గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించాక కేసీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ‘జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారట కదా!’- అన్న పాత్రికేయులకు సమాధానం చెప్తూ ‘చంద్రబాబు నాయుడుకు రెండు హిం దీ ముక్కలు సక్కగ మాట్లాడనీకె రాదు; ఏం చెక్రం దిప్పుతడయా? ఊకెనె దిరుగుతాది చక్రం?’’ అని వ్యంగ్యంగా అన్నారు. పాత్రికేయులు, అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వారు. 

నిజమే! జాతీయ భాష హిందీ నేర్చుకోకుండా జాతీయ రాజకీయాలు చేయడం సాధ్యమా? దిల్లీ, బిహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝా ర్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి దాదాపు 10 రాష్ట్రాల్లో అధికార భాషగా ఉంటూ, ప్రజలను అనుసంధానం చేయడంలో అగ్రగణ్యంగా ఉన్న హిందీని వ్యతిరేకిస్తున్నామంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తోపాటు తెలుగు పత్రికలు ‘లీడ్’ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆఖరుకు ‘నేను పార్లమెంటు సభ్యుడనై అనర్గళంగా పార్లమెంట్‌లో మాట్లాడాలని ఉంద’ని గొప్పగా చెప్పిన రేవంత్‌రెడ్డి ‘హిందీని మాపైన రుద్దుతారా?’అంటే అవాక్కయ్యాం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘నూతన విద్యా విధానం’లో భాగంగా హిందీని జాతీయ భాషగా అమలు చేయాలని సంకల్పంచింది. వెంటనే ‘దక్షిణాది రాష్ట్రాలు’ అంటూ రెచ్చగొట్టే పనికి విభజనవాదులు (తుక్డేతుక్డే గ్యాంగ్) పావులు కదిపారు. హిందీయేతర రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాలని చెప్పిన కేంద్ర మానవ వనరుల శాఖ మొదట ప్రతిపాదించి తర్వాత వెనక్కి తగ్గింది. గతంలో వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న డా.మురళీమనోహర్ జోషి ఇలాంటి జాతీయ సమగ్ర విద్యావిధానంపై చర్చ మొదలుపెట్టగానే- దేశంలోని కుహనా సెక్యులరిస్టులంతా ‘దేశం కాషాయ మయం’ అవుతుందని గగ్గోలు పెట్టారు. దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యతోపాటు విలువలు నేర్పుతున్న సరస్వతీ శిశు మందిరంలో ఆచార్యుడిగా పనిచేసిన రమేశ్ పోక్రియాల్ 2019 ఎన్నికలయ్యాక కేంద్ర మానవ వనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేసిన తొలి అడుగు ఇది. హిందీని గుడ్డిగా వ్యతిరేకించే తమిళ పార్టీలు, నాయకులతోపాటు ఎ.ఆర్.రహమాన్ (మతం మారిన సంగీతకారుడు) హిందీపై వెనక్కి తగ్గడం, స్వాగతించడం విచిత్రంగా ఉంది. మాజీ సీఎం సిద్ధరామయ్య కర్ణాటకకు ప్రత్యేక రాష్ట్ర పతాకం కావాలని, లింగాయత్‌లను వేరే మతంగా గుర్తించాలని రెచ్చగొట్టినపుడు వీళ్లంతా తెగ సంతోషపడి సిద్ధూను మెచ్చుకొన్నారు.


ఇక, 2018లో భాజపా కూటమి నుండి చంద్రబాబు పక్కకు జరిగాక ఉత్తర, దక్షిణాది అంటూ ఆర్థిక మంత్రుల సమావేశం పెట్టడం, పవన్‌కల్యాణ్ లాంటి అపరిపక్వ రాజకీయ నేత ఇదే రకమైన బాడీ లాంగ్వేజ్‌లో మాట్లాడడం తమిళ పార్టీల్లో ప్రాం తీయ, ప్రాదేశిక సెంటిమెంటును రెచ్చగొట్టడం చూశాం. చక్రాలు తిప్పేందుకు మా యావతి, ములాయం, ఆర్జే డీ, అఖిలేశ్ కావాలి, కానీ వాళ్లు భాషగా హిందీని ఎంత గౌరవిస్తారో ఈ చక్ర బాబులు విస్మరిస్తారు. ఆఖరుకు సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు అవినీతిపరులపై దాడి చేస్తే, అది కూడా ఉత్తరాది వారు మన ‘తెలుగుజాతి’పై దాడి చేస్తున్నారంటూ కలర్ ఇచ్చే ప్రయత్నం మొన్న మే 23వరకు జరిగింది.
ఏ ఆధారం లేకుండా భాషావేత్తలు పుట్టించిన ఆర్య- ద్రావిడ సిద్ధాంతం పెంచి పోషించిన ప్రజా తమిళ పార్టీలు పెరియార్ రామస్వామి మొదలుకొని స్టాలిన్ వరకు అదే మార్గంలో పయనిస్తూ రాజకీయం చేస్తున్నారు. 1937లో రామస్వామి నాయకర్ హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు. బళ్లారి జైల్లో ఉంటూనే జస్టిస్ పార్టీ నేత అయ్యాడు. ఈ జస్టిస్ పార్టీ 1944 వరకే ‘ద్రావిడార్ కజగం’గా మారిపోయింది. 1955, 1968లో ఈ వికృత మనస్తత్వం ఉత్తర భారత వ్యతిరేక దృష్టిగా మార్పు చెంది, రామాయణ సంస్కృతిని వ్యతిరేకించే వరకు వెళ్లింది. పాకిస్తాన్ లాగా ద్రావిడిస్థాన్ ఏర్పడాలని 1947 ఆగస్టు 15వ తేదీని ‘సంతాప దినం’గా ప్రకటించాడు పెరియార్. 1944లోనే పెరియార్ ద్రవిడస్థాన్ డిమాండ్‌ను బ్రిటీష్ వారికి విన్నవించేందుకు పన్నీర్ సెల్వంను దూతగా పంపగా, ఆయన విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ ప్రయత్నానికి తెరపడింది. 1955లో రామస్వామి నాయకర్ హిందీ వ్యితిరేక ఉద్యమం పేరుతో జాతీయ పతాకం దగ్ధం చేయించాడు. 1957లో 10వేల మంది అనుచరులను ఉసిగొల్పి ‘్భరత రాజ్యాంగ ప్రతుల’ను తగులబెట్టించాడు. 1960లో భారతదేశ చిత్రపటాలను తగులబెట్టాడు. ఆ తర్వాత 1958లోనే పెరియార్‌కు, నాటి గొప్ప సోషలిస్ట్ నేత రామ్‌మనోహర్ లోహియా మధ్య చర్చలు జరిగాయి. పెరియార్ 4 కోరికలను వదలిపెట్టాలని లోహియా సూచించారు. అందులో ‘హిందీ వ్యతిరేక పోరాటం’ కూడా ఒకటి..!


నిజానికి ఒకపుడు మద్రాస్ ప్రావిన్స్‌లో హిందీని ప్రవేశపెట్టాలని 1937లో రాజాజీ ప్రయత్నం చేసాడు. 1938 ఏప్రిల్ నాటికి హిందీ వ్యతిరేక ఉద్యమం తారస్థాయికి చేరి నటరాజన్, ధలముత్తులు అరెస్టయి జైల్లోనే మరణించారు. ఈ తీవ్రతను గమనించి 21 ఫిబ్రవరి 1940న మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోగా స్వతంత్రం సిద్ధించాక మరోమారు ఈ ప్రయత్నం జరిగింది. 1950 మే 2న ఇచ్చిన ఉత్తర్వులు మరోమారు హింసకు కారణమైంది. 1959లో, 1965లో ఇలాంటి ప్రయత్నాలు జరిగి ద్రావిడ పార్టీల రాజకీయం ఫలితంగా దాదాపు 63 మంది మరణించారు.
‘‘నేను తమిళంలో మా ట్లాడే రోజు, పెరియార్ నాకు హిందీలో జవాబు చెప్పేరోజు రావచ్చని నేను నాయకర్‌కు చెప్తే, ఈ దృక్పథాన్ని కజకం నాయకుడు హర్షించి’’నట్లు లోహియా చెప్పారు. అలా సాగిన ఈ ఉద్యమాన్ని డీఎంకే అధినేత కరుణానాధి ఓట్ల కోసం అలాగే కొనసాగించాడు. భౌగోళికంగా ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడును ‘మనం ప్రత్యేకం’ అన్న భావన కల్పించాడు. తమిళుల్లో భాషాభిమానం ఎక్కువ అన్న భ్రమలో ప్రజల్ని కరుణానిధి, ఇతర ద్రావిడ పార్టీలు ఉంచుతూ వచ్చాయి. నిజానికి పెరియార్ రామస్వామికి కన్నడ మూలాలుండగా, వై.గోపాలస్వామి (వైగో), కరుణానిధిలకు తెలుగు మూలాలున్నాయి. ఎంజీ రామచంద్రన్‌కు మలయాళ మూలాలున్నాయి. రజనీకాంత్ కూడా కన్నడ మూలాలున్న వాడే. ఇలా తమిళ ముఖ్యులంతా పరభాషా మూలాలున్నవారే.


ఈ గజ్జి ఇటీవల కన్నడ ప్రాంతానికి సోకింది. నిజానికి మన దేశంలో తమిళ, గుజరాతీ, మరాఠీ, కన్నడ ప్రాంతాల వాళ్లకు భాషాభిమానం మెండు. అలా ఉండడం తప్పు కూడా కాదు. కానీ ఈ ప్రాంతీయ భాషాభిమానం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. హిందీని జాతీయ అనుసంధాన భాషగా చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు ప్రయత్నించింది. దేశంలో అంతర్గతంగా ఎక్కువ మందిని కలపగల సత్తా హిందీకి ఉంది. అందుకోసమే రాజ్యాంగ నిపుణులు హిందీకి జాతీయ హోదా కట్టబెట్టకుండానే పార్లమెంటరీ కార్యకలాపాలు, న్యాయం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడికి అధికార భాషగా వాడొచ్చని రాజ్యాంగంలోని 343(1) ప్రకారం దేవణాగరి లిపి ఉన్న హిందీని ప్రభుత్వం స్వీకరించింది. అలాగే చట్టం ద్వారా తమ స్వంత అధికారిక భాష నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకు దఖలు పరిచింది. అదే సమయంలో దేశంలో భాషా బంధాన్ని కొనసాగించే బాధ్యతను హిందీ ద్వారా వ్యాప్తి జేసే బాధ్యతను రాజ్యాంగం నిర్దేశించింది. కేంద్రం ఈ బాధ్యత మోస్తూనే రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను అభివృద్ధిచేసే పనిని నిర్వర్తించాలని రాజ్యాంగం చెప్పింది.


ఎన్నో ఏళ్లనుండి కాంగ్రెస్‌తో అంటగాగిన తమిళ పార్టీలు ముఖ్యంగా డిఎంకె తన రాజకీయ అవసరాల కోసం ఆర్య-ద్రావిడ విభజన వాదంతో ముడిపెట్టి అలాగే కొనసాగించింది. విచిత్రం ఏమిటంటే 99 ఏళ్ల చరిత్ర ఉన్న ‘హిందీ ప్రచార సభ’ దక్షిణ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. తమిళనాడులో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం భారత ప్రజలందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. తిరువల్లువర్ గీతాలు దేశమంతా గుర్తించింది. బెంగాల్‌లో పుట్టిన స్వామి వివేకానందుడు ‘రాక్ మెమోరియల్’పై ధ్యానం చేసాడు. ఇదంతా మరచిపోయి అధికార యావ కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని రాజకీయానికి కుదువబెట్టిన మన నాయకులు ఉత్తర- దక్షిణాల అడ్డుగోడలు కట్టి విజయం సాధిద్దామని అనుకుంటున్నారు. కే వలం 3వేల పైచిలుకు ఆంగ్ల మూల పదాలున్న ఆంగ్లం అదే తమిళనాడులో నిస్సిగ్గుగా మాట్లాడటం గొప్పగా భావించే తమిళ నేతలు 7 లక్షల పదాలున్న హిందీపై చిన్నచూపును ప్రదర్శిస్తారు. ఇటలీ నుండి వచ్చిన సోనియాగాంధీ కుమారుడు రాహుల్ ప్రక్కన స్టాలిన్ నిలబడి రాజకీయం చేస్తాడు. కానీ ఉత్తరాది నుండి వచ్చే నాయకులు వాళ్లకు పరాయి వాళు..్ల ఎంత విచిత్రం!


ప్రపంచంలోని 190 దేశాల్లో 650 కోట్ల జనాభా ఉంది. 11 దేశాల్లో మాత్రమే ఆంగ్లం బాగా తెలిసిన వాళ్లున్నారు. అంటే 5% దేశాల్లోనే ఆంగ్ల ప్రభావం ఉందన్నమాట. నిజానికి ప్రపంచ భాష కావాలంటే 140 కోట్ల ప్రజలు మాట్లాడే చైనా మాతృభాష చీనీ గాని, 100 కోట్ల మందికి తెలిసిన హిందీ గాని, మూడవ స్థానంలోని ‘రూసీ’గానీ నాల్గవ స్థానంలోని స్పానిష్ గానీ, 5వ స్థానంలోని పోర్చుగీసు గాని కావాలి. కానీ 11 స్థానంలోని ఆంగ్లం ఇపుడు మనపై పెత్తనం చేస్తున్నది. బ్రిటన్‌కు బానిస దేశాలుగా ఉన్న భారత్, పాక్, న్యూజిల్యాండ్, అమెరికా, కెనడా లాంటి 11 దేశాలపై ఆంగ్లం బలవంతంగా రుద్దబడింది.


ఈ చారిత్రక పరిణామాలపై అవగాహన లేని నాయకులు, మేధావులు, కొన్ని మీడియా సంస్థలు కొందరిని అధికార పీఠంపై ఉంచేందుకు ఇలాంటి చౌకబారు కృత్రిమ ఉద్యమాలకు తెలుగునాట కూడా ఊపిరిపోయాలని చూస్తున్నారు. 1946 జూన్‌లో దేశానికి ‘హిందీ అధికార భాష’ అవుతుందని ప్రకటించారు. ‘‘స్వాతం త్య్రం వచ్చాక చట్టసభల్లో హిందీ మాట్లాడని వారిని జైలుకు పంపేందుకు నేను సత్యాగ్రహం చేస్తాను’ అన్న గాంధీ మాటలపై వాళ్లకు విశ్వాసముందా? యధాలాపంగా సాధ్వీప్రజ్ఞాసింగ్ ఏదో మాట్లాడితే దానిని తీవ్రంగా ఖండించిన వీర గాంధేయవారసులు ఇపుడు ఎందుకు నోరు మెదపరు? ఇదంతా రాజకీయం అని వారికి తెలుసు. ఏది తమకు అనుకూలమో దానిని ప్రజల మెదల్లోకి ఎక్కిస్తారు. కొన్ని కుటుంబాలను, కులాలను జాతికి ప్రతీకలుగా మార్చే ప్రయత్నం తెలుగునాట జరుగుతున్న ద్రావిడ ప్రాణాయామం! తస్మాత్ జాగ్రత్త..!


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*07-06-2019 : శుక్రవారం *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి