మీరే పార్టీ పగ్గాలు చేపట్టాలి. మీరే సర్వం
– శశికళను బ్రతిమాలుతున్న ఎ.ఐ.డి.యం.కె. నేతలు
దిక్కులేని వారికి చిన్నమ్మే దిక్కు.. ఆ తర్వాత అందరూ పడిపడి మొక్కు..
భూసేకరణ చట్టాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వమే భూకబ్జాలకు పాల్పడుతోంది.
– కాంగ్రెసు నేతలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి
మరి కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులు ఆకాశంలో కట్టారా!
సూది పార్టీ, దబ్బనం పార్టీ. పోలీసులు గుచ్చేలా చూడడమే వారి పని. మలన్నసాగర్‌ ప్రాజెక్టు దగ్గర కాల్పులు జరిపించాలని చూశారు. వారివి దిక్కుమాలిన రాజకీయ వ్యూహాలు..
– సిపిఎం పార్టీపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ విమర్శలు
కెసిఆర్‌ గారూ! ఉద్యమమే వాళ్ల ఊపిరి. పాదయాత్రలు వాళ్ల ప్రాణం. గొబెల్స్‌ ప్రచారం వాళ్ల నైజం. పడికట్టు పదాలు వాళ్ల ఉపన్యాసాలకు ఊతం. వాళ్ల ప్రత్యేకతను ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నారు మీరు. అందుకే వాళ్లను తిట్టడంలో మీరు కూడా ప్రత్యేకత చూపించారు.
 నా వ్యవహార శైలి నచ్చకుంటే చెప్పమన్నాను. సభలో పెద్దమనిషిగానే వ్యవహరిస్తాను. నేటి పోటీ రాజకీయాలకు నేను సరిపోనేమో!
– కాంగ్రెసు శాసన సభాపక్ష నేత జానారెడ్డి
మీ అంత అందమైన, అత్యద్భుతమైన వ్యక్తి సిఎల్‌పి నేతగా ఉండడం తెరాస వారి అదృష్టం లేదా పూర్వజన్మ పుణ్యఫలం.
పిల్లల్ని కనడానికి తప్పించి, ఇతరత్రా మరెందుకూ నాకు మగవాడితో అవసరం లేదు.
– నటి ప్రియాంక చోప్రా
ఖీ ఎంత సెలబ్రెటీ అయితే మాత్రం ఇంత స్త్రీవాదం పనికి రాదేమో!
ధర్నాకు అనుమతివ్వండి లేదా ఎందుకివ్వరో కారణాలు చెప్పండి! ఇంత రాక్షసత్వమా!
– జెఎసి నేత ప్రొ||కోదండరాం
కూరిమిగల దినములలో నేరము లెన్నడు కలుగ నేరవు
మరియా కూరిమి విరసం బైనను నేరములే తోచుచుండు”
ఎంత బాగా చెప్పాడండీ సుమతీ శతక కారుడు.
ప్రధాని మోది నిజాయితీ పరుడు
– సమాజ్‌వాది పార్టీ నేత ములాయాంసింగ్‌
ములాయాం సాబ్‌.. నిజాలు మాట్లాడడంలో మీకు మీరే సాటి.
గుజరాత్‌లో ఇలాంటివెన్నో చూశారు. పులిమీద స్వారీ మోదీకి అలవాటే!
– కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
పులిమీద ఎక్కి ప్రయాణం చేయడం సులభం. కానీ కుక్కలు మొరుగుతుంటే పరుగెత్తడం చాలా కష్టం.
నోట్ల రద్దు హడావుడి నిర్ణయమే!
– నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌
ఏంటబ్బా! మీ బ్యాచ్‌ ఇంకా దిగలేదని చూస్తున్నా! ప్రపంచం మొత్తం మోది నిర్ణయాన్ని స్వాగతించింది. అనేకమంది ఆర్థికవేత్తలు దీనిని ఆమోదించారు. వారికి మించిన ఘనులా మీరు..? అంత ఘనులైతే మీ హయాంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు ? గిరీష్‌ కర్నాడ్‌, మీ వంటి మహనీయులకు మార్క్స్‌ వచ్చి పాలిస్తేనే తృప్తిగా ఉంటుంది. ఇంకెవ్వరూ మిమ్మల్ని పాలించలేరు !!
మోదీకి వందిమాగధుడిలా కెసిఆర్‌ పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రికి వంత పాడుతున్న మంత్రి హరీశ్‌
– సిపిఐ నేత సువరం సుధాకర్‌ రెడ్డి
గత అరవై ఏళ్ల నుండి కాంగ్రెస్‌ పల్లకిని మీరే మోసారు. అప్పుడు లేని తప్పు ఇప్పుడెక్కడి నుండి వచ్చిందో..! 
– డా||పి.భాస్కరయోగి  మాటకు మాటవిశ్లేషణ జాగృతి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి