ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ ‘మీ తాత ఇంత గొప్ప గురువుకదా? ఆయన పెళ్లెందుకు చేసుకున్నాడు?’ అన్నాడట. ‘ఆయన పెళ్లి చేసుకొని ఉండకపోతే నేను పుట్టేవాణ్ణేకాదు, మీకు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉండేదీ కాదు’ అని బదులిచ్చాడట విద్యార్థి. ఇటీవల మూడో కూటమి గురించి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇంతే గొప్పగా సెలవిస్తున్నది! ఇపుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నా, ఒకపుడు ఈ ప్రాంతాన్ని తొమ్మిదేళ్లు నిరాఘాటంగా ఏలిన చంద్రబాబుకు చెందిన ‘జాతీయ పార్టీ’ ఇక్కడ సొంతంగా పోటీ చేయదు. పోనీ ప్రపంచ తెలుగువారి ‘ఆత్మగౌరవానికి పేటెంట్ హక్కున్న’ పేరు మీదైనా చేస్తారంటే అదీ లేదు.

 హైద్రాబాద్‌లో సెటిలర్లు మేం ఎలా చెప్తే అలా వింటారని అమరావతి బుద్ధవిగ్రహం ప్రక్కనుండి రోజూ పిల్లిమొగ్గలు వేస్తారు కదా.. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దెదింపేద్దాం అంటే మొన్నటివరకు చంద్రబాబు ఇక్కడ ప్రచారానికే రాను అన్నారు! ‘హైద్రాబాద్‌ను కులీ కుతుబ్‌షా కన్నా ఎక్కువ హక్కుతో నేనే ఎక్కువ అభివృద్ధి చేసాను’ అని అమెరికాలోని ఆటా మొదలుకొని అన్ని సంఘాల సదస్సుల్లో చెప్తారు కదా.. డైరెక్ట్‌గా కేసీఆర్‌తో తలపడండి అంటే అలాంటి పాపపు పనులు చేయను అంటాడు బాబు. కర్ణాటకలో నేను ఇచ్చిన పిలుపునకే భాజపా చిత్తుచిత్తుగా డిపాజిట్లు రాకుండా సున్నా సీట్లతో నిలిచింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు కదా.. తెలంగాణలో సగం సీట్లలోనైనా పోటీ చేయండి అంటే అలా కూడా కుదరదట!

ఇదంతా ఎందుకంటే- ఇపుడు తెదేపా తెలంగాణలో పోటీచేస్తున్న (పది సీట్లకు అటు ఇటూ) విషయం కన్నా, చంద్రబాబు కనుసన్నల్లో కాంగ్రెస్ నడుస్తుందన్న విషయం పైనే ఫోకస్. కాగా, కొంగర కలాన్ సభ తర్వాత ఎందుకో కేసీఆర్ గ్రాఫ్ కొంత తగ్గుతూ పోయింది. కాంగ్రెస్ పార్టీ వారు కేసీఆర్ నియంతృత్వ పోకడ, అహంకార దర్పం,కుటుంబ పాలన, మాటల గారడీ అని చాలా ఎక్స్‌పోజ్ చేసారు. దాంతో అందరూ కేసీఆర్‌కు గడ్డురోజులే అని భావించారు. సరైన పోటీ ఉంటుందని భావించారు. కాంగ్రెస్ వాళ్లను సజ్జనులుగా, కేసీఆర్ వాళ్లను డామినేట్ చేస్తున్నాడని ప్రజలు భావించారు. కేసీఆర్ ఆయత చండీయాగం ఫలితం రూపంలో ‘చంద్రబాబు పొత్తు’ కాంగ్రెస్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్రలోనే ఉన్నప్పటికీ వాళ్ల చక్రం ‘నలభై ఏళ్ల ఇండస్ట్రీ’లోకి వెళ్లిందని మెల్లమెల్లగా తెలంగాణ ప్రజలకు ఎక్కుతున్నది. ప్రచారం ముగిసే వరకూ కేసీఆర్ ఉపన్యాస పరంపర అలాగే ఉండనున్నది. కేసీఆర్ మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండు సభల్లోనే ప్రసంగం చేసాడు. ఈ మిగతా రోజుల్లో ప్రసంగాలు వేడివేడి మిరపకాయ బజ్జీల్లా సిద్ధం చేసుకొని వస్తాడు. అదే చంద్రబాబు.. రోజూ ఉపన్యాసాలే!

కేసీఆర్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంటే చంద్రబాబు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొని మోదీ దెబ్బతీయాలనుకున్నాడు. నిజానికి ఏ రాజకీయ నాయకుడికీ చంద్రబాబు ఇంతవరకు అర్థం కాలేదు. ఒక్క కేసీఆర్‌కు తప్ప! ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబు పాఠశాలలో అన్ని తరగతులూ క్షుణ్ణంగా చదివి కాన్వకేషన్ పట్టాను పొందాడు. అందుకే చంద్రబాబు కేసీఆర్‌కు రాయబారం పంపాడు. ఈ విషయం బాబే ఒప్పుకొన్నాడు.
చిన్నా చితకా పార్టీలను కలిపి మోదీని గద్దె దింపాలని బాబు ఆలోచన. కేసీఆర్‌కు సెంటిమెంట్‌ను ఎలా వాడుకోవాలో తెలుసు. కాబట్టి బాబుతో పొత్తుకు వెనక్కి తగ్గాడు. కేసీఆర్‌కు కేంద్రంలో ఎవరున్నా ఇబ్బంది లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో కలిపి కాంగ్రెస్‌కు ఊడిగం చేసి అస్థిత్వాన్ని కోల్పోవద్దన్నది కేసీఆర్ భావన. ఆంధ్రాలో చంద్రబాబు కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసాడు కాబట్టి రెండవ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించుకున్నాడు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో పిల్ల పార్టీలు పుట్టాయి. కేసీఆర్ వెనక్కి తగ్గి, ఇపుడు చంద్రబాబును టార్గెట్ చేసి టీఆర్‌ఎస్ గ్రాఫ్ పెంచాడు. ఆంధ్రాలో లేని మోదీని శత్రువుగా చూపిస్తూ చంద్రబాబు ఎలా ఎదుగుతున్నాడో, కేసీఆర్ తెలంగాణలో లేని బాబును బూచిగా చూపిస్తూ మెల్లమెల్లగా వ్యూహం అల్లుతున్నాడు. ఇందులో సత్యం ఏమిటంటే రేపు కేసీఆర్‌కు కొద్దిగా మెజార్టీ తగ్గితే మొదట లైన్లో ఉండేది టీడీపి నుంచి గెలిచే వారే! అపుడు కాంగ్రెస్ వారు నోరు వెళ్లబెట్టాల్సిందే!? గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు బాబు సలహా మేరకు వెళ్లామని చెప్తారు! కేసీఆర్‌తో అవసరాల దృష్ట్యా ఆనాడు బాబు అలాచేసారని గిట్టనివారు అంటారు.

మొన్నటి దాకా కేసీఆర్‌తో సరిసమానంగా వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన తెలంగాణ కాంగ్రెస్ ఇపుడు చంద్రబాబు కనుసన్నల్లో నడవడం మహాకూటమికి ఇబ్బందే. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు తెలిసినా జాతీయ రాజకీయాల దృష్ట్యా కిమ్మనడం లేదు.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎక్కాక ఎక్కడా విజయం సాధించిన దాఖలాలు లేవు. పంజాబ్‌లో కూడా రాహుల్‌ను ప్రచారానికి రావద్దని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పాడంటారు. ఉత్తరాది సీనియర్ ప్రాంతీయ పార్టీల నాయకులెవరూ రాహుల్‌తో రావడానికి ఇష్టపడడం లేదు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, మాయావతి, శరద్‌యాదవ్, మమత, కేజ్రీవాల్, లాలూ, ములాయం, కమ్యూ నిస్టులు మోదీతో ఏదో దశలో తలపడినవారే. ఇపుడు మొదటిసారి చంద్రబాబే ఈ యుద్ధం చేస్తున్నట్టు తెలుగు మీడియా ఎంత హడావుడి చేసినా వాళ్ల ఆలోచనలు వాళ్లకున్నాయి. రాహుల్ చుట్టూ వీళ్లంతా చేరడానికి చంద్రబాబు వ్యూహం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే ఆంధ్రలో కాంగ్రెస్ చచ్చినా, తెలంగాణలో బాబు వల్ల కాంగ్రెస్ ఇరకాటంలో పడినా ఇద్దరి కామన్ శత్రువు మోదీ అని జాతీయ కాంగ్రెస్ సరిపెట్టుకొంటున్నది. కేసీఆర్‌ను నాలుగున్నరేళ్లు తట్టుకొని చచ్చీ చెడి పార్టీని నిలబెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు- ఇది తలనొప్పి అని తెలిసినా.. వారు ‘జండూబామ్’ అడగడం లేదు.

ఈ ఫ్రంట్‌లోని టీడిపి, టీజెఎస్, ఇంటి పార్టీ, సిపిఐ ఓట్లు మొత్తం కలిపినా 5 శాతం దాటవని కాంగ్రెస్‌కు తెలుసు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక వేవ్ సృష్టించాలని కాంగ్రెస్ యత్నం. ఇదంతా తెలుసుకున్న కేసీఆర్ కూ టమా? గూటమా? అని ఓ సభలో ఎద్దేవా చేసాడు. తెలంగాణలో గోడకు తగిలించే కొయ్యను, లేదా ఏదైనా నా ఖాళీని పూడ్చేందుకు కొట్టే కొయ్యను ‘గూటం’ అంటారు. కదలకుండా చేసేది గూటం. మళ్లీ లేవకుండా చేస్తానని కేసీఆర్ గూటం అని ప్రయోగించాడు. ఆచార్య కోదండరాంకు సీట్లివ్వడం కన్నా తమవైపు పెద్దమనిషిగా ఉంచుకొని వ్యవహారం చేద్దామని కాంగ్రెస్ ఆలోచన. కానీ ఆయన వెనకున్న ఒకరిద్దరు సీట్లు కావాలని వత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్, టిజెఎస్‌కు 8 సీట్లిస్తే పొత్తు ధర్మం విస్మరించిన కోదండ 12 స్థానాలు మావని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా బీసీ కులాలకు కేటాయించిన సీట్లు కోదండ రూపంలో ఇతరులు ఆక్రమిస్తున్నారని ఆరోపణ. చంద్రబాబుతో పొత్తును తెలంగాణ తాతాచార్లముద్రను కోదండరాంతో వేయించాలని కాంగ్రెస్ ఆలోచన. కానీ కేసీఆర్ కోదండరాంను కూడా ఎలా బోనులోకి లాగాలో తెలిసినవాడు. కోదండారం మంచి వ్యక్తే. కానీ ఆయన వెనుకున్న వాళ్లంతా అన్ని టంకశాలల్లో తిరిగి తిరిగి చెల్లకుండా వచ్చినవాళ్లే.

ఈ పొత్తుల పితలాటకంలో కాకలుదీరిన కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పరిస్థితి చూసి జాలిపడి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. సురవరం సుధాకర్‌రెడ్డి రోజూ మతతత్వ బీజేపీపై యుద్ధం చేస్తాం అని ఇచ్చే స్టేట్‌మెంట్లు చూస్తే వీళ్లు ఎంత బలంగా ఉన్నారో అనుకుంటాం. కానీ మూడు సీట్లకోసం కాంగ్రెస్‌ను దేబిరించడం, నిన్నగాక మొన్నపుట్టిన కోదండరాం పార్టీ కన్నా ఘోరంగా దిగజారడం చూస్తే వాళ్ల దయనీయ స్థితి తెలుస్తుంది. వాళ్లకు అంత బలమే ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ల మోచేయి పట్టుకొని ఎందుకు బ్రతిమాలుతుంది. ఇక నిన్నటివరకు ఇంటి పార్టీలో ఇద్దరు నాయకులు చెఱుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలకు కాంగ్రెస్ ఆశజూపి బైబై చెప్పింది. వాళ్లు కాంగ్రెస్‌లో కలవలేక కేసీఆర్‌తో నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాట్లవల్ల ఆందోళనలు, ఫిరాయింపులు, గొడవలు జరుగుతుంటే గట్టి రెబల్స్‌ను నిలబెట్టి కాంగ్రస్‌కు షాక్ ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నం.

ఆంధ్రలో 2014లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను విలన్‌గా చూపి భాజపాను, పవన్‌ను కలుపుకొని బయటపడ్డ బాబు ఇపుడు అదే వ్యూహం అమలుచేస్తున్నాడు. ఆనాడు కామినేని శ్రీనివాస్‌ను భాజపాలోకి పంపి, అక్కడ భాజపాను ధ్వంసం చేసాడు. తనకు నమ్మకమైన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి ఇపుడు కాంగ్రెస్ వైపు కాల్వ మలిపాడు. బీజేపీని బూచిగా చూపి జగన్, పవన్, భజపాలను కలవకుండా చేసి దీనస్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు ముష్టిగా కొన్ని సీట్లు ఇచ్చి ఓటు ట్రాన్స్‌ఫర్ కాకుండా వాళ్లను గెలనివ్వడు. ఇపుడు తెలంగాణలో కూడా టీడిపికి ఓట్లూ లేవు, సీట్లూ రావు. నాయకులున్న ఆ 10, 12 సీట్లలో ఎలాగూ పోటీ ఉంటుంది. ఒకవేళ అందులో టీడిపి గెలిస్తే వాళ్లను కేసీఆర్ నుండి కాపాడుకోవడం, మొన్న కర్ణాటకలో అయినట్లు ప్రతి ఎమ్మెల్యే ‘విలువైతే’ ఆ భారం కాంగ్రెస్ మోయాల్సిందే. మూడు రంగులను పచ్చ పార్టీతో, ఎరుపురంగుతో కలిపి వండుతున్న ఈ ‘పంచకూట్ల కషాయం’ ఎవరికి చేదో, ఎవరికి అమృతమో చెప్పలేని దుస్థితి. ఈ కూటమి వెనుక బాబు సెలవిచ్చినట్లు విస్తృత విశాల ప్రయోజనం ఉన్నా కేసీఆర్, మోదీ బలవంతులన్న విషయం చెప్పకనే చెప్పింది. తమిళ నటుడు రజనీకాంత్ అన్నట్టు ‘బలహీనులు ఒక్కటవుతున్నారంటే మోదీ బలవంతుడని ఒప్పుకున్నట్లే’ అన్నది అక్షర సత్యం. మహాకూటమి ఇంకా సీట్ల పంచాయతీ, బుజ్జగింపుల పర్వంలో కొనసాగుతుంటే కేసీఆర్‌కు కాగల కార్యం అమరావతి గంధర్వుడే తీరుస్తాడని విశే్లషకుల అంచనా.*

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి