బతుకమ్మ పూజతో ఆత్మారాధనం, భూతారాధనం, ప్రాఙ్మానవ దేవతారాధనం, మాత్రారాధనం, సర్వదేవతారాధనం కన్పిస్తుంది. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ బతుకమ్మ. పూలు సాకారానికి, నిరాకారానికి సమన్వయ స్వరూపం. అవి సజీవంగా, సాకారంగా కన్పిస్తాయి. సాయంత్రానికి మాయమవుతాయి. పసుపు ముద్దను గౌరమ్మగా చేసి పూల మధ్యలో పెడతారు. ఈ గౌరమ్మనే  త్రిమూర్త్యాత్మక స్వరూపం.

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఒక జానపద ఉత్సవం. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. అయితే బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ, గౌరి పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.
బతుకమ్మను లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల  త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. అయితే శ్రీ లక్ష్మీదేవే ‘బతుకమ్మ’ స్వరూపంలో, ఆమె అవతారంగా తెలంగాణ ప్రాంతంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ‘లక్ష్మీ’ అంటే సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య అని భావిస్తారు. ఆమెనే ఈ సంపదలను ఇవ్వడానికి ‘శ్రీవాణి’ గిరిజగా భాసిస్తుందనేది అంతరార్థం.

శ్రీలక్ష్మినీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా! అన్న తెలంగాణ ప్రసిద్ధ బతుకమ్మ పాటలో ఇవన్నీ కన్పిస్తాయి. సర్వదేవతాస్వరూపమైన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో దేవీ నవరాత్రులతో సమానంగా నడుస్తాయి. ‘ఆశ్వియుజ శుద్ధపాడ్యమికి’ ఒక రోజు ముందు మొదలై నవమి వరకు కొనసాగుతాయి. ఇది పౌరాణిక విశేషం అయితే, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు  పర్వాలు జరుగుతాయి. అవి కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జన సామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతకమ్మ. ఈ బతుకమ్మకు అర్థం ‘జీవించు  బ్రతికించు’ అని. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది. 
బతుకమ్మ పండుగకు ఓ గొప్ప చారిత్రక ఆధారం కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ రాజులు ఎంత గొప్పగా పాలించారో జగమెరిగిన సత్యం. కాకతీయ రాజ్య పాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ ‘స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పనే  ‘దేవతా స్వరూపం’గా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్దం, బతుకమ్మ పేరుగా మారింది.

కాకతీయ వంశోద్భవకారిణీం
లోకోద్ధరణ స్వరూపిణీం
కృపామయీం కలుషహరిణీం
శక్తిమయీం రిపు విదారిణీం

నమామి శర్వాణీం ముక్తి దాయినీం అని కాకతీయులు కాకతమ్మను చేసిన ప్రార్థన. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపణిగా ఆరాధించి అటుశక్తి తత్వాన్ని, ఇటు ‘మాతృ దేవతారాధన’ను వారు స్థిరీకరించారు. ఆ కాకతమ్మనే అందరికీ బ్రతుకమ్మగా  బతుకునిచ్చే తల్లిగా చారిత్రక పరిణామం.

బతుకమ్మ సందేశం
ఇంతగా ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం దారుహా ఏర్పడలేదు. ప్రకృతిలో నుండి లభించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్ఠమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా కూడా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్ల నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడి నుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి. అన్న ఆధ్యాత్మిక, తాత్విక సందేహసంలో ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపైన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుందో అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసి మెలసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది.
మనకళ్లముందే వికసించిన పుష్పాలు మన మనస్సుకు ఆనందాన్ని కలిగించి పంచభూతాల్లోని నీటిలో కలిసిపోతాయి. అలాగే ఉన్నంతసేపు రంగు రంగుల పూలతో దర్శనమిచ్చి, పై భాగంలో గౌరమ్మ, దీపం, అగరవత్తుల వెలుగులు, వాసనలు, అన్నీ మాయమైపోతాయి. ఓ జీవుడా! నీవు ఎక్కడి నుండి వచ్చావు మధ్యలో అలంకారాలు చేసుకొని మాయమైపోతావు అన్న తాత్విక సందేశం ఇందులో ఉంది. 
బతుకమ్మ ఓ సామాజిక ఉత్సవం. సమాజంలో ఎలాగైనా భిన్న దృక్పథాలు  భాష, ప్రాంతం, కులం గలవాళ్లు జీవిస్తున్నారో అలాగే ప్రకృతిలోని ఎన్నో రకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. 

అని స్త్రీలు వాకిట్లో పెట్టి చుట్టూ తిరుగుతూ పాడుతారు. 
బతుకమ్మ లక్ష్మీదేవి స్వరూపం, గౌరిదేవి స్వరూపం, సరస్వతీ స్వరూపం కాబట్టే ఈ ముగ్గురి ఆరాధన ఇందులో కన్పిస్తుంది. అందుకే ‘భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై’ అని పాడుకుంటారు. బతుకమ్మ పండుగ అంతా అమంత్రకంగా స్త్రీలు జరిపే ఉత్సవం. అందువల్ల అనేక పాటలు పుట్టుకొచ్చాయి.
బతుకమ్మకు సంబంధించి భట్టు నరసింహకవి రచించిన పాటనే ప్రధాన ఆధారం. నరసింహకవి ఉయ్యాల పాటలో బ్రతుకమ్మ మూలాలు కన్పిస్తున్నాయి. ఇలా జానపద గాథ బతుకమ్మ చుట్టు తిరుగుతున్నది.

ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజ ఉయ్యాలో 
ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో..

ధర్మాంగరాజు భార్య సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తు ‘లక్ష్మీదేవి’ అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదిట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించటానికి దేవాన దేవతలు, మహర్షులు వచ్చి..

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో
శ్రీలక్షి దేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో.. 

అని ఆమె ‘బతుకమ్మ’ కావాలి అనే నామకరణం చేశారని, ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది. మరి బతుకమ్మ ఏ దేవి స్వరూపం? లక్ష్మీదేవియా, పార్వతియా అని ఆలోచిస్తే 

శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ  చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవివై పరమేశురాణివై
వరలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ

అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియచేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన తెలంగాణకు ప్రత్యేక శోభను కల్గిస్తుంది. 

తొమ్మిది రోజులూ ఉయ్యాలో
అతరి గుమ్మడి పూలు ఉయ్యాలో 
అని మొదలై...
పాడి పంటలు గలుగు ఉయ్యాలో
విష్ణుపథము గలుగు ఉయ్యాలో..  అని ముగిస్తారు.
బతుకమ్మ వేడుకల చివరి రోజు చీకటి పడే వేళకి  ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని  పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా వుంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత చక్కెర, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. 
డా॥  పి. భాస్కరయోగి

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట  అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
చద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
బతుకమ్మను సిద్ధంచేయుట
దుసరి తీగతో అల్లిన ‘సిబ్బి’ లేదా ఇత్తడి తాంబూలం, ఏదైనా పళ్లెంలో పుష్పాలను మేరుప్రస్థ శ్రీ చక్రంలాగా వర్తులాకారంగా పేరుస్తారు. ఈ పుష్పాల అడుగు భాగంలో పెద్దవైన మోదుగ, టేకు, బాదాం వంటి ఆకులను పరుస్తారు. దానిపైన రకరకాల పూలు బంతి, గునుగు, గోరంట, తంగేడు, నీలంకట్ల, కాకర, బీర, గన్నేరు, పారిజాత, పొన్న, మందార, మొల్ల, మల్లె, గుల్మాల, రుద్రాక్ష వంటి ప్రకృతిలో పెరిగే పూలను సేకరిస్తారు. వాటిని చక్కగా అలంకరించి దారంతో కడతారు. పై భాగంలో పసుపు ముద్దను పెట్టి గౌరమ్మగా భావిస్తారు.

శ్రీరామచంద్రుడూ ఉయ్యాలో అయోధ్య పట్నాన ఉయ్యాలో..
శుక్రవారమునాడు ఉయ్యాలో  చన్నీటి జలకాలు ఉయ్యాలో.. 
చిత్తుచిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ..
ఏమేమి పువ్వొపూచే గౌరమ్మ ఏమేమి కాయేపూసే..
కలవారి కోడలు ఉయ్యాలో కనకమాలక్ష్మి ఉయ్యాలో
ఊరికి ఉత్తరాన వలలో ఉడాలమర్రి వలలో
తంగేడు పూవుల్లో చందమామ మ్లెప్పుడొస్తావు చందమామ
ఒకనాటి కాలాన ఉయ్యాలో ఏమీ జరుగుతుందమ్మ ఉయ్యాలో

గంగమ్మ గౌరమ్మ కోల్ గొవ్వలడంగా కోల్


************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధాత్మికం  : విజయక్రాంతి
సోమవారం : అక్టోబర్  : 08 : 2018




ఇటీవల ప్రసార మాధ్యమాల్లో చాలా తెలివిగా ‘హిందుత్వ’ను ధ్వంసం చేసే కార్యక్రమాల్లో ‘దొంగబాబాలంటూ’ మొత్తానికి మొత్తం ఆధ్యాత్మిక గురువులపై ఏకపక్షంగా నిందలేస్తున్నారు. ‘హిందూమతం’ అనగానే శంకరాచార్యుల దగ్గర నుండి శివసత్తుల వరకు అందరిలోనూ తప్పులు వెతికేవాళ్లు ఎక్కువయ్యారు. ప్రశ్నలు వేసేవాళ్లు హిందుత్వను సంస్కరించాలని కాకుండా ద్వేషించేవారిలా ప్రవర్తిస్తున్నారు. నిజానికి హిందూ ధర్మంలో జిగీషు ప్రశ్న- గెలవాలనే కోరికతో అడిగే ప్రశ్న, జిజ్ఞాసు ప్రశ్న- తెలుసుకోవాలని అడిగే ప్రశ్న అని రెండు రకాలు. చాలామంది తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో కాకుండా హిందూమతంలో చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చేసి భూతద్దంలో చూపి తాము పేరు పొందాలనుకొంటున్నారు.

కొన్ని ప్రసార మాధ్యమాలు, కొందరు వంకర టింకర మేధావులు, షార్ట్‌కట్‌లో పేరు పొందాలనుకొనేవారు హిందుత్వపై ఎక్కి స్వారీ చేయాలనుకొంటారు. ఉదాహరణకు ఇటీవల తెలుగులో హిందుత్వను బాగా వ్యతిరేకించే ఓ టీవీ చానల్ కడుపున మరో పిల్ల పుట్టింది. దానిని తొందరగా ప్రచారంలోకి తేవడానికి ఆ చానల్ యాజమాన్యం శబరిమల ఘటనను ఉపయోగించుకోవాలనుకొన్నది. ఆ చానల్ రిపోర్టర్‌ను శబరిమల ఆలయంలోకి వెళ్లమని పంపించారు. నాస్తికురాలైన ఆమెను భక్తురాలిని చేసిన ఘనత ఆ ప్రసార మాధ్యమానికే దక్కింది. 

దీని వెనుక భక్తికన్నా ఆ చానెల్‌కు అడ్డదారిన పేరు తేవడమే వారి ముఖ్య లక్ష్యం.
ఈ హిందుత్వ వ్యతిరేక శక్తులు- ఎవరో అనామకులు భక్తి పేరుతో చేసే మోసాలను మొత్తం హిందుత్వకే అంటగట్టాలని చూస్తున్నారు. సమాజం విస్తృతంగా ఉన్నపుడు అందులో జరిగే పొరపాట్లను మొత్తం సమాజానికి ఆపాదించడం నేరం. ఇతర మతాలు మెజారిటీగా ఉన్నచోట్ల ఇంతకంటే ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కేరళలో అత్యాచారం చేసిన ఓ మత గరువును గొప్పగా స్వాగతించినా ఒక్కరూ దానిపై మాట్లాడలేదు సరికదా దాని గురించి పనె్నత్తలేదు. అయిదు శాతం జనాభా ఉన్న వాళ్లలోనే ఇలాంటివి ఉన్నపుడు 83 శాతం జనాభా ఉన్న హిం దూ సమాజంలో అక్కడక్కడ జరిగే అవాంఛనీయ ఘటనలు మొత్తం ధర్మానికే ఆపాదించడం తగదు.

మనం మార్కెట్లోకి వెళ్లినపుడు నాణ్యతగల, తక్కువ ధరగల వస్తువులనే ఖరీదు చేస్తాం గాని అందుకు భిన్నంగా కొనలేము కదా. అలాగే ఈ దేశంలో ఎందరో మంచి గురువులు దేశ సంస్కృతికి ఆధారంగా నిలిచారు. సనాతన ధర్మాన్ని సజీవంగా ఉంచుతున్నారు.

పాషండ మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని పంచాయతన ఆరాధనతో మరోసారి ధర్మ వైభవాన్ని చాటిన ఆదిశంకరుల మా ర్గం మనం ఎలా వదలిపెట్టగలం. కీటువార, భోగవార, ఆనందవార, భూరివార అనే సంప్రదాయాలను సృష్టించి ద్వారక, గోవర్థన, జ్యోతిర్మఠం, శృంగేరి మఠాలను స్థాపించి, సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టిన ఆదిశంకరుడు మనకు గురువు కాదా? దళితుల నుండి ఆళ్వారులను సృష్టించిన శ్రీమద్రామానుజులను ఈ జాతి ఎలా మరిచిపోతుంది? వచనాల్లో వేదాంతాన్ని అందించి దక్షిణభారతంలో నిమ్నకులాల్లోనూ ఆధ్యాత్మికతను సాధించి మహాత్మా బసవేశ్వరుని అడుగుజాడలు మనం విడిచిపెట్టగలమా? శూద్ర కులాలకు పీఠాలను స్థాపించే విధంగా వేదాంతులను తీర్చిదిద్దిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని ఈ జాతి నుండి ఎవరైనా వేరు చేయగలరా? అంతెందుకు..? ఇటీవలి కాలంలో ఎందరో ఆధునిక గురువులు హిందూ మత వైభవాన్ని తమ తమ పంథాను అనుసరిస్తూనే గొప్పగా ఆచరించారు. స్వామి శివానంద, పరమహంస యోగానంద, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ మహరాజ్, సత్యానంద్ మహరాజ్, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, శ్రీలప్రభుపాద, ప్రభాత్ రంజన్ సర్కార్, బ్రహ్మం బాబా, రమణారెడ్డి, స్వామి రామతీర్థ, రామకృష్ణ పరమహంస, ముమ్మిడివరం బాలయోగీశ్వరులు, సదాశివ బ్రహ్మేంద్ర, మెహర్‌బాబా- వీళ్లంతా తమ జీవితకాలమంతా శుద్ధమైన వేదాంతాన్ని అందించారు. మన శాస్త్రాల్లో వున్న గహనమైన విషయాలను సులభరీతిలో మనకు అందించి, ఆధునిక వేదాంతంగా మెరుగులు దిద్ది ఇంకో వెయ్యేళ్లకు కావాల్సిన ఆధ్యాత్మికదారులను సిద్ధం చేసి శరీరాలను వదలిపెట్టారు.

అలాగే ఇపుడు శరీరంతో ఉన్నవాళ్లు కొందరు ఆత్మజ్ఞానులైతే మరి కొందరు ధర్మరక్షణ చేసే వీర యోధుల్లా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని నిత్య నూతనం చేస్తున్నారు. మాతా అమృతానందమయి- రూపంతో, కులంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా తన ఆధ్యాత్మిక సేవలను ఆధ్యాత్మికత వైపు మరల్చింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఉద్యమ సారథి రవిశంకర్ గురూజీ తీవ్రవాదులతో చర్చలు జరిపి శాంతి సౌభ్రాతృత్వాలను సాధిస్తున్నారు. బాబా రాందేవ్ ఇవాళ పతంజలి బ్రాండ్ అనే భారతీయ మార్కెట్ సృష్టించి కోకోకోలాకే నీళ్లు తాగిస్తున్నాడు. ఇంత గొప్ప గురువులు ఈ దేశంలో పుట్టి నిస్వార్థ చింతనతో జాతికి మేలు చేస్తుంటే- ఎవరో చిల్లరగాళ్లు చేసే బాణామతులు, చేతబడుల ఘటనలకు బాబాల పేర్లు తగిలించి హిందుత్వను అ పఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నం చాపక్రింద నీరులా జరుగుతోంది. సమాజ హితమే లక్ష్యంగా దధీచి మహర్షి వారసుల్లా అనాథ ఆశ్రమాలు, బీదల కోసం పాఠశాలలు, కుటీర పరిశ్రమలు, వృద్ధాశ్రమాలు నడుపుతున్న గురువులు ఒకవైపు ఉండగా, రాజదండం బలహీనమైనపుడు ధర్మదండంతో జాతిని రక్షించే గురువుల బలాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ఈ కుట్రను ఇకనైనా గ్రహించకపోతే జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. తస్మాత్ జాగ్రత్త!

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
ఆంధ్రభూమి : భాస్కర వాణి
శుక్రవారం : నవంబర్ : 02 : 2018
వర్సిటీల ధుర్గతికి కారకులెవరు?

రాజగృహంలోని సాలవతి అనే పరిచారిక పుత్రు డు జీవకుడు. అతడు రాజ కుమారుడైన అభయుని చేతిలో పెరిగాడు. కొన్నాళ్లకు జీవకుడు ఏదైనా కళను అభ్యాసం చేయాలని సంకల్పించి తక్షశిల విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. గొప్ప ఆయుర్వేద పండితుని దగ్గర శిష్యుడై ఏడేండ్లు విద్యాభ్యాసం చేశాడు. తన విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తవుతుందని గురువును అడిగినపుడు- ఆయన ఓ పరీక్ష పెట్టాడు. జీవకుడికి ఓ పారను ఇచ్చి తక్షశిల కేంద్రంగా ఓ యోజనం దూరంలోని మొక్కలను పరీక్షించి ఔషధానికి పనికిరాని మొక్కను తెమ్మన్నాడు. జీవకుడు తిరిగివచ్చి ‘ఔషధానికి ఉపయుక్తం కాని మొక్క ఒక్కటి కూడా నాకు కన్పించలేద’ని అన్నాడు. దాంతో గురువు సంతోషించి నీ వైద్యవిద్య పూర్తయ్యిందని ఇంటికి పంపించాడు
.

ఈ జీవకుడే ఓ పెద్ద వ్యాపారి భార్యకు గొప్ప వైద్యం చేసి 16 వేల కార్షపణములు, రథాలు బహుమతిగా పొం దాడు. అలాగే, బింబిసార చక్రవర్తి మూలశంక వ్యాధిని ఇతను తగ్గించినట్లు బౌద్ధ సాహిత్యంలోని వినయపిటకం వల్ల తెలుస్తున్నది. ఇలాంటి విద్యలను అందించిన గొప్ప విశ్వవిద్యాలయాలకు నిలయం భారతదేశం. తక్షశిల, విక్రమశిల, నలంద, శ్రీపర్వతం వంటివి భారతీయ విద్యలకు, కళలకు పుట్టినిళ్లుగా భాసిల్లాయి. యువాన్ చాంగో, ధోన్-మి వంటి విదేశీయులు మన విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేశారు. గుణమతి, స్థిరమతి ప్రభామిత్రుడు, జ్ఞానచంద్రుడు, జినమిత్రుడు, ధర్మపాలుడు, నాగార్జునుడు వంటి గొప్ప విద్యావేత్తలు ఆ విద్యాసంస్థల్లో ప్రబోధకులు. వైదిక గ్రంథాలు, హేతువిద్య, శబ్దవిద్య, యోగశాస్త్రం, రసవాదం, సాంఖ్యవిద్య, చికిత్స విద్య వంటివి నేర్పించిన ఈ విశ్వవిద్యాలయాలు జగత్ప్రసిద్ధి పొందాయి. కేవలం నలందా విశ్వవిద్యాలయంలోనే 10 దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, 9 అంతస్థుల గ్రంథాలయం, 2వేల మంది ఆచార్యులకు వసతి గృహాలు, 10,500 మందికి విద్యాభ్యాసం చేసేలా వసతులుండేవంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా, టిబెట్, కొరియా, ఇండోనేషియా, పర్షియా, టర్కీల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసేవారు.

క్రీ.శ.427 నుండి 1197 వరకు నలందా విశ్వవిద్యాలయం మన దేశ విద్యా వ్యవస్థకే తలమానికం. మరి ఇలాంటి విద్యాలయం ఎక్కడ మాయమైంది? బక్తియార్ ఖిల్జీ అనే మతోన్మాది చేసిన విధ్వంసంలో ఈ విద్యాసుమం మాడి మసైపోయింది. బౌద్ధ సన్యాసులను చంపేసి, మరికొందరిని తరిమేసి, గ్రంథాలయాలను ఖిల్జీ తగులబెడితే అది మూడు నెలల పాటు తగులబడిందని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మాజీ డీన్ జెఫ్రీ గార్డన్ ‘న్యూయార్క్ టైమ్స్’లో రాసాడు.

కానీ, ఇటీవల కొందరు మేధావులు అజ్ఞానంతో న లంద, తక్షశిల వంటి విద్యాలయాలను హిందువులు ధ్వంసం చేశారని దుప్ప్రచా రం మొదలుపెట్టారు. ఇంత చారిత్రక అజ్ఞానులు మేధావులా? ఇదంతా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఇటీవల మన దేశంలో విశ్వవిద్యాలయాలు దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారాయి. ఇక్కడున్న అందరూ అలా అని చెప్పలేం గాని కొందరు విద్యాలయాలను రాజకీయ శిక్షణ కేంద్రాలుగా మలచుకొంటున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), ఢిల్లీ విశ్వవిద్యాలయం (డియూ), యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వంటివి ఇటీవల ఎన్నోసార్లు వార్తల్లోకెక్కినవే.

ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన అనేక సంఘటనల తర్వాత ఇటీవల జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జాతీయవాద విద్యార్థి సంఘం గెలుపొందింది. కొన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగాలు సంపాదించి మేధావులుగా చలామణి అవుతున్న కొందరు- ‘యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి’ అంటూ క్రొత్త సంచలనాలు రేపుతున్నారు. ముంబయి బాంబు పేలుళ్లలో వందలాదిమందిని బలి తీసుకొన్న యాకూబ్ మెమన్ అనే తీవ్రవాదికి కోర్టు శిక్ష వేస్తే అతనికి నివాళులు అర్పించి నినాదాలు చేసినపుడు విశ్వవిద్యాలయాలు భ్రష్టుపట్టలేదా? ‘రెండు దేశాల సిద్ధాంతాని’కి పితామహుడైన మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్) చిత్రపటాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో తగిలించినపుడు యూనివర్సిటీల పతనం గుర్తుకు రాలేదా? అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేసి కశ్మీర్ లోయకు వెళ్లి తీవ్రవాదం రేకెత్తించిన మన్నాన్ వనీని మన భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో చంపేశాయి. అలాంటి కరడుగట్టిన తీవ్రవాదికి అలీగఢ్ ముస్లిం వర్సిటీలో కొందరు విద్యార్థులు ప్రొఫెసర్ల పరోక్ష మద్దతుతో నివాళులు అర్పించినపుడు విశ్వవిద్యాలయాలు పతనం వైపు వెళుతున్నట్లు ఈ మేధావులకు ఎందుకు అన్పించలేదు.

ఇంకా దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్స్, ‘లవ్ ఆఫ్ కిస్’ వంటి కార్యక్రమాలు చేసినపుడు విద్యార్థులు పెడద్రోవ పడుతున్నట్టు ఈ ‘ఎర్ర’ మెదడు మేధావులకు కన్పించలేదా? ‘ఆజాదీ’ పేరుతో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వంటి విద్యార్థి నేతలు చెలరేగిపోయి ప్రసంగాలు చేసి విశ్వవిద్యాలయ విద్యార్థులను రెచ్చగొట్టినపుడు విద్యా విలువలు గుర్తుకురావా?

విశ్వవిద్యాలయాలకున్న స్వయం ప్రతిపత్తిని, అస్తిత్వాన్ని ఆధారం చేసుకొని ‘్భవస్వేచ్ఛ’ పేరుతో చెలరేగిపోవడం ఎంతవరకు సబ బు? దేశానే్న ప్రమాదంలోకి నెట్టే ఆలోచనలు చేసే విచ్ఛిన్నర శక్తులకు విశ్వవిద్యాలయాలు నిలయాలుగా మా రాలా? సెమినార్లు, సదస్సులు విద్యార్థుల పరిశోధనా శక్తికి, సృజనాత్మకతకు కేంద్ర బిందువు కావలసింది పోయి తమకు నచ్చనివారిపై దుమ్మెత్తిపోసే విష సంస్కృతిని ‘సిన్సాప్సిన్’గా మార్చడం సరైందా? పత్రికలను, ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని మేధావులుగా చెలామణి అవుతూ తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిప్పించుకొన్న ఘనత- ‘గొప్ప తాత్విక, చారిత్రక, విద్యా వ్యవస్థ పరిణతి తెలిసిన’ మేధావులది! దార్శనికత, అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం ఉన్న మన తొలితరం నాయకులకు రాజకీయ అధికారం అప్పజెప్పి సాంస్కృతిక, కళా, సాహిత్య, విద్యా రంగాల్లో తిష్ట వేసుక్కూచుని ‘ప్రజాస్వామ్యం’ అని కబుర్లు చెప్పిన ‘అవార్డు వాపసీ గ్యాంగ్’ ఈ డెబ్భై ఏళ్ళలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ఈ వ్యవస్థ అంతా ఇప్పటివరకు వీళ్ల చేతుల్లోనే కదా ఉన్నది?

ఇంకా బహుజనులకు విద్యారంగంలో, పరిశోధనా రంగంలో కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి? నాయకులు ‘అధికారమే జ్ఞానం’ (పవర్ ఈజ్ నాలెడ్జ్) అనుకుంటే, ఈ మేధావులు ‘జ్ఞానమే అధికారం’ (నాలెడ్జ్ ఈజ్ పవర్) అనుకొంటున్నారు. తత్వదృష్టితో చూస్తే ఈ రెండూ నాణేనికి ఇరు పార్శ్వాలే! రెండింటిలో ఒకటి తామసాహంకారం, రెండవది సాత్వికాహంకారం. అంతే తేడా! ఇంతలో గొంతులు చించుకునే ఈ గద్దె దిగిన ప్రొఫెసర్లు, మేధావులు, వాళ్ల బాకాలు ఇనే్నళ్లలో మన విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రతిష్ఠ వున్న 200 విశ్వవిద్యాలయాలతో సమానంగా ఎందుకు చేయలేకపోయారు? 

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మొదటి వైస్ చాన్సలర్ పార్థసారధి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌లను నెత్తిన పెట్టకొని ఊరేగే ఈ వంది మాగధులు ఇపుడు అక్కడ జరుగుతున్న దేశ విద్రోహ చర్యలను ఏనాడైనా ప్రశ్నించారా? జెఎన్‌యు విశిష్టత ‘ప్రశ్నించే తత్వంలో వుంది’ అంటూ ‘మార్క్సిస్ట్ మదర్సా’గా మార్చిన తుక్డే తుక్డే గ్యాంగుకు వ్యతిరేకంగా ఈ ‘విశ్వవిద్యాలయ పరిరక్షకులు’ నోరు తెరచి మాట్లాడగలరా? సెంట్రల్ యూనివర్సిటీలో కులాల సంఘర్షణతో అరాచకం సృష్టించాలనుకొన్న శక్తులు- విద్యార్థి సంఘ ఎన్నికల్లో జాతీయవాదం గెలవగానే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. 

ఈ డెబ్భై ఏళ్లలో పెట్టుబడిదారీ వ్యవస్థలేని రాజ్యంగా భారత్‌ను నిర్మించినట్లు ఈ ‘చైనా రష్యా భక్తులు’ పోజులిస్తున్నారు. ఇపుడు ‘్ఫసిజం’ అనే కొత్త పదాన్ని సృష్టించి చేస్తున్న ప్రచారం పసిగట్టకపోతే దేశానికే పెను ప్రమాదం.

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
ఆంధ్రభూమి : భాస్కర వాణి
శుక్రవారం అక్టోబర్ : 26 : 2018

చాపకింద నీరులా.. ‘సాంస్కృతిక విధ్వంసం’!




ఒకఫ్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉండేవి. సెలవుల్లో పల్లెలకు చేరాలనే ఉబలాటం పిల్లలకూ, పెద్దలకూ ఉండేది. పట్టణాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా పెట్టేబేడా సర్దుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పల్లె దారి పట్టేవారు. ‘బతుకమ్మ’ ఆడే అక్కాచెల్లెళ్ల కోసం అడవంతా గాలించి సోదరులు గోరింట పువ్వులు, బీర, కట్లపూలు, గునుగు, గుమ్మడి, టేకు, అల్లిపూలు తెచ్చి పెట్టేవారు. తాము సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో కొత్తబట్టలు కొనుక్కొని, పిండివంటలు (మాంసాహారం తినేవారు కూడా) తిని ఇంటికి వచ్చిన అతిథులతో ఆనందంగా గడిపేవారు. అలాగే దసరా సమయంలో అందరూ వ్యవసాయ పనులు తగ్గించుకొని తీరిగ్గా ఉండేవారు కాబట్టి పండుగకు ముందు వేసే పగటి వేషాలు అందరినీ అలరించేవి. గ్రామీణ కళాకారుల ప్రతిభకు అద్దం పట్టేవి. వారి అభినయంలో, వాక్చాతుర్యంలో ఇతరులను అనుకరిస్తూ చేసే ఈ పాత్రలు సంఘంలోని బలహీనతలను, ప్రత్యేకతలను వ్యంగ్యంగా ఎత్తిచూపటం ఈ వేషాల ప్రధాన ఉద్దేశం. ఎవరూ బాధపడని సున్నిత హాస్యం ద్వారా మనుషుల్లోని చెడును బయటపెట్టేవారు. పఠాన్ వేషం, లత్కోర్‌సాబ్, తాగుబోతు వేషం, భిక్షకుల వేషం, పిట్టలదొర.. ఇలా అనేక వేషాలు సమాజంలోని రుగ్మతలను ప్రత్యక్షంగా బయటపెట్టేవి.
ఇపుడు ఇదంతా ఎందుకు ధ్వంసమైంది? మనిషిని ఒక యంత్రంలా మార్చి వ్యాపార, వాణిజ్య చట్రంలో బంధించి క్షణం తీరిక లేని వ్యక్తిగా చేస్తున్నది ఎవరు? భావోద్వేగాలతో, సంఘర్షణలతో మనం ఎందుకు జీవిస్తున్నాం? ఇలాంటి వౌలిక ప్రశ్నలకు మనం దూరం అయ్యేలా- ఏదో అదృశ్యశక్తి మనల్ని సాంస్కృతిక వి ధ్వంసం వైపు నడిపిస్తున్నది అన్న సత్యం తెలుసుకొనే సమయం కూడా మనకు లేదు. ‘సజీవంగా వున్న పూలు ఉదయం వికసిస్తాయి. ప్లాస్టిక్ పూలు సాయంత్రానికి వాడిపోతాయి’ అంటాడు ఓ తత్త్వవేత్త. మనముందు జీవం వున్న అన్ని విషయాలను ‘టీవీ’ అనే ‘మాయామంత్రజాలపు’ పెట్టెలో మూసేశాం. ఇందుకు ఒక ఉదాహరణ బాగా పనికివస్తుంది. 1914 నుండి 1917 వరకు జరిగిన ప్రథమ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ గొప్ప విజయాన్ని సాధించింది. అదే ఫ్రాన్స్ 1945లో దారుణంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలవగానే ఉన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఫ్రాన్స్ విచక్షణ కోల్పోయింది. అక్కడ 1926లో టెలివిజన్ ప్రారంభం అయ్యింది. పబ్బులు, క్లబ్బులు విస్తృతంగా తెరవబడినాయి. తర్వాత ‘కాసినోస్’ తెరచుకొన్నాయి. జూదం ఆడేందుకు కావలసిన స్థలాలు వచ్చేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఒక తరం మొత్తం ఇందులో పడి కొట్టుకుపోయింది. అంత శక్తిమంతమైన దేశం ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల తన అస్తిత్వం కోల్పోయింది. 1945 తర్వాత ఫ్రాన్స్‌లో అధికారం చేపట్టిన చాల్స్ డిగోల్ తన దేశ చరిత్రను తిరగరాసాడు. ఆయన ఫ్రా న్స్ అధ్యక్షుడయ్యాక టీ వీల్లో కార్యక్రమాలు ఆపేశాడు. బార్లు, క్లబ్బులు, పబ్బులు, కాసినోలు, థియేటర్లు మూయించాడు. ఫ్రాన్స్ యువతలో ‘ఫ్రెంచి సంస్కృతి’ పట్ల అపారమైన గౌరవం కలిగించాడు. ఇపుడు కూడా ‘బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్’ అనే నిదానాన్ని తమ హృదయంలో నింపుకొన్నందుకే ఆ దేశం ముందుకు సాగుతోందని ప్రఖ్యాత మేధావి రాజీవ్ దీక్షిత్ ఓ చోట అంటారు.
మరి.. మనకేం దరిద్రం చుట్టుకొంది. దేశీయ సంస్కృతికి విధానం లేకుండా అస్తిత్వాల ముసుగులో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కొంటున్నాం. సంఘర్షణ లేకుండా సమన్వయంతో మనం ఎందుకు ఈ దృక్పథాన్ని సాధించలేకపోతున్నాం. మన ‘సంస్కృతిని వ్యాపారమయం’ చేయడం ఒక కారణమైతే, విదేశీ భావజాలాలతో పుట్టిన విధానాలు, మతాలు మరొక కారణం. ప్రతిదాంట్లో వ్యతిరేక దృక్పథాన్ని సృష్టించడం మరొక భావ దారిద్య్రం. ఈ పత్య్రామ్నాయ సంస్కృతి సంఘర్షణ లేకుండా సమన్వయ దృక్పథంతో సాధిస్తే ఫర్వాలేదు కానీ ఎదుటివారిని వ్యతిరేకించాలనే ధోరణిని సృష్టిస్తేనే ప్రమాదం. ఇదంతా మళ్లీ కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ధోరణితో సాగేదే తప్ప ఒక పట్టాన తేలదు.
స్వాతంత్య్రం వచ్చాక మనం ఫ్రెంచి వాళ్లలాగా అడ్డూ అదుపు లేని వాళ్లం అయ్యాం. దాని అవలక్షణాలు ఇపుడు సమాజంలో, రాజకీయాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. రాజకీయం ఒక ‘ఈవెంట్’ మాదిరి మారిపోయింది. వ్యక్తిగత విలువల కన్నా తమ స్వలాభమే గొప్పదన్న ధోరణి ప్రబలింది. అది అన్నింటినీ మ్రింగేసే బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. దాని కోరల్లో చిక్కుకున్న మనం ఈ జాతి గురించి, మన సంస్కృతి గురించి ఎందుకు ఆలోచిస్తాం? మన చరిత్రకు చెదలు పట్టించి మనకు స్వాభిమానం లేకుండా చేసినవాళ్లు కొందరైతే, మనకున్న సంస్కృతీ సంప్రదాయాలను దిగమ్రింగి విదేశీ భావజాలాన్ని మననెత్తినిండా చొప్పించినవాళ్లు మరికొందరు! నిసర్గ తత్వాన్ని చెప్పే బతుకమ్మ పూలు ప్లాస్టిక్‌తనాన్ని సంతరించుకొన్నాయి. అది కూడా ఓ రాజకీయ క్రీడగా మారి తన సహజత్వాన్ని కోల్పోయింది. పూర్వం మనవాళ్లు గళ్ల ఉప్పును, గోమయాన్ని కాల్చి తయారుచేసిన పళ్లపొడిని వెక్కిరించిన వాళ్ల నేడు- ‘మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?’ అంటుంటే, ‘ఇది వేద విజ్ఞానాల సంగమం’ అని తాటికాయంత అక్షరాలపై కోల్గెట్ పేస్టుపై రాస్తుంటే మనం వెర్రి గొర్రెల్లా చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. రాగి పాత్రలో రాత్రివేళ నీళ్లు పెట్టి ఉదయం పరగడుపున త్రాగాలని పెద్దలు, అలా చేస్తే తిట్టిపోసిన మనమే, క్రొత్త క్రొత్త డిజైన్‌ల రాగిపాత్రల్లో స్టార్ హోటళ్ల వడ్డింపులు చూసి లొట్టలేస్తు న్నాం. రాగి అంబలి (రాగిమాల్ట్) మధుమేహ రో గులు మొదలుకొని మద్యం త్రాగేవాళ్ల వరకు మంచిదని చెప్తే ముఖం త్రిప్పుకొన్న మనం, ఇవాళ డీమార్ట్ నుండి రాగి పిండి తెచ్చుకొని లీటర్ బాటల్ ఎత్తి అంబలి త్రాగుతున్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్‌ను చూసి ఆశ్చర్యపోతాం! మన ఎముకలను బలంగా ఉంచి, మనకు ఆరోగ్యం కల్గించే ‘సూర్య నమస్కారాలు’ రోజూ చేయండని మన యోగవేత్తలు చెప్తే- అది ‘మతం’ అని ‘విజ్ఞాన వేదిక’ల వీరులు టీవీల్లో కూర్చుని చెప్తే నమ్మేశాం. కానీ ఉదయపుటెండ శరీరానికి మంచిదని ఏర్పాటుచేసిన ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా డి- విటమిన్ మాత్రలు మ్రింగుతున్నాం!
మధుకైటభులు, మహిషాసురుడు, శుంభనిశుంభులు, చండముండులు, రక్తబీజుడు మొదలైన వాళ్లంతా అసురశక్తులకు ప్రతీకలు. ఈ నకారాత్మక శక్తులను జయించేందుకు స్ర్తిమూర్తులు సిద్ధం కావాలన్నది పౌరాణిక సందేశం. మహిషాసురుడిని అంతం చేసినందుకు దసరా సందర్భంగా దుర్గామాతను తొమ్మిదిరోజుల పాటు పూజిస్తాం. కానీ- ‘టెన్త్‌క్లాస్’ సినిమా ‘లవ్’ను ప్రోత్సహిస్తూ, ఆడవారిపై రోజూ దాడులు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్న కబోదులం మనం! మతవాదానికి మేం వ్యతిరేకం అంటే- ‘సెక్యులరిజం’ అనుకుంటాం కానీ ఆ వ్యతిరేకత మన సాంస్కృతిక విధ్వంసం అని మనకు తెలియదు. నిజంగా అన్ని మతాల మతతత్వానికి వ్యతిరేకం అంటే సంతోషమే. కానీ ఇప్పుడు జరుగుతోంది అలా కాదే!?
అందుకే మైకేల్ డానినో అనే పాశ్చాత్యుడు- ‘మతాలన్నీ ఒకే సత్యం చెప్తాయి అనడం ఓ ఫ్యాషనైపోయింది. ఇతర సంప్రదాయాల నుండి మత మార్పిడి చేసేవాళ్లకు ఇది అనుకూల వాక్యం. దౌర్జన్యకర మతాలు విశ్వాసులు, అవిశ్వాసులు అని ప్రకటించి కఠినంగా ప్రపంచాన్ని లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి’ అని అంటాడు. ఇదంతా ఆవులు వెళ్లి గొఱ్ఱెలు, తోడేళ్ళతో చేరి మనంతా ఒక్కటే అన్నట్లు ఉంటుంది. విభజన వాదాలతో అన్నిరకాల సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నా అమాయకంగా ఉండడం మరో అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎంతవరకు వెళ్లిందంటే- ‘నన్ను ధ్వంసం చేసేందుకు ఇతరులకు స్వేచ్ఛ ఇవ్వనట్లయితే కూడా నన్ను మతతత్వవాది అనేవరకు వెళ్లింది’ -ఇదే ఇప్పటి సాంస్కృతిక విధ్వంసం!

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
ఆంధ్రభూమి : భాస్కర వాణి
శుక్రవారం అక్టోబర్ : 12 : 2018

 

సోప్ అనే మేధావి చెప్పిన ఓ కల్పిత కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ అరణ్యంలో సింహం తనకు కన్పించిన ప్రతి జంతువునూ ‘ఈ అడవికి నేను రాజునా? కాదా?’ అని అడిగేది. అన్ని జంతువులూ ‘నీవే రాజువు’ అని సమాధానమిచ్చేవి. ఓ రోజు చిరుతపులిని అడిగినా అది కూడా సంకోచిస్తూ ‘నీవే రాజువు’ అన్నది. చివరకు ఏనుగును అడిగింది. వెంటనే ఏనుగు సింహాన్ని దూరంగా విసిరేసింది. ‘ఓ గజరాజా! నీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పవచ్చు. నన్ను ఇంతలా గాలిలో ఎగరేయాల్సిన అవసరం లేదు’ అంటూ గట్టిగా అరిచింది.

ఈ కథను ఉదాహరించిన ఓ తత్త్వవేత్త ‘విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తి ఆరాధన అంటే ఏంటో నీకు నిజంగా తెలుసా?’ 

అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు; అతడి జీవితమే దానికి సమాధానం అంటాడు.

అలాగే ఈ దేశంలో సనాతన ధర్మం అవలంబించే వ్యక్తులకు ఇక్కడి భూమిలోని ఎన్నో చోట్ల ఆరాధానా కేంద్రాలు. కాశీ ఉందనుకోండి, అది ఇక్కడి సనాతనులకు భూమి మాత్రమే కాదు, శివుడు నడయాడిన అపర కైలాసం. కాశీలోకి ప్రవేశిస్తే సంపూర్ణమైన నమ్మకంతో, అపార విశ్వాసంతో వీధుల్లో నడుస్తారు. అక్కడే శివుడు, అన్నపూర్ణ, బుద్ధుడు, ఆదిశంకరుడు, జైనతీర్థంకరులు, భక్తకబీర్, తులసీదాస్ అందరూ ఆ క్షేత్రంలో దర్శనం ఇస్తారు. ఇదంతా ఆజ్ఞలతో ఈ ధర్మావలంబులకు ఎవరూ చెప్పలేదు- చెప్పలేరు!? ఇదంతా విశ్వాసాల మేళవింపు!

ఇలాంటి విశ్వాసాలను ఈ దేశంలో ఏ మీడియా పట్టించుకోదు. మన మాధ్యమాలకు ‘నెగెటివ్ అప్రోచ్’ ఎక్కువ. జనాన్ని ఆకర్షించాలంటే వ్యతిరేక దృష్టిని అటువైపు తిప్పాలనే ప్రయత్నం గొప్పగా చేస్తున్న ‘రేటింగ్’ వెర్రెత్తిన ఛానళ్లను చూస్తే నవ్వొస్తుంది. 

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా అరియమంగళం నదీ తీరంలో కాళీమాత మందిరం నిర్మించిన ‘జయ్’ అనే అఘోరా తన తల్లి మరణిస్తే ఆమె శవంపై కూర్చున్న సంఘటన మీడియాను బాగా ఆకర్షించింది. అదే తమిళనాడు పక్కనున్న ట్రావెన్‌కోర్ సంస్థానంలోని ‘పందళం’లో వేలాదిమంది మహిళలతో పెద్ద ర్యాలీ జరిగింది. ‘అయ్యప్ప ధర్మ సంరక్షణ సేన’ పేరిట జరిగిన ఈ ర్యాలీలో ‘శబరిమలను రక్షించండి’ అన్న నినాదాలు మహిళలు మార్మోగించారు. ఈ వారంలో ఈ దేశ నమ్మకాలకు వ్యతిరేకంగా వచ్చిన రెండు సుప్రీం కోర్టు తీర్పుల్లో శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశం కూడా ఒకటి. ఈ తీర్పును నిరసిస్తూ, ఇందుకు వ్యతిరేకంగా పందళం పట్టణం మహిళల నిరసనలతో అట్టుడికింది.

మహిళలకు అనుకూలంగా తీర్పువస్తే- ఆ మహిళలే తీర్పును వ్యతిరేకించడం విడ్డూరం కాదా? జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో హిందూ మతాన్ని దుమ్మెత్తిపోసే మహిళా సంరక్షకులుగా వున్న పురుష రచయితలందరినీ తొలుస్తున్న ప్రశ్న! స్ర్తివాద అస్తిత్వమే ఆరోప్రాణంగా బ్రతికే చలం వారసులకు కూడా ఇది మింగుడుపడని అంశమే. ఇక హిందూమతంలోని ఏ అంశం చర్చకు వచ్చినా- ‘సీతను రాముడు ఎందుకు అడవికి పంపాడు?’ ఆవు వ్యాసం లాంటి డైలాగును పదే పదే చెప్పేవాళ్లకు ‘సేవ్ శబరిమల’ ర్యాలీ అర్థం కాక తలబొప్పి గట్టింది. శబరిమల భక్తులంతా స్ర్తి ద్వేషులన్నట్లు ప్రచారం చేసే కొన్ని ప్రచార మాధ్యమాలకు దీన్ని గురించి ఆలోచించే తీరిక లేదు.

ఈ ర్యాలీలో ‘రాజ్యాంగానికి శతాబ్దాల పూర్వమే సంప్రదాయాలున్నాయ్’ అన్న నినాదం వినిపించింది. అంటే ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించడం కాదు. సంప్రదాయాల, నమ్మకాల ప్రాచీనత చెప్పడం. అంతెందుకు? ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని మగ జడ్జీలంతా మహిళలు శబరిమల గుడిలో ప్రవేశించవచ్చునని తీర్పునిస్తే, అదే ధర్మాసనంలోకి ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం ‘ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అనీ, ఇలా తీర్పులు వస్తే ఇది ఇక్కడితో ఆగదు’ అని పేర్కొన్నారు. ఇక్కడ ‘సజాతి ధృవాల వికర్షణ, విజాతి ధృవాల ఆకర్షణ’ అన్న ఫ్రాయిడ్ సిద్ధాంతం పనిచేసిందా? కాదు.. కాదు! అక్కడ ఏం జరుగుతుందో, ఆ నమ్మకం ఎందుకు ఉందో జస్టిస్ ఇందూ మల్హోత్రాకు మాత్రమే తెలుసు. ఆమె ఈ దేశ నారీమణి.

‘బలమైన మత విశ్వాసాలు, ఆచారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవు. ఇందులో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు అసంబద్ధం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆరాధకులు, మత సంస్థలే’ అని ఇందూ మల్హోత్రా బల్లగుద్ది మరీ చెప్పారు. హిందూ ధర్మానికి సంబంధించి లక్షలాది ఆరాధనా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడా లేని ఓ వింత నియమం ఇక్కడే ఎందుకు ఉంది? కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో చట్టాల సంరక్షణతోపాటు నైతిక జీవనం కూడా సమాజాన్ని శాంతియుతంగా ఉంచుతుంది. మతవిశ్వాసాలన్నీ అలాంటి నైతిక జీవనం అందించే క్రమంలో బలమైన ఆలోచనలుగా మారుతుంటాయి. మూలతత్వాన్ని గ్రహిస్తే సమాధానం దొరుకుతుంది. అలా కాక చేతులతో నడిచి, వింత మనుషులై త్వరగా పేరు ప్రతిష్ఠలు పొందాలనుకొనే మనకు అది సాధ్యం కాదు!?

అలాంటి స్థితిలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేరళ మహిళల్లాగే కొంత సమాచారం ఇవ్వాల్సి వుంది. శబరిమలై దేవాలయంలోకి 10-50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశానికి సంబంధించి కేసు వేసిన పిటిషన్‌దారు పేరును పత్రికలు పెద్దగా ప్రస్తావించలేదు. సామాజిక మాధ్యమాల సమాచారం మేరకు నౌషాద్ అహ్మద్‌ఖాన్ అనే వ్యక్తి ఇందులో పిటిషన్‌దారుగా తెలుస్తున్నది. ఫ్యూబర్టీ స్టేజ్ నుండి మెనోపాజ్ దశ వరకున్న ఆడవాళ్లకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. మిగతా వయసులవారికి అది నిషేధం కాదు. కాబట్టి మహిళా వ్యతిరేక చర్యగా ఆ ఆచారాన్ని చెప్పలేం. వయసులో వున్న స్ర్తిలకు సంబంధించిన విధి - నిషేధంలో ఏదో ప్రత్యేకమైన ఆలోచన ఉండితీరాలి. మహిళలే దేవాలయంలోకి రావద్దు అంటే అది అన్ని వయసులకు ఉండాలి కదా?

 అంటే ఇది వయసుకు సంబంధించిన విషయం అన్నమాట. హిందూ దేవాలయాలన్నింట్లోకి స్ర్తిలకు ప్రవేశం ఉంది. మీరాను మించిన కృష్ణ్భక్తురాలు ఇంకెవరు? శారదా మాతను మించిన శ్రీరామకృష్ణుల శిష్యురాలు ఎవరు? ఆఖరికి అస్ఖలిత బ్రహ్మచారి హనుమంతుడికి కూడా పరాశర సంహిత ప్రకారం సువర్చల అనే స్ర్తిమూర్తినిచ్చి కల్యాణం జరిపించే ఉదాత్తత మనది. కాబట్టి ఇది స్ర్తి దేశం ఎంత మాత్రం కాదు. స్ర్తిలపై వివక్ష అంతకన్నా కాదు! అలాగైతే ఈ మహిళా న్యాయమూర్తి ఈ తీర్పును వ్యతిరేకించరు. మలయాళ స్ర్తిలు వేలాదిమంది రోడ్లపైకి రాలేరు కదా?

కేరళలోని అయ్యప్పను గురించిన ఆధారాలు అక్కడ ‘్ధర్మశాస్తా’ అనే రూపంలో చూపిస్తారు. మలయాళంలో పూర్వం నుండి జానపదుల పాటల్లో అయ్యప్ప ఒక యుద్ధవీరుడు. పందళరాజు, పాండ్యరాజు వద్ద జరిగిన విషయాలను ‘అయ్యప్ప సేవం’ పేరుతో ‘ఏడు సేవకాలు’ ఈ పాటలున్నాయి. పాండిచ్చేవం, పులిచ్చేవం, ఇళైయరసు చేవం, వెళిచ్చేవం, ఈళచ్చేవం, పందళచ్చేవం, వేళార్‌చేవం- వీటిని ఢమరుక వాద్యంతో వినిపిస్తారు. ఉదయనన్ అనే దురాత్ముణ్ణి అయ్యప్ప వధించి, అతడు ధ్వంసం చేసిన శబరిగిరి ఆలయాన్ని అయ్యప్ప పునరుద్ధరించి ఆ ఉత్సవంలో అయ్యప్ప పాల్గొన్నట్లు చెప్తారు. 

ఎరుమేలిలో జరిగే ‘పేట్టేతుళ్లాల్’ అనే అంగడి నృత్యం కూడా ఆదివాసీ, గిరిజన సంప్రదాయమే. ఇదంతా స్థానిక ఆచార కథనాలు, నమ్మకాలతో ముడిపడిన భక్తి అని తెలుస్తున్నది. బ్రహ్మచారిగా అయ్యప్ప భక్తి బాగా ప్రచారంలోకి రాగా అతని జీవిత కథలో కూడా స్ర్తిని గొప్పగా గౌరవించే కథనం కన్పిస్తుంది.

ఇలాంటి అయ్యప్పను సేవించే దీక్షాపరులు స్వయం పాకం, నిక్షేరము, శీతల స్నానం, చందన లేపనం, నల్లని వస్తధ్రారణ, పాదరక్షారహితం, భూతల శయనం వంటి కఠిన నియమాలను పాటిస్తూ పూజిస్తారు. అలాంటి సమయంలో స్ర్తి సాంగత్యం పురుషులు వర్జిస్తే, ఋతుకాలం కాని బాలికలు, ఋతుకాలం ముగిసిన స్ర్తిమూర్తులు అయ్యప్పను సేవిస్తారు. ఇదంతా నియమంగా మనకు కన్పిస్తుంది. 

పూర్వం వాళ్లకున్న పరిధిలో కొన్ని విధి నిషేధాలను అక్కడి క్షేత్రపాలకులు పెట్టుకొన్నారు. ఇప్పటికీ హిందూ స్ర్తిలు ఋతుకాలంలో ఏ దేవాలయాన్ని సందర్శించరు. అలాంటి నియమం మిగతా దేవాలయాలకు ఎక్కడా చెప్పుకున్నా వారు పాటిస్తారు.

ఆరోగ్య శాస్త్ర రీత్యా స్ర్తిలకు ఋతుకాలం విశ్రాంతి సమయం. వారి మానసిక ప్రశాంతతకు కూడా అది అవసరం. ఇవన్నీ మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినా మనం ఛాందసం అంటూ కొట్టేస్తాం. శరీరం నుండి ఆత్మకు శక్తి ఎక్కడ ప్రసారం జరుగుతుందో, ఎక్కడ వాతావరణం శక్తితో నింపబడుతుందో, ఎక్కడైతే ఆత్మస్థితి మహోన్నత సమాధివైపు కదులుతుందో అక్కడ క్షేత్రం, తీర్థం సృష్టింపబడింది. స్ర్తిల ఋతుక్రమానికి, చంద్రభ్రమణానికి దగ్గరి సంబంధం ఉంది. స్ర్తి శరీరం ఆరోగ్యంగా, సాధారణంగా ఉంటే 28 రోజుల తర్వాత ఋతుస్రావం జరుగుతుంది. ఆ సర్కిల్‌కు భంగం జరిగిందంటే ఎక్కడో ఏదో క్రమం తప్పిందని అర్థం.

1950లో విశ్వ రసాయనశాస్త్రం (కాస్మిక్ కెమిస్ట్రీ) అనే శాస్త్రం పుట్టుకొచ్చింది. విశ్వమంతా ఒకే శరీరం అన్నది దాని సారాంశం. జార్జి జియార్టీ అనే వ్యక్తి ఈ శాస్త్రాన్ని అనే్వషించిన వాళ్లలో ముఖ్యుడు. ఈ క్రమంలో టమాటో అనే జపాన్ వైద్యుడు స్ర్తి పురుషుల రక్తంపై అనేక పరిశోధనలు చేసి ఋతుస్రావ సమయంలో స్ర్తి రక్తం పలుచగా ఉంటుందని చెప్పాడు. సూర్యుడిపై అణుతుఫాను రేగినపుడు పురుషుల్లో కూడా రక్తం పలుచబడుతుంది. ఎక్కడో వున్న సూర్యుడికి భూమిమీద వున్న పురుషుడికి ఏమిటి సంబంధం? ఇదంతా ప్రకృతికి, మనిషికి మధ్యనున్న సంబంధం. అందువల్లనే విశ్వంలోని ప్రతి అణువుకూ ఒకదానితో ఒకటి సంబందం ఉంటుంది.

ఇదంతా ఆగమశాస్త్రాల కట్టుదిట్టాలు. దీన్ని నమ్మకంగా కూడా అవసరమైతే పరిగణించాలి. ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారిస్తున్న న్యాయమూర్తులది తప్పేం కాకపోవచ్చు. ఆ వ్యక్తి తనకు న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అలా తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఇపుడు వీధుల్లోకి వస్తున్నవాళ్ల నమ్మకాలను కూడా చట్టం పరిగణనలోకి తీసుకోవాలి. 

ఇక్కడ ఎవరు గుడికి ఎలా వెళ్తారన్నది ముఖ్యం కాదు. గుడికి ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే బలవంతం లేదు. కానీ నమ్మకాలను గౌరవించాలన్నదే ప్రాథమిక అభ్యర్థన. ‘పురాణమిత్యేవ నసాధుసర్వమ్’- పురాణం చెప్పేదంతా అంగీకరించాలని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. సనాతన ఆచారాలన్నీ చెడ్డవి కావు. కొత్త ఆచారాలన్నీ మంచివి కావు. 

ప్రతివాటిలోనూ మంచీ చెడ్డ రెండూ ఉంటాయి. కానీ ఆ మంచిని గౌరవించే అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఎందుకంటే చెడ్డ ఉన్నా లేకున్నా చెడుగా చిత్రీకరించే శక్తులున్నాయి కాబట్టి..!

*********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰

కొక్కొరో ... క్కో ... 


***********************************
– డా|| పి.భాస్కర యోగి
 జాగృతి : వారపత్రిక 
01-07: అక్టోబర్  - 2018
సంపుటి : 70, సంచిక : 50




ఓ పాశ్చాత్య స్త్రీ తన భర్తతో “నీ కొడుకు, నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు” (“Your Children, my children are Quarreling with our children”)   అని ఫిర్యాదు చేసిందట. పాశ్చాత్య దేశాల్లో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వివాహాలు, ఉద్యోగాలు, ఇళ్ళు మార్చడం సర్వసాధారణం. దానివల్ల ఆమెకు వేరే పురుషుని వల్ల పుట్టిన కొడుకు, ఇతనికి వేరే స్త్రీ వల్ల పుట్టిన కొడుకు, మళ్ళీ వీళ్ళకు పెళ్ళాయాక పుట్టిన కొడుకు మధ్య జరిగిన కొట్లాటను గురించిన సంఘటన పైన చెప్పబడింది.

పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు, వాటి అనుబంధాలు చాలా విచిత్రమైనవి. పశుపక్ష్యాదుల్లా ‘స్వేచ్ఛా లైంగిక వాంఛలు’ వారి సొంతం. మెల్లమెల్లగా విస్త్రృత మత మార్పిడులు, పాశ్చాత్య భావజాలం నూరిపోసే సంస్థల మూలంగా మనకూ ఆదుస్థితి దాపురిస్తుందనడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఓ నిదర్శనం. 

ఈ విషయంలో మనం కోర్టులను నిందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ 135 కోట్ల భారతదేశంలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి బాధితులుంటారన్నది సుస్పష్టం. కానీ అలాంటి కొద్దిపాటి సంఘటనలను సరిచేయడానికి కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడుప్పుడు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయనడానికి ఇదొక నిదర్శనం.

“వివాహేతర బంధం విషయంలో మహిళ, పురుషుడూ ఇద్దరూ పాల్గొన్నపుడు పురుషుడు మాత్రమే నేరం చేసినట్లు పరిగణించడం సరికాదు” అనే పట్‌వర్ వాదనకు సుప్రీంకోర్టు ధర్మాసనం” అసలు.. 497 ఐపీసీ చెల్లదు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం నేరమే కాదు. అంటే... ఇందులో మహిళదీ, పురుషుడిదీ తప్పుకాదు. పరస్పరం ఇష్టపడినపుడు శృంగారంలో పాల్గొనడం నేరం కాదు” అని తీర్పును ఇచ్చింది. 158 సంవత్సరాల ఐపీసీ సెక్షన్ 497 భార్యల లైంగిక ప్రాధాన్యతను తగ్గిస్తుందని కూడా న్యాయమూర్తులు పేర్కొన్నారు.

దేశం మొత్తం మీద దీనికి హర్షం ప్రకటించిన వాళ్ళలో కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు బృందాకారత్, సామాజిక ఉద్యమకారిణి రంజన కుమారి, అర్ధరాత్రి కోర్టులు తెరిపించి సరిక్రొత్త దేశభక్తులకు సహాయపడే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో చిటుక్కుమన్నా స్పందించే ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇది ‘అభ్యుదయమైన తీర్పు’ అని పేర్కొన్నది. 

వెంటనే అసదోద్దీన్ ఓవైసీ “గేసెక్స్ నేరం కాదు... వివాహేతర సంబంధం నేరం కానపుడు త్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది అన్నారు” విచిత్రంగా ఈ కేసులో ప్రధాన పిటిషనర్ జోషెఫ్ షైన్ అనే వ్యక్తి అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఈ దేశంలో ఫ్రాయిడ్ వారసులకేం కొదవలేదు. “లార్డ్ బైరన్ అనే ప్రసిద్ధ పాశ్చాత్యుడు పెళ్ళయ్యేనాటికే 60 మంది స్త్రీలతో సంబంధాలు నెరపి పెళ్ళిరోజు చర్చి మెట్లు దిగుతున్నపుడు తారసపడ్డ అమ్మాయి గురించి కారు ఎక్కక ముందే” ఆ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పాడట. కామించి, ప్రేమించు అనే పాశ్చాత్య భోగవాదం ఈ దేశంలోకి తీసుకురావడానికి వ్యాపార దృష్టి ఓ కారణం. 

అందుకే ప్రేమికుల రోజు పబ్బులు, క్లబ్బులు, గబ్బులు, నిండిపోవడం వెనుక ఉన్న అసలు మతలబు అదే. దాని దుష్పరిణామాలే ఇటీవల మన దేశంలో పంజాబ్ ‘ ఉడ్తా పంజాబ్’ గా మారడం, హైదరాబాద్‌లో కాఫీ షాప్‌ల పేరిట హుక్కా సెంటర్లు, స్కూళ్ళు, కళాశాలల్లో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా సాగడం వెనకున్న రహస్యం ఇదే.

మన దేశంలో వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ రోజుకూ చాలా పటిష్టంగా ఉంది. నవీన నాగరికత ఎంత ముదిరినా దాని మూలం చెదిరిపోకుండా అది రూపాంతరం చెందుతున్నది కానీ ధ్వంసం కావడం లేదు. కామం తీవ్రత తెలిసిన మన పెద్దలు విధి  నిషేధాలను చాలా జాగ్రత్తగా చేసారు. ఎక్కడ  నిషేధం ఉంటుందో అక్కడ అది స్వాగతమే. ఆడమ్  ఈవ్ విషయంలో అదే జరిగింది కదా!

అందుకే మన వాళ్ళు కథల రూపంలో శృంగారాన్ని అందించారు. వాత్సాయన ఋషి కామ సూత్రాలను ప్రపంచం కళ్ళు తెరవని నాడే అందించాడు. కామాన్ని అర్థం చేసుకోవడానికే బ్రహ్మచర్యం, గార్హస్థ్య జీవనాలను పొందుపరిచారు. దాని తీవ్రతను నిషేధం చేయకుండా వివాహ వ్యవస్థ ద్వారా స్థిరత్వం కల్పించారు. ఒక్క క్షణం కలిగే సంభోగ పరాకాష్టను విస్మరించడం, అణగదొక్కడం కాకుండా ఉదాత్తస్థితిలో దానిని అనుభవించే అవకాశం వివాహం ద్వారా కల్పించారు. కామభావాన్ని రామభావంగా తీర్చిదిద్దారు. 

మన నాగరికతా బీజాలను వేలయేళ్ళ నుండి సంరక్షిస్తూ చిన్న మొక్క నుండి ఫలపుష్పాదులతో నిండియున్న వటవృక్షంగా మార్చారు. దీని వేర్లను పీకే ప్రయత్నం బ్రిటీషు కాలం నుండే జరుగుతోంది. మొఘల్‌పాలనలో దీన్ని కదిలించడం వాళ్ళచేతగాక విత్తనాలనే తమ ఇళ్ళల్లో నాటుకున్నారు. 

కామప్రవృత్తి నుండి మనిషిని జంతువుగా మార్చకుండా ఉంచే కుటుంబ వ్యవస్థ కాపాడింది. అయితే వ్యక్తుల దుష్పరివర్తన, వ్యక్తిత్వహననం, వికృతమనస్తత్వం, పరిస్థితుల వల్ల అది కొంత అక్కడక్కడ అనారోగ్యకరంగా తయారయ్యింది.
శరీరం జడం అయినా అది మనస్సు చెప్పినట్లు వింటుంది. ఫ్రాయిడ్ నుండి యంగ్ వరకు అందరూ శరీరంలో జరిగే మార్పులను మనస్సుకు ఆపాదించారు. 

పాశ్చాత్యుల కామస్థితి చంచలంగా ఉన్నందువల్ల అక్కడ వివాహాలు భగ్నమై, సంసారాలు కుప్పకూలి విడాకులవైపు పరుగెడుతున్నాయి. దాంతో అక్కడి సాంఘీక వ్యవస్థ అతుకుల బొంతగా మారింది. మనస్సుల కలయికతో మాత్రమే జరిగే సంసారాలు మనసులు మారినపుడు క్రిందా మీదా అయిపోతాయి. ఈ అంటురోగం మన సమాజంలోకి వ్యాప్తి చెంది ఫ్యామిలీకోర్టుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే మన సమాజంలో మనస్సు స్థాయిలో ఉండే కామవాంఛకోసమే విడాకులు జరగడం లేదు. ఆర్థిక విషయాలు, స్థాయీభేదాలు, అపరిపక్వ మనస్తత్వాలు, అవగాహనరాహిత్యం, మాట పట్టింపులు... ఇలా ఎన్నో విషయాలు ఈ కుటుంబ వ్యవస్థ విధ్వంసానికి దోహదం చేస్తున్నాయి. 

“ఉన్న నాలుకకు మందువేస్తే కొండనాలుక ఊడిపోయిందన్నట్లు” కోర్టులు దూరదృష్టితో, విస్త్రృత సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పకుండా చేసే వ్యాఖ్యలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది. స్త్రీ స్వేచ్ఛ, లైంగిక సమానత్వం పేరిట స్త్రీ హక్కులను రక్షించడానికి చేసే చర్య పురుషులకు విశృంఖలత్వాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేయకూడదు. వ్యభిచారాన్ని పరోక్షంగా చట్టబద్దం చేసే విధంగా వ్యాఖ్యానం జరుగుతున్నది.

 ఇటీవల ‘స్వలింగ సంపర్కం’ తప్పుకాదు అని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పాశ్చాత్యుల నుండి దిగుమతి అయిన అపరక్యాన్సర్ ఎయిడ్స్‌తో మన దేశం కూడా బాధపడుతోంది. కొత్త కొత్త లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా ప్రకృతి విరుద్ధమైన చర్యలకు ఆమోదముద్ర వేసినట్లు అవుతుంది. ఇది పత్రికలకు, టీవీలకు మంచిమసాలా కావచ్చుగాక. సమాజ ప్రవర్తనా నియమాల దృష్ట్యా అనారోగ్యకర చర్యలకు మాత్రం ఆస్కారం కల్పిస్తుంది. పాశ్చాత్యుల జైళ్ళలో ఏళ్ళ తరబడి నిర్దాక్షిణ్యంగా బంధించడం వల్ల ఏర్పడ్డ ‘అసహజ చర్యలు’ మెల్లమెల్లగా ప్రపంచాన్ని తాకుతున్నాయి. దాని పర్యవసానమే స్వలింగ సంపర్కుల వివాదం.

 వయోభేదంతో సంబంధం లేకుండా శబరికొండ మీద ఉన్న అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. తెలుగు దినపత్రికలన్నీ ఈ కేసులు వేసిన పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి. ఇందులో కూడా ఏం మతలబు ఉందో తెలియదు. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ కేసులో పోరాటం చేసింది నౌషాద్ అహ్మద్‌ఖాన్ అని తెలుస్తుంది.

 అంటే హైందవ దేవాలయాల ఆగమ శాస్త్రాలను సవాల్ చేస్తున్నది ఎవరు?! అయితే ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూమల్హోత్రా దీనిని వ్యతిరేకించింది. మతపరమైన విశ్వాసాలు కోర్టులు తేల్చలేవని ఆమె తేల్చి చెప్పింది.

నిజానికి ఈనాటి సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ప్యూబర్టీ స్టేజి నుంచి మెనోపాజ్ దశ వరకున్న స్త్రీలకు మాత్రమే ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం. హిందూ స్త్రీలు బహిష్టు సమయంలో ఏ దేవాలయానికి వెళ్ళరు. ఇది కోర్టుల ఆదేశాలకన్నా మహిళలు నైతికంగా స్వీయ నియంత్రణగా పెట్టుకున్నారు. 

51 శక్తిపీఠాల్లో కామాఖ్య దేవాలయంలో స్త్రీలే పూజలు చేస్తారు. తంత్ర విధానంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది. అయ్యప్పదీక్షలో చన్నీటి స్నానం, భూతలశయనం, పాదరక్షలు లేకుండా పాదచారులై నడవడం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం,  మధుమాంస నిషేధం వంటి కఠిన నియమాలున్నాయి. స్త్రీ, పురుషులు కలిసి ఆలయంలోకి వెళ్ళడం వల్ల మనోచాంచల్యం కలుగరాదని మాత్రమే పెట్టిన నియమం కాదిది.

అక్కడి స్థలపురాణంలో కొన్ని కథలు ఈ నిషేధం విధించాయి. మహిళలపైనే వ్యతిరేకతతో నిషేధం ఉంటే కొన్ని వయసులవారికి ఎందుకు ప్రవేశం ఉంటుంది? కావున ఇది మహిళా వ్యతిరేక దృష్టి కానేకాదు. దీనిని హిందూ వ్యతిరేక దృష్టికలవాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మన శాస్త్రాల్లో చెప్పిన విషయాలు మనం విశ్వసించంగాని పాశ్చాత్యులు చెప్తే తలకెత్తుకుంటాం. టమాటో అనే జపాన్ శాస్త్రవేత్త 20 ఏళ్ళు స్త్రీ, పురుషుల రక్తంపై పరిశోధన జరిపి పురుషుల రక్తంలో లేని ఒక ప్రత్యేక గుణం స్త్రీ రక్తంలో ఉంటుంది, ఋతుస్రావ సమయంలో స్త్రీ రక్తం పలుచన అవుతుంది.

స్త్రీలలో జరిగే మార్పుల వల్ల వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారని వారికి విశ్రాంతి అవసరం అన్నారు. అందుకే స్త్రీలు బహిష్టు ఉన్న సమయంలో వారి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు వారికి ఇంటి పనులు కూడా నిషేధంగా పెట్టారు. ఇదంతా ఒక పెద్ద చర్చ. అయితే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇచ్చినపుడు కొందరు కోర్టులకు వెళ్ళిన వ్యక్తులకు న్యాయం చేయాలనే స్ఫూర్తితో చేస్తారు. కానీ దాని ప్రభావం సమాజంపై ఎలా అన్నది కూడా ఆలోచించకపోతే ‘కోర్టు తీర్పులు కోటి ప్రశ్నలు’ తలెత్తి అనంతకోటి సమస్యలుగా మారే అవకాశం ఉంది.

********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*వర్తమాన భారతం : విజయక్రాంతి*