డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ముంబై విశ్వవిద్యాలయానికి చెందిన పరీక్ష పత్రాలు దిద్దుతున్న సందర్భంలో ఓ దళిత విద్యార్థికి మార్కులు ఎక్కువ వేయాలనే సిఫారసు వచ్చింది. అఖండ మేధావి అయిన అంబేద్కర్ ఆ సిఫారసును తిరస్కరిస్తూ ‘‘విద్యార్థి అస్పృశ్యుడు అయినంత మాత్రాన అతని మాటను నేను అంగీకరించి, తప్పక సహాయం చేస్తానని అతనికి అనిపించవచ్చు. కాని నా దృష్టిలో అది సాధ్యం కాదు. నేను కావాలనుకుంటే అది సాధ్యమవుతుంది. కానీ అది నా గౌరవానికి భంగకరం. అదీగాకుండా ఇలా ఎవరికోసమైనా సిఫారసు చేయడం నాకు అసహ్యకరం. తెలివితేటలు, యోగ్యత దృష్ట్యా ఇతర విద్యార్థుల కన్నా తాను ఈ ఏరకంగా తక్కువ వాడినని చెప్పుకొనే పద్ధతిలో ఏ అస్పృశ్య విద్యార్థీ ప్రవర్తించకూడదు. ఇతర విద్యార్థులతో పోల్చుకున్నపుడు ఓ ఆదర్శ విద్యార్థిగా అతడు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి’’ - అని కుండబద్దలు కొట్టారు.
ఈ రోజు విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్న మేధావులు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు బాబా సాహెబ్ జీవితంలోని ఈ సంఘటన సారాంశం గ్రహించాలి. దేశంలోని యూనివర్సిటీల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టే చర్యలు ‘రాజకీయ రావణకాష్ఠం’లా మండుతున్నాయి. దీని వెనుక అనేక కారణాలుఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు పూర్తిగా దిగజారడం, నరేంద్రమోదీ ప్రధాని కావడం జీర్ణించుకోలేని మనస్తత్వం, హిందుత్వవాదుల నుంచి ఏదో ప్రమాదం ఉందని శంకించడం, అంతర్జాతీయ మతతత్త్వ శక్తుల ప్రోద్బలం... వెరసి ఈ రోజు భారతదేశంలోని అభివృద్ధిని పక్కకు నెట్టి జరుగుతున్న అసంబద్ధ చర్చ.
గ్లోబలైజేషన్ ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీల, సంస్థల ప్రభావం దేశంలో రోజు రోజుకు సడలిపోతుంది. ముఖ్యంగా మావోయిస్టులు బయట తిరిగే పరిస్థితులు లేకుండా పోయాయి. అపార భారత సైన్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల వాళ్ల కదలికలు నిఘా విభాగానికి సులభంగా దొరికిపోతున్నాయి. అడవుల్లో ఉంటే ప్రాణాలు పోవడం తప్ప ఇంకోమార్గం కనిపించడం లేదు. దాంతో పార్టీ బలహీన పడుతున్నది. అలాంటి భావజాలం ఉన్న కొందరు వ్యక్తులు ప్రొఫెసర్లుగా, విద్యావేత్తలుగా, మేధావులుగా, మానవ హక్కుల సంఘాల నాయకులుగా చలామణి అవుతున్నారు. వీళ్లు తయారుచేస్తున్న సరుకు ఎక్కువగా యూనివర్శిటీల నుంచి వస్తున్నదే. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ(జేఎనయూ)ని ‘మదర్సా ఆఫ్ మార్క్సిస్ట్’ అని పిలుస్తారు. ఈ విశ్వవిద్యాలయంలో తొలి నుంచీ కాంగ్రెస్- కమ్యూనిస్టుల చీకటి ఒప్పందాల ఫలితంగా వామపక్షాలదే పెత్తనం. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఇక్కడి నుంచే సంకేతాలు అందుతుంటాయి. భారతదేశంలోని వామపక్ష విద్యార్థి సంఘాలకు ఇది గురువులాంటిది. ఇటీవల మోదీని, హిందుత్వను భరించే ఓపికలేని మేధావులు - మరీ ముఖ్యంగా వామపక్షవాదులు వారి అక్కసును ‘అసహనం’ పేరుతో వెళ్లగక్కుతున్నారు.
వ్యక్తిగత అహంకారాలకు సిద్ధాంతాలను, మతాన్ని, కులాన్ని జోడించి నానా యాగీ చేస్తున్నారు. దానికి తోడు అధికారం కోల్పోయి అల్లల్లాడిపోతున్న కాంగ్రెస్ పార్టీ, కుటుంబ అధికారం కోల్పోయిన సోనియా, రాహుల్ ప్రతిదానికి ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఏదో ఓ అమూర్త విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. అక్లాక్ హత్య, హేతువాదుల హత్యలు, రోహిత్ ఆత్మహత్య, తాజాగా కన్నయ్య కుమార్ అరెస్ట్.... ఇట్లా ఏదో ఒక విషయంతో ప్రభుత్వం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు.
వీళ్లు మొదట చర్య చేస్తారు. ఆ చర్య నచ్చని వాళ్లు ప్రతిచర్య చేస్తే దాన్ని రాజకీయం చేస్తారు. దేశ ద్రోహులుగా కోర్టులు శిక్షలు వేసిన యాకూబ్ మెమెన్, అఫ్జల్ గురులను కీర్తించడం చర్య. అలాంటి చర్య జరుపడం దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం అని అంటే అలా అనడానికే వీలులేదు అంటారు. ఇపుడు కొత్తగా వీళ్లు చేసే ఈ ప్రతి కార్యక్రమానికి ‘అంబేద్కర్ వాదం’ ముందుకు తెస్తున్నారు. తద్వారా దళిత - మావోయిస్టు గ్రూపులు తమ అహంకారం గెలిచిందని సంతృప్తి చెందుతున్నాయి. కాంగ్రెస్, కేజ్రీవాల్, నితీశ వంటివాళ్లు రాజకీయ లబ్ధి పొందుతున్నారు.
భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న ఈ శక్తుల వెనుక ఎవరున్నారు? వివిధ సాంస్కృతిక - సాహిత్యరంగాల్లో తమ ప్రాభవం కోల్పోతామనే భావనతో ఉన్న వామపక్ష మేధావి వర్గం ఇలాంటి అప్రాధాన్య విషయాలను ఎప్పటికపుడు మీడియా తెరపైకి తెచ్చి అవతలి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోయిన అవతలి వర్గం తిరగబడినపుడు అది దౌర్జన్యం అని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న భారతదేశంలోని వివిధ జాతుల ప్రజలను ఎవరూ ఈ దేశం నుంచి బయటకు పంపలేరు. అందరూ కలసి జీవించాల్సిందే. ‘నీ సిద్ధాంతం - నా సిద్ధాంతం వేర్వేరు కావచ్చు గాక కానీ నీ భావ వ్యక్తీకరణకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాను’ అన్న ఓ మేధావి మాటలు ఇలాంటి వ్యక్తుల చెవికి ఎక్కడం లేదు. జాతి, కులం, భాష, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేసి యాభై ఏళ్ల నుంచి దేశాన్ని అనేక సమస్యల వలయంగా మార్చేశారు.
వ్యక్తిగత అవినీతి, కుటుంబ అవినీతికి దూరంగా ఉన్న ఓ దిగువ మధ్యతరగతికి చెందిన, వెనుక బడిన కులానికి చెందిన వ్యక్తి ఉన్నత పదవిని అందుకోవడం ఓర్చుకోలేని వ్యక్తులు రోజుకోరకమైన ‘మేధో ఉగ్రవాదం’ సృష్టిస్తున్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఇలాంటి శక్తులు జాతీయవాదాన్ని ధ్వంసం చేస్తున్నాయి. దీనికి తోడు మీడియా ప్రతి విషయాన్ని న్యాయవ్యవస్థకన్నా, పాలనా వ్యవస్థకన్నా ముందే జడ్జిమెంట్ చేయడంవల్ల ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఏ విషయం ఎంత స్థాయిలో చర్చ చేయాలన్న నైతిక నియమావళి మీడియా పాటించాలి. ముఖ్యంగా కులాల మధ్య - మతాల మధ్య జరిపే చర్చలు సమాజాన్ని సమైక్యంగా ఉంచేందుకు దోహదం చేయాలి. అలాకాకుండా రెండు వర్గాలు విభేదపు గోడలు కట్టే విధంగా ఉండకూడదు.
హిందుత్వను తిట్టడమే సెక్యులరిజమనుకొనే ఓ వర్గం మీడియాలో, రాజకీయాల్లో, మేధో రంగంలో బలంగా పాతుకొని ఉంది. వీళ్లు చేస్తున్న ‘అతి’ వల్ల హిందుత్వ మరింత పెరుగుతుందని గ్రహించడం లేదు. గత యాభై ఏళ్ల నుంచి అవలంబిస్తున్న ఈ వైఖరి దేశసమగ్రతకు, జాతీయ సమైక్యతకు గొడ్డలిపెట్టుగా మారిందని అందరూ గ్రహించాలి.
- డాక్టర్ పి. భాస్కరయోగి
bhaskarayogi.p@gmail.com
27-02-2016 ఆంధ్రజ్యోతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి