– మా పార్టీలో చేరండి ప్లీజ్…!
– కాంగ్రెస్ నేత, సినిమా నటి నగ్మా
- ‘చేతులు నాకే వాడు మూతులు నాకేవాణ్ణి’ భిక్షం ఎత్తుకోవడం అంటే ఇదే! తమిళనాడు రాజకీయరంగం ఖాళీగా ఉందని అందరూ స్టెప్పులు వేసేవాళ్ళే! ఒకవైపు జాబాలి తమ్ముడు కరుణానిధి, మరోవైపు జయమ్మ పెంపుడు చిలకలు ఓపీయస్, ఈపియస్, జైలుపక్షి శశికళ మేనల్లుడు దినకరుడు, మరి మహాసమాధిలో ఉన్న రజనీబాబా ఎప్పుడు కళ్లు తెరుస్తాడో అని భాజపా వారు, సందట్లో సడేమియాలా ‘కాషాయం- కషాయం’ అంటూ దశావతారం కమలహాసన్…! వహ్వా ధీరోదాత్తురాలైన ఒక స్త్రీ మరణం ఇంతమందికి అవకాశం కల్పించనుందా?
– ప్రభుత్వ వైఫల్యం వల్లే దళితుల ఆత్మహత్యలు. తెరాస దళిత వ్యతిరేకి.
– పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్‌రెడ్డి
- గట్టిగా గదమాయించి న్యాయం చేయండి….! మీరు అధికారంలోకి వస్తే ఇలాంటి జరుగవని హామీ ఇవ్వండి….!!
– మోదీ, కేసీఆర్ ఇద్దరివీ అందమైన అబద్ధాలు ప్రచారమే ఎక్కువ…. పని సున్నా! ఆర్.ఎస్.ఎస్, బిజెపి ఏనాడూ స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకోలేదు. ఇపుడు వారే దేశభక్తులని చాటుకొంటున్నారు.
– కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి
- జీవితాంతం పరాన్న భుక్కులా ఇతర పార్టీలపై ఆధారపడి గెలిచిన జైపాల్‌రెడ్డి నీతులు వల్లిస్తే బాగుండదేమో అని ప్రజలు అనుకంటున్నారు. ‘స్వాతంత్రోద్యమం జరిగేటపుడు భాజపా పుట్టలేదు’. ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు హెగ్డేవార్ జైలుకు వెళ్ళిన సంగతి కూడా తెలియని మీరు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కేసీఆర్ మిమ్మల్ని ఉతికి ఆరేస్తుంటే దిక్కుమొక్కు లేక అరుస్తున్నారని మీ పార్టీ వాళ్ళే చెవులు కొరుక్కుంటున్నారు జాగ్రత్త !
– స్వతంత్ర భారతంలో భూ సంస్కరణలు చేపట్టిన ఘనత కాంగ్రెస్‌దే.
– కాంగ్రెస్ నేతలు మల్లుభట్టి విక్రమార్క
- డెబ్భై ఏళ్ళు ఈ దేశాన్ని ఏలారు. ఏది చేసినా మీ ఘనత ఉండే తీరుతుంది. దానిని చెరిపి వేయాలనే కేసిఆర్ ప్రయత్నం. అందుకే మూణ్ణెళ్ళు సమగ్ర భూసర్వే !
– పైరవీలతో వస్తే ఆనందమే ఉండదు; వచ్చే ఏడాది నుండి పనితీరును బట్టే ఉపాధ్యాయులకు అవార్డులు.
– ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
- అంటే అపుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకొన్నట్లే అవార్డులను తమ అనుకూలమైన వారికిస్తారని ప్రతిపక్షాలు ఉపాధ్యాయ సంఘాలు అనుమానిస్తున్నాయి సార్.
– పాలనలో నెంబర్ వన్‌గా ఉన్నాం.. మన పథకాలు దేశానికే ఆదర్శం.
– మంత్రి హరీశ్‌రావు
- అదే నేరెళ్ళ ఘటన, మీయాపూర్ భూకుంభకోణం, కోరలు చాస్తున్న డ్రగ్స్ మాఫియా…. నియంతృత్వ నిర్ణయాలు, విమోచనదినంపై మౌనం, మల్లన్న సాగర్ రోదనలు… ఇలాంటి వాటిలో దేశంలోనే ఫస్ట్ అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ…! కామెంట్ ప్లీజ్ !!
– సత్యం నోరు నొక్కలేరు. ఆమె మన హృదయాల్లో ఉంటారు. ఈహత్యకు భాజపా, ఆర్.ఎస్.ఎస్‌లదే బాధ్యత.
– గౌరీ లంకేశ్ హత్యపై రాహుల్‌గాంధీ
- దేశంలోని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉపాధ్యక్షుడు హత్య జరిగిన గంటలో ఇంత దారుణమైన ఆరోపణ చేస్తాడా ! వెనుక ఉన్న ఆ ప్రాంప్టర్ అయినా జాగ్రత్తగా మాట్లాడమని యువరాజుకు చెప్పాలి. పోలీసులు, నేర పరిసోధన విభాగాలను నోరు తెరువనీయకుండా పరిశోధన ప్రక్కదారి పట్టిస్తే ఎలా?
– డోక్లాం ఘటన మరచిపోదాం
– బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్
- హిందీ- చీనీ భాయి భాయీ- నమ్మవద్దు నరేంద్రభాయీ.
– మోదీ, షా ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారు. గుజరాత్ నమూనా ఎక్కడ ఉంది. సామాజిక అభివృద్ధిలో గుజరాత్ 13,14 స్థానాల్లో ఉంది.
– కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్
- డిగ్గీ రాజా! మీరే అపుడపుడు దేశాన్నీ గుజరాత్‌లా మారుస్తున్నారని అంటారు. మళ్ళీ మీరే గుజరాత్ మాడల్ కావాలంటారు. ఇదెక్కడి వైరుధ్యం…!?
– డా||పి.భాస్కరయోగి మాటకు మాట, విశ్లేషణ జాగృతి 18-24 September 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి