ఓ కీకారణ్యం - అందులో కాకులు దూరవు.. చీమలూ చేరవు. కానీ ఓ ఋషి ప్రవేశించాడు. నీటి వసతి ఉన్న చోట కుటీరం ఏర్పాటు చేసుకొన్నాడు. గడ్డాలు, మీసాలు పెంచుకున్నాడు. దండకమండల ధారియై తపస్సు ప్రారంభించాడు. ఆయనకు తన శరీరంపై ఎలాంటి మమకారం, స్పృహ లేనేలేవు. అలా సంవత్సరాలు గడిచాయి. కొన్నాళ్ళకు దేవుని దర్శనం జరిగి, సృష్టికి సంబంధించిన ఏదో సత్యం పరమాద్భుతంగా గమనించాడు.
అంతే! అది ప్రపంచానికి అందించాలనుకొన్నాడు. జనంలోకి బయల్దేరాడు. తాను గురువుగా మారి ఈ ప్రపంచానికి ఉపదేశించాడు. తనువు చాలించాడు. ఆ ఉపదేశం గురువుల వద్ద నుండి శిష్యులకు చేరింది. శిష్యులు గురువులు అయ్యారు. ఆ సిద్ధాంతం సూర్యచంద్రులున్నంత వరకు నిలబడేంత గట్టిగా స్థిరపడింది. అలా జనంలోకి వచ్చిన వేదాంతమే ఈనాడు సూత్ర, స్తోత్ర, వేద, పురాణ, ఉపనిషత్తులుగా మన వరకు చేరింది. అందులోని సారభూతమైన అంశాలే యోగం, ధ్యానం, తపస్సు, ఆరాధన, పూజ, యజ్ఞం.. ఇలా అనేక మార్పులతో సమాజంలో నిలబడ్డాయి.
ఇప్పటివరకు తైలధారగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విషయం వేలయేళ్ల క్రింద జరిగింది. ఆనాడు ఋషులకు, గురువులకు అంతగా వసతులు లేవు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అసలే లేవు. (ఇపుడు అన్నీ స్వామిజీలను, మహాత్ములను చెడ్డగా చిత్రీకరిస్తున్నాయి) ఆ ఋషులకు ప్రచారం యావ లేదు. ప్రచారం చేసిన గురువులకు తస్య దర్శనమే కాని ‘సత్తా’ (అధికారం) స్పర్శనం లేదు. ఏమీ లేని కాలంలో మానవుల్లో ఇంత అద్భుతంగా ‘నైతికత’ ను తీర్చిదిద్దారు ఋషులు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇంత గొప్ప పరంపర నుండి వచ్చిన మనం ఏ రకంగా ముందుకు కదులుతున్నాం!
వైదేశిక భావజాలం, స్వార్ధం, హింస, దోపిడీ, అవినీతి... ఇవి మాత్రమే మన పరమ లక్ష్యాలుగా (చాలామందిలో) ఉన్న ఈ రోజుల్లో మానవ ధర్మానికి ఏం కావాలో అది చేయడం లేదు. మనిషిని పశుత్వం నుండి బయటకు తీసుకొని వచ్చి.. ఇంకా ముందుకు పోయి నరోత్తముడిగా మార్చే సంస్కృతి మనది.
సత్యదర్శనం చేయడం మాత్రమే తెలిసిన మన పరంపర విశ్వానికే ఆదర్శవంతమైన సూత్రాలను రూపొందించాం. ప్రపంచానికి అందించాం.
వేదంలో ప్రకృతి, సూర్యుడు, గణితం నైతికభావజాలం, మానవులను విశ్వజనీనులుగా చేయడానికి కావాల్సిన సూత్రాలను రూపొందించారు. పురాణంలో వాటిని గాథలుగా మార్చి చక్కని ప్రయోజనాన్ని ఉపదేశంగా మనకు అందించారు.
ఇంకా వీరికి అర్థం కావనే ఉద్దేశ్యంతో రకరకాల మాధ్యమాలుగా మార్చి ఈనాటి స్థిరీకృతమయ్యేట్లుగా చేసారు. కానీ మనం నేనూ... నా కుటుంబం... ఇంకెవ్వరు మనుషులు కారు అనే రీతిలో వ్యవహరిస్తూ సత్యాన్ని విస్మరిస్తున్నాం. అటు ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం. ఇటు మన సంస్కృతినీ కాపాడుకోలేకపోతున్నాం. ఏం ‘ఖర్మ’ పట్టింది మనకు?
మన పద్ధతులు మార్చుకొని చూద్దాం
మీరు ప్రొద్దునే ‘వాకింగ్’కు (కాలినడకన) వెళ్తున్నారా? మీ వెంబడి కొందరు ‘రన్నింగ్’కు (పరుగు) వస్తుంటారు. వారిని గమనించండి. అశ్లీలపు సినిమా పాటలు సెల్‌ఫోన్లో పెట్టుకొనో, లేదా బాగా ఉత్సాహం ఉరకలెత్తే (ఫాస్ట్‌బీట్) పాటల్ని పెట్టుకొనో రన్నింగ్ చేస్తుంటారు ఇదే నేటి యువత తీరు! (అందరు కారు!)
ఏదైనా ఓ బస్సు ఎక్కండి! అందులో సడన్‌గా మధ్య సీట్లో ఏదో సినిమా పాట వినిపిస్తుంది. వెనుక సీటు నుండి ఎఫ్‌ఎమ్ రేడియో పాటలు విన్పిస్తాయ్. ముందు సీటు నుండి ఇంకో పాటల మోత ఇవన్నీ కలగలసి మన చెవులకు శబ్దకాలుష్యం! ఏం... మనఖర్మ!
గుళ్లకి వెళ్లి చూడండి కనీస సంప్రదాయ దుస్తులు లేకున్నా ఫర్వాలేదు జీన్స్, మిడ్డీలు స్కర్ట్‌లు ... ఎంత ఘోరం! కాదు కాదు ఎంత అపచారం!
ఇంట్లో మనుషుల్ని చూడండి! సెల్‌ఫోను, టీవీలతో తప్ప మనుషులతో ఇంట్లో ఉన్నవాళ్ళతో మాట్లాడనే మాట్లాడరు ఎంత వింత!
చిన్న పిల్లల్ని పలకరించండి! వాడి టై.. వాడి బుక్స్... వాడిగోల వాడిది. ముసలాళ్లలను గెలకండి! అనంత దుఃఖరాశి వారి హృదయాల నుండి పొంగి పొర్లుతుంది! ఏమైంది జాతికి!
స్త్రీలను మందలించండి! అమ్మా!.. నీకు ఏమైందని...?
ఎక్కడో గ్రామంలో ఉండే అత్తగారిమీద, ఇంకో ఊర్లో బతుకుతెరువుకు వెళ్లి స్థిరపడ్డ తోడికోడలు మీద.. పరాయి ఇంటికి వెళ్లిన ఆడకూతురు మీద.. ఇంటి పక్క ఎల్లమ్మ మీద.. ఎదురింటి మల్లమ్మ మీద.. లేనిపోని కారుకూతలు... అసూయలు.. ఈర్ష్యలు! ఏమయింది మన నారీ వారసత్వం!
ఇలా పార్టీలుగా, వర్గాలుగా, కులాలుగా, వ్యక్తిగా ఎక్కడికక్కడ గోడలు కట్టుకొని మన్నింపు లేని మనుషులుగా జీవిస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ అశాంతికి కారణమై బ్రతకడం విడ్డూరం.
ఆత్మస్తుతి... పరనింద ఒకవైపు..! ఆత్మాభిమానం పేరుతో సోమరితనం నూరిపోసే వర్గం ఇంకోవైపు!
మనిషి తనంతకు తాను కట్టుకొన్న ఈ అడ్డుగోడలు, వేసుకొన్నీ పరదాలు తొలగించుకోకపోతే జీవితానికి అర్థమే లేదు.
ఒక్కసారి మన అంతరంగంలోకి తొంగిచూద్దాం! ఇంద్రియాల ముందు లొంగిపోయిన మన మనస్సును వంచి పరమాత్మవైపు అడుగులు వేద్దాం!
నిత్యజీవితంలో మనం చేస్తున్న పొరపాట్లను మన్నించి తనవైపు మన హృదయాన్ని నింపమని ఆ హృదయేశ్వరుణ్ణి స్మరణం చేద్దాం.
ఎన్ని ఆధునిక పోకడలు మన జీవితంలో వచ్చినా, ఎంత కృతకత్వం మనకు కల్గినా సత్యరూపం కల్గించమని భగవంతుని కోరుకుందాం! విశ్వమంతా నీ రూపమని విశ్వం నీ చేతనే నడుస్తుందని, నీవు విశ్వమయుడని ఒక్కసారి గొంతును ఎలుగెత్తి ప్రార్థన చేదాం!
************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధాత్మికం : విజయక్రాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి