ఒకసారి అల్వార్‌ సంస్థానపు రాజు మంగళ్‌సింగ్‌.. స్వామి వివేకానందను కలుసుకొన్నారు. ఆయనకు పాశ్చాత్యవ్యామోహం ఎక్కువ. భారతీయుల విగ్రహారాధనకు కారణం అజ్ఞానమేనని భావించేవాడు. అందుకే వివేకానందుని కలిసినప్పుడు.. ‘స్వామీ నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు. నా గతి ఏమవుతుంది?’ అని ప్రశ్నించాడు. వెంటనే వివేకానందుడు.. ఆ సంస్థానపు దివాన్‌ మేజర్‌ రామచంద్రను పిలిచి గోడపైనున్న రాజుగారి చిత్తరువుపై ఉమ్మి వేయాల్సిందిగా ఆదేశించారు. దానికాయన.. రాజుగారి చిత్తరువుపై తాను ఉమ్మి వేయలేనన్నాడు. చిత్తరువుపై ఉమ్మి వేస్తే రాజుగారిపై ఉమ్మి వేసినట్లు కాదు కదా అన్నారు స్వామి. అయినా ఎవరూ సాహసించలేదు.

              అప్పుడు వివేకానందుడు రాజును ఉద్దేశించి.. ‘రాజా ఈ చిత్రం మీ ప్రతిబింబం మాత్రమే. కానీ దీన్ని చూసినప్పుడు వారి మదిలో మీరే మెదిలారు. అందువల్ల మీ పట్ల చూపే మర్యాద ఆ చిత్తరువు పట్ల కూడా చూపిస్తున్నారు. అలాగే రాయి, మట్టి, చెక్కలతో చేసిన దైవ విగ్రహాల పట్ల కూడా భక్తుల ఆరాధన అలాగే ఉంటుంది’ అని చెప్పారు. నిరాకార తత్వాన్ని చేరాలంటే విగ్రహం ఒక కిటికీ లాంటిది. నిగ్రహం కోసం విగ్రహం కావాలి. అది కలిగాక విగ్రహం అవసరం ఉండదు.

                 సకారాత్మకత లేకుండా సత్యశోధన చాలా కష్టం. విగ్రహాన్ని ఆరాధించడం.. చిత్తానికి ఏకాగ్రతను, ఆత్మతృప్తిని కలిగించి మనిషిని యోగమార్గం వైపు తీసుకెళ్తుంది. విగ్రహంపై పరమాత్మ స్వరూపస్వభావం బ్రహ్మభావన కలిగిస్తుంది. మనచుట్టూ ఆవరించి ఉన్న విశ్వాకారుడైన పరమాత్మతో అనుసంధానం కలిగించే ప్రాథమిక విద్య విగ్రహారాధన. అస్పష్టంగా ఉన్న తత్వాన్ని స్పష్టంగా ఉన్న మాధ్యమం సాయంతో చేరేందుకు నిర్మించిన ఆధ్యాత్మిక వంతెన అది.

-డాక్టర్‌ పి.భాస్కర యోగి
ఆంధ్రజ్యోతి నవ్య నివేదన
15-01-2018 సోమవారం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి