1925లో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ కాలాంతరంలో అనేక మార్పులు, చీలికలు, పేలికలు అయింది. రకరకాల గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఎప్పుడూ తామే దేశ అధికారాన్ని చెలాయిస్తున్నట్లు మాట్లాడుతుంది. మనం టివిలు, పత్రికలు చూస్తే భారతదేశంలో కమ్యూనిస్టు పాలనలో ఉన్నామా అన్నట్లు స్టేట్‌మెంట్స్‌, వ్యాసాలు, చర్చలు, సంస్థలు, నినాదాలు వగైరా కన్పిస్తాయి. భారతదేశంలో వాళ్ల బలమంతా మీడియానే. అలాగే కమ్యూనిస్టు మేధావులు పూటకో సంచలనమైన పుస్తకాలు రాస్తుంటారు. అలాగే ‘భారత్‌పై అరుణతార’ అనే పేరుతో యాన్‌మిర్డాల్‌ రాసిన పుస్తకం చూస్తే భారతదేశంలో ఎర్రదండు తప్ప ఇంకేం లేరనుకొంటాం. అదే విషయాన్ని పూర్వ పక్షం చేస్తూ వుప్పల నరసింహం సంధించిన రామబాణం లాంటి పుస్తకం ‘నిజం’. ఈ పుస్తకంలోని నిజాలన్నీ ఇజాలుగా విడివడ్డ మావోయిస్టులను, వారి ఆలోచనలను తూర్పార బట్టింది. మావోయిస్టు సిద్ధాంతాలపై లోతైన అధ్యయనం చేసిన ‘వుప్పల నరసింహం’ అదే స్థాయిలో ఆధునిక ప్రపంచాన్ని అధ్యయనం చేశారు. ‘స్వీడన్‌ నుండి భారత పర్యటన కొచ్చిన యాన్‌మిర్డాల్‌ భారతదేశంపై అరుణతార పరచుకుంటోందని అతిశయోక్తులను అచ్చు వేస్తే ఏ మేరకు ఆమోదయోగ్య మవుతుంది’ అని రచయిత ప్రశ్నిస్తాడు.
‘గతంలో అమెరికా పత్రికా రచయిత ఎడ్గర్‌స్నో చైనా ఎర్ర సైన్యంలో కొన్ని నెలలపాటు తిరిగి అక్కడి, అప్పటి అగ్రనాయకులతో మాట్లాడి, చర్చించి తన అభిప్రాయాలతో ‘చైనాపై అరుణతార’ అన్న పుస్తకం రాశారు. చైనా విప్లవం బలంగా ఉన్న రోజుల్లో యోనాన్‌ ప్రావిన్స్‌లో సంచరించి ప్రోది చేసిన అంశాలతో ఆ పుస్తకాన్ని స్నో రాశారు. సుదీర్ఘమైన 75 సంవత్సరాల అనంతరం స్వీడిష్‌ పత్రికా రచయిత యాన్‌మిర్డాల్‌ భారతదేశంలో ముఖ్యంగా బస్తర్‌లో తిరుగుబాటును దగ్గరగా పరిశీలించి తన అనుభవాలు, జ్ఞాపకాలతో ఈ పుస్తకాన్ని రాశారు. ‘వాస్తవానికి చైనాపై అరుణతార పుస్తకానికి ప్రస్తుత ఈ పుస్తకానికి పొంతనలేదు’ అని తన ప్రయాణం మొదలు పెట్టారు రచయిత. వలసవాదం బలంగా ఉన్న కాలం నాటి చైనా విప్లవానికి, ప్రపంచీకరణ బలంగా ఉన్న ఈనాటి భారతదేశంలో బస్తర్‌లోని గెరిల్లా చర్చలకు సంబంధం లేదని తార్కికంగా నిరూపించారు. భారత్‌లో పట్టణీకరణ ప్రపంచం లాగానే చాలా వేగంగా కొనసాగుతోంది. జనాభాలోని సగం మంది పట్టణాల్లో, నగరాల్లో జీవిస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఓ కుగ్రామమైంది. ఇలాంటి సందర్భంలో మావోయిస్టులు ఆదివాసీలకు డబ్బులేని నిరాడంబర జీవనశైలిలో జీవింపజేసే ‘కమ్యూనిస్టు తత్త్వాన్ని’ అలవాటు చేస్తామనడం సిద్ధాంతపరమైన దిగజారుడు కాక ఇంకేమిటి అని రచయిత ప్రశ్నిస్తాడు.
దిక్కుమొక్కులేని జనం
ఒక్కొక్కరు జ్ఞానబలం నిజం
రచన : వుప్పల నరసింహం
పుటలు : 132
వెల  : 150/-
ప్రతులకు : వుప్పల నరసింహం
జ్ఞానం పబ్లికేషన్స్‌,    హైదరాబాద్‌ – 500013
ఫోన్‌ : 99857 81799
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
– డా.పి.భాస్కరయోగి పుస్తక సమీక్ష  జాగృతి  కథనాలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి