ఒక రాజు తన మందీమార్బలంతో ఊరేగింపుగా వెళ్తున్నాడు. దారిలో భూమి రంధ్రంలో దాగిన ఒక కప్ప ఆ రాజుపైకి ఓ కాలును ఎత్తి తన్నబోయింది. ఎందుకంటే ఎవరో దారిన వెళ్తున్న సమయంలో ఓనాణెం పడిపోతే అది కప్ప ఉంటున్న రంధ్రంలోకి చేరింది. నాణెం స్పర్శ తగలగానే కప్పకు ధనహంకారం కలిగిందని శ్రీ రామకృష్ణ పరమహంస సరదాగా చెప్పేవారు. ఇది ఇప్పటికీ వర్తిస్తుంది. మనుషులు తప్పులు చేయడానికి ధనం ఒక కారణం. ఆధ్యాత్మిక జీవనంలో మనుషులు పవిత్రంగా ఉండకుండా చేస్తున్నది ధనమే. ‘ధన సంచయం’ అనేది ఓ వికృత మనస్తత్వం. పూర్వం ప్రజలకు ఇప్పుడున్న వసతులేవీ లేకున్నా ‘కాపీనవంత కడు భాగ్యవంత’ అన్నట్లు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని వసతులనూ అత్యంత వేగంగా పొందగలిగినా ‘మోకాళ్లలోతు సుఖం మొలలోతు దుఃఖం’గా జీవిస్తున్నారు. అత్యాశ కారణంగానే ప్రతిరంగంలో మనిషి యంత్రంలాగా వేగంగా పరుగెత్తుతున్నాడు. అపరిమితమైన ఆశతో అసలు సత్యాన్ని గుర్తించలేక జీవితం దుఃఖమయం చేసుకొంటున్నారు. ఈ అత్యాశ అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అంధకారంలో పడేస్తుంది.

అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసః త్రాసశ్చింతా భ్రమోనృణామ్‌

ధనసంపాదనలో నిమగ్నమయినవారు దాని అభివృద్ధి, రక్షణ, వ్యయం, నాశనం, అనుభవం కలుగగానే వరుసగా శ్రమ, భయం, విచారం, దుఃఖం సుఖభ్రాంతులను పొందుతారు- అని భాగవతం తెలిపింది. ఈనాటి ధనసంపాదనంతా సుఖంగా జీవించడం కోసం, తమ సంతానం రాబోవు రోజుల్లో ఆనందంగా జీవితం గడపడం కోసం అనుకొని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. కానీ, అందులోనే విలువైన జీవితం గడిచిపోయి మనకున్న అసలైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నది. మరి దీనికి పరిష్కారమేమిటి? రోగానికి ఔషధం, అజ్ఞానానికి జ్ఞానం ఎలాగో.. అలా అత్యాశకు ఆత్మ జ్ఞానమే ఉపాయం. జ్ఞాని అయినవాడు లోకంలోని దుఃఖానికి కారణం అత్యాశ అని గ్రహిస్తాడు. అది ఒక రోగం. దానికి ధర్మాచరణతో కూడిన ఆత్మజ్ఞానం ఔషధం. ఇది అర్థం చేయించడానికే పౌరాణిక గాథలు. అవి విని మనలోని అసలు తత్వాన్ని తెలుసుకుంటే ఆత్మశాంతి లభిస్తుంది.


*******************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి