ప్రతి మనిషికి తల్లి పాలలా ఆనందం, ఆరోగ్యం కలిగించే ఆత్మాభిమానం హృది నిండా నింపేవి మాతృ భాషలు. అలాంటి మాతృభాషలకు ప్రపంచీకరణ నేపథ్యంలో కలుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టారు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం. 22 శీర్షికలతో 96 పుటలతో ‘మన మాతృ భాషలు’ అనే పుస్తకం రచించాడు. సద్గురు శివానందమూర్తి, డా||పోరంకి దక్షిణామూర్తి, డా.బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మహామహుల స్వల్ప పీఠికలతో ఈ పుస్తకానికి మరింత అందం చేకూరింది.

‘తెలుగు బిడ్డకు నేడు తెలుగును బోధింప
అదనపు చదువున కంపవలయు
శతక రత్నాలలో చక్కని పద్యాలు
పాడుట యన యలవాటదేమొ
నన్నయ తిక్కన యన్న కవుల పేర్లు
వేమనాదుల గూర్చి విననే లేదు
అను పద్య పాదాల్ని, చిన్న చిన్న కార్టూన్లు పుస్తకంలో చేర్చడం వల్ల చదువరులకు మరింత వినోదాత్మకంగా ఉంది.
మన భాషా సమస్య అనేక చిక్కుముడులతో ఉంది. అందువల్ల దీని పరిష్కారం ఓ క్లిష్ట సమస్యగా మారిపోయింది. కులం, ప్రాంతం లాంటి కొన్ని ‘ఇగో’ల మధ్య భాష ఇరుక్కుపోవడం దురదృష్టం. ఇలాంటి విషయాలను విశ్వేశ్వరంగారు సమగ్రంగా పరిశీలించారు. మనం మన మాతృభాష అని అనగానే సంప్రదాయవాదులని, ఛాందసులని ముద్ర వేస్తారు. అదే విషయాన్ని రచయిత ఓ చోట చెప్తూ ‘ఆంగ్ల భాష నేర్చిన కారణంగానే భారతదేశం ఈనాడు ప్రపంచ దేశాలలో గౌరవం పొందే స్థాయికి చేరు కొన్నది. మనం ఇంగ్లీషు నేర్చుకొని పోటీలో నిలబడక పోతే చైనావంటి దేశాలు త్వరితగతిలో ప్రపంచ దేశాల్లోని అమెరికాలోని ఉపాధి అవకాశాలను కైవసం చేసుకొంటాయి’ అంటారు వారు (పు-3) అని వాపోతారు.
‘మన సాహిత్యం ఒక్కటే. భిన్నమైన భారతీయ భాషల ద్వారా ప్రకటితమైంది’ అనే ఓ కొటేషన్‌ ఇస్తూ దానికనుగుణంగా ‘మన భాషలన్నీ ఒకే వృక్షానికి ఉన్న వికసించే పుష్పాలవలె చక్కని భారతీయ సంస్కృతి అనే సుగంధాన్ని వ్యాపింప జేయుచున్నవి. సంస్కృత భాషయే భాషలన్నింటికి రాణి’ అంటారు.
మాతృభాషల పట్ల అవ్యాజమైన ప్రేమతో, గణాంకాలతో సహా వివరిస్తూ రచించిన ఈ రచన భాషా ప్రేమికలకు ఓ దిక్సూచి అని చెప్పక తప్పదు. ఇది అవశ్య పఠనీయం. – డా.పి.భాస్కరయోగి
మన మాతృభాషలు
రచన : దుగ్గిరాల విశ్వేశ్వరం
పుటలు : 48
వెల : రూ. 75/-
ప్రతులకు :
సాహిత్యనికేతన్‌, హైదరాబాద్‌ 500027,
దూరవాణి :040-27563236
సాహిత్యనికేతన్‌, విజయవాడ-520002
దూరవాణి : 9440643348

–  డా.పి. భాస్కరయోగి జాగృతి  కథనాలుపుస్తక సమీక్ష


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి