జ్ఞానులు రోజూ చేసే ప్రబోధాలు సమాజంలో ఉత్తమ గుణాలు నిర్మాణం చేయడానికే. వారి అధ్యయనం, అధ్యాపనం, ఆచరణ అన్నీ సమాజహితం కోసమే. అయితే దరిద్రుడి వద్దకు మరో దరిద్రుడు దానం కోసం వెళ్తే అతని దుఃఖం తీరదు. రోగి దగ్గర మరొక రోగి వెళ్లి మందును యాచిస్తే రోగం తగ్గదు. అలాగే అజ్ఞాని దగ్గరకు ఇంకో అజ్ఞానివెళ్తే జ్ఞానం వికసించదు. కాబట్టి జ్ఞాన సముపార్జనకు సరైన గురువును ఆశ్రయించడమే ఉత్తమ ధర్మం. తాజా బావినీటిలో రూపాయి నాణెం వేస్తే ఎలా తళతళ మెరుస్తుందో.. వాసనలు లేని మనస్సు మొదట్లో అంత నిర్మలంగా ఉంటుంది. అనంతరకాలంలో రకరకాల జీవన మలుపులతో వ్యక్తిని ఈ మలినాలన్నీ ఆవరిస్తాయి.
మెదడు నిండా చెత్త పేరుకుపోతే కొత్త విషయాలకు తావుండదు. మనస్సు ఖాళీగా ఉండి నిర్మలత్వం పొందినప్పుడు అది చిత్తం అనే అంతఃకరణంగా మారుతుందని యోగ శాస్త్రం ప్రబోధిస్తోంది. ప్రాపంచిక వాసనల బలం పెరిగినపుడు మనస్సు అనేక విషయాలను తనకు తోడుగా తెచ్చుకుంటుంది. అవే అరిషడ్వర్గాలు, అహంకార, మమకారాలు. వీటి ప్రాబల్యం మనోబలాన్ని తగ్గించి పశుత్వంవైపు తీసుకెళ్తుంది. ఈ పశు స్వభావానికి వశమై పోవడం తప్ప ఇంకో జీవలక్షణం లేదు. ఒక్కోసారి జ్ఞానం కూడా బరువైపోయి అహంకారానికి దారితీస్తుంది. అది కూడా పెద్దబంధమే. అందుకే ‘‘అహంకారులైన విద్యావంతులకన్నా నిరహంకారులైన విద్యావిహీనులే ఉత్తములు’’ అని శ్రీరామకృష్ణులు చెప్తారు. మన శాస్త్రాలు ఎంత లోతుగా తత్వ దర్శనం చేశాయంటే.. శాస్త్ర పఠనం, గురూపదేశం లాంటివి కూడా ఇంద్రియ ప్రవృత్తులే. ఈ ప్రవృత్తిని వదిలిపెట్టగల నిస్సంగత్వం సాధకుడికి కావాలని చెప్పారు. అందరూ రమణ మహర్షిలా ఉండడం సాధ్యం కాదని మనకు తెలుసు. అందుకే గురుత్వం తత్వదర్శనానికి ప్రధానద్వారం. శాస్త్రపఠనం దారిదీపం. ఈ రెండూ ఆత్మ సాక్షాత్కారానికి కారణములు కాకున్నా కారణాలుగా స్వీకరించాల్సిన అవసరం ఎన్నో చోట్ల ప్రస్తావింపబడింది. పడవలో నీరు చేరకుండా జాగ్రత్త పడడం వేరు. పడవ నడపడం వేరు. అయితే, ఈ రెండూ పరస్పర ఆధారాలు. నడపడం వల్ల పడవ గమ్యాన్ని చేరిస్తే నీరు రాకుండా చేయడం మరణాన్ని ఆపుతుంది. అలాగే గురుతత్వం కూడా. అలాంటి గురువును వెదకి సేవించాలని గీత ప్రబోధం చేసింది.

తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేనసేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శినః

‘సద్గురువుకు ప్రణామం చేసి ప్రశ్నించి పరిచర్య చేసి బ్రహ్మజ్ఞానం ఆర్జించాలి. తత్వద్రష్టలైన జ్ఞానులు నీకు బ్రహ్మోపదేశం చేస్తారు’ అని దీని అర్థం. ఈ జ్ఞానుల ప్రబోధం నిరంతరంగా సాగుతూనే ఉంది. చెప్పడం వారి ధర్మం, వినకపోవడం మన ఖర్మం.

*******************************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి