కశ్మీర్‌లో 370, 35ఎ రద్దు తర్వాత సగటు భారతీయులంతా ఉద్విగ్నతకు లోనయ్యారు. ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల ‘గ్రాఫ్’ ఆకాశమంత ఎత్తుకు చేరింది. ఈ ఇద్దరూ అవలంబించిన ‘స్ట్రాటజీ’ వారి చాణక్యాన్ని మరింత రాటుదేల్చి దేశ ప్రజల్లో వారి పట్ల అభిమానం పెరిగింది. ఇప్పటివరకూ పార్లమెంటు లోపలా బయటా మోదీ ప్రసంగాలను మాత్రమే జనం సీరియస్‌గా విన్నారు.
ఈసారి ‘అమిత్ షా’ ప్రసంగం కాస్త మందలింపులతో ఉద్వేగంగా సాగింది. ఇది చూశాక ప్రతిపక్షాలకు ఇప్పటి వరకూ ‘మోదీ మాత్రమే మాకు నిలువ నీడలేకుండా చేస్తాడని గగ్గోలు పెట్టేవాళ్లం.. షాను చూస్తుంటే మోదీనే మంచివాడనిపిస్తుంది’ అనుకున్నారట! అయితే యథాలాపంగా గులాం నబీ ఆజాద్ బాటలో ఒక్క అడుగు కూడా పక్కకు వేయకుండా రాహుల్ గాంధీ ‘ట్వీట్’ చేయడం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఏం ‘శుద్ధ గాంధేయవాది’ కాడు. వౌలానా అబుల్ కలాం ఆజాద్‌లా, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్‌లా ఏనాడూ ‘గాంధేయ కాంగ్రెస్’ మనస్తత్వం ప్రదర్శించలేదు.
గులాం నబీ ఆజాద్ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమర్‌నాథ్ యాత్రికులు మధ్యలో విశ్రాంతి తీసుకొనేందుకు, ఇతర సదుపాయాల కోసం దేవస్థానం బోర్డు అర్జీ మేరకు నూరెకరాల అటవీ భూమిని కశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. అదేమీ శాశ్వత నిర్మాణాల కోసం గాదు. మంచుకొండలెక్కే యాత్రికులకు దారిగుండా కనీస సౌకర్యాల కోసం మాత్రమే. దాని ఉపయోగం యాత్ర జరిగినన్ని రోజులే.
అయితే ఆ రోజు కాంగ్రెస్‌తో సంకీర్ణం నడిపిన పీడీపీ చేతుల్లో అటవీ శాఖ ఉండడం వల్ల ఆ మంత్రి కూడా ఓకె అనగానే ఈ ఆజాద్ ఆమోదముద్ర వేశాడు. హిందూ యాత్రికుల కోసం- అదీ కనీస సౌకర్యాల కోసం టెంపరరీ టెంట్ల కోసం ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకోవాలని, ఇక్కడ హిందువులు తిష్టవేస్తారనీ, దానికి ‘కాశ్మీరీయత్’ అనే ముసుగు తొడిగి ఆందోళన పుట్టించారు. వెంటనే ఇదే ఆజాద్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా దాన్ని వెనక్కి ఇప్పించింది. అంటే హిందువులకు కనీస సౌకర్యాల కోసం తాత్కాలికంగా భూమిని కేటాయించడం అక్కడి నాయకులకు సుతరామూ ఇష్టం లేదన్నమాట. జమ్మూ మొదలుకొని దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన లేచింది.
అయినా నాటి మన్మోహన్ సింగ్ సర్కారు గానీ, ఆజాద్ సర్కారు గానీ హిందువుల మనోభావాలపై కనికరం చూపలేదు. అంత నిఖార్సయిన లౌకికవాది గులాం నబీ ఆజాద్! ఆయన తోక పట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇన్నాళ్ళూ రాహుల్‌ను మాత్రమే బాల్య చేష్టలున్న రాజకీయ నాయకుడిగా ప్రజలు భావించేవారు. ఇపుడు ప్రియాంక గాంధీ ట్వీట్లు చూసి జనం నవ్వుకుంటున్నా రు. ‘‘ఇందిరా గాంధీలా ఆహా ర్యం వుంటే సరిపోదు. అ లాంటి నిర్భీతి కూడా ఉం డాలి’’ అంటున్నారు.
ఆఖరుకు పి.చిదంబరం లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతే ప్రియాంక ‘ఇది పిరికిపందల చర్య’ అనడం ఆమె అజ్ఞానానికి నిదర్శనం అంటూ విశే్లషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ బ్యాచంతా ఒకవైపు ఇలాంటి వడ్ల గింజల్లోంచి బియ్యం తీసే పనిలో ఉండగా, అటు ‘అర్బన్ నక్సల్స్’ అయోమయంతో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగునాట స్వయం ప్రకటిత మేధావులు, కుల పక్షపాత మీడియాలోని కొందరు హర్యాలీ మేధావులు 370 రద్దు అప్రజాస్వామికమని ఉడికిపోతున్నారు.
జర్నలిస్ట్ లేదా ఒక మతానికి చెందినంత మాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేయవచ్చా? ‘సంకెళ్లలో కాశ్మీర్.. కశ్మీరీల భావోద్వేగాలను ముళ్లకంచెలో బందీ చేసిన సందర్భం’ అంటూ రాష్టప్రతి ఇచ్చిన గెజిట్‌ను, పార్లమెంటును అవమానం చేసిన ఓ జర్నలిస్టు కొందరి ఆలోచనల్లో దేశం కన్నా గొప్పగా అయిపోయింది! వాళ్లందరికీ ఆదర్శమూర్తి అయిన అమర్త్యసేన్ ‘కశ్మీర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయంవల్ల భారతీయుడిగా గర్వపడలేనని’ చెప్పడం విడ్డూరం. మార్కిస్ట్ మదర్సా జెఎన్‌యూలోని కొందరు విద్యార్థులు, అలాగే మణిపూర్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, ఢిల్లీ లా స్కూల్, హెచ్‌సీయూ వంటి విశ్వవిద్యాలయ కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల నాయకులు ఆయా విశ్వవిద్యాలయాల్లో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు.
‘తుక్డే తుక్డే గ్యాంగు’కు అధ్యక్షురాలయిన షెహ్లా రశీద్ అనే వామపక్ష విద్యార్థి సంఘ నాయకురాలు కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడ మారణహోమం జరుగుతోందని ట్వీట్ చేసింది. ఇదే యువతి గతంలో 370 ఆర్టికల్ జోలికొస్తే దేశంలో అగ్గి రగిలిస్తామని, మాకు ఆజాదీ కావాలని బహిరంగంగా టీవీ చర్చల్లో చెప్పింది. అయితే షెహ్లా చెప్పినట్లుగా పారా మిలటరీ దళాలు ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడి అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ ఖండించారు. వాళ్లందిస్తున్న సమాచారమే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాదనకు బలం అందిస్తున్నది. ఇంకో పత్రికా సంపాదకుడు ‘పోటా టాడా చట్టాలు వచ్చినపుడు వచ్చి ప్రజాందోళన ఇపుడు రావడం లేదని’’ తీవ్రంగా బాధపడిపోతున్నాడు. రామచంద్ర గుహ అనే చరిత్ర మేధావి 370 ఆర్టికల్ రద్దును గాంధీ భుజాలపై పెట్టి తుపాకీ పేల్చాడు.
ఒకప్పుడు కాంగ్రెస్- కమ్యూనిస్టులు కలిసి ప్రభుత్వాలు నడిపారు. కొన్నిసార్లు విధానపరంగా విడిపోయారు. కానీ వీళ్లమధ్య పరస్పర సహకారం అంతర్గతంగా బలంగా ఉండేది. ఇటీవల మరణించిన కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు యస్.జైపాల్‌రెడ్డి తమకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించడమేగాక ఎన్నో సహకారాలు అందించేవాడని ఇటీవల ప్రొ. జి.హరగోపాల్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చాడు.
నక్సలైట్లను, మావోయిస్టులను, వారి అనుబంధ సం ఘాలను నిషేధించే అధికార పార్టీ బయటకు కన్పించేటట్లు చేస్తే, వారికి అంతర్గతంగా సహకరించేవారు ఉండేవారని తెలుస్తున్నది. ఇపుడు అర్బన్ నక్సల్స్ ముసుగులో అమర్త్య సేన్, షెహ్లా రశీద్ వంటివాళ్లు పరోక్షంగా మతతత్వాన్ని ఎగదోస్తున్నారు. ఇక కమ్యూనిస్టు నాయకులు, మేధావుల నోటికి మొక్కాలి. వాళ్లు ప్రతిరోజూ మతతత్వం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం అంటూ వల్లించే పదాలు 1984లో సిక్కుల ఊచకోత జరిగినపుడు, తొంభయ్యవ దశకంలో పండిట్లపై జరిగిన అత్యాచారాలు ఈ పరిధిలోకి రావు.
మాట్లాడితే కశ్మీరీల స్వేచ్ఛ, అభిప్రాయం అంటూ పిల్లి మొగ్గలు వేస్తున్న ఈ గ్యాంగ్ రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అనే పదం ఏ దేశ ప్రజలను అడిగి చేర్చారో చెప్పగలరా? దేన్నైనా బయట ఉండి ధ్వంసం చేయడం కన్నా ప్రక్కన ఉండి నాశనం చేయడం సులభం అని బ్రిటీషువారు నేర్పిన నీతి ఈ దేశ సరిహద్దులను కాపాడే సిక్కులను హిందువుల నుండి వేరు చేయడానికి 1841 తర్వాత ఐర్లాండు నుండి భారత్‌కువచ్చిన ‘మాక్స్ ఆర్థర్ మెకాలిఫ్’ అనే బ్రిటీషు అధికారి సిక్కు మతాన్ని స్వీకరించి భాయ్ కహ్నేసింగ్ నాభా అనే సిక్కు గురువును ప్రభావితం చేశా డు. 1897లో అతను రచించిన ‘హమ్ హిందూ నహీ’ అనే చిన్న పుస్తకం సరిగ్గా వందేళ్ల తర్వాత ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి దారిచూపింది. కాబట్టి పక్కనే ఉంటూ గోతి త్రవ్వుతున్న విదేశీ మానసపుత్రుల ‘అర్బన్ నక్సలిజాన్ని’ గట్టిగా ఎదుర్కొంటేనే భవిత.
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి