అంశాలను సులభ శైలిలో పాఠకుల మనస్సుకు హత్తుకొనేలా చెప్పడం ఈ పుస్తకం ప్రత్యేకత. ముక్తకాలుగా ఏ అంశానికి ఆ అంశం చదువుకోవడం జరిగినా రచయిత కృషి సఫలమైనట్లే! రామాయణంలో అనేక అంశాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా చెప్పడంలో రచయిత ప్రతిభ ద్యోతకమవుతుంది. తల్లిదండ్రులు బిడ్డలకు చేసే ఉపకారాన్ని తాను లోకానికి చెప్పాలనుకొన్నాడు. దానిని రామునికి దశరథునిపై ఉన్న ‘పితృభక్తి’ని శీర్షికగా మలచుకొన్నాడు.
‘తల్లిదండ్రులు తమ బిడ్డల మలమూత్రాలను శుభ్రము చేసియు, వారికి అన్నపాన వస్త్రాదులు ఇచ్చియు వారి విద్యాబుద్ధులు చెప్పించుయు వారిని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దియు పలు విధములుగా వారికొరకు కష్టపడుటతో పాటుగా వారి కొరకు అనేక త్యాగములు చేసియు తమ బిడ్డలకు అంతులేని ఉపకారము చేయుచున్నారు. అందువలన తల్లిదండ్రుల ఋణము తీర్చుట చాలా కష్టము’ అని లోకానికి రచయిత మాతృ, పితృ భక్తిని ప్రబోధించారు. ఇందులో శీర్షికా విభాగం, నామకరణం చదువరులను ఆకట్టుకొనే విధంగా ఉంది. వాల్మీకి రామాయణంలోని వివిధ అంశాలను పఠితల మనస్సులను ఆకర్షించే ఘట్టాలుగా మలచడంవల్ల దేనికది విడిగా, సంపూర్ణ సారయుక్తంగా ఉంది.
శ్రీరాముడు వెంట నడచిన వశిష్ఠుడు, శ్రీరాముని వెంట నడచిన జాబాలిని ఇద్దరినీ పక్కపక్కనే చర్చించి నాస్తిక - ఆస్తిక సిద్ధాంతాలను హైందవ ధర్మవీరుడైన శ్రీరాముడు ఎలా నిర్వహించాడో చిత్రించినట్లు చూపించాడు.
అక్కడక్కడ శ్లోకాలను కూడా ఇవ్వడంవల్ల ఇదో పరిశోధక, ప్రామాణిక గ్రంథంగా మలచాడు. అంతే స్థాయిలో ఎక్కువ శ్లోకాలను మధ్యమధ్యలో పెడితే రచన కుంటుబడుతుందని ప్రవాహాన్ని వదిలిపెట్టలేదు. సాధారణ వ్యకె్తైనా సరే ఆయా ఘట్టాల్లోని విశేషాలను చదివేటట్లు చేశారు. ఇదంతా పరిశోధక రచయిత ప్రతిభా విశేషమే.
ఈ రామాయణ సారామృతం ప్రధానంగా పెద్ద శీర్షికల్లో కన్పిస్తూనే అందులోని ఇంకెన్నో ఉపశీర్షికలు చదువరుల వేగాన్ని, విషయ గ్రహణం త్వరగా చేసేట్లుగా ఉన్నాయి. రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని ఓ కొత్త కోణంలో - ముఖ్యంగా సామాజిక కోణంలో వ్యక్తపరచి ‘మరల ఇదేల రామాయణంబన్న!’ అన్న ప్రశ్నకు సరైన జవాబు ఇచ్చారు. ఈ రామాయణంలో శ్రీరాముణ్ణి ఎంతో ఉదాత్తమైన వ్యక్తిగా వ్యక్తీకరించినా, ఓ చోట రావణుడి గుణగణాలు 30 పేర్కొన్నారు. అవన్నీ రావణాసురుని కీర్తిని ప్రకటించేవే! కానీ అతనిలోని ‘స్ర్తి లోలత్వం’ ఎలా లంకా వినాశనానికి, అతని స్వీయ వినాశనానికి కారణం అయ్యిందో చెప్పడమే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి