చాలామంది ఆర్టీసీ బస్సు ఎక్కాలని ఇష్టపడతారు. కారణం ఆర్టీసీలో ప్రయాణం ‘సుఖకరం, సురక్షితం’ అని నమ్మడం. అనివార్య కారణాల వల్ల మాత్రమే ప్రైవేటు వాహనాలపై ఆధారపడతారు. అప్పటివరకు అరచి గీపెట్టినా ప్రైవేటు వాహనంలో ఎక్కనివారు సైతం కాస్త స్థలం ఉంటే కూర్చుంటామని బతిమాలుతారు. ఇదంతా బస్టాండ్ల వద్ద నిత్యం కనిపించే దృశ్యం. కానీ, తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం చూసాక ఇలాంటి దృశ్యాలను టీవీలు, పత్రికలు నింపేస్తున్నాయి. ఎక్కడ సీటు దొరికితే అక్కడ, ఏ వాహనంలోనైనా ప్రయాణించేవాళ్లు, వాహనాలకు వేలాడుతూ వెళ్లడానికైనా సిద్ధపడడం వంటి దృశ్యాలు బస్టాండ్ల ముందే కాదు... రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు కూడా చూడవచ్చు.

పార్టీకి సేవచేస్తామని వచ్చే నాయకులు కొన్నాళ్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుతున్నారు. తీరా ‘పారాచుట్ నాయకుల’ రాకతో వాళ్ల సీటుకు కాకపుట్టి అర్ధరాత్రి ఎగరేసుకుపోతే ఏం చేయాలి? చివరకు తెలంగాణలో దిక్కూదివాణం లేని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ)లకూ గిరాకీ పెరిగింది. నిజానికి ఈ పార్టీల బీ-్ఫరాలతో ఒకవేళ ఎవరైనా గెలిస్తే- వారిని ప్రధాన పార్టీలు లాగేస్తాయి. దీన్ని గత అనుభవాలను చూసి మనం తెలుసుకోవచ్చు. ఇలా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి ఏకంగా కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసాడు.

‘బిఎల్‌ఎఫ్’ అంటూ కమ్యూనిస్టు కాకాసురులు పుట్టించిన కూటమి బహుగొప్ప బీసీ వాదాన్ని ముందుకు తెచ్చింది. ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చామంటారు. తమ్మినేని వీరభద్రం పోస్టు ఏనాడూ బీసీ కులాలకు దక్కదు. బీవీ రాఘవులు స్థానం ఏ బీసీతోనూ భర్తీచేయరు. కానీ ‘గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్లు ఎలాగూ గెలవరు కాబట్టి అనామక బీసీలను అందులో చేర్చుకొని ఆటపట్టిస్తారు! కూటమి ‘పెద్దల’ అసలు లక్ష్యం వేరే ఉంటుంది. ప్రధాన ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలలో వారికి ఇష్టమైనవారికి పరోక్షంగా మేలుచేసే వ్యూహం కూడా ఇందులో ఉంటుంది. ఇదంతా కొంత సిద్ధాంతం, మరికొంత అవకాశవాదం- ప్రక్కనపెడదాం.

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతాపార్టీ వేసిన కొన్ని అడుగులు తప్పటడుగులా? తప్పుటడుగులా?? అని తేల్చుకోలేక రైట్‌వింగ్ కార్యకర్తలు బుర్రలు గోక్కుంటున్నారు. విలువలు, సిద్ధాంతాలకు మారుపేరైన, నికార్సయిన రాజకీయం చేసే పార్టీ భారతీయ జనతాపార్టీ. తెలంగాణలో ‘పొత్తు’ల తలనొప్పి లేని ఏకైక పార్టీ భాజపా. ప్రస్తుత ఎన్నికల్లో 15-20 సీట్లు భాజపా గెల్చుకోగలిగితే రేపు తెలంగాణలో ఏర్పడే కాంగ్రెసేతర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. కానీ అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇలాంటి రాజకీయ క్రీడ ఆడాలన్న ‘కసి’ కన్పించట్లేదన్నది చా లామంది మదిని తొలుస్తున్న ప్రశ్న.

 తెలంగాణలో ఎన్నికలు వస్తాయని కేసీఆర్‌కు ఎంతముందుగా తెలు సో, భాజపాకు అంతేముందు తెలుసు. కేసీఆర్ మోదీని కలిసి వచ్చాక పదిహేనురోజుల పాటు అన్నీ సర్దుకుంటూ, గోప్యత పాటిస్తూ వ్యవహారం చక్కబెట్టుకొని ఎన్నికల రంగంలోకి దూకాడు. భాజపా వారు నామినేషన్ల గడువు పూర్తయ్యేముందురోజు రాత్రికి ఆరవ జాబితాను విడుదల చేశారు. పద్దెనిమిది రోజుల్లో అభ్యర్థులు ఎలా పనిచేయగలరని నాయకత్వం ఎందుకు ఆలోచించలేదు. తెలంగాణ భాజపా అంతా ఒకప్పటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబివిపి) వారితోనే నిండిపోయింది. ఇందులో ముఖ్యమైన వాళ్లంతా ముం దే టిక్కెట్లు కేటాయించుకొన్నారు. 

అమాయకులుగా, అధికారం లేకున్నా గుడ్డిగా ఏళ్ల తరబడి పార్టీకి సేవచేస్తూ వస్తున్నవాళ్లకు చివరివరకు సీట్లు ఇవ్వలేదు. డబ్బుగల వాళ్లకోసం వాటిని రిజర్వ్ చేస్తే- వాళ్లు రాకపోతే ఇచ్చారన్నమాట. అంటే గిరాకీ లేని సీట్లలో నిబద్ధులైన వాళ్లకు కేటాయించారు. పోనీ ‘పారాచూట్’లలో వచ్చిన వాళ్లకు సిద్ధాంత సారూప్యత ఉందా? ఒకవేళ వాళ్లు గెలిస్తే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా? బొడిగె శోభ, బాబూ మోహన్, అరుణతారల గురించి అధిష్ఠానం ఆలోచించిందా? గాలివాటంగా వచ్చినవారు అదే స్వార్థబుద్ధితో ఉంటే కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినదా? గతంలో ఏదో ఆశించివచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారు?

అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే రోజుల్లో కూడా భాజపాలో ఎందరో కార్యకర్తలు నోరువాయి కట్టుకొని అమ్ముడుపోకుండా సేవ చేస్తున్నారు. దానికి కారణం నిబద్ధతగల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నియంత్రణ ఉండడం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భాజపాను ఆరెస్సెస్ నియంత్రణ చేస్తున్నట్లు కన్పించదు. సంఘ్ పెద్దలను రాజకీయంకట్టడి చేసిందా? అన్నది దేవుడికెరుక. సంఘ్ తరఫున పార్టీ బాధ్యతలు చూస్తున్న మంత్రి శ్రీనివాస్ పైనే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. జాతీయవాద అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు సరైన కార్యాచరణను స్థానిక నాయకత్వం ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఎప్పుడూ దిగజారనంతగా ఇపుడు భాజపా పాతాళంలోకి వెళ్లిందని ఏ కార్యకర్తను అడిగినా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లు ఎదుగూబొదుగూ లేకుం డా ఉందన్నది నిజం.

ఈశాన్య రాష్ట్రాల్లో సై తం జోరుగా దూసుకుపోతున్న భాజపా తెలంగాణలో మాత్రం ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? ఒకప్పుడు నరేంద్ర, విద్యాసాగర్, బద్దం బాల్‌రెడ్డి వంటి పాతతరం నాయకులే హైదరాబాద్‌లో ‘సాలార్’కు ముచ్చెమటలు పట్టించారు. హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లలో ఎందరో హిందువులు ప్రాణాలు కోల్పోతే బాధితుల పక్షాన నిలబడ్డారు. ఇటీవలి కాలంలో భాజపా ఉదాసీనత కారణంగానే అసదొద్దీన్ ఓవైసీ జాతీయ నాయకుడయ్యాడు. అతడు ప్రధానినే సవాల్ చేసే వ్యక్తిగా ప్రతిపక్షాలకు, సూడో సెక్యులర్ పార్టీలకు కన్పిస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? అంతెందుకు..? సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రధానిని బండబూతులు తిడితే హైద్రాబాద్ నుండి ఒక్క పెద్ద నాయకుడు కూడా నిలువరించలేదు.

హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న రెండు, మూడు ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మోదీ టార్గెట్‌గా చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్న ఒక్క భాజపా నాయకుడు దీనిపై చర్యలకు ఉపక్రమించలేదు. ప్రత్యేక హోదాను ప్రాంతీయ వాదంలా జనాల్ని రెచ్చగొడుతున్న మీడియా సంస్థలపై చట్టపరంగా భాజపా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏపీ భాజపాలోని ఒక వర్గం ఈరోజుకూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తుంది. మరి తెలంగాణ నాయకులకు ఏం అడ్డంకి..?

తెలంగాణలో కొందరు ప్రధానిపై అదే పనిగా దుమ్మెత్తిపోస్తూ, దుష్ప్రచారం చేస్తుంటే అది ఎన్నికల నిబంధన ఉల్లంఘనగా భాజపా నాయకులు ఎందుకు ఫిర్యాదు చేయరు? వీరు టీవీలు చూడడం, పత్రికలు చదవడం మానేశారా? మోదీ ప్రతిష్ఠపై ప్రత్యర్థులు బురద చల్లుతుంటే ఎన్నికల్లో ఆ ప్రభావం పడదా? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఉన్న ఈ తీరుతెన్నులు ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తాయి? భాజపా నాయకులు తర్కం లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘మేం అధికారంలోకి వస్తాం, 70 సీట్లు గెలుస్తాం, కేసీఆర్ అసలు ఏమీ చేయలేదు..’ అని చెప్పే మాటలను ప్రజలు స్వీకరించడం లేదు. పార్టీని గోవర్ధన పర్వతంలా ఎత్తేస్తానని వచ్చిన పరిపూర్ణానంద స్వామి కూడా ఇలా మాట్లాడకూడదు. కేసీఆర్ నియంతృత్వాన్ని, కుటుంబ పాలనను, కాంగ్రెస్ కుల రాజకీయాన్ని, సంతుష్టీకరణ విధానాన్ని ఎండగట్టండి. పార్టీని ‘నిర్ణాయక శక్తిగా మారుస్తాం’ అంటే ప్రజలు స్వీకరిస్తారు.

అడ్డగోలుగా జరిగిన టిక్కెట్ల పంపిణీ వ్యవహరం పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఉదాహరణకు పరిగిలో నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కరణం ప్రహ్లాదరావుకు ఆరవ లిస్ట్‌లో అదీ అతను రాజీనామా చేశాక టిక్కెట్టు ఇచ్చారు. అక్కడ ధనికుడైన కాసాని వీరేశ్‌ను పోటీకి దింపాలనుకొన్నారు. ఏనాడూ మళ్లీ నియోజకవర్గం ముఖం చూడని వ్యక్తి కేవలం 18 రోజుల్లో ఎంత డబ్బున్నా ఎలా బరిలోకి దిగుతాడు? అతడికి కుత్బుల్లాపూర్ టిక్కెట్టు ఇచ్చారు. తీరా అతడు నామినేషన్ వెనక్కి తీసుకొన్నాడు. అక్కడి భాజపా రెబల్ అభ్యర్థుల నామినేషన్లు చెల్లలేదు. దీంతో అక్కడ భాజపా అభ్యర్థి లేడు. ఈ ఉదాహరణ చాలదా? టిక్కెట్ల పంపిణీలో గందరగోళం జరిగిందనడానికి.

ముందే పొత్తులు, వ్యూహాలు ఖరారు చేసుకొని అభ్యర్థులను జల్లెడపట్టి టిక్కెట్లు కేటాయింపుచేస్తే ఈ సమస్య ఉండదు. 26 స్థానాల్లో అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ వారికి ఎందుకు టిక్కెట్లు ఇచ్చాడు? ఓట్లు అభ్యర్థులను చూసి కాదు.. తనను చూసి వెయ్యమని! మరి భాజపా సైన్యాధ్యక్షుడు సరిగ్గాలేనపుడు బలమైన అభ్యర్థుల కోసం ఎలాంటి సర్వే చేసారో తెలియదు? కనీసం ప్రచారాన్నైనా వ్యూహాత్మకంగాచేస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. గెలిచే స్థానాలపై దృష్టిపెట్టకపోతే ఏళ్లకు ఏళ్లు పనిచేస్తున్న కార్యకర్తలకు, జాతీయవాదులకు దుఃఖమే మిగులుతుంది. మోదీని దెబ్బతీయడానికి తెలుగు రాష్ట్రాల నుండే కుట్ర జరుగబోతోంది. ఇక్కడి భాజపా నేతలు ఎలాంటి వ్యూహం లేకుండా యుద్ధంలోకి దిగడం అవివేకం. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో ఫ్రంట్‌ల పేరుతో టెంటులు వేస్తారు. భాజపా నాయకత్వం తక్షణ చర్యలతో ముందుకు వెళ్లకపోతే ‘పంచ పాండవులు మంచం కోళ్లలాగా ముగ్గురే’ అన్న సామెత పునరావృతం అవుతుంది. *

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి